• facebook
  • whatsapp
  • telegram

ప‌ర్యావ‌ర‌ణ ఉద్యమాలు

  పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలుగా తెలంగాణలో పలు సామాజిక ఉద్యమాలు జరిగాయి. వీటిలో నల్గొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. రాజధాని నగరంలో మూసీ నది ప్రక్షాళన దిశగా నిర్వహించిన ఉద్యమాలు ప్రధానమైనవి. స్థానికుల నుంచి వ్యక్తమైన నిరసనలు ఉద్యమాలుగా మారాయి. వీటికి పలు సంస్థలు, ప్రముఖుల నుంచి మద్దతు లభించడంతో కొంతమేర విజయవంతమయ్యాయి. ఈ ఉద్యమాల వివరాలు తెలుసుకుందాం..

  మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.

 

యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం

  భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.

* 2002 సెప్టెంబరులో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంభాపురం గ్రామాల్లో యురేనియం గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 795 ఎకరాల్లో సుమారు రూ.315 కోట్లతో దాదాపు 20 ఏళ్ల వరకు తవ్వకాలు చేయడానికి నిర్దేశించింది. అనుమతుల అనంతరం నమూనాల కోసం తవ్వకాలను ప్రారంభించడంతో అప్పట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించారు.

* 2005లో దేవరకొండ పరిధిలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నించగా అక్కడి స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో తవ్వకాలను నిలిపివేశారు. 2006లో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున స్థానికులు ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి గిరిజన సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాయక్ మద్దతు తెలిపారు. పర్యావరణవేత్తలు, జన విజ్ఞాన వేదిక, పౌరహక్కుల సంఘం నాయకులు కూడా మద్దతిచ్చారు.

* 2007లో లంభాపురం, పెద్దగట్టు, శేరుపల్లి, చిట్రియాల, పెద్దమూల, కాచరాజుపల్లి గుట్టల్లోని అటవీ ప్రాంతంలో దేశ రక్షణ, అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యురేనియం నిక్షేపాలున్నట్లు యురేనియం సంస్థ పరిశోధనలో తేలింది. దీంతో 2007లో మళ్లీ యురేనియం శుద్ధి కర్మాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను అక్కడి స్థానికులు పెద్దఎత్తున అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా 20 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇది చివరికి ప్రజా ఉద్యమంగా మారి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి పనులను వాయిదా వేసింది.

 

మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమం

  1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ మూసీ నదిలో కలవడం వల్ల అది ఒక మురికి కాలువగా మారింది. వాస్తవంగా.. మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుండటం వల్ల నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించి దీని ఉపనదిపై హుస్సేన్‌సాగర్ సరస్సును పూర్వకాలంలో నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ నీరు కలుషితమైంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రతిరోజూ జంట నగరాల నుంచి 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలు కలుస్తున్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 1986లో డాక్టర్ కిషన్‌రావు, కె.పురుషోత్తమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్థానిక ప్రజలను కూడగట్టారు. ఇతర పర్యావరణ సంఘాలతో కలిసి మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజల జీవించేహక్కును కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1988లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా కొన్ని పరిష్కారాలను కనుక్కున్నారు. 1989లో హానికరమైన వ్యర్థపదార్ధాల నిర్వహణ, నిల్వ, పరిష్కారాల కోసం 'హానికరమైన వ్యర్థపదార్థాల' నియమావళిని ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు ఉద్యమం కొంత విజయం సాధించింది.

* 2000లో మూసీ నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీట్ కాలువ ద్వారా ప్రవహింపజేసి.. నదీ జలాల ప్రాంతాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించి తెలుగుదేశం ప్రభుత్వం 'నందనవనం' అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది సమీపంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 'మూసీ బచావో ఆందోళన్' అనే నినాదంతో స్థానిక సామాజిక సంస్థలు ఉద్యమం చేపట్టాయి. దీనికి పర్యావరణవేత్త మేధా పాట్కర్ మద్దతు ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.

* 2000, జూన్ 24న 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఫోరమ్ కన్వీనర్ ఎం.వేదకుమార్ ఆధ్వర్యంలో 'హైదరాబాద్ బచావో' అనే పర్యావరణ ఉద్యమం మొదలైంది. 2006, నవంబరు 21న కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు పురానా పూల్ వంతెన నుంచి అంబర్‌పేట వరకు పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఛత్రీ, గమన అనే రెండు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.

* 2007లో మూసీనదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ జలమండలి మూసీ నది పొడవునా దశలవారీగా మురుగు శుద్ధి, ప్రక్షాళన పనులను చేపట్టడానికి 10 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను సిద్ధం చేసింది. అయితే వీటివల్ల అక్కడి జనావాసాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని 'సేవ్ మూసీ రివర్ క్యాంపైన్' పేరుతో స్థానిక పర్యావరణ సెల్ 2009, జూన్ 2న ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సేవ్ లేక్స్ సొసైటీ, సేవ్ రాక్స్ సొసైటీ, అక్షర, ప్రజా చైతన్య వేదిక, పుకార్, చెలిమి ఫౌండేషన్, హెరిటేజ్ వాచ్ లాంటి పర్యావరణ సంఘాలు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచాయి.

* 2009 నుంచి నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ మూసీ నది పరివాహక ప్రాంతాలు రియాల్టర్లు, కబ్జాదారుల ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. మలక్‌పేట, హిమాయత్‌నగర్, అజ్గంపురా, కాచీగూడ ప్రాంతాల్లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా ఒక సంస్థ నదీ పరివాహ ప్రాంతాన్ని కబ్జాచేసి వేసిన వెంచర్ చుట్టూ ప్రహరీగోడను నిర్మించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు 'మూసీ బచావో' పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజా సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. ఈ ఉద్యమకారుల డిమాండ్‌కు స్పందించి జీహెచ్ఎంసీ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి పర్యావరణ నిర్వహణ ద్వారా ఆర్ధిక వృద్ధి సాధించడమే లక్ష్యం. - టీఎస్ పీసీబీ విజ‌న్‌

Posted Date : 30-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌