• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు

దీర్ఘకాలిక సంక్షేమ సాధనాలు!

(సుస్థిరాభివృద్ధి)

దేశం ప్రగతి పథంలో నడవాలంటే సహజ వనరుల సంరక్షణ, దీర్ఘకాలిక శ్రేయస్సును అందించే స్థిరమైన వృద్ధి కావాలి.  గాలి, నీటి కాలుష్యాలు; అటవీ నిర్మూలన, వాతావరణ  మార్పు, పర్యావరణ సమతౌల్యత  మొదలైన సమస్యలను పరిష్కరించుకోవాలి. దీంతోపాటు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. సమర్థంగా వ్యర్థాలను నిర్వహించాలి.  ఇందుకోసమే భారత ప్రభుత్వం పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలను రూపొందించి అమలు చేస్తోంది. వాటిపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. వాటర్‌షెడ్‌ల నిర్వహణ, హరిత నగరాలు, జీవ ఇంధనాలు తదితరాల గురించీ తెలుసుకోవాలి. 

కొన్ని నూతన పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలను వివిధ రంగాల్లో అనుసరించడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చు. అవి

1) సేంద్రియ వ్యవసాయం

2) జీవ ఎరువులు

3) జీవ క్రిమి సంహారకాలు

4) వాటర్‌ షెడ్‌ నిర్వహణ    

5) పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల వాడకం  

6) జీవ ఇంధనాల వాడకం

7) హరిత నగరాలు  

8) సంప్రదాయేతర ఇంధన వనరులు.


సేంద్రియ వ్యవసాయం: వ్యవసాయ పంటలు, పశు సంపదకు సంబంధించి ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంపొందించడానికి ఉపయోగించే రసాయన పురుగు మందులు, ఎరువులు, జన్యు మార్పిడి జీవులు, వృద్ధి హార్మోన్ల స్థానంలో, పర్యావరణ అనుకూలమైన జీవ ఎరువులను వినియోగిస్తూ చేపట్టే వ్యవసాయ విధానాన్నే సేంద్రియ వ్యవసాయ విధానం అంటారు.

* ఈ విధానాన్ని దేశంలో తొలిసారిగా మణిపుర్‌ రాష్ట్రంలో, తరువాత ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు.

* సర్‌ ఆల్బర్ట్‌ హోవార్డ్‌ను సేంద్రియ వ్యవసాయ పితామహుడు అని పిలుస్తారు.

* గజియాబాద్‌లోని ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌’ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు.


జీవ ఎరువులు:  భూసారాన్ని ప్రకృతి పరంగా అభివృద్ధి చేసే సూక్ష్మజీవులను లేదా వాటి మిశ్రమాన్ని జీవ ఎరువులు అని పిలుస్తారు. అవి మొక్కలతో సహజీవనం చేస్తూ పంటలకు కావాల్సిన పలు పోషకాలను అందజేస్తాయి. ఉదా: రైజోబియం, అజటో బ్యాక్టర్, క్లాస్ట్రీడియం లాంటి నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు; అనబీనా, నాస్టాక్, అల్లోసిరా, అజోల్లా లాంటి నీలి ఆకుపచ్చ శైవలాలు; మైకోరైజా లాంటి శిలీంధ్ర జాతులు వివిధ రకాల పంట జాతులకు కావాల్సిన పోషకాలను అందజేస్తూ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర వహిస్తాయి.


ఉపయోగాలు:

నేల, నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.

* రసాయన ఎరువుల వినియోగం వల్ల తలెత్తే యూట్రిఫికేషన్, బయోమాగ్నిఫికేషన్‌ ఉండవు.

* సారాన్ని పెంపొందించడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు పెరుగుతాయి.

* ఇవి రైతుకు లాభాన్ని చేకూర్చే ఎరువులు. వీటిని రైతే స్వయంగా తయారు చేసుకోవచ్చు.  

దీర్ఘకాలికంగా జీవ ఎరువులను  వినియోగించడం వల్ల సుస్థిర వ్యవసాయం  సాధ్యమవుతుంది.


జీవక్రిమి సంహారకాలు:  పంటలను నష్టపరిచే తెగుళ్లు, క్రిమి కీటకాలు, క్రిమి కీటక డింభకాలను అరికట్టేందుకు వినియోగించే మొక్కలు; జంతువులు, సూక్ష్మజీవులు మొదలైన ప్రకృతిపరమైన జీవరాశులు లేదా వాటి నుంచి తీసే ఉత్పన్నాలను జీవక్రిమి సంహారకాలని పిలుస్తారు.


ఉదా: బాసిల్లస్‌ తురింజియనిసిస్‌ లాంటి బ్యాక్టీరియాలు, విరిడే కుటుంబానికి చెందిన వైరస్‌లు, ట్రెకో డెర్మా, బావేరియా బాస్సినా లాంటి శిలీంధ్రాలు; యూకలిప్టస్‌ నూనె, లెగ్యూమ్‌ జాతి మొక్కల వేళ్ల నుంచి తయారుచేసే రొటెనోన్‌ లాంటి వాటిని పలు రకాల చీడ నివారణలో వాడుతూ సస్యపరిరక్షణను పెంపొందిస్తారు.


ఉపయోగాలు:

పర్యావరణ కాలుష్యం జరగదు.

* బయోమాగ్నిఫికేషన్‌ సమస్యలు ఉండవు.

* మృత్తికలోని ఉపయోగకరమైన వానపాములు, ఇతర సూక్ష్మజీవులకు ఎలాంటి హాని కలిగించవు.  

* ఇవి త్వరితంగా జీవవిచ్ఛిన్నం చెంది పంట మొక్కల పరిరక్షణకు అందుబాటులోకి వస్తాయి. 

* రైతుకు వీటి వాడకం తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

* జీవక్రియ సంహారకాల వినియోగం ద్వారా సమగ్ర సస్యపరిరక్షణ వీలవుతుంది.


వాటర్‌ షెడ్‌ నిర్వహణ: వర్షపు నీటిని వృథా కాకుండా స్థానికంగా నిల్వ చేయడానికి, ఒక భౌగోళిక ప్రాంతంలోని ప్రవాహ వ్యవస్థలను వాలులకు అనుగుణంగా మార్పుచేసి అభివృద్ధిపరిచిన కృత్రిమ, సామాజిక, ఆర్థిక, పర్యావరణ అనుకూలమైన జియో హైడ్రోలాజికల్‌ విభాగాన్నే వాటర్‌షెడ్‌ అని పిలుస్తారు.

* ఒక భౌగోళిక ప్రాంతంలో అందుబాటులో ఉండే ప్రతి ఒక్క నీటిబొట్టు వృథా కాకుండా వినియోగంలోకి తీసుకురావడానికి ఉద్దేశించిన పథకమే వాటర్‌షెడ్‌.


వాటర్‌షెడ్‌ అభివృద్ధిలో ఇమిడి ఉన్న నిర్మాణాలు:

* చెక్‌డ్యామ్‌లు, కాంటూర్‌ బండ్‌లు/టెర్రేసింగ్‌లు నిర్మించడం

* పెర్కులేషన్‌ ట్యాంక్‌ లేదా పాండ్‌లు నిర్మించడం

* మళ్లింపు కాలువలు, రాక్‌ఫీల్డ్‌ డ్యామ్‌లు నిర్మించడం. 


లాభాలు:

* భూగర్భ జలాల పరిమాణం పెరుగుతుంది.

* మృత్తికల్లో తేమ శాతం పెరుగుతుంది.

* సహజ ఉద్భిజ సంపద పెరుగుదలకు దోహదపడుతుంది.

* ఎడారీకరణను నిరోధిస్తుంది.

* హరిత వ్యవసాయాన్ని పెంపొందిస్తుంది.

నేల క్రమక్షయాన్ని నియంత్రిస్తుంది.

వరదలను అరికడుతుంది.

* జీవ వైవిధ్యత, ఆవరణ వ్యవస్థలను పరిరక్షిస్తుంది.


దేశంలో ఆదర్శంగా నిలిచిన వాటర్‌షెడ్‌ పథకాలు:  

1) రాజస్థాన్‌లో ఆల్వార్‌ వాటర్‌ షెడ్‌

2) హరియాణాలోని సుకోమా జరీ వాటర్‌ షెడ్‌

3) మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్ధి వాటర్‌ షెడ్‌

4) మధ్యప్రదేశ్‌లోని జబువా వాటర్‌ షెడ్‌

5) ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కాల్వ వాటర్‌ షెడ్‌

6) తెలంగాణలోని నల్గొండజిల్లాలోని శివన్నగూడెం వాటర్‌ షెడ్‌

7) తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని కొత్తపల్లి వద్ద ఇక్రిసాట్‌ అభివృద్ధి చేసిన వాటర్‌ షెడ్‌


వాటర్‌ షెడ్‌కు భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు: 


1) రూరల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌: 1990లో నాబార్డు చేపట్టిన ఈ ఫండ్‌లో వాటర్‌ షెడ్‌ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా అనేక గ్రామాలు, అడవుల్లోనూ వాటర్‌ షెడ్‌లను అభివృద్ధి చేశారు. దాదాపుగా రూ.2500 కోట్లను దీని కోసం ఖర్చు చేశారు.


2) నేషనల్‌ వాటర్‌ షెడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ రెయిన్‌ ఫెడ్‌ ఏరియాస్‌ (జాతీయ మెట్ట ప్రాంతాల వాటర్‌ షెడ్‌ అభివృద్ధి పథకం): ఈ పథకాన్ని 8వ పంచవర్ష ప్రణాళికలో 1990-91లో జాతీయ వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు సమష్టిగా చేపట్టాయి. 25 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. 30% కంటే తక్కువ నీటి వసతులున్న ప్రాంతాల్లో దాదాపు 25 లక్షల ఎకరాల భూమిలో ఈ పథకాన్ని అమలు చేశారు. పర్యావరణ సమతౌల్యతను పరిరక్షించడమే కాకుండా హరిత     విప్లవం ద్వారా ఏర్పడిన ప్రాంతీయ అసమానతలను తొలగించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.


3) ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌ షెడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ హిల్‌ ఏరియాస్‌ (కొండ ప్రాంతాల్లో సంయుక్త వాటర్‌ షెడ్‌ అభివృద్ధి పథకం): 1991-92లో ప్రపంచ బ్యాంకు సహాయంతో హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, జమ్ము, కశ్మీర్, ఒడిశా, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. కొండ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ, సామాజిక అడవుల పెంపకం ప్రధానలక్ష్యాలుగా ఇది ప్రారంభమైంది.


హిమాలయన్‌ వాటర్‌ షెడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌:  1993లో ప్రపంచ బ్యాంకు సహాయంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ పథకం ప్రారంభమైంది. హిమాలయాల్లో ఆవరణ వ్యవస్థల పరిరక్షణకు,  పశువులను విపరీతంగా మేపడాన్ని నిలువరించడం కోసం దీన్ని మొదలుపెట్టారు.


పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల వాడకం:  కాలుష్య రహిత, పర్యావరణ హిత, ఉపయోగించే కొద్ది పునరుత్పత్తి చెందే ఇంధన వనరులను.. ‘పునరుత్పత్తి చెందే’ లేదా ‘నవీన యోగ్యమైన ఇంధన వనరులు’ అని పిలుస్తారు. జనాభా పెరిగే కొద్దీ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడం వల్ల ఇంధన డిమాండ్‌లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి పరిమితంగా ఉన్న కాలుష్య సహితమైన సాంప్రదాయిక ఇంధన వనరుల స్థానంలో పునరుత్పత్తి చెందే కాలుష్య రహితమైన ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించడం ద్వారా సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చు.

ఉదా: సౌర శక్తి, పవన శక్తి, హైడ్రోజన్‌ ఇంధనం, భూతాపిత శక్తి, సముద్ర అలల శక్తి.

ఉపయోగాలు:

* ప్రాంతీయాభివృద్ధికి తోడ్పడతాయి.

* కాలుష్యరహితమైనవి.

* పర్యావరణ అనుకూలమైనవి.

*  తరిగిపోనివి. 


జీవ ఇంధనాలు: బయో గ్యాస్, బయో ఇథనాల్, బయో హైడ్రోజన్‌ గ్యాస్, బయో బ్యుటనాల్, బయో డీజిల్‌ లాంటి వాటిని జీవ  ఇంధనాలుగా పరిగణిస్తారు.


హరిత నగరాలు:  పునరుద్ధరించదగిన, కర్బన రహిత శక్తి వనరులను వినియోగించడం ద్వారా పర్యావరణ హిత, పట్టణాభివృద్ధి ప్రణాళికల ద్వారా అభివృద్ధి పరిచినవే హరిత నగరాలు. 

* ఎకోసిటీ భావనను 1975లో రిచర్డ్‌ అనే పర్యావరణవేత్త  ప్రతిపాదించారు. ప్రపంచంలో మొదటి జీరో - కార్బన్‌ పట్టణంగా 2008లో అబూదాబీలోని మస్టర్డ్‌ నగరాన్ని అభివృద్ధి పరిచారు.


హరిత నగరాల లక్షణాలు:

పునరుద్ధరించదగిన, కార్బన్‌ రహిత ఇంధన వనరులను వినియోగించాలి.

* పలు రకాల వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక, వ్యవస్థీకృతమైన అనేక వరసలున్న రహదారులుండాలి.

* ప్రణాళికాబద్ధమైన నగరాలు ఉండాలి.


సంప్రదాయేతర ఇంధన వనరులు:  ఇటీవల మానవుడు అభివృద్ధి చేసిన వనరులు పునరుత్పత్తి సామర్థ్యంతో ఉంటాయి. వినియోగించే కొద్ది పునరుత్పత్తి చెందుతాయి. కాలుష్య రహితమైనవి. సుస్థిరాభివృద్ధిని పెంపొందిస్తాయి. భారత ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరుల అవసరాన్ని 1970లో గుర్తించి, వీటి అభివృద్ధి, నిర్వహణ కోసం 1982లో సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖను ఏర్పాటు చేసింది. దీంతోపాటు 1992లో సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖనూ ఏర్పాటు చేసింది. 2004, ఆగస్టు 20 నుంచి ప్రజల్లో ఈ ఇంధన వనరుల ప్రాముఖ్యతను వ్యాప్తి చేయడానికి ఆగస్టు 20 ని ఏటా ‘రాజీవ్‌ అక్షయ్‌ ఉర్జాదివస్‌’ గా నిర్వహిస్తోంది. 


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌


 

 

Posted Date : 05-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌