• facebook
  • whatsapp
  • telegram

మానవ భూగోళ శాస్త్రం నిర్వచనం, పరిధి

సహజ పర్యావరణంతో సమున్నత బంధం! 

మానవ సమాజాలు అభివృద్ధి చెందిన కొద్దీ మనుషులకు, భూమికి మధ్య సంబంధాలు పెరిగిపోయాయి. అవి నిరంతరం అనేక రకాల మార్పులకు గురయ్యాయి. వాటి అధ్యయనమే మానవ భూగోళశాస్త్రం. జనాభా ప్రాదేశిక విస్తరణ, భూమిపై వారి కార్యకలాపాలు, పర్యావరణం, జీవావరణ వ్యవస్థలతో ఉన్న అనుబంధాలను  వివరించే ఈ శాస్త్రం మొదట భూగోళశాస్త్రంలో భాగంగా ఉండేది. క్రమంగా ప్రత్యేక విభాగంగా ఏర్పడింది. వివిధ ఉప విభాగాలుగా వృద్ధి చెందింది. వీటిపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. ఈ శాస్త్రం పురోగతికి దోహదపడిన పరిణామాలు, ప్రసిద్ధ శాస్త్రవేత్తల నిర్వచనాలు, విస్తృత పరిధి, అందులోని విభిన్న అంశాలను తెలుసుకోవాలి.

భూగోళ శాస్త్ర అధ్యయనాల్లో మానవ భూగోళ శాస్త్రం అనేది అంశాలవారీ పద్ధతికి ఒక ఉదాహరణ. మానవ భూగోళ శాస్త్రాన్ని పలు సమయాల్లో చాలామంది శాస్త్రవేత్తలు రకరకాలుగా నిర్వచించారు. అరిస్టాటిల్, బకిల్, హంబోల్డ్, రిట్టర్‌ లాంటి పూర్వ అధ్యయనకారులు చరిత్ర, ప్రదేశం ప్రభావంపై దృష్టి సారించారు. రాట్జెల్, సెంపెల్‌ మానవ కార్యకలాపాలపై భౌతిక పర్యావరణ ప్రభావానికి ప్రాధాన్యం ఇచ్చారు. సాధారణంగా మానవ భూగోళశాస్త్రం మానవుడు - పర్యావరణం సంబంధాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది.


నిర్వచనాలు:  ‘‘మానవ సమాజాలు, భూమి ఉపరితలం మధ్య సంబంధాల క్రమబద్ధ అధ్యయనమే మానవ భూగోళ శాస్త్రం’’ 

- మానవ భూగోళ శాస్త్ర పితామహుడుగా ప్రసిద్ధికెక్కిన జర్మనీ భూగోళ శాస్త్రవేత్త ఫ్రెడరిక్‌ రాట్జెల్‌‘‘

చంచలమైన మనిషి, అస్థిరమైన భూమి మధ్య నిరంతరం మారుతుండే సంబంధ అధ్యయనమే మానవ భూగోళ శాస్త్రం’’  

- రాట్జెల్‌ శిష్యురాలు, అమెరికా భూగోళ శాస్త్రవేత్త ఎల్లెన్‌ సి.సెంపెల్‌

‘‘స్థిరంగా ఉండని అన్ని భూసంబంధ దృగ్విషయాల్లాగే మానవ పరిణామ క్రమంలోని తిరోగమనం, అభ్యున్నతుల అధ్యయనమే మానవ భూగోళశాస్త్రం’’

- ఫ్రెంచి భూగోళ శాస్త్రవేత్త జీన్‌ బ్రున్హెస్‌

 ‘మానవ భూగోళ శాస్త్రం.. భౌతిక పర్యావరణంలోని భౌతిక పరిస్థితులు, మానవ ప్రతిస్పందనలకు సంబంధించి ఉంటుంది.’ - ఎల్స్‌వర్త్‌ హంటింగ్టన్‌ (1956)

‘‘భూమి, అందులో ఉండే జీవుల సంబంధాలను ప్రభావితం చేసే భౌతిక నియమాల సంయోజిత పరిజ్ఞాన ఫలితంగా ఏర్పడిన భావనే మానవ భూగోళ శాస్త్రం’’

- పౌల్‌ విడాల్‌ డి లా బ్లాష్‌


మానవ భూగోళ శాస్త్రం పరిధి, విషయం:  మొత్తం భూగోళ శాస్త్రంతో సమాంతరంగా, మానవ భూగోళ శాస్త్రం మూడు భాగాలుగా కనిపిస్తుంది. 

1) మానవ జనాభా ప్రాదేశిక విశ్లేషణ అంటే వారి సంఖ్య, లక్షణాలు, భూమి ఉపరితలంపైన వారి కార్యకలాపాల వ్యాప్తి.

2) మానవ జనాభా, దాని పర్యావరణం మధ్య సంబంధాల గురించి పర్యావరణ విశ్లేషణ అంటే, మానవ జీవావరణ వ్యవస్థ.

3) ప్రాంతీయ సంశ్లేషణం- ఇది భూమి ఉపరితలం ‘ప్రాంతీయ వ్యత్యాసం’లోని మొదటి రెండు నేపథ్యాలను మిళితం చేస్తుంది.

ఈ మూడు నేపథ్యాలు ‘స్థూల స్థాయి (ప్రపంచం లేదా ప్రధాన ప్రపంచ ప్రాంతాలు) నుంచి సూక్ష్మస్థాయి (వ్యక్తిగత సమూహాలు, వారి తక్షణ పర్యావరణం) వరకు వివిధ ప్రాదేశిక స్థాయుల్లో అధ్యయనానికి ఉపకరిస్తాయి.

దీని ప్రకారం మానవ సమాజాలకు, వారి ఆవాసం లేదా పర్యావరణానికి ఉండే సంబంధ అధ్యయనమే మానవ భూగోళ శాస్త్రం ప్రధాన ఉద్దేశం. దీని పరిధి అపారమైంది. ఇది పలు అంశాలను విశ్లేషిస్తుంది.

1) మానవ జాతుల అధ్యయనం: ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని జనాభా సాంద్రత, విస్తరణ, జనాభా గుణాలు, వలస రీతులు, మానవ సమూహాల మధ్య ఉండే భౌతిక, సాంస్కృతిక తేడాలు, ఆర్థిక కార్యకలాపాలు.

2) మానవుడికి, సహజ పర్యావరణానికి మధ్య సంబంధం, అతడి కార్యకలాపాల విస్తరణ విధానం.

3) సంస్కృతి, భాష, మతం, ఆచారాలు, సంప్రదాయాల సమ్మేళనం; గ్రామీణ ఆవాసాల రకాలు, రీతులు, పట్టణ ఆవాసాల ఉనికి, పరిమాణం, పెరుగుదల, పనితీరు, పట్టణాల క్రియాత్మక వర్గీకరణ.

4) భౌతిక పర్యావరణం ద్వారా ప్రభావితమయ్యే ఆర్థిక కార్యకలాపాల క్షేత్రీయ పంపిణీ, పరిశ్రమలు, వర్తకం రవాణా, సమాచార రీతులు మానవ భూగోళ శాస్త్రంలోని ముఖ్యమైన అంశాలు. క్లుప్తంగా ఒక ప్రాంతంలోని ప్రజల ఆర్థిక కార్యకలాపాలు, సమాజం, సంస్కృతి, మతాన్ని ప్రభావితం చేసే భౌతిక పర్యావరణం గురించిన అధ్యయనమే మానవ భూగోళ శాస్త్రం.

5) పర్యావరణంపై మనిషి ప్రభావం అనే అంశానికి మానవ భూగోళ శాస్త్రంలో ప్రాముఖ్యం పెరుగుతోంది.

 

మారుతున్న పరిధి:  భూగోళ శాస్త్రాన్ని సాధారణంగా భౌతిక, మానవ భూగోళ శాస్త్రాలుగా విభజించలేదు. ‘మానవ భూగోళ శాస్త్రం’ అనే పదం వినియోగం చాలా మితంగా ఉండేది. కాలక్రమేణా దాని ఉపయోగం మారిపోయింది. సాంఘిక శాస్త్రాల ఎన్‌సైక్లోపీడియా- 1932 సంచికలో ఫ్రెంచి భూగోళ శాస్త్రవేత్త క్యుమిల్లె వాలక్స్‌ రాసిన వ్యాసంలో ‘మానవ భూగోళ శాస్త్రం’లో ‘‘మానవ సమాజాలు, భూమి ఉపరితలానికి మధ్య ఉన్న సంబంధపు సంయోజిత అధ్యయనం’’గా నిర్వచించారు. దీనిద్వారా ఆ కాలంలో ఈ పదం పరిమిత పరిధి ఉపయోగాన్ని తెలుసుకోవచ్చు. ఈ సంచికలో ‘సాంస్కృతిక భూగోళ శాస్త్రం’, ‘ఆర్థిక భూగోళ శాస్త్రం’లకు ప్రత్యేక స్థానాలు ఇచ్చారు. ఈ ఎన్‌సైక్లోపీడియా-1968 సంచికలో మానవ భూగోళ శాస్త్రం కోసం ప్రత్యేకమైన వ్యాసం లేదు. కానీ ‘సాంస్కృతిక భూగోళ శాస్త్రం’, ‘ఆర్థిక భూగోళ శాస్త్రం’ లాంటి వాటితో పాటు కొత్తగా ‘రాజకీయ భూగోళ శాస్త్రం’, ‘సామాజిక భూగోళ శాస్త్రం’, ‘గణాంక శాస్త్రం’ విభాగాలను చేర్చారు. ప్రస్తుతం స్త్రీవాద భూగోళ శాస్త్రం, పిల్లల భూగోళ శాస్త్రం, పర్యాటక అధ్యయనాలు, పట్టణ భూగోళ శాస్త్రం, శృంగార భూగోళ శాస్త్రం లాంటి ప్రత్యేక విభాగాలు అభివృద్ధి చెందాయి.

చారిత్రక దృక్కోణం:  మానవ భూగోళ శాస్త్రం మూలాలు భూగోళ శాస్త్రం లాగే లోతుగా ఉన్నాయి. 18, 19వ శతాబ్దాల్లో దీనిపై ఎక్కువ దృష్టి సారించారు. గ్రీకు, రోమన్‌ మేధావులు హెరొడోటస్, అరిస్టాటిల్, ఎరటోస్థనీస్, స్టాబ్రో రచనలు; ఆల్‌-బదానీ, ఆల్‌-మసూదీ, ఆల్‌-బిరునీ, ఆల్‌-ఇద్రిసీ, ఇబన్‌-ఎ-ఖల్దమ్‌ లాంటి అరబ్‌ పండితులు మానవుడికి, పర్యావరణానికి మధ్య సంబంధం గురించి వర్ణించేందుకు ప్రయత్నించిన కాలం నుంచే మానవ భూగోళ శాస్త్ర మూలాలను గుర్తించారు. 19వ శతాబ్దం ద్వితీయార్ధం 1859లో చార్లెస్‌ డార్విన్‌ ‘ప్రాణుల పుట్టుక సిద్ధాంతం (ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీసిస్‌)’ ప్రచురణతో భూగోళ శాస్త్రం అధ్యయనంలో మానవ భూగోళ శాస్త్రం ఒక ప్రత్యేక శాఖగా అభివృద్ధి చెందడానికి ప్రేరేపితమైంది. 

మానవ చర్య గమనంపై పర్యావరణ నియంత్రణ అనే భావనను 18, 19వ శతాబ్దాల్లో అలెగ్జాండర్‌ వాన్హాంబోల్డ్‌ (1790-1859) (కాస్మోస్‌), కార్ల్‌ రిట్టర్‌ (1779-1859) (ఎర్డుండే) రచనల ద్వారా పాశ్చాత్య ఐరోపాలో పునరుద్ధరించారు. అందుకే హంబోల్డ్, రిట్టర్‌లు ఆధునిక మానవ భూగోళ శాస్త్రం స్థాపక పితామహులుగా పేరు పొందారు.

ఆధునిక మానవ భూగోళ శాస్త్రం పితామహుడిగా పేరొందిన జర్మనీ భూగోళ శాస్త్రవేత్త ఫ్రెడరిక్‌ రాట్జెల్‌ (1844-1904) మార్గదర్శక రచన ‘ఆంత్రోప్రో జాగ్రఫీ’ని మానవ భూగోళ శాస్త్రం చరిత్రలో ఒక మైలు రాయిగా పరిగణించారు. పి.విడాల్‌ డి లా బ్లాష్‌ (1845-1918), జీన్‌ బ్రూన్స్‌ (1896-1947), డెమంగాన్, ఇ.సి.సెంపెల్, హంటింగ్టన్‌ (1876 -1974), గ్రిఫిత్‌ టేలర్‌ (1880-1963) లాంటి ఇతర గొప్ప భూగోళ శాస్త్రవేత్తల రచనలు మానవ భూగోళ శాస్త్ర అభివృద్ధికి దోహదపడ్డాయి.

1980 దశకం నుంచి పూర్తిగా భౌతిక భూగోళ పర్యావరణానికి సంబంధించిన శాస్త్రాలు, సాంకేతిక విభాగాలైన మానచిత్ర లేఖన శాస్త్రం, సుదూర గ్రాహక శాస్త్రం, జియో ఇన్ఫర్మాటిక్స్‌ లాంటివి మినహాయించి, భూగోళ శాస్త్రంలోని మిగిలిన అన్ని విభాగాలను తన పరిధిలో ఇముడ్చుకునే అనేకాంశాల పదంగా మానవ భూగోళ శాస్త్రం పరిధి విస్తృతి చెందింది. సాంస్కృతిక భూగోళ శాస్త్రం, సాంఘిక భూగోళ శాస్త్రం, ఆర్థిక భూగోళ శాస్త్రం, చారిత్రక భూగోళ శాస్త్రం, రాజనీతి భూగోళ శాస్త్రం, ప్రాంతీయ భూగోళ శాస్త్రం, పట్టణ భూగోళ శాస్త్రం, వైద్య భూగోళ శాస్త్రం, పరిపాలన భూగోళ శాస్త్రం, లింగభేద భూగోళ శాస్త్రం లాంటివి మానవ భూగోళ శాస్త్రం ప్రధాన ఉపవిభాగాలు.

రచయిత: సక్కరి జయకర్‌

Posted Date : 18-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌