• facebook
  • whatsapp
  • telegram

మానవ జాతులు, సాంస్కృతిక ప్రాంతాలు

సజాతి లక్షణ సమూహాల సాంస్కృతిక విస్తరణ!  

  చింపాంజీ నుంచి పుట్టిన మానవుడు పరిణామ క్రమంలో తన ఆలోచన, వివేకం, విచక్షణలతో అత్యున్నత శ్రేణి జీవిగా, జ్ఞానం ఉన్న జాతిగా ఆవిర్భవించాడు. తొలుత ఆహారాన్వేషణ, ఆ తర్వాత వనరుల వేట, మత వ్యాప్తి, భావజాల ఆధిపత్యం కోసం ప్రపంచం అంతా విస్తరించాడు. ఈ క్రమంలో ప్రాంతాలవారీ పరిస్థితులు, వాతావరణ ప్రభావంతో ఒక్కో చోట ఒక్కో తరహా శరీర ఛాయ, ఆకారం లాంటి అంతర్గత లక్షణాలతోపాటు జీవనశైలి, వేష భాషలు తదితర బహిర్గత సాంస్కృతిక లక్షణాలు ఏర్పడ్డాయి. మానవ జాతి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవాంటే ప్రపంచంలో నేడు స్థిరపడిన ప్రధాన జాతుల వర్గీకరణ, వాటి మూలాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. సంస్కృతిపరంగా సారూప్యతలున్న నిర్దిష్ట ప్రాంతాలు, దేశాల సమాచారంతోపాటు వలసల కారణంగా ప్రభావితమైన జాతులు, అన్నిరకాల దాడులను తట్టుకుని అస్థిత్వాన్ని, ప్రత్యేకతను నిలబెట్టుకున్న సంస్కృతుల గురించి అవగాహన పెంచుకోవాలి.

  

 మానవ జాతికి భూమి ఒక ఇల్లు లాంటిది. తొలి మానవుడు ఆఫ్రికాలోని గొరిల్లా (చింపాంజీ) జాతికి చెందినవాడు. ఈ జాతిని హోమోసెపియన్స్‌ అంటారు. జ్ఞానవంతులైన మానవులు అని దీని అర్థం. నేడు మానవుల్లో కనిపించే అన్ని జాతులు ఈ మూల శాఖకు చెందినవే. కాలక్రమేణా మనిషి గొప్ప నాగరికతను సృష్టించి ప్రముఖ స్థానాన్ని పొందాడు. మానవ జాతుల అంతర్గత, బాహ్య లక్షణాలు ఆధారంగా వాటిని కొన్ని సమూహాలుగా విభజించవచ్చు. శాస్త్రజ్ఞుల మధ్య భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, అందరికీ ఆమోదయోగ్యమైన వర్గీకరణ ప్రధానంగా మూడు రకాలుగా ఉంది.

1) నీగ్రాయిడ్‌ జాతి 

2) మంగోలాయిడ్‌ జాతి

 3) యూరపాయిడ్‌ జాతి. 

వీటిలో ఉపజాతులు కూడా ఏర్పడ్డాయి.

మానవ జాతులు - భౌతిక లక్షణాలు

ప్రపంచంలో కొన్ని ఉచ్ఛ జాతులనీ, మరికొన్ని అల్పజాతులని చెప్పడానికి వీల్లేదు. అన్ని జాతుల్లో విజ్ఞానవంతమైనవి, మేధస్సును కలిగినవి ఉండవచ్చు. ప్రతి మానవుడు ఏదో ఒక జాతి లేదా మతం లేదా భాషా సమూహానికి చెందినట్లే ఒక సాంస్కృతిక సమూహానికి కూడా సంబంధించి ఉంటాడు. ఏ ప్రాంతంలో అయితే సాంస్కృతిక విషయాల్లో ఒకే విధమైన సజాతీయ లక్షణాలుంటాయో ఆ ప్రాంతాన్ని సాంస్కృతిక ప్రాంతమని చెప్పవచ్చు. శాస్త్రజ్ఞులు ప్రపంచాన్ని కొన్ని సాంస్కృతిక ప్రాంతాలుగా విభజించారు.


టాయన్‌ బీ (Toynbee) అనే శాస్త్రజ్ఞుడు ప్రపంచంలో 26 సంస్కృతులను గుర్తించాడు. ఇతడికంటే ముందు, తర్వాత కూడా అనేకమంది మానవ భూగోళ శాస్త్రజ్ఞులు ప్రపంచాన్ని వివిధ సాంస్కృతిక ప్రాంతాలుగా విభజించారు. మొత్తం మీద ప్రపంచంలో ప్రధానంగా ఆరు సాంస్కృతిక ప్రాంతాలను పేర్కొన్నారు. అవి 

1) పాశ్చాత్య సాంస్కృతిక ప్రాంతం 

2) ముస్లిం సాంస్కృతిక ప్రాంతం 

3) భారతీయ సాంస్కృతిక ప్రాంతం 

4) తూర్పు ఆసియా సాంస్కృతిక ప్రాంతం 

5) ఆగ్నేయాసియా సాంస్కృతిక ప్రాంతం 

6) నీగ్రో లేదా మధ్య ఆఫ్రికా సాంస్కృతిక ప్రాంతం.

1) పాశ్చాత్య సాంస్కృతిక ప్రాంతం:  కొత్త ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకోవడం, వలస పాలన, సాంస్కృతిక విస్తరణ అనే మూడు విధాలుగా పాశ్చాత్య సంస్కృతి గత నాలుగు శతాబ్దాల్లో అభివృద్ధి చెందింది.ఉత్తర, దక్షిణ అమెరికాలు; ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికాలకు సముద్ర, భూ మార్గాల ద్వారా యూరోపియన్లు అధిక సంఖ్యలో వలస వెళ్లారు. వీరు వెళ్లక ముందు అక్కడ అంతగా సాంస్కృతిక వికాసం జరగలేదు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని అనేక ప్రాంతాలను; అక్కడి ఆర్థిక వనరులను కూడా స్వాధీనపరుచుకున్నారు. ఆ విధంగా ఈ వలస ప్రాంతాల్లో పాశ్చాత్య సంస్కృతి విస్తరించింది.


సముద్ర ప్రభావిత యూరప్‌:  మధ్యధరా యూరప్‌ 15, 16వ శతాబ్దాల వరకు పాశ్చాత్య సంస్కృతికి కేంద్రంగా విలసిల్లింది. జెనీవా, వెనిస్‌ నగర వర్తకులు తమ వ్యాపారాన్ని నలుదిశలా విస్తరించారు. ఈ నగర వాసులు, ఇటలీ భూగోళ శాస్త్రజ్ఞులు, సముద్ర యాత్రలకు నాంది పలికారు. మధ్య అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో స్పెయిన్‌ దేశస్థులు వలసలు ఏర్పరచుకుని, అక్కడి పురాతన రెడ్‌ ఇండియన్ల సంస్కృతిని ఇంచుమించు రూపుమాపారు. అమెరికన్‌ ఇండియన్ల జనాభాను చాలావరకు తగ్గించి, ఇంకా మిగిలిన వారిని తమ మతంలోకి మార్చి, స్పానిష్‌ వ్యవస్థలను ప్రవేశపెట్టారు. స్పానిష్‌ వలస విధానం సైన్యం, మత సంస్థలు, భూస్వాముల ఆధిపత్యం మీద ఆధారపడి ఉండేది. స్పెయిన్‌లోనే కాకుండా ఆ దేశ వలస ప్రాంతాల్లోనూ క్యాథలిక్‌ చర్చి ఆధ్యాత్మిక, రాజకీయ జీవితాలపై ఆధిపత్యం వహించింది.


దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌ పోర్చుగీసు వారి ఆధీనంలోకి రావడంతో, అక్కడ తోట పంటలు అభివృద్ధి చేశారు. బ్రెజిల్‌లో కాఫీ తోటల అభివృద్ధి ఇలాగే జరిగింది. లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో ప్రారంభంలో అమెరికన్‌ ఇండియన్లు, వలసదారుల సంస్కృతి అభివృద్ధి చెందినప్పటికీ, ఆ తర్వాత బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్‌ వారు ప్రవేశించి తోట పంటలు అభివృద్ధి చేయడంతో వాటిలో పనిచేసే కార్మికుల కొరత ఏర్పడింది. దీంతో ఆఫ్రికా ఖండం నుంచి అనేకమంది నీగ్రోలు వలస వచ్చారు.


పోర్చుగీస్, స్పెయిన్‌ దేశస్థుల మధ్య వివాహ సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. నేటి మెక్సికో వాసులు అమెరికన్‌ ఇండియన్లు, యూరోపియన్ల పరస్పర సమ్మేళనం వల్ల ఉద్భవించినవారే. వాయవ్య యూరప్‌లో జరిగినంత పారిశ్రామికాభివృద్ధి మధ్యధరా ప్రాంతంలో జరగలేదు. మధ్యధరా ప్రాంత దేశాలు చాలావరకు వ్యవసాయ దేశాలుగానే ఉన్నాయి.

వాయవ్య యూరప్, ఇతర ప్రాంతాలు: ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బ్రిటన్, స్కాండినేవియా, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాలు ఈ సాంస్కృతిక ప్రాంతంలోకి వస్తాయి. 17వ శతాబ్ద ప్రారంభంలో వాయవ్య యూరోపియన్లు వర్తకం, కొత్త భూభాగాల అన్వేషణ, వలసరాజ్య స్థాపన లాంటి విషయాల్లో ప్రగతి సాధించారు. పారిశ్రామిక విప్లవం వాయవ్య యూరప్‌లోనే మొదలైంది. అందువల్లే ఈ దేశాలు పారిశ్రామికంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా కూడా అభివృద్ధి చెందాయి.


వాయవ్య యూరప్‌ సంస్కృతి యూరప్‌తోపాటు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, దక్షిణ ఆఫ్రికా, న్యూజిలాండ్‌ ప్రాంతాలకు వ్యాపించింది. మొదటి ప్రపంచ యుద్ధం వరకు వాయవ్య యూరప్‌ రాజకీయ, ఆర్థిక శక్తిగా ఉన్నప్పటికీ రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా ఒక శక్తిమంతమైన దేశంగా మారింది. బ్రిటిషర్ల ఆచార వ్యవహారాలు అమెరికాలో కంటే కెనడాలోనే ఎక్కువగా కనిపిస్తాయి.


ఆస్ట్రేలియన్ల సంస్కృతి చాలావరకు ఆంగ్లేయుల సంస్కృతిని పోలి ఉంటుంది. న్యూజిలాండ్, బ్రిటన్‌ శీతోష్ణస్థితులు ఒకదానికొకటి పోలి ఉంటాయి. దక్షిణాఫ్రికా వాసులు మూడు రకాలుగా ఉంటారు. వలసవచ్చి స్థిరపడిన యూరోపియన్లు: వ్యాపారులుగా, కార్మికులుగా వచ్చి స్థిరపడిన భారతీయులు, పాకిస్థానీయులు; స్వదేశీ ఆదిమవాసులైన బంటూ తెగకు చెందిన నీగ్రాయిడ్‌ జాతివారు. దేశ జనాభాలో నీగ్రాయిడ్లు అత్యధికంగా ఉన్నప్పటికీ తెల్లవారి కంటే  బాగా వెనకబడి ఉన్నారు.


ఖండాంతర్గత యూరప్‌ -రష్యా, మధ్య యూరప్,ఉత్తర, మధ్య ఆసియా: ఖండాంతర్గత యూరప్‌ దేశాలు యూరప్‌ లోతట్టు ప్రాంతాల్లో, సముద్ర ప్రభావిత యూరప్‌ దేశాల సరిహదుల్లో ఉన్నాయి.రష్యా సంస్కృతిని పాశ్చాత్య సంస్కృతిలో ఒక అంతర్భాగంగానే గమనించవచ్చు. మత సంస్కరణలు, ఫ్రెంచి విప్లవాల ప్రభావాలకు రష్యా లొంగలేదు. కమ్యూనిస్ట్‌ విప్లవం (1918) సంభవించే వరకు దాని ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఆ తర్వాత పెద్దఎత్తున రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికపరమైన మార్పులు వచ్చాయి. ఇంత స్వల్పకాలంలో ప్రపంచంలో అంత పెద్దఎత్తున మార్పులు సంభవించిన ఆధారాలు మరెక్కడా లేవు. రష్యా ప్రజలు వివిధ భాషా, జాతి సమూహాలకు చెందినప్పటికీ, సాంస్కృతిక పరంగా రష్యా అంతా ఒకే ప్రాంతంగా రూపొందింది.

2) ముస్లిం సాంస్కృతిక ప్రాంతం: ఇది శుష్క, అర్ధశుష్క ప్రాంతం. ఒకప్పుడు ఈ ప్రాంతం ప్రపంచ సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లినప్పటికీ ఈ దేశాలు చాలావరకు వెనకబడి ఉన్నాయి. ఆఫ్రికాలోని అరబ్‌ దేశాలు, మధ్య ప్రాచ్య ముస్లిం దేశాలు, ఇరాన్, పాకిస్థాన్‌ ఈ సాంస్కృతిక ప్రాంతంలోకి వస్తాయి. ఇండొనేసియా ప్రజలు ఇస్లాం మతస్థులైనప్పటికీ వారు మలయన్‌ సాంస్కృతిక ప్రాంతంలోకి వస్తారు.మధ్యయుగ కాలంలో వీరు తమ సామ్రాజ్యాలను ఇతర ప్రాంతాలకు విస్తరింప చేసినప్పటికీ, క్రమేపీ ముస్లిం ప్రాంత ప్రభావం క్షీణించింది. ఈ దేశాలు క్రమంగా పాశ్చాత్య సాంస్కృతిక ప్రభావానికి లోనైనప్పటికీ వీరి ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థలు ఇంకా కుదుటపడలేదని చెప్పవచ్చు. 

3) భారతీయ సాంస్కృతిక ప్రాంతం: ఉత్తరాన హిమాలయాలు, మిగతా మూడు వైపులా సముద్రం ఉండటంతో భారతదేశానికి ఒక విశిష్టమైన ఉనికి ఏర్పడింది. మధ్యయుగంలో వాయవ్యంలో ఉన్న కనుమ మార్గాల ద్వారా ముస్లింలు ఈ దేశంలోకి చొరబడ్డారు. తర్వాత ఆంగ్లేయులు, ఫ్రెంచివారు కూడా ప్రవేశించారు. ఆంగ్లేయులు సుమారు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించినప్పటికీ మనదేశ మూల సంస్కృతిని మాత్రం అంతగా ప్రభావితం చేయలేకపోయారు. ఆ విధంగా  భారతీయ సంస్కృతి తన విశిష్టతను నిలబెట్టుకుంది. అత్యధిక శాతం భారతీయులు మతపరంగా హిందువులు. వీరి సంస్కృతి ఉన్నతమైంది. వివిధ సాంస్కృతిక రంగాల్లో భారతీయులు తమ వంతు పాత్ర నిర్వహించారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, గ్రామ సాంఘిక వ్యవస్థ, కుల వ్యవస్థలు భారతీయ సాంస్కృతిక చిహ్నాలుగా నిలిచాయి. భాషలు, మతాలు వేరైనప్పటికీ భారతీయులంతా ఒకే సంస్కృతికి చెందినవారు. ఈ సంస్కృతి విదేశాల్లో పరిమితంగా మాత్రమే విస్తరించింది. కొందరు భారతీయ చక్రవర్తులు తమ రాజ్యాన్ని ఆగ్నేయాసియా వరకు వ్యాపింపజేయడంతో అక్కడ కొంతవరకు ఈ సంస్కృతి వేళ్లూనుకుంది. బంగ్లాదేశీయులు ఇస్లాం మతస్థులైనప్పటికీ వారి భాష, సంస్కృతుల దృష్ట్యా చాలావరకు భారతీయ సాంస్కృతిక ప్రాంతంలోకి వస్తారు.

4) తూర్పు ఆసియా సాంస్కృతిక ప్రాంతం:  ఈ ప్రాంతంలోకి చైనా, జపాన్, కొరియా వస్తాయి. నైసర్గిక స్వరూపం దృష్ట్యా చైనాలో ఒక ప్రత్యేక సంస్కృతి ఏర్పడింది. ఒకప్పుడు సాంస్కృతికమైన ఆధిక్యతా భావం చైనీయుల్లో ఎక్కువగా ఉండేది. అయితే 1949 తర్వాత కమ్యూనిస్టుల ప్రభావంతో వారి జీవన విధానంలో, సాంస్కృతిక వికాసంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రాచీన సాంఘిక కుటుంబ వ్యవస్థ సామ్యవాద సాంఘిక వ్యవస్థగా రూపొందింది. మతం, వేషం మొదలైన సాంఘికాచారాలు, కట్టుబాట్లకు ప్రాధాన్యం తగ్గిపోయింది. జపాన్, కొరియాల్లో చైనా ప్రభావం ఎక్కువగానే ఉన్నా, ఇవి తమ సాంస్కృతిక ప్రత్యేకతను కొంతవరకు నిలబెట్టుకున్నాయి. క్రీ.శ.500 తర్వాత చైనా, జపాన్‌ ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడంతో, జపనీయుల భాష, సంస్కృతుల్లో చాలా మార్పులు వచ్చాయి. కొరియా భౌతిక స్వరూపరీత్యా అది చైనా, జపాన్‌ మధ్య వారధిగా ఉంది. అందుకే కొరియాకు ఈ రెండు దేశాలతో సన్నిహితమైన సాంఘిక, భౌగోళిక, రాజకీయ సంబంధం ఏర్పడింది.

5) ఆగ్నేయాసియా ప్రాంతం:  మయన్మార్, మలయా, సింగపూర్, లావోస్, వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, ఫిలిప్పైన్స్, ఇండొనేసియాలు ఆగ్నేయాసియా కిందకి వస్తాయి. ఆగ్నేయాసియా వివిధ సంస్కృతుల సమ్మేళనం. చైనా, భారత్, ముస్లిం పాశ్చాత్య సంస్కృతులతో ఈ ప్రాంతం ప్రభావితమైంది. అందుకే ఇక్కడ ఒక నిర్దిష్టమైన సంస్కృతి ఏర్పడలేదు. ప్రపంచంలోని ముఖ్య మతాలన్నీ ఇక్కడ ఉన్నాయి. వాణిజ్య, తోటపంటలకు అనుకూలంగా ఉండటంతో పాశ్చాత్యుల రాక అనంతరం వ్యవసాయ విధానంలో పెద్దఎత్తున మార్పులు వచ్చాయి. జీవనాధార వ్యవసాయం వాణిజ్య వ్యవసాయంగా మార్పు చెందింది. వ్యవసాయ రంగంతో పాటు ఆర్థిక, సాంఘిక రంగాల్లోనూ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది.

6) మధ్య ఆఫ్రికా సాంస్కృతిక ప్రాంతం:  ఇక్కడ నీగ్రో సంస్కృతి ఎక్కువగా ఉండటంతో ఒక ప్రత్యేక సాంస్కృతిక ప్రాంతంగా ఏర్పడింది. ఇక్కడికి భారతీయులు, పాశ్చాత్యులతో పాటు ఇతర దేశస్థులు వలస వచ్చారు. యూరోపియన్లు వలస వెళ్లిన ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో వ్యవసాయ పద్ధతుల్లో పెద్దగా మార్పు రాలేదు. విస్తాపన వ్యవసాయం, పశుపోషణ ఇక్కడి ముఖ్యవృత్తులు. కెన్యా, ఉగాండాల్లో మాత్రం వాణిజ్య వ్యవసాయం అమలులో ఉంది. తూర్పు ఆఫ్రికా దేశాలు వాణిజ్య పంటల అభివృద్ధితో కొంత ప్రగతి సాధించాయి. దట్టమైన అడవుల కారణంగా ఈ ప్రాంతం అంతగా అభివృద్ధికి నోచుకోలేదు.

 


రచయిత: జయకర్‌ సక్కరి 

Posted Date : 14-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌