• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - ఉనికి

సహజ సరిహద్దుల విశిష్ట ద్వీపకల్పం!


మూడువైపులా మహాసముద్రాలు, ఒక వైపు సహజ కోటలాంటి హిమాలయ పర్వతాలు,అనేక విశిష్ట లక్షణాలతో భారత ద్వీపకల్పం ఉపఖండంగా విరాజిల్లుతోంది. భౌగోళికంగా ఎన్నో మార్పులకు గురవుతూ స్వాతంత్య్రానంతరం సమగ్ర రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది. భారతదేశ ఉనికి, నైసర్గిక స్వరూపం, భూ, జల సరిహద్దులు, అంతర్జాతీయ సరిహద్దు రేఖలు, పాలనా విభాగాలైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజకీయ స్వరూపం, విస్తీర్ణం, జనాభా పరంగా వాటి స్థానం గురించి అభ్యర్థులకు సంపూర్ణ అవగాహన ఉండాలి. సంబంధిత ప్రాథమికాంశాలు, గణాంకాలు, విశేషాలను సమగ్రంగా తెలుసుకోవాలి.


భారత్‌ విశాల భూభాగం ఉన్న పెద్ద దేశం. ప్రపంచ విస్తీర్ణంలో 2.42% వాటాతో (32,87,283 చదరపు    కిలోమీటర్లు) 7వ అతిపెద్ద దేశంగా ఉంది. మొత్తం విస్తీర్ణంలో 29,73,193 చ.కి.మీ.ల భూభాగం; 3,14,070 చ.కి.మీ.ల జలభాగం; 7,516 కి.మీ.ల పొడవైన సముద్ర తీరప్రాంతం ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 16% కంటే ఎక్కువ ఇక్కడే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ  జనాభా 121 కోట్లు కాగా, 2023 నాటి ప్రాథమిక అంచనాల ప్రకారం 143 కోట్ల జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది.


భారతదేశం హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉంది. ఈ ప్రాంతం అనేక సముద్ర మార్గాలకు కీలకం, వ్యూహాత్మక స్థానం. హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉండటం వల్ల మన దేశానికి హిందూస్థాన్‌ అనే పేరు వచ్చింది. సింధూ నదిని గ్రీకులు ‘ఇండస్‌’ నదిగా పిలవడంతో ఆంగ్లేయులు భారత్‌ను ‘ఇండియా’గా వ్యవహరించారు.


స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌ ఇండియాలో 700కు పైగా సంస్థానాలు ఉండేవి. స్వాతంత్య్రానంతరం వాటన్నింటినీ భారత్‌ లేదా పాకిస్థాన్‌ దేశాల్లో కలిపారు. 1956లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా మొత్తం 20 రాజకీయ యూనిట్లుగా దేశం ఉంది. ప్రస్తుత రాజకీయ స్వరూపంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒక ఖండానికి కావాల్సిన భౌతిక, సాంఘిక, శీతోష్ణస్థితి, సాంస్కృతిక వైవిధ్యాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే భారతదేశాన్ని ఉపఖండంగా పిలుస్తారు. ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు విశాలమైన భూభాగం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం సహజమైన సరిహద్దులుగా ఉన్నాయి. మూడువైపుల్లో సముద్రం, ఒకవైపు భూభాగం ఉండటంతో భారత్‌ను ద్వీపకల్పంగా పిలుస్తారు. దేశంలో ఉత్తరాన గంగా, సింధూ, బ్రహ్మపుత్ర, మైదానాలు; పశ్చిమాన థార్‌ ఎడారి; దక్షిణాన ద్వీపకల్ప పీఠభూమి, తూర్పు, పశ్చిమ తీరరేఖతో కూడిన సహజ వైవిధ్య భూభాగం ఉంది. దేశ ఉత్తర భూభాగం సమశీతోష్ణ మండలంలో ఉంది. దక్షిణ భాగంలో ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంది.


భారతదేశం 804' ఉత్తర అక్షాంశం నుంచి 3706' ఉత్తర అక్షాంశం వరకు 3,214 కి.మీ.ల పొడవు,6807' తూర్పు రేఖాంశం నుంచి 97025' తూర్పు రేఖాంశం వరకు 2,933 కి.మీ.ల వెడల్పుతో, 15,200 కి.మీ.ల భూభాగం సరిహద్దు, 7,516 కి.మీ.ల సముద్రతీర సరిహద్దు (అండమాన్, నికోబార్, లక్షదీవులతో కలిపి) ఉంది. 23 1/20 కర్కటరేఖ దేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా వేరుచేస్తోంది. ఈ రేఖ మొత్తం 8 రాష్ట్రాల మీదుగా వెళుతోంది (గుజరాత్, రాజస్థాన్,  మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, త్రిపుర, మిజోరాం).


* 82 1/20 తూర్పు రేఖాంఖాన్ని దేశ ప్రామాణిక సమయ రేఖాంశంగా తీసుకున్నారు. ఈ రేఖ దేశంలో  5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి వెళుతోంది (ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి). భారత్‌ పరిధిలోని రేఖాంశాల్లో 30ా వ్యత్యాసం ఉండటంతో తూర్పు, పశ్చిమ సరిహద్దు రాష్ట్రాల ప్రామాణిక సమయంలో 2 గంటల తేడా ఉంటుంది. తూర్పున చివరి రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్, పశ్చిమాన చివరి ప్రాంతం సౌరాష్ట్ర (గుజరాత్‌). ఉత్తరాన చివరి ప్రాంతం ఇందిరా కాల్‌ (లద్దాఖ్‌), దక్షిణాన చివరి ప్రాంతం ప్రధాన భూభాగం పరంగా ‘కేప్‌ కమరోన్‌’, సముద్రమార్గ చిట్టచివరి ప్రాంతం గ్రేట్‌ నికోబార్‌ ద్వీపంలోని ఇందిరా పాయింట్‌ (పిగ్‌మిలియన్‌ పాయింట్‌).


భారత్‌కు మొత్తం 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. దేశంలోని 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి. 2000 సంవత్సరం నవంబరులో దేశంలో కొత్తగా 3 రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ (నవంబరు 1న), ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ (నవంబరు 9న), బిహార్‌ నుంచి ఝార్ఖండ్‌ (నవంబరు 15న) ఏర్పాటయ్యాయి. 2014, జూన్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రం (దేశంలో 29వ రాష్ట్రం)గా ఏర్పాటు చేశారు. 2019, అక్టోబరు 31న జమ్ము- కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండుగా (జమ్ము-కశ్మీర్, లద్దాఖ్) విభజించారు. ప్రస్తుతం అవి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రాలు 28 మాత్రమే.


* కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్, డయ్యూ, దాద్రానగర్‌ హవేలీలను కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా విలీనం చేశారు. దీంతో 8 కేంద్రపాలిత ప్రాంతాలయ్యాయి (అండమాన్‌ నికోబార్‌ దీవులు, చండీగఢ్, దాద్రానగర్‌ హవేలీ, దిల్లీ, జమ్ము-కశ్మీర్, లద్దాఖ్, లక్షదీవులు, పుదుచ్చేరి).


* జనాభా పరంగా (2011 లెక్కల ప్రకారం) ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్‌ పెద్దరాష్ట్రాలు. సిక్కిం, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా చిన్న రాష్ట్రాలు. జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో (4.8%), తెలంగాణ 12వ స్థానంలో (2.97%) ఉన్నాయి.


* విస్తీర్ణపరంగా పెద్దరాష్ట్రాలు వరుసగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌. చిన్న రాష్ట్రాలు గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్‌.


అంతర్జాతీయ సరిహద్దులున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు


* బంగ్లాదేశ్‌తో - పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, అస్సాం, మిజోరాం


* చైనాతో - లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం


* పాకిస్థాన్‌తో - జమ్ము-కశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌


* నేపాల్‌తో - ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌


* మయన్మార్‌తో - అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, మణిపుర్, నాగాలాండ్‌


* భూటాన్‌తో - అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం


* అఫ్గానిస్థాన్‌తో - లద్దాఖ్‌ దేశంలో పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రం - పశ్చిమ బెంగాల్‌ (2,509 కి.మీ.), అతితక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రం - నాగాలాండ్‌ (215 కి.మీ.)


* దేశంలో భూపరివేష్ఠిత రాష్ట్రాలు (తీర రేఖ లేకుండా, అంతర్జాతీయ సరిహద్దు లేకుండా చుట్టూ భూమి సరిహద్దుగా ఉన్నవి): మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హరియాణా, తెలంగాణ.


పొరుగు దేశాలతో సరిహద్దు
 

 దేశం                 సరిహద్దు (కి.మీ.ల్లో) 
 బంగ్లాదేశ్‌    -   4,096    
 చైనా           -   3,917
 పాకిస్థాన్‌     -   3,310 
 నేపాల్‌        -   1,752
మయన్మార్‌  -  1,458 
భూటాన్‌   -  587 
అఫ్గానిస్థాన్‌   -  80

 


ఎల్‌ఓసీ రేఖ:  భారత్‌ - పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు మధ్య ఉన్న రేఖ.


ఎల్‌ఏసీ/ఎల్‌ఓఏసీ రేఖ: జమ్ము-కశ్మీర్‌ (ప్రస్తుత లద్దాఖ్‌)లోని ఆక్సాయ్‌చిన్‌ - చైనా మధ్య వాస్తవాధీన రేఖ.


ఏజీపీఎల్‌ రేఖ:  భారత్‌లోని పెద్ద హిమానీనదం సియాచిన్, పాకిస్థాన్‌ మధ్య వాస్తవ మోహరింపు రేఖ.


రాడ్‌క్లిఫ్‌ రేఖ: భారత్‌ - పాకిస్థాన్‌ను వేరుచేసే రేఖ (భారత్‌ - బంగ్లాదేశ్‌ను వేరు చేస్తుంది.)


మెక్‌మహాన్‌ రేఖ: భారత్‌ - చైనా (తూర్పు వైపు) సరిహద్దు రేఖ.


సర్‌క్రీక్‌ రేఖ: గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతంలో పాకిస్థాన్‌ గుర్తించిన సరిహద్దు (240 సమాంతర రేఖ).


డ్యూరాండ్‌ రేఖ: భారత్‌ - అఫ్గానిస్థాన్‌ మధ్య ఉన్న సరిహద్దు రేఖ (బ్రిటిష్‌ కాలం నాటి ఒప్పందం).

 


రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌ 


 

Posted Date : 01-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌