• facebook
  • whatsapp
  • telegram

కాక‌తీయులు - సాంఘీక, ఆర్థిక, సామాజిక ప‌రిస్థితులు

* గ్రామానికో చెరువు

* మూడు శతాబ్దాల చరిత్ర

* వ్యవసాయానికి పెద్దపీట

* వాణిజ్యంలోనూ ప్రత్యేకత

కాకతీయులు తెలంగాణను దాదాపు 300 సంవత్సరాలకు పైగా పాలించారు. వీరి కాలంలో తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించింది. వీరు నిర్మించిన ఎన్నో చెరువులు, దేవాలయాలు నేటికీ తెలంగాణలో కాకతీయుల సుపరిపాలనకు సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి.

గ్రామ పరిపాలన

గ్రామ పరిపాలనను 'మహాజనులు' అనే సభ నిర్వహించేది. ఈ సభ నిర్ణయాలను అమలుపరచడానికి 12 మంది ఆయగార్లు ఉండేవారు. వీరిలో కరణం, రెడ్డి, తలారి అనేవారు ప్రభుత్వోద్యోగులు. కరణం భూమిశిస్తును నిర్ణయించేవాడు. రెడ్డి భూమిశిస్తును వసూలు చేసేవాడు. తలారి గ్రామ రక్షకభటుడు. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడేవాడు. మిగిలిన 9 మంది వివిధ వృత్తులను చేసే గ్రామ సేవకులు. ఆయగార్లకు పన్నులు లేని భూములు ఇచ్చేవారు. కొన్నిసార్లు పంటలో కూడా భాగముండేది.

రాజ్య ఆదాయం

భూమిశిస్తు రాజ్యాదాయంలో ప్రధానమైంది. పండిన పంటలో 1/6వ వంతు భూమిశిస్తుగా వసూలు చేసేవారు. భూమిశిస్తును 'అరి' అనీ, చెల్లించే వారిని 'అరిగాపులు' అనీ వ్యవహరించేవారు.

సంప్రదాయ పన్నులు

రాజును దర్శించినప్పుడు ఇచ్చే కానుకలను 'దరిశనం' అని, రాజు లేదా ఇతర అధికారులు మేలు చేసినప్పుడు చెల్లించే కానుకను 'ఉపకృతి' అని అనేవారు.

ప్రతి పొలాన్ని గడ లేదా దండ లేదా కొలతో కొలిచేవారు. ఈ గడ 32 జానల పొడవుండేది. నీరు పొలంపై పన్నును 'కోరు' అనీ, వెలిపొలంపై పన్నును 'పుట్టిహండి' అనీ వ్యవహరించేవారు. 'కొలకాండ్రు' అనే అధికారులు పన్నులు వసూలు చేసేవారు. ప్రతి గ్రామంలో రాజు సొంత పొలానికి 'రాచదొడ్డి' అని పేరుండేది. ఈ భూమిని రైతులకు 'కోరు' లేదా అర్ధాదాయానికి కౌలుకు ఇచ్చేవారు. ఇలా తీసుకునే రైతులను 'అర్ధశిరీ' అనేవారు. సంత పట్టణాల వర్తక సామగ్రిపై విధించే సుంకానికి 'పెంట సుంకం' లేదా 'మగమ' అని పేరు. వేశ్యలపై విధించే పన్నును 'గుణాచార పన్ను' అనేవారు.

చెరువుల నిర్మాణం

కాకతీయులు వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. ఈ క్రమంలో చెరువుల నిర్మాణాన్ని ప్రోత్సహించారు. ఇందులో భాగంగానే కాకతీయుల కాలంలో తెలంగాణలోని అన్ని గ్రామాల్లో చెరువుల నిర్మాణం జరిగింది. చెరువును నిర్మించిన వ్యక్తికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందనే నమ్మకం ఉండేది. చెరువుల నిర్మాణాన్ని సప్త సంతానాల్లో ఒకటిగా భావించేవారు. సప్త సంతానాల గురించి గంగాధరుడి కరీంనగర్ శాసనం, గణపతిదేవుడి గణపేశ్వర శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు నిర్మించిన చెరువుల్లో కేసరి సముద్రం, రుద్ర సముద్రం, ఉదయచోడుని చెరువు, పాకాల చెరువు, రామప్ప చెరువు, లక్నవరం చెరువు, బయ్యారం చెరువు, కుంద సముద్రం ముఖ్యమైనవి. కాకతీయులు 'దశబంధ ఈనాం' అని ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. చెరువు కింద సాగయ్యే పంటలో పదో వంతు రాజుకు ధన లేదా ధాన్యరూపంలో చెల్లించే షరతుపై ఇచ్చిన ఈనాంనే దశబంధ ఈనాం అనేవారు.

మూసేటి కాల్వ, ఇమ్మడి కాల్వ, కృష్ణవేణి కాల్వ, అంతర్‌గంగ కాల్వలకు నదుల నుంచి నీరు సరఫరా అయ్యేది. ప్రతాపరుద్రుడి కాలంలో అడవులను నరికించి, కొత్త భూములను వ్యవసాయ యోగ్యంగా చేశారు. ఈ కాలంలో గోధుమలు, వరి, కొర్రలు, పెసలు, జొన్నలు, చెరకు, నూనె దినుసులు, ఉల్లి, అల్లం, పసుపు పంటలను పండించేవారు.

పరిశ్రమలు

ప్రాచీన కాలం నుంచీ కలంకారీ చీరలకు, సన్నని వస్త్రాలకు తెలంగాణ ప్రసిద్ధి చెందింది. కాకతీయుల కాలంలో 20కి మించిన వివిధ వస్త్రాలను పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు. ఓరుగల్లు రత్న కంబళ్లు, ముఖమల్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. గోల్కొండలో వజ్రాలు దొరికేవి.

వాణిజ్యం

వాణిజ్యాన్ని వైశ్యులు, బలిజశెట్టులు నిర్వహించేవారు. వర్తకులు 'శ్రేణి' వ్యవస్థ ద్వారా వ్యాపారం చేసేవారు. ఈ కాలంనాటి పెద్దశ్రేణి 'సర్వదేశీయ సహస్రతెలికి'. ఈ కాలంలో వడ్డీ వ్యాపారం ఉండేది. వడ్డీ 12 శాతం మించరాదని 'విజ్ఞానేశ్వరం' చెబుతుంది. దేశీయ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రధాన కేంద్రం. అక్కడ ప్రతివారం మడిసంత, మైలసంత జరిగేవి. 'గద్యాణం' అనే బంగారు నాణెం, 'రూక' అనే వెండి నాణెం అమల్లో ఉండేవి.
అలంపురం, పానగల్లు, మంథెన, తంగెడ, మాచర్ల, వెల్పూరు, త్రిపురాంతకం, నెల్లూరు దేశీయ వాణిజ్య కేంద్రాలు. వీటిని రేవు పట్టణాలైన మోటుపల్లి, మచిలీపట్టణాలతో కలుపుతూ రహదారులుండేవి. మోటుపల్లి నుంచి త్రిపురాంతకం మీదుగా బళ్లారి మార్గం ఉండేది. చైనా, సింహళం, పర్షియా, అరేబియా దేశాలతో విదేశీ వాణిజ్యం జరిగేది. మోటుపల్లి ప్రధాన ఓడరేవుగా ఉండేది. గణపతిదేవుడు ఇక్కడ విదేశీ వర్తకులకు అభయహస్తమిస్తూ మోటుపల్లి అభయశాసనాన్ని వేయించాడు. మోటుపల్లిని దేశీయకొండ పట్టణం అనేవారు.

సాంఘిక జీవనం

కాకతీయుల కాలంలో కులవ్యవస్థ బాగా ప్రబలి పోయింది. కాకతీయుల కులం గురించి స్పష్టత లేదు. కానీ శూద్రులనే భావన ఉంది. వర్ణాంతర వివాహాలు కేవలం ఉన్నత వర్గాల వారిలో ఉండేవి. వివిధ వర్ణాల మధ్య సామరస్యం ఉండి గ్రామీణ జీవితం ప్రశాంతంగా సాగింది. అయితే రెడ్డి, వెలమ కులాల మధ్య అధికార ప్రాబల్యం కోసం పోరాటాలు జరిగాయి. సమాజంలో బ్రాహ్మణులకు రాజకీయ ప్రాబల్యం తగ్గింది. అధికారం శూద్రుల హస్తగతం కావడంతో వారు రాజులయ్యారు. శూద్రులతో క్షత్రియులు సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను రక్షించడానికి పుళింద వర్గాన్ని బ్రహ్మ సృష్టించినట్లు కాకతీయ ప్రోలరాజు సేనాని మల్లెనాయకుడు 'మాటేడు శాసనం'లో పేర్కొన్నాడు. వైశ్యులు వర్తక వ్యాపారాలు చేసేవారు. మనువు తర్వాత మొదటిసారిగా స్త్రీకి ఆస్తిహక్కును గుర్తించింది ఈ కాలంలోనే. విజ్ఞానేశ్వరం స్త్రీధనాన్ని అయిదు రకాలుగా వర్ణిస్తుంది.

దురాచారాలు

కాకతీయుల కాలంనాటి సమాజంలో నిర్బంధ వైధవ్యం, బాల్యవివాహాలు, కన్యాశుల్కం, సతీసహగమనం లాంటి దురాచారాలుండేవి. సామాన్య ప్రజల్లో మద్యపానం, జూదం, కోడిపందేలు, పొట్టేళ్ల పందేలు లాంటి వ్యసనాలుండేవి. దేవదాసీలకు, బసివిరాండ్రకు, వేశ్యలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. ప్రభువులు, ఉన్నతవర్గాల వారు దేవాలయాలకు దేవదాసీలను, నాట్యగత్తెలను బహూకరించేవారు.

క్రీ.శ.1182లో జరిగిన పల్నాటి యుద్ధం తర్వాత ఓరుగల్లులో కూడా పల్నాటి వీరులకు జాతర చేయడం ఆచారమైంది. పల్నాటి బ్రహ్మనాయుడు కులవ్యవస్థను ఖండించి సహపంక్తి భోజనాలను, చాపకూళ్లను ప్రోత్సహించాడు. అతడు వీరవైష్ణవాన్ని అనుసరించి.. అనేక మంది నిమ్న కులస్థులను అందులో చేర్చాడు. దళితులకు దేవాలయ ప్రవేశం చేయించాడు. శివుడి ఉగ్రరూపాలైన భైరవ, మైలారు దేవతలను పూజించినట్లు క్రీడాభిరామం తెలుపుతోంది. మైలారు దేవుడిని యుద్ధదేవుడిగా వీరులు ఆరాధించేవారు.

మత జీవనం

నాటి సమాజంలో వీరశైవ, వీరవైష్ణవ శాఖల మధ్య తరచుగా ఘర్షణ జరిగేది. హరిహరులు (శివుడు, విష్ణువు) ఇద్దరూ ఒకటేనని మహాకవి తిక్కన ప్రచారం చేసి ప్రజల్లో సఖ్యత కల్పించాడు. ఏకవీర, రేణుక, భైరవుడు, చాముండేశ్వరి, వీరభద్రుడు, కుమారస్వామి, మైలారుదేవుడు, ముద్దరాలు ముసానమ్మ లాంటి దేవతలను పూజించేవారు.

జైనమతం

తొలి కాకతీయులు దిగంబర జైనమతాన్ని అనుసరించారు. వేంగి రాజ్యంలో హింసకు గురైన జైనులు హనుమకొండకు వలస వచ్చినట్లు ఓరుగల్లు కైఫీయత్తు (గ్రామ చరిత్ర) వివరిస్తుంది. క్రీ.శ.800 నాటికే హనుమకొండ ప్రముఖ జైనకేంద్రంగా ప్రసిద్ధి చెందింది. రాజరాజ నరేంద్రుడు అనే వేంగి చాళుక్యరాజు హింసించగా వృషభనాథుడనే జైనాచార్యుడు హనుమకొండకు వచ్చినట్లుగా ఓరుగల్లు కైఫీయత్తు ద్వారా తెలుస్తోంది. హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం జైన దేవాలయంగా ఉండేది. హనుమకొండ శాసనం జినేంద్ర ప్రార్థనతో మొదలవుతుంది. ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ హనుమకొండలో కడలాలయ జైనబసదిని నిర్మించింది. తర్వాతి కాలంలో జైనులను శైవులు హింసించినట్లు, వారి దేవాలయాలను నేలమట్టం చేసినట్లు పండితారాధ్యం తెలుపుతోంది. హనుమకొండలోని జైన మతస్థులను గణపతి దేవుడు తన గురువైన విశ్వేశ్వర శివుడి ప్రోత్సాహంతో హింసించినట్లుగా సిద్ధేశ్వర చరిత్ర ద్వారా తెలుస్తోంది. విశ్వేశ్వర శివుడు 36 జైన గ్రామాలను నాశనం చేశాడు. అయినప్పటికీ జైనమతం పూర్తిగా పతనం కాలేదు. బోధన్, పొట్లచెరువు (పటాన్ చెరువు), వేములవాడ, కొల్లిపాక (కొలనుపాక), హనుమకొండ ప్రముఖ జైన కేంద్రాలుగా ఉండేవి.

శైవం

కాకతీయుల కాలంలో శైవం విశేష ఆదరణ పొందింది. ఈ కాలంలో కాలాముఖ శైవం ఎక్కువగా జనాదరణ పొందింది. గణపతిదేవుడి కాలం నుంచి గోళకీ మఠం ఆదరణ పొందింది. గోళకీ మఠ ప్రధానాచార్యుడైన విశ్వేశ్వర శంభు గణపతిదేవుడి శివదీక్షా గురువు. క్రీ.శ.1261లో విశ్వేశ్వర శంభునికి రుద్రమదేవి మందారం (మందడం) గ్రామాన్ని కృష్ణలంకతో కలిపి దానం చేసినట్లు మలకపురం శాసనం తెలుపుతోంది. ఈ గ్రామానికి ఆయన విశ్వేశ్వర గోళకీ లేదా విశ్వనాధ గోళగిరి అనే కొత్తపేరు పెట్టాడు. మందడంలో వేద పాఠశాలను, సత్రాన్ని, శుద్ధ శైవమఠాన్ని విశ్వేశ్వర శంభు ఏర్పాటు చేశాడు. విశ్వేశ్వర శివుడు ఏలేశ్వరంలో షోడశ ఆవర కాలమఠాన్ని ఏర్పాటు చేశాడు. శివుడి అవతారాలైన 28 మంది యోగాచార్యుల గురించి శివపురాణం, కూర్మపురాణం తెలుపుతున్నాయి. మందడం, ద్రాక్షారామం, పుష్పగిరి, శ్రీశైలం, త్రిపురాంతకం తదితర ప్రాంతాల్లో గోళకీ మఠ శాఖలు ఏర్పడ్డాయి. శైవుల్లో ఎక్కువగా మూఢాచారాలుండేవి. జంతుబలులు, ఆత్మబలిదానాలు ఎక్కువగా ఉండేవి. భక్తులు వీరావేశంతో గండకత్తెరతో తలలు కత్తిరించుకునేవారు. దేవాలయాల్లో ఉత్సవాలు జరిగే సమయంలో జాతరలు నిర్వహించేవారు. గ్రామదేవతలను పూజించేవారు. గణపతిదేవుడు, రుద్రమదేవి కాలంలో పాశుపత, శివశాసన, కాపాలిక, కాలానన, యామిళ తదితర శైవ శాఖలున్నట్లు త్రిపురాంతకం, మల్కాపురం శాసనాల ద్వారా తెలుస్తోంది. అలంపురం గొప్ప కాలాముఖ క్షేత్రంగా ఉండేది.

వైష్ణవం

కాకతీయుల కాలంలో వైష్ణవం కూడా గొప్ప ఆదరణ పొందింది. కాకతీయుల రాజలాంఛనం 'వరాహం'. రుద్రమదేవి కాలం నుంచి వైష్ణవం విశేషంగా వ్యాప్తి చెందింది. కాకతీయల సామంతులు వైష్ణవాన్ని ఆదరించారు. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని, నగునూరులో వైష్ణవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుడు, గణపతిదేవుడు చాతుర్వర్ణ సముద్ధరణ బిరుదు ధరించారు. ఈ కాలంలో దక్షిణాదేశం నుంచి రామానుజ వైష్ణవం తెలంగాణలోకి ప్రవేశించి వ్యాపించింది. నందలూరు, తిరుపతి, మంగళగిరి, మాచర్ల, సింహాచలం, శ్రీకూర్మం, నెల్లూరు, బాపట్ల, శ్రీకాకుళం తదితర ప్రాంతాలు వైష్ణవ కేంద్రాలుగా ఉండేవి. ప్రతాపరుద్రుడు కీ.శ.1321లో చెన్నకేశవస్వామికి కొన్నిదానాలు చేసినట్లు కొలనపల్లి శాసనం తెలుపుతోంది.

విద్యా విధానం

కాకతీయుల కాలం నాటి రాజభాష సంస్కృతం. అప్పట్లో విద్యా మండపాలు ఉండేవి. ఇవి ముఖ్య దేవాలయాలకు అనుబంధంగా ఉండి సాహిత్య గోష్ఠులకు, మత చర్చలకు కేంద్రంగా పనిచేసేవి. మందడం, పుష్పగిరి తదితర ప్రాంతాల్లో విద్యా మండపాలతో పాటు వేదపాఠశాలలు కూడా ఉండేవి. ఈ విద్యాకేంద్రాల్లో గణితం, జ్యోతిషం, ఆయుర్వేద విద్యలను నేర్పేవారు. క్రీ.శ.1261 నాటి మల్కాపురం శాసనం నాటి విద్యామండపాల స్థితిగతులను తెలుపుతోంది.

 

మాదిరి ప్రశ్నలు

 

1. 'దరిశనం' అంటే ఏమిటి?

    ఎ) భూమిశిస్తు       బి) దేవతలను దర్శించినప్పుడు చెల్లించే సుంకం

    సి) రాజును దర్శించినప్పుడు చెల్లించే కానుక        డి) సామంతుల కప్పాలు

జ: (సి)

2. ఏ కాలంలో దేవాల యాలకు దేవదాసీలను, నాట్యగత్తెలను బహూకరించే ఆచారముండేది?

    ఎ) విష్ణుకుండినులు     బి) కాకతీయులు     సి) ఇక్ష్వాకులు     డి) శాతవాహనులు

జ: (బి)

3. తొలి కాకతీయులు అనుసరించిన మతం ఏది?

    ఎ) బౌద్ధం     బి) శైవం     సి) వైష్ణవం     డి) జైనం

జ: (డి

4. జినేంద్ర ప్రార్థనతో ప్రారంభమయ్యే శాసనం ఏది?

    ఎ) హనుమకొండ శాసనం     బి) కాజీపేట శాసనం     సి) బీదర్ శాసనం     డి) పద్మాక్షి దేవాలయ శాసనం

జ: (ఎ)

5. కాకతీయుల కాలంలో పంటలోని ఎన్నో వంతును భూమిశిస్తుగా వసూలు చేసేవారు?

    ఎ) 1/3     బి) 1/6     సి) 1/2     డి) 1/4

జ: (బి)

6. జైనులను గణపతిదేవుడు హింసించినట్లు తెలిపే ఆధారం ఏది?

    ఎ) బసవపురాణం     బి) ముద్రామాత్యం     సి) సకలనీతిసమ్మతం     డి) సిద్ధేశ్వర చరిత్ర

జ: (డి)

7. కాకతీయుల కాలం నాటి రాజభాష ఏది?

    ఎ) తెలుగు     బి) ప్రాకృతం     సి) సంస్కృతం     డి) పాళీ

జ: (సి)

8. యుద్ధదేవుడిగా వీరులు ఆరాధించే దేవత ఎవరు?

    ఎ) మైలారుదేవుడు     బి) ఇంద్రుడు     సి) యముడు     డి) అర్జునుడు

: (ఎ)

9. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిందెవరు?

    ఎ) రుద్రమదేవి     బి) ప్రతాపరుద్రుడు     సి) ప్రోలరాజు     డి) గణపతిదేవుడు
జ: (డి)

10. విద్యా మండపాల స్థితిగతులను తెలిపే ఆధారం ఏది?

    ఎ) ఉప్పరపల్లి శాసనం     బి) మల్కాపురం శాసనం     సి) కరీంనగర్ శాసనం     డి) బీదర్ శాసనం

జ: (బి)

11. కిందివాటిలో కాకతీయుల కాలంనాటి బంగారు నాణెం ఏది?

    ఎ) గద్యాణం     బి) రూక     సి) వరాహం     డి) ఏదీకాదు

జ: (ఎ)

Posted Date : 04-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌