• facebook
  • whatsapp
  • telegram

కాక‌తీయులు

* ప్రగతిదాయక పరిపాలన

* చెరువులు, ఆలయాల నిర్మాణం

తెలంగాణ చరిత్రలో కాకతీయులది ప్రముఖ స్థానం. తెలంగాణపై తమదైన చెరిగిపోని ప్రగతిముద్ర వేసిన కాకతీయ రాజులు ప్రజాప్రయోజనాలు, ప్రజాభీష్టాల మేరకు ఎన్నో చెరువులు, దేవాలయాలను నిర్మించారు. కాకతమ్మ భక్తులుగా.. ఆ దేవత పేరుతోనే వీరు ప్రఖ్యాతి గాంచారు. చరిత్రలోప్రముఖ స్థానం సంపాదించుకున్న రాణి రుద్రమదేవి కాకతీయుల్లో గొప్ప పాలకురాలిగా కీర్తి గడించింది. తొలి పాలకుడు మొదటి బేతరాజు కాగా చివరివాడు ప్రతాపరుద్రుడు. టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం కాకతీయ చరిత్ర అధ్యయన సమాచారం..
తెలంగాణ చరిత్ర, సంస్కృతితెలంగాణ చరిత్రలో కాకతీయ సామ్రాజ్య స్థాపన ఒక ముఖ్య ఘట్టం. రెండున్నర శతాబ్దాలు పాలించిన కాకతీయులు తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపజేశారు. తెలంగాణలో అనేక చెరువులు, దేవాలయాలను నిర్మించారు. వీరి పాలనా కాలంలో తెలంగాణ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. కాకతీయుల్లో మొదటివాడు బేతరాజు కాగా.. రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు లాంటి ప్రముఖులున్నారు. కాకతీయ రాజుల విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.

కాకతీయ రాజులు

మొదటి బేతరాజు

కాకతీయుల్లో తొలిపాలకుడు మొదటి బేతరాజు అని కాజీపేట, బయ్యారం శాసనాలు తెలుపుతున్నాయి. మొదటి బేతరాజు కళ్యాణి చాళుక్యులకు సామంతుడిగా పాలించాడు. బేతరాజు మంత్రి నారణయ్య శనిగరంలోని యుద్ధమల్ల జినాలయాన్ని పునరుద్ధరించి కానుకలిచ్చి అక్కడ క్రీ.శ. 1051లో శనిగరం శాసనం వేయించాడు. బేతరాజుకు 'కాకతీపురాధినాథ' అనే బిరుదుండేది.

మొదటి ప్రోలరాజు

ఇతడు మొదటి బేతరాజు కుమారుడు. ఇతడి కాలంలో హనుమకొండ కాకతీయుల రాజధాని అయ్యింది. ఇతడు వరాహ లాంఛనం ఉపయోగించడం ప్రారంభించాడు. కేసరి తటాకాన్ని, కేసముద్రం చెరువును తవ్వించాడు. ఇతడికి అరిగజకేసరి, కాకతీవల్లభ, సమదిగత పంచమహాశబ్ద అనే బిరుదులుండేవి.

రెండో బేతరాజు

ఇతడు మొదటి ప్రోలరాజు కుమారుడు. ఇతడికి త్రిభువనమల్ల, మహామండలేశ్వర, విక్రమచక్రి, చలమర్తిగండ అనే బిరుదులుండేవి. ఇతడు కాలాముఖ శైవాచార్యుడైన రామేశ్వర పండితుడి నుంచి శైవదీక్ష పొందాడు. గురుదక్షిణగా హనుమకొండలో శివపురమనే భాగాన్ని ఇచ్చి, అందులో బేతేశ్వర దేవాలయాన్ని నిర్మించాడు.

దుర్గరాజు

ఇతడు రెండో బేతరాజు పెద్ద కుమారుడు. కాజీపేట దర్గా శిలాశాసనం వేయించాడు. తన తండ్రి నిర్మించిన బేతేశ్వర ఆలయాన్ని కాలాముఖ శైవాచార్యుడైన రామేశ్వర పండితుడికి దానం చేసినట్లు తెలుస్తోంది.

రెండో ప్రోలరాజు

దుర్గరాజు అనంతరం అతడి సోదరుడు రెండో ప్రోలరాజు సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడి మంత్రి బేతనామాత్యుడు. బేతనామాత్యుడి భార్య మైలమ క్రీ.శ. 1118లో హనుమకొండలో కడలాలయ జైనబసదిని నిర్మించింది. ప్రోలరాజు ఓరుగల్లు కోటలో స్వయంభు దేవాలయాన్ని, హనుమకొండలో పద్మాక్షి, సిద్ధేశ్వర దేవాలయాలను నిర్మించాడు.

కాకతీయ ప్రముఖులు

రుద్రదేవుడు

కాకతీయ ప్రముఖుల్లో రుద్రదేవుడు ప్రథముడు. ఇతడు రెండో ప్రోలరాజు కుమారుడు. హనుమకొండ శాసనం రుద్రదేవుడి ఘనతను తెలుపుతుంది. ఇతడినే మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. ఓరుగల్లు నగర నిర్మాత రుద్రదేవుడని కొలని గణపతిదేవుడి శివయోగ శాస్త్రం తెలుపుతుంది. రుద్రదేవుడు కవి, కవిపోషకుడు, విద్యావంతులకు కల్పతరువు లాంటి వాడని క్రీ.శ. 1195 నాటి పిల్లలమర్రి నాయరెడ్డి శాసనం తెలుపుతుంది. రుద్రదేవుడికి 'విద్యాభూషణుడు' అనే బిరుదుండేది. ఇతడు సంస్కృత భాషలో 'నీతిసారం' అనే గ్రంథాన్ని రచించాడు. రుద్రదేవుడు తనను స్వతంత్ర ప్రభువుగా ప్రకటించుకున్న సందర్భంలో క్రీ.శ. 1163లో హనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని (వెయ్యి స్తంభాల గుడి) నిర్మించాడు. ఇది ఒక త్రికూటాలయం. ఇందులో శివుడు, వాసుదేవుడు, సూర్యదేవుడు తదితర దేవతలున్నారు. ఇతడి కాలంలో జైన, శైవ మతాల మధ్య సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. రుద్రదేవుడు దేవగిరి యాదవ పాలకుడైన జైత్రపాలుడితో జరిగిన యుద్ధంలో మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని యాదవరాజుల ఆస్థాన కవి హేమాద్రి తన చతుర్వర్గ సారం అనే గ్రంథంలోని వ్రతఖండ భాగంలో పేర్కొన్నాడు.

గణపతిదేవుడు

గణపతిదేవుడు కాకతీయుల్లో గొప్పవాడు. అతడి కాలంలో రాజ్యం కంచి వరకు విస్తరించింది. దీర్ఘకాలం రాజ్యపరిపాలన చేశాడు. విదేశీ వర్తకులకు అభయమిస్తూ మోటుపల్లి అభయశాసనం వేయించాడు. మోటుపల్లికి దేశీయకొండ పట్టణం అని పేరు. ఇది విదేశీ వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. క్రీ.శ. 1254లో గణపతిదేవుడు తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. ఇతడికి రాయగజకేసరి అనే బిరుదుండేది. ఇది ఆ కాల నాణేలపై కనిపిస్తుంది. గణపతిదేవుడి సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు. పాలంపేటలో క్రీ.శ.1213లో రామప్ప దేవాలయాన్ని, రామప్ప చెరువును నిర్మించి శాసనం వేయించాడు. గణపతిదేవుడి శివదీక్షా గురువు విశ్వేశ్వర శంభూ అనే ప్రసిద్ధ శైవాచార్యుడు. గణపతిదేవుడు వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తూ అనేక కొత్త చెరువులను నిర్మించాడు. అవి.. రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్కవరం చెరువు, బయ్యారం చెరువు.

రుద్రమదేవి

రుద్రమదేవి తెలంగాణను పాలించిన మొదటి మహిళా పాలకురాలు. రుద్రదేవ మహారాజు పేరున సింహాసనాన్ని అధిష్టించింది. ఆమెకు 'రాయగజకేసరి' అనే బిరుదు ఉండేది. దేవగిరిని పాలించే యాదవ రాజు మహాదేవుడు ఓరుగుల్లుపైకి దండెత్తగా రుద్రమదేవి అతడిని ఓడించి దేవగిరి వరకు తరిమివేసింది. ఈ విషయం ఆమె వేయించిన బీదర్ శాసనం ద్వారా తెలుస్తుంది. దేవగిరి యాదవుల నాణేలు తెలంగాణ ప్రాంతంలోను, ఆంధ్రా ప్రాంతంలోని కృష్ణాజిల్లా రాచపట్నంలోను లభించాయి. రుద్రమదేవి సైన్యంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆమె పాలనాకాలంలో వెనీస్ (ఇటలీ) యాత్రికుడు మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని దర్శించాడు. రుద్రమదేవి తన రాజ్య దక్షిణ భాగంలో కాయస్థ అంబదేవుడి తిరుగుబాటును అణచడానికి త్రిపురాంతకానికి వెళ్లి అక్కడ జరిగిన యుద్ధంలో మరణించింది. ఈ విషయం ఇటీవల నల్గొండ జిల్లా చందుపట్లలో దొరికిన శాసనం ద్వారా తెలుస్తోంది.

ప్రతాపరుద్రుడు

ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనుమడు. ఇతడినే రెండో ప్రతాపరుద్రుడు అంటారు. ఇతడు కుమార రుద్రుడు, వీరభద్రుడు అనే పేర్లతో రుద్రమదేవి కాలంలోనే రాజ్య వ్యవహారాలను నిర్వహించాడు. రాయలసీమ ప్రాంతంలో నూతన వ్యవసాయ భూములు, గ్రామాలను ఏర్పాటు చేశాడు. ఇతడే చివరి కాకతీయ పాలకుడు. కాకతీయ రాజ్యంపై ఢిల్లీ సుల్తానులు 8 సార్లు దండయాత్ర చేశారు. ఎనిమిదో దండయాత్రలో జునాఖాన్ ప్రతాపరుద్రుడిని ఓడించి ఢిల్లీకి బందీగా తీసుకుపోయాడు. మార్గమధ్యంలోనే నర్మదానది (సోమోద్భవ) తీరంలో ప్రతాపరుద్రుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ముసునూరి ప్రోలయ నాయకుడి విలస శాసనం, రెడ్డి రాణి అనితల్లి వేయించిన కలువచేరు తామ్ర శాసనం (కీ.శ. 1423) తెలుపుతున్నాయి. దీంతో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది.

సుల్తాన్‌పూర్

ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ ఓరుగల్లుకు సుల్తాన్‌పూర్ అని పేరు పెట్టాడు. తెలంగాణ మొత్తాన్ని ఆక్రమించి అక్కడ రాజప్రతినిధిని నియమించి తమ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు.

పరిపాలన

కాకతీయులు సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించి పాలించారు. దత్తత ద్వారా సింహాసనం లభించే పద్ధతి కాకతీయుల కాలంలో మొదటిసారిగా అమలైంది. రాజుకు పరిపాలనలో సలహాలివ్వడానికి మహాప్రధాని, ప్రధాని, అమాత్య, మంత్రి లాంటి వారుండేవారు. రాజోద్యోగులను 72 నియోగాలు(శాఖలు)గా విభజించారు. ఈ మొత్తం నియోగాలను బాహత్తర నియోగాధిపతి పర్యవేక్షించేవాడు. కాకతీయ రాజులు మహామండలేశ్వర బిరుదును ధరించారు.

నాయంకర విధానం

పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు. గ్రామ పరిపాలనకు 'మహాజనులు' అనే పేరుతో సభ ఉండేది. కాకతీయులు తమకు విశ్వాసపాత్రులైన వారికి భూములిచ్చి నాయంకరులుగా నియమించుకున్నారు. వీరు సైన్యాలను పోషిస్తూ రాజుకు సరఫరా చేసేవారు. ఈ పద్ధతినే నాయంకర విధానం అంటారు. చక్రవర్తి అంగరక్షకులను లెంకలు అనేవారు. లెంక ధర్మాలను తెలిపే లెంకావళి ఉండేది. రాజు ఆస్థానంలో ప్రాడ్వివాకులు అనే ప్రత్యేక న్యాయాధికారులు ఉండేవారు. కొన్ని ప్రత్యేక వివాదాలను పరిష్కరించడానికి ధర్మాసనాలను ఏర్పాటు చేసేవారని దుగ్గిరాల శాసనం, క్రీడాభిరామం తెలుపుతున్నాయి. ఈ ధర్మాసనాలు చేసిన తీర్పులను జయ పత్రాలు అనేవారు.

 


కాకతీయుల గురించిన మొదటి ప్రస్తావన తూర్పు చాళుక్యరాజు దానార్ణవుడి మాగల్లు శాసనం (క్రీ.శ. 950)లో ఉంది. ఓరుగల్లులో కాకతమ్మకు దేవాలయం ఉండేదని ఆమెను పూజించడం వల్ల ఈ పాలకులకు కాకతీయులని ఆ పేరు వచ్చిందని వినుకొండ వల్లభరాయుడు తన క్రీడాభిరామంలో తెలిపాడు. కాకతీయులు రాష్ట్ర కూటుల కొలువులో చాలాకాలం సైన్యాధిపతులుగా పనిచేశారు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. నీతిసారం గ్రంథకర్త ఎవరు?

ఎ) ప్రోలరాజు    బి) గణపతిదేవుడు    సి) ప్రతాపరుద్రుడు    డి) రుద్రదేవుడు

జ: (డి)

2. కాకతీయుల్లో చివరి పాలకుడు ఎవరు?

ఎ) రుద్రమదేవి    బి) గణపతిదేవుడు    సి) ప్రతాపరుద్రుడు    డి) ప్రోలరాజు

జ: (సి)

3. కాకతీయులను గురించి మొదటి ప్రస్తావన ఏ శాసనంలో ఉంది?

ఎ) హనుమకొండ శాసనం    బి) మల్కాపురం శాసనం    సి) బీదరు శాసనం    డి) మాగల్లు శాసనం

జ: (డి)

4. దేవగిరి యాదవుల నాణేలు ఎక్కడ లభించాయి?

ఎ) రాచపట్నం   బి) హనుమకొండ    సి) సబ్బీమండలం    డి) పిల్లలమర్రి

జ: (ఎ)

5. గణపతిదేవుడి శివదీక్షా గురువు ఎవరు?

ఎ) నైనాచార్యుడు   బి) శ్రీపతి పండితుడు   సి) విశ్వేశ్వర శంభూ   డి) మల్లికార్జున పండితారాధ్యుడు

: (సి)

6. హనుమకొండలో కడలాలయ జైన బసదిని నిర్మించినదెవరు?

ఎ) కుందమాంబ   బి) మైలమ   సి) గణపాంబ   డి) ముమ్మడమ్మ

జ: (బి)

7. శనిగరం శాసనాన్ని ఎవరు వేయించారు?

ఎ) నారణయ్య బి) గోనగన్నయ్య సి) రేచర్ల ప్రసాదాదిత్యుడు డి) రేచర్ల రుద్రుడు

జ: (ఎ)

8. గణపతిదేవుడు తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు ఎప్పుడు మార్చాడు?

ఎ) 1222 బి) 1236 సి) 1249 డి) 1254

జ: (డి)

9. జైనశైవ సంఘర్షణ ఏ కాకతీయ పాలకుడి కాలంలో ప్రారంభమైంది?

ఎ) రుద్రదేవుడు   బి) గణపతిదేవుడు   సి) రెండో ప్రోలరాజు   డి) మొదటి బేతరాజు

జ: (ఎ)

10. దేశీయకొండ పట్టణం అంటే..?

ఎ) మచిలీపట్నం   బి) పులికాట్   సి) హంసల దీవి   డి) మోటుపల్లి

జ: (డి)

11. నాయంకర వ్యవస్థను ఎవరు ప్రవేశ పెట్టారు?

ఎ) ప్రతాపరుద్రుడు బి) దుర్గరాజు సి) రుద్రమదేవి డి) రెండో ప్రోలరాజు

జ: (సి)

12. ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపిన శాసనం ఏది?

ఎ) హనుమకొండ శాసనం బి) దేశటి శాసనం సి) దోశపాడు శాసనం డి) కలువచేరు శాసనం

జ: (డి)

13. కాకతీయుల కాలంలో ప్రభుత్వ శాఖలను ఏమని పిలిచేవారు?

ఎ) జనపదాలు బి) నియోగాలు సి) ఆహారాలు డి) విషయాలు

జ: (బి)

14. జయపత్రాలు అంటే ఏమిటి?

ఎ) న్యాయతీర్పులు బి) వృత్తిపన్ను సి) వర్తక సుంకం డి) యుద్ధంలో గెలిచినప్పుడు లభించే పత్రాలు

జ: (ఎ)

15. హనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించిన దెవరు?

ఎ) గణపతిదేవుడు    బి) రుద్రదేవుడు    సి) ప్రతాపరుద్రుడు   డి) రుద్రమదేవి

జ: (బి)

Posted Date : 04-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌