• facebook
  • whatsapp
  • telegram

ముదిగొండ చా‌ళుక్యులు  

* కొక్కిరాజు.. నాగతిరాజు

* ఆద్యుడొకరు.. ఆఖరివాడొకరు

తెలంగాణ చరిత్రలో తెలుసుకోవాల్సిన మరో అధ్యాయం ముదిగొండ చాళుక్యులది. వేములవాడ చాళుక్యుల్లాగానే వీరికీ రాజధాని ప్రాంతంతోనే ఆ పేరు వచ్చింది. పదో శతాబ్దం ప్రారంభంలో రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్న వీరు నేటి ఖమ్మం జిల్లాలోని ముదిగొండను ప్రధాన రాజధానిగా చేసుకొని పాలించారు. ఏయే ప్రాంతాల్లో వీరి పాలన సాగింది? ప్రముఖులెవరు? ఈ రాజుల ప్రత్యేకతలేమిటి? తదితర అంశాలు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..

ముదిగొండ చాళుక్యులు తూర్పు చాళుక్యులకు సామంతులుగా మంచికొండ మండలాన్ని పరిపాలించారు. ఈ ప్రాంతం తెలంగాణ తూర్పు సరిహద్దులోనూ.. దక్షిణాన కృష్ణా తీరంలోని కొండపల్లి నుంచి వరంగల్ జిల్లాలోని కొరవి వరకు విస్తరించి ఉంది. వీరు ప్రధానంగా ఖమ్మం జిల్లా ముదిగొండను రాజధానిగా చేసుకుని పాలించడం వల్ల వీరికి ముదిగొండ చాళుక్యులనే పేరు వచ్చింది.

ముదిగొండ చాళుక్యులు ముదిగొండ (ముదిగొండూరు)తో పాటు కొరవి, బొట్టు తదితర పట్టణాలను కూడా రాజధానులుగా చేసుకున్నారు. వీరి చరిత్రను తెలుసుకోవడానికి వివిధ శాసనాధారాలు లభిస్తున్నాయి.

కొక్కిరాజు

ముదిగొండ చాళుక్యుల వంశం గురించి క్రివ్వక(కాకునూరు) శాసనంలో వర్ణించారు. ఈ వంశానికి మూలపురుషుడు కొక్కిరాజు. అతను ప్రస్తుత ఖమ్మం జిల్లా ప్రాంతాన్ని పాలించాడు. కొక్కిరాజుకు అతడి సోదరుడు రణమర్ధుడు పరిపాలనలో సాయపడ్డాడు. కొక్కిరాజు ముదిగొండూరు(ముదిగొండ) రాజధానిగా పాలించాడు. అతడికి ప్రవర్ధమానుడు, సంపన్నుడు, విజయుడు అనే బిరుదులు ఉండేవి. కొక్కిరాజు అనంతరం అతడి సోదరుడు రణమర్ధుడు పాలించాడు.

రణమర్ధుడు

ఇతడు గొప్ప యుద్ధ వీరుడు. మొగలి చెరువు శాసనం ఇతడిని యుద్ధరంగంలో మరో రాముడిగా పేర్కొంది. తన అధికారాన్ని కొండపల్లి వరకు విస్తరింపజేశాడు. ఇతడు చియ్యరాజును ఓడించి అతడి నుంచి గరుడ, వేతాళ ధ్వజాలను స్వాధీనం చేసుకున్నాడు. రణమర్ధుడు రాజచిహ్నంగా 'కంఠియ' అనే కంఠిక హారాన్ని ధరించాడు. ఈ హారాన్ని కులధనంగా, పవిత్ర సంప్రదాయ వారసత్వ హారంగా భావించేవారు. ఈ వంశీయులు తర్వాత కాలంలో దీన్నే కులదేవతగా పూజించారు.

మొదటి కుసుమాయుధుడు

ఇతడు రణమర్ధుడి కుమారుడుగా మొగలి చెరువు శాసనం ద్వారా తెలుస్తోంది. ఇతడు వేంగీ చాళుక్య భీముడి సామంతుడు. కుసుమాయుధుడి అభ్యర్థన మేరకు చాళుక్య భీముడు కూకిపర్రు అనే గ్రామాన్ని పోతమయ్య అనే బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చాడు.

రెండో కుసుమాయుధుడు

మొదటి కుసుమాయుధుడి తర్వాత సింహాసనానికి వచ్చిన రెండో కుసుమాయుధుడికి 'వినీత జనాశ్రయుడు' అనే బిరుదు ఉండేది. ఇతడి తర్వాత మూడో కుసుమాయుధుడు రాజ్యానికి వచ్చాడు.

నాలుగో కుసుమాయుధుడు

నాలుగో కుసుమాయుధుడి కాలంలో.. వేదపండితుడు, కుత్సగోత్రుడైన దోనయ అనే బ్రాహ్మణుడికి మొగలి చెరువు గ్రామాన్ని అతడు దానం చేశాడు. మొగలి చెరువుల దానశాసనం ద్వారా ఈ విషయం తెలుస్తోంది.

అయిదో కుసుమాయుధుడు

నాలుగో కుసుమాయుధిడి తర్వాత వచ్చిన రాజుల్లో అయిదో కుసుమాయుధుడు ముఖ్యుడు. ఇతడికి మార్చలకేసరి, ముత్తెనగల్ల అనే బిరుదులుండేవి.

నాగతిరాజు

ముదిగొండ చాళుక్యుల్లో చివరి పాలకుడు నాగతిరాజు. అతడికి వివేకానారాయణుడనే బిరుదుండేది. అతడు కాకతీయ భూభాగాల ఆక్రమణకు ప్రయత్నించడంతో గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు అతడిని ఓడించి తెలంగాణ నుంచి తరిమేశాడు. దీంతో నాగతిరాజు గోదావరి లోయ ప్రాంతాలకు పారిపోయి కొలను నాయకుల కొలువులో ఆశ్రయం పొందాడు. ఇలా ముదిగొండ చాళుక్య రాజ్యం పతనమైనట్లు కొలని సోమయ వేసిన నత్త రామేశ్వర శాసనం ద్వారా తెలుస్తోంది.

 

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో ముదిగొండ చాళుక్యుల రాజధాని ఏది?

ఎ) ఖమ్మం బి) ముదిగొండూరు సి) హనుమకొండ డి) వర్ధమానపురం

జ: (బి)

2. ముదిగొండ చాళుక్యుల్లో చివరి పాలకుడు ఎవరు?

ఎ) నాగతిరాజు బి) నిరవధ్యుడు సి) అయిదో కుసుమాయుధుడు డి) రణమర్ధుడు

: (ఎ)

3. ముదిగొండ చాళుక్యుల వంశావళిని తెలిపే ఆధారమేది?

ఎ) బొట్టు శాసనం బి) కొరవి శాసనం సి) క్రివ్వక శాసనం డి) చెన్నూరు శాసనం

జ: (సి)

4. ముదిగొండ చాళుక్యులు ధరించే వారసత్వ హారం ఏది?

ఎ) రత్నహారం బి) సువర్ణహారం సి) మణిహారం డి) కంఠిక హారం

జ: (డి)

5. ముదిగొండ చాళుక్య రాజ్యస్థాపకుడు ఎవరు?

ఎ) రెండో కుసుమాయుధుడు బి) కొక్కిరాజు సి) మొదటి కుసుమాయుధుడు డి) నిరవధ్యుడు

: (బి)

6. ముదిగొండ చాళుక్యుల కాలంలో మొగలి చెరువుల గ్రామాన్ని ఎవరికి దానమిచ్చి శాసనం వేశారు?

ఎ) పోతమయ్య బి) దొమ్మనశర్మ సి) నాగమయ్య డి) దోనయ

జ: (డి)

7. 'వినీత జనాశ్రయుడు' అనే బిరుదు ఎవరిది?

ఎ) రెండో కుసుమాయుధుడు బి) నాలుగో కుసుమాయుధుడు సి) రణమర్ధుడు డి) కొక్కిరాజు

జ: (ఎ)

8. ముదిగొండ చాళుక్యుల పతనాన్ని తెలిపే శాసనమేది?

ఎ) కొరవి శాసనం    బి) మల్కాపురం శాసనం    సి) మొగలి చెరువుల శాసనం   డి) నత్తరామేశ్వర శాసనం

జ: (డి)

Posted Date : 04-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌