• facebook
  • whatsapp
  • telegram

జనాభా సానుకూలత 

 మంది ఎక్కువైతే మంచిదే!

జనాభా పెరిగితే కార్మికులు ఎక్కువవుతారు. పలు రకాల నైపుణ్యాలు ఉన్న సిబ్బంది దొరుకుతారు. ఉత్పత్తి అధికమవుతుంది. వినియోగం పెరిగి దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే మారుతున్న పరిణామాల నేపథ్యంలో జనాభాను దేశానికి నిజమైన ఆస్తిగా భావిస్తున్నారు. అందులోనూ పని సామర్థ్యం ఉన్న మానవ వనరులు ఎక్కువ ఉంటే మరింత ప్రయోజనకరం. ప్రస్తుతం భారత్‌లో సానుకూల జనాభా వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది, ప్రగతికి దోహదపడుతోంది.  ఈ స్థితికి దారితీసిన జనాభా వృద్ధి ధోరణులు, ప్రయోజనాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దేశంలో పట్టణీకరణ, నగరీకరణకు దారితీస్తున్న పరిణామాలు, పర్యవసానాలతో పాటు జనాభా పరంగా సానుకూలత తగ్గితే వచ్చే సమస్యలు, వాటిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన పెంచుకోవాలి.

ఒక దేశ జనాభాలో అధిక శాతం పనిచేసే ప్రజలు, శ్రామికులు ఉంటే దాన్ని ఆ దేశ సానుకూల జనాభాగా పిలుస్తారు. దీనినే డెమోగ్రాఫిక్‌ బోనస్‌ లేదా డెమోగ్రాఫిక్‌ విండోస్‌ అంటారు. ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌ (యూఎన్‌ఎఫ్‌పీఏ) నిర్వచనం ప్రకారం జనాభా వయసు నిర్మాణంలో వచ్చే మార్పులు ఆర్థిక ప్రగతికి దారితీసే విధంగా ఉంటే దాన్ని డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ (జనాభా సానుకూలత) అంటారు. అంటే పనిచేసే వయసున్న (15-64 సంవత్సరాల మధ్య) జనాభా, పనిచేయలేని జనాభా కంటే ఎక్కువగా ఉండటం ఆ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. జనాభా సానుకూలతకు సహకరించే ముఖ్యమైన సూచికలు విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన. ఒక దేశ జనాభాను 3 వయో వర్గాలుగా వర్గీకరిస్తారు. 1) 0-14 సంవత్సరాల్లోపు - అనుత్పాదక జనాభా 2) 15-64 సంవత్సరాల్లోపు - ఉత్పాదక జనాభా  (డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌) 3) 65 సంవత్సరాలకు పైన - వృద్ధ/అనుత్పాదక జనాభా భారతదేశంలో పాపులేషన్‌ డివిడెండ్‌ 2011 లెక్కల ప్రకారం 64.8 శాతం ఉంది. అది 68 శాతానికి పెరగ వచ్చని 2023 వరల్డ్‌ పాపులేషన్‌ నివేదిక తెలిపింది. డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ ఆర్థిక వృద్ధికి 3 రకాలుగా ఉపయోగపడుతుంది.1) పనిచేసే జనాభా ఎక్కువగా ఉండటం వల్ల అధిక ఉత్పాదకత రేటు, పెట్టుబడి రేటు ఫలితంగా మిక్కిలి వృద్ధి సాధ్యమవుతుంది. 2) సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉండటంతో స్త్రీకి పనిచేసే స్వేచ్ఛ వస్తుంది. ఫలితంగా ఉత్పత్తిలో పాల్గొంటుంది. దీనివల్ల లింగ సమానత్వం ఏర్పడుతుంది. 3) పిల్లలు తక్కువగా ఉండటంతో ప్రజలు తమ సంపాదనలో ఎక్కువ భాగం వారి ఆరోగ్యంపై ఖర్చు పెడతారు. ఇది ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడుతుంది. గత 4 దశాబ్దాల కాలంలో ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాలు డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ వల్ల అత్యధిక లాభం పొందాయి. జనన, మరణాలు తగ్గిపోవడంతో యూరప్, జపాన్, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చైనా అనుసరించిన ఒకే సంతానం విధానం 1980 నుంచి జనాభా పరంగా ఆ దేశానికి ఉన్న అనుకూలతలను తలకిందులు చేసినట్లు ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక స్పష్టం చేసింది. 2020 నాటికి భారతీయుల సగటు వయసు 29 సంవత్సరాలు (చైనా 38, అమెరికా 38, జపాన్‌ 48, జర్మనీ 48, ఫ్రాన్స్‌ 48). మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ ఎక్కువ శ్రామిక శక్తిని అందించే స్థాయిలో ఉంది. అయితే ఈ సానుకూలత 2031 వరకే ఉండవచ్చని అంచనా. ఆ తర్వాత వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల ఆర్థికాభివృద్ధిపై రుణాత్మక ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ‘యంగ్‌ ఇండియా’ 2050 నాటికి ‘ఓల్డ్‌ ఇండియా’గా మారబోతుందని అంచనా. అంటే ఇప్పుడున్న ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’ అప్పటికి ‘డెమోగ్రాఫిక్‌ బర్డెన్‌’గా మారుతుందని సూచించింది. భారతదేశంలోని రాష్ట్రాల మధ్య జనాభా కూర్పు తీరు, పరిమాణంలో భిన్నత్వం ఉండటం మరొక విశిష్ట లక్షణం. ఈ విషయంలో ద్వీపకల్ప భారతదేశం (పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌), ఇతర రాష్ట్రాల (మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌) మధ్య స్పష్టమైన విభజన ఉంది. ద్వీపకల్ప రాష్ట్రాలు పనిచేసే వయసు జనాభాలో వేగవంతమైన పెరుగుదల, పతనాన్ని ప్రదర్శిస్తూ చైనా, కొరియాల తీరుగా ఉన్నాయి.

భారతదేశం - ఆరోగ్య సూచికలు:

1) సగటు ఆయుర్దాయం: ఒక దేశంలో మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, పౌష్టికాహార లభ్యత, తక్కువ శిశుమరణాల రేటు (ఐఎంఆర్‌) ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తాయి. 2021 మానవాభివృద్ధి సూచీ ప్రకారం భారత్‌లో సగటు ఆయుర్దాయం 67.2 సంవత్సరాలు. పురుషుల ఆయుర్దాయం 65.51 ఏళ్లు, మహిళల ఆయుర్దాయం 68.89 సంవత్సరాలు. అత్యధిక ఆయుర్దాయం ఉన్న రాష్ట్రం కేరళ, తక్కువ ఉన్న రాష్ట్రం అస్సాం.

2) ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్‌): సగటున లక్ష మంది గర్భిణుల్లో ప్రసూతిపరమైన కారణాలతో  మరణించేవారి సంఖ్య 167 (2013 డేటా ప్రకారం).  

* ఎంఎంఆర్‌ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు అస్సాం (328), ఉత్తర్‌ప్రదేశ్‌ (292); తక్కువ ఉన్నవి కేరళ (66),  మహారాష్ట్ర (87), ఆంధ్రప్రదేశ్‌ (92).

*  నార్వే, స్వీడన్, డెన్మార్క్‌ దేశాల్లో ఎంఎంఆర్‌ రేటు కేవలం 7. ఈ దేశాలతో పోలిస్తే భారత్‌లో అధిక మరణాల రేటు ఉంది.


3) శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌):  సగటున వెయ్యి మంది శిశువులు జన్మిస్తే ఒక సంవత్సరం నిండేలోపు  చనిపోయేవారి సంఖ్యే ఐఎంఆర్‌. 2015 గణాంకాల ప్రకారం భారత్‌లో ఐఎంఆర్‌ రేటు 34 (గ్రామాల్లో 41, పట్టణాల్లో 25). అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 47, అతి తక్కువగా గోవాలో 8 రేటు ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఐఎంఆర్‌ 34. ఆడ శిశువుల అధిక మరణ రేటు ఉండటం గమనార్హం. పౌష్టికాహార లోపం, కనీస వైద్యం అందకపోవడం, పేదరికం, నిరక్షరాస్యత, కనీస సంరక్షణ చర్యలు లోపించడంతో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశంలో గర్భవతుల్లో సుమారు 55% మంది పౌష్టికాహార లోపంతో వచ్చే ఎనీమియా బాధితులే. 0-3 సంవత్సరాల్లోపు పిల్లల్లో 60% మందిలో పౌష్టికాహార లోపం ఉంది.


4) సంతాన సాఫల్యత రేటు: సగటున ఒక స్త్రీ జన్మనిచ్చే శిశువులను సంతాన సాఫల్యత రేటుగా పేర్కొంటారు. 2016 డేటా ప్రకారం దేశీయ సగటు టీఎఫ్‌ఆర్‌ రేటు 2.3. అత్యధికంగా బిహార్‌ (3.4), అత్యల్పంగా పశ్చిమ బెంగాల (1.6) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సగటు 1.7. దేశంలో రక్షిత సంతాన సాఫల్య రేటును 2.1కు తగ్గించాలని లక్ష్యం.


5) జనన మరణాల రేటు: భారత జననాల రేటు 2016 లెక్కల ప్రకారం 20.4 (సగటు 1000 మంది జనాభాకు), మరణాల రేటు 6.4 (సగటు 1000 మంది జనాభాకు). ఆంధ్రప్రదేశ్‌ జననాల రేటు - 16.4, మరణాల రేటు - 6.8. అతి తక్కువ మరణాల రేటు జమ్ము-కశ్మీర్‌లో 5.3. ఉంది. 


భారత్‌లో పట్టణీకరణ:  గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు విద్య, ఉపాధి, మెరుగైన జీవనం కోసం, నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని కార్మికుల వలసలతో నగర జనాభా పరిమాణం పెరగడాన్ని పట్టణీకరణ అంటారు. నగర జనాభాను గుర్తించడం, నిర్వచించడంలో ప్రపంచవ్యాప్తంగా ఒక అంగీకారయోగ్యమైన భావన ఏదీ లేదు. అయితే జనాభా పరిమాణాన్ని అనుసరించి నగరాలను నిర్వచించారు. కొన్ని దేశాల్లో 1000 మంది జనాభా ఉన్న ప్రాంతాలను నగరాలుగా నిర్వచించగా, మరికొన్ని దేశాల్లో 5000 మంది జనాభా ఉన్న ప్రాంతాలను నగరాలుగా పేర్కొంటున్నారు. 


భారతదేశంలో నగరీకరణ ధోరణులు:  2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 37.7 కోట్ల మంది ప్రజలు సుమారు 7,935 పట్టణ ఆవాసాల్లో నివసిస్తున్నారు. 1901లో మొత్తం దేశ జనాభాలో పట్టణ జనాభా 11.4% ఉండగా, 2001 నాటికి 28.53%కి, 2011 నాటికి    31.16% కి పెరిగింది. ఇదే రీతిలో నగర జనాభా రేటు భవిష్యత్తులో పెరిగితే 2025 నాటికి దేశ జనాభాలో పట్టణ జనాభా 45% ఉండవచ్చని వివిధ అధికార సంస్థలు అంచనా వేశాయి. ప్రస్తుతం పట్టణ జనాభా పరిమాణంలో భారతదేశం ప్రపంచంలో చైనా, అమెరికాల తర్వాత 3వ స్థానాన్ని ఆక్రమించి ఉంది. దేశంలోని పట్టణ జనాభాలో మహారాష్ట్రలో 13.5%, ఉత్తర్‌ప్రదేశ్‌లో 11.8%, తమిళనాడులో 9.3% కేంద్రీకృతమైంది. మిగిలిన రాష్ట్రాల్లో పట్టణ జనాభా పరిమాణం అతితక్కువగా ఉంది. మన దేశంలో నగరీకరణ కొన్ని పెద్ద నగరాల్లోనే కేంద్రీకృతమై ఉంది. మహానగర పరిధిలోని ప్రాంతాల్లో (అగ్లోమరేషన్లు) 43% పట్టణ జనాభా నివసిస్తుండగా, మిగిలిన నగరాలు, పట్టణాల్లో కొద్ది శాతం మాత్రమే నివసిస్తున్నారు. దేశంలో మెట్రోపాలిటన్‌ లేదా మిలియన్‌ నగరాల సంఖ్య 1981లో 12 కాగా, 1991 నాటికి 23, 2001 నాటికి 35కి, 2011కి 58కి పెరిగాయి. పెద్దనగరాలు, పట్టణాలు మరింత విస్తరిస్తూ ఉంటే చిన్నసైజు పట్టణాలు జనాభా పరంగా, సంఖ్యాపరంగా 2011 నాటికి 538కు చేరాయి. భౌగోళికంగా చూస్తే దక్షిణ భారతదేశంలో, అందులోనూ తీర ప్రాంతాల్లో నగరీకరణ వేగంగా విస్తరిస్తోంది. దీనికి చారిత్రక కారణాలు, వనరులు, సాంస్కృతిక పరమైన అంశాలు దోహదం చేస్తున్నాయి


*  2001 జనాభా లెక్కల కమిషన్‌ ప్రకారం దేశంలో నగరాలు లేదా పట్టణాలను గుర్తించేందుకు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అవి 

1) జనపదంలో జనాభా 5000 మందికి మించి ఉండటం. 

2) ఒక ప్రాంతంలోని జనసాంద్రత చ.కి.మీ.కు 400 కంటే అధికంగా ఉండటం. 

3) ఒక ప్రాంతంలో పనిచేసే పురుష కార్మికుల్లో 75 శాతం కంటే అధికంగా వ్యవసాయేతర వృత్తుల్లో ఉండటం. 

4) పురపాలక సంఘాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, కంటోన్మెంట్‌ ప్రాంతాలు మొదలైన ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాలున్న ప్రదేశం. ఈ  నిబంధనల్లో మొదటి 3 నిబంధనల ఆధారంగా గుర్తించిన పట్టణాలను ‘జనాభా పట్టణాలు’ అని, చివరి నిబంధన ఆధారంగా ప్రకటించిన పట్టణాలను ‘చట్టబద్ధ పట్టణాలు’ అని పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం పట్టణాల సంఖ్య 7,935. 


 

- రచయిత: జయకర్‌ సక్కరి 

Posted Date : 23-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌