• facebook
  • whatsapp
  • telegram

జనాభా సానుకూలత

వివిధ జాతీయతలతో వర్ధిల్లితే.. విశ్వనగరం!

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్‌ ఆవిర్భవించింది. పరిస్థితులకు తగినట్లుగానే ఇక్కడ కూడా పట్టణాలు, జనాభా వేగంగా పెరిగిపోతున్నాయి. ఆర్థిక, వాణిజ్య, రాజకీయ, ఉపాధి కేంద్ర స్థానాలుగా, నగరాలుగా రూపొందుతున్నాయి. పట్టణ ఆవాసాలకు ఉన్న ప్రామాణిక నిర్వచనాలు, వర్గీకరణ, అందుకోసం పరిగణనలోకి తీసుకుంటున్న సూత్రాలు, ప్రాంతాల వారీగా గ్రామీణ-పట్టణ జనాభాలో వస్తున్న వ్యత్యాసాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రభుత్వ  రికార్డుల ప్రకారం ముఖ్య నగరాలు, పట్టణాల జనాభా లెక్కలతోపాటు రాష్ట్రాల వారీగా జనాభా విస్తరణ ధోరణులు, పట్టణ జనాభా శాతాలను తెలుసుకోవాలి.

జనాభా లెక్కల కోసం పట్టణాలను జనాభా ప్రాతిపదికన పలు రకాలుగా వర్గీకరించవచ్చు. ఏదైనా మానవ నివాస ప్రాంతంలో 5,000 - 1,00,000 వరకు జనాభా ఉంటే దానిని పట్టణం అని పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 468 పట్టణాలున్నాయి. ఏదైనా పట్టణ జనాభా ఒక లక్షకు మించితే వాటిని నగరాలు అని పిలుస్తారు. అలాగే ఏదైనా నగర జనాభా 10 లక్షలు లేదా ఒక మిలియన్‌కు మించితే వాటిని మెట్రోపాలిటన్‌ లేదా మిలియన్‌ నగరాలు అని వ్యవహరిస్తారు. 

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మిలియన్‌ నగరాలు మొత్తం 53 ఉన్నాయి. ఈ నగరాల్లో దేశంలోని మొత్తం పట్టణ జనాభాలో 42.6% అంటే 16.07 కోట్ల పట్టణ జనాభా ఉంది. ఏదైనా మిలియన్‌ నగరం జనాభా 50 లక్షలు లేదా 5 మిలియన్లకు మించితే వాటిని ‘మెగాసిటీలు’ అని పిలుస్తారు. దేశంలో ఉన్న మెగాసిటీలు 8. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ ఒక్కటే మెగా సిటీ. ఏపీలోని విశాఖపట్నం (17.4 లక్షలు), విజయవాడ (14 లక్షలు) మిలియన్‌ నగరాల జాబితాలో ఉన్నాయి.

2012లో ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఒక కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న మిలియన్‌ నగరాలను మెగాసిటీలు పేర్కొంటున్నారు. దీని ప్రకారం ప్రస్తుతం దేశంలో మెగా సిటీల సంఖ్య 3 మాత్రమే. అవి ముంబయి, న్యూదిల్లీ, కోల్‌కతా.

నగర సమాకలనాలు / పట్టణ సముదాయాలు (Urban agglomeration): 1971 జనాభా లెక్కల్లో ‘నగర సమాకలనం’ అనే భావనను  ప్రవేశపెట్టారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పట్టణాలు నిరంతరాయంగా విస్తరిస్తూ, శివారు ప్రాంతాలను చేర్చుకుంటూ విస్తరించే    పట్టణాలను ‘నగర సమాకలనాలు’ అంటారు. 

* ప్రధాన నగరాల చుట్టూ రైల్వే కాలనీ, యూనివర్సిటీ క్యాంపస్, పోర్ట్‌ ఏరియా లాంటివి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించి ఉప నగరాలుగా ఏర్పడితే వాటిని పట్టణం లేదా నగరంతో కలిపి పట్టణ సముదాయంగా పిలుస్తారు. దేశంలో అతిపెద్ద నగర సమాకలనాల్లో మొదటి స్థానంలో ‘దిల్లీ’, రెండో స్థానంలో ‘ముంబయి’ ఉన్నాయి.

* మిలియన్‌ నగరాలు లేని రాష్ట్రాలు - ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిం, ఒడిశా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌.

* మిలియన్‌ నగరాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం - ఉత్తర్‌ప్రదేశ్‌ (7)

* అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రం - మహారాష్ట్ర

* అత్యధిక పట్టణాలున్న రాష్ట్రాలు -  తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌.

* అత్యధిక పట్టణీకరణ చెందిన రాష్ట్రాలు - గోవా, మిజోరం

* వివిధ జాతీయతలకు చెందిన ప్రజలు ఒక నగర జనావాసంలో   నివసిస్తుంటే ఆ నగరాలను ‘కాస్మోపాలిటన్‌ సిటీలు (విశ్వ నగరాలు)’ అని పిలుస్తారు. 

ఉదా: న్యూదిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం

* 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా మొత్తం 83.3 కోట్లు అంటే 68.84% ఉండగా, పట్టణ జనాభా 37.7 కోట్లు అంటే 31.16%.

* గ్రామీణ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్‌ - 15.51 కోట్లు, బిహార్‌ - 9.20 కోట్లు; అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు సిక్కిం - 4.5 లక్షలు, మిజోరం - 5.19 లక్షలు.

* గ్రామీణ జనాభా శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు హిమాచల్‌ప్రదేశ్‌ - 89.96%, బిహార్‌ - 88.70%; అత్యల్పంగా ఉన్నవి గోవా 37.83%, తమిళనాడు 51.55%.

* పట్టణ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర - 5.08 కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌ - 4.44 కోట్లు, తమిళనాడు - 3.89 కోట్లు; అత్యల్పంగా ఉన్నవి సిక్కిం - 1.51 లక్షలు, అరుణాచల్‌ప్రదేశ్‌ - 3.13 లక్షలు, మిజోరం - 5.56 లక్షలు.

* పట్టణ జనాభా శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు గోవా - 62.17%, మిజోరం - 51.51%, తమిళనాడు - 48.45%, కేరళ - 47.72%; అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు హిమాచల్‌ప్రదేశ్‌ - 10.04%, బిహార్‌ - 11.30%.


నమూనా ప్రశ్నలు 


1. అత్యల్ప గ్రామీణ జనాభా శాతం ఉన్న రాష్ట్రాలు?

1) తమిళనాడు    2) గోవా    3) 1, 2    4) ఏదీకాదు


2. ‘మెగా సిటీలు’ అని పిలిచే నగరాల జనాభా దాదాపుగా?

1) 50 లక్షలు జనాభా మించిన పట్టణాలు

2) ఒక కోటి జనాభా మించిన పట్టణాలు

3) 1.50 కోట్ల జనాభా మించిన పట్టణాలు 

4) 2 కోట్ల జనాభా మించిన పట్టణాలు


3. ప్రస్తుతం దేశంలో మెగా సిటీల సంఖ్య?

1) 3   2) 5   3) 6   4) 2


4.  2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మిలియన్‌ నగరాల సంఖ్య?

1) 63   2) 53   3) 43   4) 33


5.  కిందివాటిలో మిలియన్‌ నగరాలు లేని రాష్ట్రాలు?

1) తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, సిక్కిం  

2) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా 

3) మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌  

4) హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఉత్తరాఖండ్‌


6.  కిందివాటిలో కాస్మోపాలిటిన్‌ నగరానికి ఉదాహరణ?

1) విశాఖపట్నం  2) కోట   3) విజయవాడ  4) బికనీర్‌


7.  ‘మిలియన్‌ నగరాలు’ ఎక్కువగా ఉన్న రాష్ట్రం?

1) మహారాష్ట్ర  2) గుజరాత్‌  3) దిల్లీ    4) ఉత్తర్‌ప్రదేశ్‌


8. దేశంలో అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రాలు?

1) గోవా    2) మిజోరం    3) 1, 2   4) ఏదీకాదు


9.  అత్యల్ప గ్రామీణ జనాభా ఉన్న రాష్ట్రాలు?

1) సిక్కిం, మిజోరం     2) మిజోరం, గోవా   

3) సిక్కిం, బిహార్‌     4) బిహార్, గోవా


10. దేశ జనాభాలో గ్రామీణ జనాభా శాతం?

1) 42.6%    2) 57.4%   3) 60%   4) 50%


సమాధానాలు: 1-3; 2-2; 3-1; 4-2; 5-4; 6-1; 7-4; 8-3; 9-1; 10-2.


 


రచయిత: జయకర్‌ సక్కరి 

Posted Date : 02-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌