• facebook
  • whatsapp
  • telegram

జనాభా (మానవ భూగోళ శాస్త్రం)

సాధికారతకు.. సమాజ పురోగతికి సాధనాలు!

ఒక దేశ నిజమైన ప్రగతిని ప్రతిబింబించే సూచికల్లో లింగ నిష్పత్తి, అక్షరాస్యత ముఖ్యమైనవి. ప్రతి వెయ్యి మంది పురుషులకు, స్త్రీల సంఖ్యను పోల్చే లింగ నిష్పత్తి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతను  ప్రతిబింబిస్తుంది. సమాజంలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యం, సాధికారతను వెల్లడిస్తుంది. అదే విధంగా అక్షరాస్యత అనేది సామాజిక, ఆర్థిక పురోగతికి నిచ్చెన లాంటిది. ప్రజల్లో జ్ఞానాన్ని, విచక్షణను, సామర్థ్యాన్ని పెంపొందించి సమాజ పురోగతికి చోదకంగా పనిచేస్తుంది.  దేశంలో జనాభా ధోరణులు, సమాజ పోకడలను అర్థం చేసుకునేందుకు కీలకమైన ఈ సూచికలు, సంబంధిత గణాంకాలతో పాటు భవిష్యత్తును నిర్ణయించే పిల్లల జనాభాలో పెరుగుదల, బాలల లింగ  నిష్పత్తిపైనా అభ్యర్థులకు అవగాహన ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ అంశాల్లో దేశంలో ఉన్న వైరుధ్యాలు, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో మెరుగైన పరిస్థితులకు కారణాలను అర్థం చేసుకోవాలి.

భారతదేశ వృద్ధి గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ మానవాభివృద్ధికి అద్భుతంగా దోహదపడింది. దేశంలో పేదరికం 21 శాతం తగ్గింది. అయితే లింగ నిష్పత్తి, అక్షరాస్యత విషయంలో ఇంకా ప్రపంచ సగటుకు దూరంగానే ఉండిపోయింది. ఈ పరిణామం విస్తృత అసమతౌల్యతను ప్రతిబింబిస్తోంది. జనాభా గణన రికార్డుల ప్రకారం 1901 నుంచి దేశంలో లింగ నిష్పత్తిలో క్షీణత కనిపిస్తోంది. 1901లో 972 నుంచి 2011లో 943కి పడిపోయింది. అబ్బాయిలే కావాలని కోరుకోవడం, ఆడశిశువుల భ్రూణహత్యలకు పాల్పడటం ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇటీవలి కాలంలో పరిస్థితులు మారి, లింగ నిష్పత్తి ఆరోగ్యకర స్థాయికి చేరుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2020-21 ప్రకారం 2023లో భారతదేశ లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆ సంఖ్య 1037కి చేరగా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం 985 మంది స్త్రీలు ఉన్నారు. 


* అక్షరాస్యత విషయంలోనూ దేశంలో విస్తృతస్థాయి లింగపరమైన అసమానత నెలకొంది. స్వాతంత్య్రానంతరం అనేక కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ అక్షరాస్యత శాతం మందకొడిగానే వృద్ధి చెందింది. 1991- 2001 దశాబ్దంలో 12.63% వృద్ధి నమోదవడం ఆశావహ పరిణామంగా నిలిచింది.


స్త్రీ - పురుష నిష్పత్తి:

ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను తెలియజేసేది స్త్రీ - పురుష లింగ నిష్పత్తి. ఒక నిర్దిష్ట సమయంలో, సమాజంలో ఆడ, మగ మధ్య ఉన్న సమానత్వం పరిధిని కొలవడానికి ఇది ముఖ్యమైన సామాజిక సూచిక.


* లింగ నిష్పత్తి = (మొత్తం మహిళల సంఖ్య ్ల 1000)/మొత్తం పురుషుల సంఖ్య


* 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో సగటు లింగ నిష్పత్తి 943, గ్రామీణ లింగ నిష్పత్తి 949, పట్టణ లింగ నిష్పత్తి 929.


* అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రాలు కేరళ-1084, తమిళనాడు-996, ఛత్తీస్‌గఢ్‌-991; ఆంధ్రప్రదేశ్‌ -993; తెలంగాణ - 988.


* అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు హరియాణా-879, జమ్ము-కశ్మీర్‌-889, సిక్కిం-890.


* అధిక లింగ నిష్పత్తి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి-1037, లక్షదీవులు-947, అండమాన్, నికోబార్‌ దీవులు-876; 


* తక్కువ లింగ నిష్పత్తి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు డయ్యూ-డామన్‌-618, దాద్రానగర్‌ హవేలీ-774.


అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న జిల్లాలు మహే (పుదుచ్చేరి)-1176, ఆల్మోరా (ఉత్తరాఖండ్‌)-1142; తక్కువ ఉన్న జిల్లా డామన్‌- 533.


కేరళలో అధిక లింగ నిష్పత్తికి కారణాలు: 

1) స్త్రీలలో అధిక అక్షరాస్యత 

2) ఎక్కువ ప్రాంతాల్లో మాతృస్వామ్య కుటుంబాలు


* ఆర్థికంగా ముందంజలో ఉన్న పంజాబ్, హరియాణాలు ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రాలు. వ్యవసాయ పనుల్లో స్త్రీల కంటే పురుషులనే ఎక్కువగా కోరుకోవడంతో లింగ నిష్పత్తి తక్కువగా ఉంది. భారతదేశంలో 1991 నుంచి లింగ నిష్పత్తి మెరుగుపడుతోంది. 1991లో 927, 2001లో 933, 2011లో 943గా పెరుగుతూ వస్తోంది. అయితే ప్రపంచంలోని అనేక ఇతర దేశాలతో పోలిస్తే ఇది తక్కువగానే ఉంది. పొరుగు దేశాలైన మయన్మార్, శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో లింగ నిష్పత్తి భారత్‌ కంటే ఎక్కువగా ఉంది. భారత్‌లో తగ్గుతున్న స్త్రీల సంఖ్యను అమర్త్యసేన్‌ ‘మిస్సింగ్‌ ఉమెన్‌’ అని వ్యాఖ్యానించారు. ఆర్థికంగా వెనుకబడిన బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌(BI-M-A-RU)రాష్ట్రాల్లో లింగనిష్పత్తి తక్కువగా ఉంది. భారత్‌లో పురుషుల కంటే స్త్రీలపై వైద్య సంరక్షణ తక్కువగా ఉందని, అందుకే స్త్రీ - పురుష నిష్పత్తి పడిపోయిందని ‘లీలా విసారియా’ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ఉత్తర భారతం కంటే దక్షిణ భారతంలోనే లింగ నిష్పత్తి మెరుగ్గా ఉంది.

బాలల లింగ నిష్పత్తి

 0 - 6 మధ్య వయసున్న పిల్లల లింగ నిష్పత్తిని పరిశీలిస్తే భారత్‌లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తగ్గుతూ వస్తోంది. 1991లో 945గా ఉన్న బాలల లింగనిష్పత్తి, 2001 నాటికి 927కి, 2011 నాటికి  914కి తగ్గింది.


* అత్యధిక బాలల లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రాల మిజోరం 971, మేఘాలయ 970; తక్కువ ఉన్న రాష్ట్రాలు హరియాణా 830, పంజాబ్‌ 848.


* అత్యధిక బాలల లింగ నిష్పత్తి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్‌ నికోబార్‌ దీవులు 966; తక్కువ ఉన్నది న్యూఢిల్లీ 866.


* జిల్లాల పరంగా బాలల లింగ నిష్పత్తి లాహుల్‌ స్పితి (హిమాచల్‌ ప్రదేశ్‌)లో - 1013 ఉండగా, తక్కువగా జజ్జర్‌ (హరియాణా)లో 774 ఉంది. భ్రూణహత్యలు నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం 1994లో (Pre Natal Diagnostic Technique & Prevention of Misuse Act) తీసుకొచ్చింది. దీన్ని 2002లో సవరించి మరింత శక్తిమంతం చేసింది. అలాగే బాలబాలికల లింగ నిష్పత్తిని పెంచడానికి 2015, జనవరి 22న ‘బేటీ బచావో - బేటీ పడావో’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రధాన లక్ష్యాలు.. 

ఎ) గర్భస్థ లింగాధార పరీక్షల ద్వారా గర్భస్రావాల నియంత్రణ 

బి) ఆడపిల్లలకు వైద్యపరమైన వసతులు, విద్య 

సి) పౌష్టికాహార లభ్యత పెంచడం

అక్షరాస్యత

భారతదేశ జనాభా 2011 నాటికి 121.02 కోట్లు. ఇందులో 7 సంవత్సరాల పైన ఉన్న జనాభా 105.14 కోట్లు. ఆరేళ్లలోపు చిన్నారుల జనాభా 15.88 కోట్లు. అక్షరాస్యత గణనలో 7 సం।।లపైన ఉన్నవారినే తీసుకుంటారు. దేశ సగటు అక్షరాస్యత - 74.04% (3/4వ వంతు). పురుష అక్షరాస్యత - 82.14% (4/5వ వంతు), స్త్రీ అక్షరాస్యత - 65.46% (2/3వ వంతు) స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దేశంలో అక్షరాస్యత 18% మాత్రమే. 2011 నాటికి 74.04%కి పెరిగింది. 1961లో ప్రతి 10 మంది మహిళలకు 1 కంటే తక్కువమంది అక్షరాస్యులు కాగా, నేడు ప్రతి ముగ్గురు మహిళల్లో ఇద్దరు అక్షరాస్యులయ్యారు. అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రాలు కేరళ 94%, మిజోరం 91.3%, గోవా 88.7%, త్రిపుర 87.2%; తక్కువ ఉన్నవి బిహార్‌ 61.8%, అరుణాచల్‌ ప్రదేశ్‌ 65.4%, రాజస్థాన్‌ 66.01%, ఝార్ఖండ్‌ 66.4%, తెలంగాణ - 66.4%.


* అక్షరాస్యత మెరుగ్గా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు లక్షదీవులు 91.8%, డయ్యూ-డామన్‌ 87.1%, పుదుచ్చేరి 86.6%, దాద్రానగర్‌ హవేలీ 76.2%.


* అత్యధిక మహిళా అక్షరాస్యత రాష్ట్రం కేరళ (92.91%), తక్కువ ఉన్నది బిహార్‌ (51.56%). 


* పురుష అక్షరాస్యతలో మొదటి స్థానం లక్షదీవులు (96.11%), రెండో స్థానంలో కేరళ (96.02%); తక్కువ ఉన్న రాష్ట్రం బిహార్‌ - (73.39%)


* అధిక అక్షరాస్యత ఉన్న జిల్లా - సెర్చిప్‌ (మిజోరాం) - (98.76%), తక్కువ ఉన్న జిల్లా - అలీరాజ్‌పుర్‌ (మధ్యప్రదేశ్‌) - (37%) పిల్లల జనాభా (0-6 ఏళ్లు):  మన దేశంలో 2001లో చిన్నపిల్లల జనాభా 16.38 కోట్లు (మొత్తం జనాభాలో 15.9%), 2011లో 15.88 కోట్లు (మొత్తం జనాభాలో 13.1%). 2011లో పిల్లల సంఖ్యలో, శాతంలో తగ్గుదల కనిపించింది. 2011లో భారత్‌లోని చిన్నపిల్లల జనాభా, జనాభాలో 8వ పెద్ద దేశమైన నైజీరియా కంటే కొంచెం ఎక్కువ.


* పిల్లల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్‌ 2.97 కోట్లు, బిహార్‌ 1.86 కోట్లు. మహారాష్ట్ర 1.28 కోట్లు, మధ్యప్రదేశ్‌ 1.05 కోట్లు, రాజస్థాన్‌ 1.05 కోట్లు (ఈ ఐదు రాష్ట్రాల్లోనే 52% చిన్నపిల్లల జనాభా ఉంది.)


* 0-6 ఏళ్ల వయసున్న జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాలు జమ్ము-కశ్మీర్‌లోని కుప్వారా (జిల్లా జనాభాలో 22.50%), మేఘాలయలోని పశ్చిమ ఖాసీ హిల్స్‌ (22.05%); తక్కువగా ఉన్న జిల్లాలు బెంగాల్‌లోని కోల్‌కతా (6.69%), కేరళలోని పథనంతిట్ట (7.65%).


 

రచయిత: జయకర్‌ సక్కరి 

Posted Date : 13-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌