• facebook
  • whatsapp
  • telegram

పట్టణీకరణ సమస్యలు (జనాభా సానుకూలత)

పడిపోతున్న జీవన ప్రమాణాలు!


ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిక్రమంలో పట్టణీకరణ అనివార్యమైన ప్రక్రియ. విద్య, ఉపాధితో పాటు ఎన్నో కారణాలతో గ్రామీణ ప్రజలు తమ నివాసాలను పట్టణ ప్రాంతాలకు మారుస్తుంటారు. ఫలితంగా గ్రామాల్లో నివసించే జనాభా తగ్గి, పట్టణాల్లో జనాభా, జనసాంద్రత అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమస్యలను సృష్టించే పట్టణీకరణ పరిణామాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. అలాగే భారతదేశంలో జనగణన, జనసాంద్రత, జనాభా వృద్ధి గణాంకాల వివరాలను తెలుసుకోవాలి.


అధిక జనాభా, పట్టణ విస్తరణ: పట్టణాలు, నగరాల్లో జనాభా వేగంగా పెరిగిపోతోంది. ఇందుకు తగినట్లుగా మౌలిక వసతులు ఏర్పడటం లేదు. కొద్ది విస్తీర్ణంలో అధిక జనాభా నివసించడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇరుకు నివాస ప్రాంతాల్లో అంటువ్యాధులు, అగ్నిప్రమాదాలకు అవకాశం ఎక్కువ. శివారు ప్రాంతాల్లో జనాభా పరిమాణంతో పాటు భూమి విలువలు, నేరాలు అధికమవుతాయి.


నివాస సమస్య: విద్య, ఉపాధి అవసరాల కోసం పట్టణాలు, నగరాలకు వలసలు పోటెత్తుతున్నాయి. గ్రామాలతో పాటు ఇతర చిన్న పట్టణాల నుంచి నగరాలకు వచ్చే వలస జీవులకు ఇళ్ల కొరత తీవ్రంగా ఉంది.  అధిక డిమాండ్‌ వల్ల ఇళ్ల అద్దెలు పెరిగిపోయి, వలస కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల జీవనప్రమాణాలు దెబ్బతింటున్నాయి.


నిరుద్యోగం: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం జఠిల సమస్య. వైట్‌కాలర్‌ ఉద్యోగాల నుంచి దినసరి కూలీల వరకు అభ్యర్థులు ఎక్కువగా, అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందరికీ ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారుతోంది.

మురికివాడలు, చెదురుమదురు ఆవాసాలు: నగర విస్తరణ ప్రణాళికాబద్ధంగా లేకపోవడంతో పట్టణ ఆవాసాలలో మురికివాడల సంఖ్య పెరిగిపోతోంది. నివాసయోగ్యత అంతంతమాత్రంగా ఉండే ఈ ఆవాసాలు నగర పరిపాలనకు ఆటంకాలను కలగజేస్తున్నాయి. మురికివాడల్లో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువై శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. నగర పేదల దుర్భర జీవితానికి మురికివాడలే నిదర్శనం. బాలకార్మికులకు ఇవి కేంద్రాలవుతున్నాయి.

 

రవాణా: నగర విస్తరణ ప్రణాళికాబద్ధంగా లేనప్పుడు జనాభాకు తగినట్లుగా రోడ్లు, రవాణా సౌకర్యాల కొరత ఏర్పడుతుంది. ట్రాఫిక్‌ రద్దీలతో నగర వాతావరణం కలుషితమవుతుంది.


పర్యావరణ హీనత: ఆకాశహర్మ్యాల నిర్మాణం వల్ల పట్టణాలు ‘ఉష్ణద్వీపాలు’గా మారి సంవహన ప్రవాహాలు ఏర్పడి కుండపోత వర్షాలు, ఫలితంగా వరదలు సంభవిస్తాయి. భూగర్భ జలాలు కలుషితమవుతాయి.


తాగునీటి కొరత: జనాభా అనూహ్యంగా పెరుగుతుంటే, నీటి వనరులు పరిమితమైపోయి, తాగునీటి సమస్య తలెత్తుంది. మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తమై అంటువ్యాధులు ప్రబలుతాయి. నగర ఆవాసాల్లో చెత్త పారబోతకు సరైన స్థలం లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.


జీవనశైలి మార్పులు: పట్టణ వాతావరణంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై కేంద్రక కుటుంబాలు ఆవిర్భవిస్తాయి. తీరికలేని ఉరుకుపరుగుల దినచర్య కారణంగా ఆహారపు అలవాట్లలో మార్పు వస్తుంది. పాశ్చాత్యీకరణ ధోరణులు పెరిగి వ్యక్తిగత జీవనానికి, విలాసాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. దురలవాట్లతో పాటు జీవన వ్యయాలు ఎక్కువవుతాయి.


పరిపాలనా సమస్యలు: పట్టణ స్థానికసంస్థల్లో ఆధునిక ప్రణాళికల కార్యాచరణ లోపించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ స్థానిక సంస్థలకు తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోవడంతో సొంత ఆదాయ వనరులను సమీకరించుకోలేకపోతున్నాయి. ప్రజలపై తగిన పర్యవేక్షణ, శాంతిభద్రతల నియంత్రణ కొరవడుతోంది.

గ్రామాలపై ప్రభావం: యువ జనాభా పట్టణాలకు, నగరాలకు తరలిపోతుంటే గ్రామాల్లో ఉత్పాదకత తగ్గిపోతుంది. కీలకమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది.


మురికివాడల జనాభా:  ఏదైనా ఒక ప్రాంతాన్ని రెండు నిబంధనల ప్రకారం మురికివాడగా ప్రకటిస్తారు.

1) ప్రభుత్వం మురికివాడగా గుర్తించిన మానవ ఆవాసాలు. 

2) 300 లేదా అంతకుమించి జనాభా ఉండి, అందులో 60 - 70 శాతం గృహాలకు కనీస నివాసయోగ్య సదుపాయాలు లేకపోవడం.


* 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 5.5% మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. మురికివాడల జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర- 1.18 కోట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ - 1.01 కోట్లు, పశ్చిమ బెంగాల్‌ - 0.64 కోట్లు; మురికివాడల జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం గోవా, కేంద్రపాలిత ప్రాంతం అండమాన్‌ నికోబార్‌ దీవులు.


* మురికివాడల్లో నివాసాల సంఖ్య ఎక్కువున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌. దేశంలో అతి పెద్ద మురికివాడ ముంబయిలోని ధారావి ప్రాంతం (జనాభా దాదాపు 60 లక్షలు).


దేశంలో జనాభా విస్తరణ


భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌ (16.48%), తక్కువ జనాభా రాష్ట్రం సిక్కిం (0.05%). దేశ వార్షిక జనాభా వృద్ధి రేటు 1.69%, దశాబ్దపు పెరుగుదల రేటు 17.64%. మన దేశంలో 1951 - 81 మధ్య కాలాన్ని ‘జనాభా విస్ఫోట దశ’గా పిలుస్తారు. అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదైన దశాబ్దం 1961 - 71 (24.8%).


* దేశంలో అధిక జనాభా దశాబ్దపు వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం మేఘాలయ (27.8%), తక్కువ దశాబ్దపు వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం నాగాలాండ్‌ (-0.47%).


* దేశంలో సగటు జనసాంద్రత 382. ఈ విషయంలో బిహార్‌ (1106) ప్రథమ స్థానంలో ఉండగా, చివరి స్థానంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ (17) ఉంది. స్త్రీ, పురుష నిష్పత్తి కేరళలో (1084) అధికంగా, హరియాణాలో (879) అతితక్కువగా ఉంది. దేశంలో బాలబాలికల లింగ నిష్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015, జనవరి 22న ‘బేటీ బచావో’ పథకాన్ని ప్రవేశపెట్టింది.


* భారతదేశ అక్షరాస్యత 74.04%. అధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కేరళ (94%), తక్కువ ఉన్న రాష్ట్రం బిహార్‌ (61.8%).


* భారతీయుల సగటు వయసు 29 సంవత్సరాలు. సగటు ఆయుర్దాయం 67.2 సంవత్సరాలు. అత్యధిక ఆయుర్దాయం ఉన్న రాష్ట్రం కేరళ, తక్కువ ఉన్నది అస్సాం.


మానవ పరిణామక్రమం - ముఖ్యాంశాలు


పెరామెనిడే కుటుంబానికి చెందిన మానవ జాతి ఆవిర్భావం మొదటిసారిగా ఆఫ్రికా ఖండంలో జరిగినట్లు శిలాజ ఇంధనాలు తెలియజేస్తున్నాయి. మొదటిసారిగా లభ్యమైన శిలాజం ‘రామాపితికస్‌’ జాతి మానవుడిది. ‘ది-14 డేటింగ్‌’ పద్ధతి ద్వారా పురాతన మానవజాతి వయసును లెక్కించారు. మొట్టమొదటి మానవుడు రెండుకాళ్లపై నడిచినట్లు ఆధారాలు లభించిన ప్రాంతం ఆఫ్రికాలోని లేటాలి.


* ఐరోపా, అమెరికా, కెనడా దేశాల్లోని ప్రజలు కాకసాయిడ్‌ జాతికి చెందినవారు. ఈ జాతి ప్రజల కళ్లు నీలిరంగులో ఉంటాయి. సెమైట్లు, హమైట్లు ఈ జాతికి చెందినవారే. వాయవ్య భారతదేశ ప్రజలు కూడా కాకసాయిడ్‌ జాతీయులే. దక్షిణ భారత రాష్ట్రాల్లోని ‘ద్రవిడియన్‌’లను సింధు నాగరికత ప్రజల సంతతిగా పేర్కొనవచ్చు. వీరు ‘పేలియో మెడిటరేనియన్‌’ ఉపజాతికి చెందినవారు. నీ మంగోలాయిడ్‌ జాతి ప్రజలు తూర్పు ఆసియా ప్రాంతంలో విస్తరించి ఉన్నారు. వీరి శరీరం పసుపు రంగులో ఉంటుంది. కనుపైరెప్ప ముడతలు పడి ఉండటం (ఎపికాంతిక్‌ ఐఫోల్డ్‌) మంగోలాయిడ్‌ ప్రజల ప్రధాన శారీరక లక్షణం. ఆలినినో అనే లక్షణం వీరిలో కనిపిస్తుంది.నీ ‘పెరా మోసెవియన్స్‌’ క్రీ.పూ.10,000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించారు. ప్రపంచంలో అత్యంత వెనుకబడిన తరగతికి చెందినవారు బుష్‌మెన్స్‌.


ప్రపంచ జనాభాలో ఎక్కువమంది ‘ఇండో-యూరోపియన్‌’ భాషా కుటుంబానికి చెందిన భాషలు మాట్లాడుతున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాష మాండరిన్‌. అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీ 5, బెంగాలీ 6వ స్థానాల్లో ఉన్నాయి. ఇవి రెండూ ఇండో - యూరోపియన్‌ భాషా కుటుంబానికి చెందినవే.


* ప్రపంచంలోని మతాల్లో హిందూయిజం సంఖ్యాపరంగా మూడో స్థానంలో ఉంది. మతవిశ్వాసాలు పాటిస్తున్న మొత్తం జనాభాలో 15 శాతం మంది హిందువులు. మన దేశంలో హిందూ జనాభా అధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో, హిందూ జనాభా శాతం అధికంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉంది. ముస్లిం జనాభా అధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో, ముస్లిం జనాభా శాతం అధికంగా జమ్ము- కశ్మీర్‌లో ఉంది. క్రైస్తవ జనాభా అధికంగా కేరళలో, క్రైస్తవ జనాభా శాతం నాగాలాండ్‌లో ఎక్కువగా ఉంది. 


* 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో 8.6% షెడ్యూల్‌ తెగలు, 16.6% షెడ్యూల్‌ కులాలవారు ఉన్నారు. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న షెడ్యూల్‌ తెగలు 1) గోండులు 2) మీనాలు 3) భిల్లులు. వీరిలో గోండులు మధ్యప్రదేశ్‌లో, మీనాలు రాజస్థాన్, భిల్లులు గుజరాత్‌లో ఎక్కువగా ఉన్నారు.


భారతదేశంలో అత్యంత ప్రాచీన భాష సంస్కృతం. దాని నుంచి అనేక ఇండో ఆర్యన్‌ భాషలు ఉద్భవించాయి. ప్రస్తుతం సంస్కృతం ఉత్తరాఖండ్‌లో రెండో అధికార భాషగా ఉంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవి. హిందీ, మరాఠీ, ఆంగిక భాషలు దేవనాగిరి లిపిలో ఉండగా, పంజాబీ గురుముఖి లిపిలో ఉంటుంది. ఒడియా, ప్రాకృత, బ్రహ్మి భాషలు ఉత్కల్‌ లిపిలో ఉన్నాయి. నీ రాజ్యాంగంలోని 17వ భాగంలో 343వ అధికరణ హిందీని భారత రిపబ్లిక్‌ అధికార భాషగా పేర్కొనగా, అధికారక కార్యకలాపాలలో ఇంగ్లిష్‌ను అదనపు భాషగా పేర్కొంది. భారత రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన మొత్తం భాషలు 22.


రచయిత: జయకర్‌ సక్కరి 

 

 

Posted Date : 09-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌