• facebook
  • whatsapp
  • telegram

ప్రధాన భూఉపరితల స్వరూపాలు

విరూపం.. పరిశిష్టం.. సంచితం!

భూ ఉపరితల స్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఎలా ఏర్పడతాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడ విస్తరించాయో అభ్యర్థులు తెలుసుకోవాలి. జనరల్‌ స్టడీస్‌లో భాగంగా తరచూ వీటిపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. 

ప్రధాన భూఉపరితల స్వరూపాలనే ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు అని కూడా అంటారు. ఇవి ఏర్పడటానికి కారణం ప్రథమశ్రేణి భూస్వరూపాలైన ఖండాలు, సముద్ర భూతలాలపై ఒకదానిపై ఒకటి వ్యతిరేకదిశలో పనిచేసే అంతర్జనిత (భూకంపాలు, అగ్నిపర్వతాలు), బహిర్జనిత (నదులు, పవనాలు, హిమానీనదాలు, సముద్ర తరంగాలు, అంతర్భూజలం) బలాలు. 
భూస్వరూపాలు ఏర్పడటానికి కారణాలు  
అంతర్జనిత బలాలు: వీటిని విరూపకారక బలాలు అంటారు. వీటి వల్ల భూకంపాలు, అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. వీటి కారణంగా భూఉపరితలంపై ఉన్న ప్రస్తుత ప్రధాన భూస్వరూపాలు వివిధ భౌమకాలాల్లో ఏర్పడ్డాయి.
బహిర్జనిత బలాలు (బాహ్య ప్రకృతి బలాలు): ఇవి భూఉపరితల భూస్వరూపాలను శైథిల్య, క్రమక్షయ, నిక్షేపణ ప్రక్రియలకు గురిచేస్తూ వాటి ఆకార, పరిమాణాల్లో నిరంతరం మార్పులు కలగజేస్తాయి.

భూఉపరితల స్వరూపాల్లో ప్రధానమైనవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు.
పర్వతాలు: భూఉపరితలంపై 900 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తును కలిగి అంచులు ఏటవాలుగా ఉండి తక్కువ శిఖర వైశాల్యంతో మొనదేలి ఉన్న శిలా స్వరూపాలను పర్వతాలు అని పిలుస్తారు.
* పర్వతాల కంటే తక్కువ ఎత్తు ఉన్న భూస్వరూపాలను కొండలు అంటారు. 
* పర్వతాల పుట్టుకను గురించి వివరించే శాస్తాన్న్రి ఓరోజనీ అంటారు. 

పర్వతాల ఆకార పరిమాణాలను బట్టి కింది విధంగా వివరించారు. 
పర్వతశ్రేణి: పర్వతాలు ఒకదాని తర్వాత మరొకటి గుంపులుగా చాలా దూరంగా ఏర్పడే అమరికను పర్వతశ్రేణి అంటారు.
పర్వత వ్యవస్థ: పర్వతాల వయసు, ఉద్భవ రీత్యా సంబంధం ఉన్న శ్రేణులు దాదాపు సమాంతరంగా ఉంటే వాటిని పర్వత వ్యవస్థ అంటారు. 
ఉదా: హిమాలయ పర్వతాలు
పర్వత గొలుసు: కొన్ని పర్వత శ్రేణులు, పర్వత వ్యవస్థలు వయసు, ఉద్భవ రీత్యా ఒకదాంతో మరొకటి సంబంధం లేకపోయినా ఒక మేఖల (Belt)గా ఏర్పడిన వాటిని పర్వత గొలుసు అంటారు.
ఉదా: ఆండీస్‌ పర్వతాలు
పర్వత సముదాయం: ఒక నిర్దిష్టమైన అమరిక లేకుండా ఉన్న పర్వతాలను పర్వత సముదాయం అంటారు.
కాల్డిల్లెరా: అనేక పర్వత గొలుసులు కలిస్తే కాల్డిల్లెరా ఏర్పడుతుంది. ఇది స్పానిష్‌ పదం. మొదట ఈ పదాన్ని ఆండీస్‌ పర్వతాలకు తర్వాత రాఖీ పర్వతాలకు ఉపయోగించారు.  
* ప్రపంచంలో నాలుగు ప్రధాన కార్డిల్లెరా ప్రాంతాలు ఉన్నాయి. అవి
1) ఉత్తర అమెరికా కార్డిల్లెరా ప్రాంతం- ఇందులో రాఖీ, సియర్రా శ్రేణులు; బేసిన్‌ శ్రేణి అలస్కా, బ్రిటిష్‌ కొలంబియా తీర ప్రాంతం ఉన్నాయి.
2) ఆండీస్‌ కార్డిల్లెరా ప్రాంతం
3) దక్షిణ యూరప్‌ కార్డిల్లెరా ప్రాంతం- ఇది ఆల్ఫ్, స్పెయిన్, ఉత్తర ఐరోపా పర్వత ప్రాంతాలు.
4) ఆసియా కార్డిల్లెరా ప్రాంతం- హిమాలయ, కున్‌లున్, టియాన్షిన్, హిందూకుష్, కాకసస్‌ పర్వతాలు.

ఉద్భవ విధానాన్ని అనుసరించి పర్వతాలను మూడు రకాలుగా పేర్కొనవచ్చు. 
1) విరూపకారక పర్వతాలు
2) పరిశిష్ట లేదా అవశిష్ట పర్వతాలు 
3) సంచిత లేదా అగ్నిపర్వతాలు 

విరూపకారక పర్వతాలు 
భూమిలోని అంతర్గత బలాల సర్దుబాట్లు, మార్పులు సంభవించడం వల్ల విరూపకారక పర్వతాలు ఏర్పడతాయి. ఇవి భూభాగంపై ఎక్కువగా వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వతాలు రెండు రకాలు. అవి..
ఎ) ముడుత పర్వతాలు (వళి పర్వతాలు): ఇవి భూపటలంలోని రాతిపొరల్లో కలిగే సంపీడనా బలాల వల్ల ఏర్పడతాయి. ప్రధానంగా పలక సరిహద్దులు, భూకంప, అగ్నిపర్వత ప్రాంతాలు, అవక్షేప శిలలతో ఏర్పడిన ప్రాంతాల్లో టెర్షియరీ భౌమకాలంలో ఏర్పడతాయి. ఇవి ఏర్పడిన కాలాన్ని అనుసరించి వీటిని రెండు రకాలుగా విభజించారు.  
1) నవీన ముడుత పర్వతాలు: ఇవి టెర్షియరీ భౌమకాలంలో 30 నుంచి 60 మిలియన్‌ల సంవత్సరాల కిందట ఏర్పడ్డాయి. 
ఉదా: ఉత్తర అమెరికాలోని రాఖీపర్వతాలు, దక్షిణ అమెరికాలోని ఆండీస్‌ పర్వతాలు (ప్రపంచంలో అతిపొడవైన పర్వత వ్యవస్థ), ఐరోపాలోని ఆల్ఫ్స్‌ పర్వతాలు, భారతదేశంలోని హిమాలయ వ్యవస్థలు (ప్రపంచంలో ఎత్తయిన పర్వత వ్యవస్థ), ఉత్తర ఆఫ్రికాలోని అట్లాస్‌ పర్వతాలు.
2) పురాతన ముడుత పర్వతాలు: ఇవి టెర్షియరీ భౌమకాలానికి ముందు దాదాపు 200 మిలియన్‌ల సంవత్సరాలకు పూర్వం ఏర్పడిన పర్వతాలు.
ఉదా: రాజస్థాన్లోని ఆరావళి, ఉత్తర అమెరికాలోని అపలేచియన్, రష్యాలోని యూరల్, ఆస్ట్రేలియాలోని గ్రేట్‌ డివైడింగ్‌ రేంజ్‌ పర్వతాలు. 
బి) ఖండ పర్వతాలు: భూ అంతర్భాగంలోని తన్యత బలాల వల్ల ఏర్పడిన భ్రంశాలకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలు కిందకు 
కుంగిపోవడం లేదా పైకి నెట్టబడటం వల్ల ఏర్పడే ఎత్తయిన శిలా భాగాలను ఖండ పర్వతాలు అంటారు. రెండు ఖండ పర్వతాల మధ్య ఉన్న లోతట్టు ప్రదేశాలను భ్రంశ లోయలు (పగులు లోయలు) అని పిలుస్తారు. వీటిని గళిత శిలా విన్యాసాలు (గ్రాబెన్‌) అంటారు. 
ఉదా: ఫ్రాన్స్‌లోని వాస్‌జెస్, జర్మనీలోని బ్లాక్‌ ఫారెస్ట్, దక్షిణాఫ్రికాలోని డ్రాకెన్స్‌బర్గ్, భారతదేశంలోని వింధ్య, సాత్పూర; పాకిస్థాన్‌లోని సాల్ట్‌ రేంజ్‌ పర్వతాలు, కాలిఫోర్నియాలోని సియరా నెవడా, వసాచె, హార్ట్, మెస్ట్గాపర్వతాలు.

పగులు లోయలు 
ఉదా: ఐరోపాలోని రైన్‌ నదీ లోయ, భారతదేశంలోని వింధ్య, సాత్పూర పర్వతాల మధ్య ఉన్న నర్మద పగులు లోయ, కాలిఫోర్నియాలోని మృతలోయ, ఆఫ్రికా ఖండంలో నైలు నది ప్రవహిస్తున్న పగులు లోయ (ప్రపంచంలోనే అతిపెద్ద పగులు లోయ.. దీన్ని గ్రేట్‌ ఆఫ్రికన్‌ రిఫ్ట్‌ వ్యాలీ అంటారు). 

పరిశిష్ట పర్వతాలు 
బహిర్జనిత బలాల వికోశీకరణ వల్ల ఒకప్పుడు ఎత్తుగా ఉండి శైథిల్య, క్రమక్షయ చర్యలకులోనై ఆకార పరిమాణాల్లో మార్పు చెందిన (చిన్నగా మారడం) వాటిని పరిశిష్ట పర్వతాలు అంటారు.
ఉదా: ఆరావళి పర్వతాలు, ఝార్ఖండ్‌లోని రాజ్‌మహల్‌ కొండలు, గుజరాత్‌లోని గిర్‌ పర్వతాలు, నీలగిరులు. 

సంచిత పర్వతాలు
భూ అంతర్భాగంలోని ఆమ్ల లావా భూఉపరితలానికి ప్రవహించి సంచితమవుతుంది (కుప్పగా ఏర్పడుతుంది). ఈ లావా కుహరం ద్వారా వచ్చి శంకువు ఆకారంలో ఘనీభవిస్తుంది. అలాంటి వాటిని సంచిత పర్వతాలు అంటారు. ఇవి అగ్ని పర్వత క్రియాశీలత, భేదక క్రమక్షయం, భూపటల చలనాల వల్ల ఏర్పడతాయి. వీటిలో రెండు లేదా మూడు ఏక కాలంలో ఏదైనా ప్రాంతంపై పనిచేయడం వల్ల క్లిష్టమైన పర్వత నిర్మాణం జరుగుతుంది.
ఉదా: ఆండీస్‌ పర్వత శ్రేణుల్లో ఉన్న అనేక అగ్నిపర్వతాలు. చిలీలోని అకాంకాగ్వా, అమెరికాలోని హుడ్, షాస్టా, రైనెర్‌.  

ప్రపంచంలోని వివిధ పర్వతాలు
ఆసియా ఖండం: హిమాలయ పర్వతాలు - నేపాల్, టిబెట్, భారత్‌; కున్‌లున్‌ - టిబెట్, హిందూకుష్‌ - అఫ్గానిస్థాన్, అలాయి - మంగోలియా, సులేమాన్‌ - అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌; యూరల్‌ పర్వతాలు - రష్యా, ఫ్యూజియామా - జపాన్‌; కారకోరమ్‌ - భారత్‌; జాగ్రోస్‌ - ఇరాన్‌.
ఆఫ్రికా ఖండం:  డ్రాకెన్స్‌బర్గ్‌ - దక్షిణాఫ్రికా; అట్లాస్‌ పర్వతాలు - మొరాకోలోని అల్జీరియా; కిలిమంజారో - టాంజానియా.
ఉత్తర అమెరికా: అలస్కా రేంజ్, అపలేచియన్, సియార్రానావడా - అమెరికా; మెకంజ్‌ - కెనడా.
దక్షిణ అమెరికా: ఆండీస్‌ పర్వతాలు - చిలీ, పెరు, బొలీవియా.  
యూరప్‌: ఆల్ఫ్స్‌ పర్వతాలు - జర్మనీ, స్విట్జర్లాండ్‌; పైరనీస్‌ - ఆస్ట్రియా, స్పెయిన్‌.  
ఆస్ట్రేలియా: డార్లింగ్, ఫిండర్స్, గ్రేట్‌ డివైడింగ్‌ రేంజ్‌ 

రచయిత: సక్కరి జయకర్‌

Posted Date : 08-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌