• facebook
  • whatsapp
  • telegram

రక్షణ రంగం బలోపేతానికి చేపట్టిన ప్రాజెక్టులు

సముద్ర గర్భంలో అరిహంత్‌.. గగనతలంలో ఇంద్రజాల్‌!
 


ఆధునిక యుగంలో దేశాల శక్తిసామర్థ్యాలను నిర్ణయించేది రక్షణ రంగమే. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలటరీ వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. భౌగోళికంగా వ్యూహాత్మక స్థానంలో ఉండటం, శత్రుదేశాల బెడద వల్ల సాయుధ బలగాలు, రక్షణ వ్యవస్థలను నిరంతరం ఆధునీకరిస్తూ వస్తోంది. యుద్ధతంత్రంలో సాంకేతికత నిర్ణయాత్మక అంశంగా మారడంతో ఆ దిశగా నావికా, వైమానిక దళాలను పటిష్ఠం చేస్తోంది. దీర్ఘశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థలు, యాంటీ డ్రోన్‌ ఏర్పాట్లు, అణు, సాధారణ జలాంతర్గాముల దాడులను తట్టుకోగలిగిన యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు, మానవ రహిత విమానాలు, స్టెల్త్‌ సాంకేతికత లాంటివన్నీ ఇందులో భాగమే. ఇటీవలి కాలంలో దేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రక్షణ రంగ ప్రాజెక్టులు, వాటి అవసరం, ప్రాధాన్యం, ఇందుకోసం సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.


శత్రు దేశాలతో ముప్పుపొంచి ఉన్న వేళ, భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు చేపట్టింది. వాటిలో భాగంగా భారత్‌ విమానవాహక నౌకలు, జలాంతర్గాములు, డ్రోన్లను ఎదుర్కొనే సాంకేతికత, మానవ రహిత విమానాలు లాంటి వాటిని నిర్మిస్తోంది. ముఖ్యంగా వాయుసేన, నావికాదళ పటిష్ఠతకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయి.

D4 - యాంటీడ్రోన్‌ సిస్టమ్‌: ఈ వ్యవస్థను భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేయగా, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) తయారుచేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి యాంటీడ్రోన్‌ వ్యవస్థ ఇది. దీన్ని D4 S అని అంటారు. అంటే డ్రోన్, డిటెక్ట్, డిటర్, డిస్ట్రాయ్‌ అని అర్థం. ఈ వ్యవస్థ డ్రోన్లను పసిగట్టి, వాటి గమనాన్ని నిరోధించి నాశనం చేస్తుంది. ఇందులోని రాడార్‌ వ్యవస్థ డీఆర్‌డీవోకు చెందిన గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (జీఎన్‌ఎస్‌ఎస్‌) సహాయంతో పనిచేస్తూ డ్రోన్లను గుర్తిస్తుంది. ఈ వ్యవస్థలోని పరికరాలు డ్రోన్లకు వచ్చే సమాచారాన్ని నిలిపివేస్తాయి. 1.25 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను తటస్థపరుస్తాయి. ఈ ప్రక్రియను ‘సాఫ్ట్‌కిల్‌’ అంటారు. ఆ తర్వాత ఈ వ్యవస్థలోని లేజర్‌ పరికరాలు డ్రోన్లను కూల్చివేస్తాయి. ఈ ప్రక్రియను ‘హార్డ్‌కిల్‌’ అంటారు. ఈ యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఎయిర్‌ ఇండియా షో 2023లో ప్రదర్శించారు.

ప్రాజెక్ట్‌ - 75: దీనిలో భాగంగా ముంబయికు చెందిన మజగావ్‌ డాక్‌ యార్డ్‌ షిప్‌ బిల్డర్స్, ఫ్రాన్స్‌కు చెందిన నావల్‌ గ్రూప్‌ కలిసి స్కార్పీన్‌ డిజైన్‌కు చెందిన ఆరు కల్వరి తరగతి జలాంతర్గాముల నిర్మాణం చేపట్టాయి. అవి..

1) ఐఎన్‌ఎస్‌ కల్వరి

2) ఐఎన్‌ఎస్‌ ఖండేరి    

3) ఐఎన్‌ఎస్‌ కరంజ్‌

4) ఐఎన్‌ఎస్‌ వేలా

5) ఐఎన్‌ఎస్‌ వాఘ్‌శీర్‌

6) ఐఎన్‌ఎస్‌ వాగిర్‌.

ప్రాజెక్ట్‌-75 (I): దీనిలో I అక్షరం ఇండియాను సూచిస్తుంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ 2021, జులైలో ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ముంబయిలోని మజగావ్‌ డాక్‌షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్,   లార్సన్‌ అండ్‌ టర్బో కంపెనీ కలిసి ఆరు అధునాతన జలాంతర్గాములు నిర్మించనున్నాయి. ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ (AIP) సాంకేతికత కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. సాధారణ జలాంతర్గాములు ప్రతి 48 గంటలకు సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చి ఇంధనాన్ని మండించుకుని బ్యాటరీలను రీఛార్జి చేసుకోవాలి. ఈ సమయంలో ఇవి శత్రువుల కంటపడే ప్రమాదం ఉంది. 

AIP సాంకేతికత ఉన్న ఆధునిక జలాంతర్గాములు 14 రోజుల వరకు సముద్ర గర్భంలో ఉండగలవు. వీటిలో ఆధునిక సాంకేతికతతోపాటు లాంగ్‌ రేంజ్‌ గైడెడ్‌   టార్ఫిడోలు, సోనార్‌లు, తొడుగు నుంచి ప్రయోగించగల యాంటీషిప్‌ క్షిపణులు, శత్రువుల రాడార్లు గుర్తించకుండా చేసే స్టెల్త్‌ టెక్నాలజీ లాంటివి ఉన్నాయి. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో భాగంగా వీటిని నిర్మిస్తున్నారు.

ATV ప్రోగ్రామ్‌: అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెజిల్‌     ప్రోగ్రామ్‌లో భాగంగా భారతదేశం అణుశక్తి (న్యూక్లియర్‌ ఎనర్జీ)తో నడిచే జలాంతర్గాములను తయారుచేస్తోంది. వీటిలో మొదటిది ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌.

ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌: ఇది SSBN రకానికి చెందింది. దీన్ని S2 గా పిలుస్తున్నారు. ఎన్‌రిచ్డ్‌ యురేనియం ఇంధనంతో నడిచే ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్‌తో ఇది పనిచేస్తుంది. ఇందులో K-15 క్షిపణులు, టార్పిడోలు ఉంటాయి. 50 రోజుల పాటు నిరంతరాయంగా    సముద్రంలో మునిగి ఉండి సేవలు అందించగలదు.

ATV ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న రెండో అణు  జలాంతర్గామి INS అరిఘాత్‌. దీన్ని S3 పేరుతో   పిలుస్తున్నారు. మూడో జలాంతర్గామి INS అరిథామన్‌. దీన్ని S4 పేరుతో పిలుస్తున్నారు.

ప్రాజెక్ట్‌ - 28: ఇది భారత నావికా దళానికి చెందిన ప్రాజెక్ట్‌. దీనిలో భాగంగా కోల్‌కతాలోని ‘గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ)’ కార్వెట్టి రకానికి చెందిన నాలుగు నౌకల్ని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టుకు 2008లో ఆమోదం తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో  నిర్మించిన ఈ నౌకలను యాంటీ సబ్‌మెరైన్‌ యుద్ధ నౌకలుగా పిలుస్తున్నారు. దీనిలో భాగంగా నిర్మించిన నాలుగు యుద్ధనౌకలు

1) ఐఎన్‌ఎస్‌ కమోర్త

2) ఐఎన్‌ఎస్‌ కదమత్‌  

3) ఐఎన్‌ఎస్‌ కిల్టన్‌

4) ఐఎన్‌ఎస్‌ కవరట్టి. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని నిర్మించారు.

ప్రాజెక్ట్‌ - 71: భారత నావికా దళానికి అవసరమైన రెండు విమాన వాహక నౌకల తయారీకి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. వీటిని ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ నావల్‌’ డిజైన్‌ చేయగా, కొచ్చిన్‌ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్‌ నిర్మిస్తోంది. వీటిలో ఇప్పటికే పూర్తయిన ఐఎన్‌ఎస్‌ - విక్రాంత్‌ సేవలందిస్తోంది. ఇది నాలుగు గ్యాస్‌ టర్బైన్‌లతో పనిచేస్తుంది. దీనిపై మిగ్‌-29 యుద్ధ విమానాలు, కామోవ్‌ 31, MH-60 R హెలికాప్టర్లు ఉంటాయి. దీనిపై విమానం దిగేందుకు, పైకి లేచేందుకు STOBAR (షార్ట్‌ టేక్‌ ఆఫ్‌ బారియర్‌ అరెస్టెడ్‌ రికవరీ) సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో నిర్మిస్తున్న రెండో విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ - విశాల్‌.

ప్రాజెక్ట్‌ ఘాతక్‌: యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్న  మానవరహిత విమానాలను అభివృద్ధి చేసేందుకు భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థ ‘ప్రాజెక్ట్‌ ఘాతక్‌’ ను చేపట్టింది. ఇవి స్వయంచాలకంగా రన్‌వేపై నుంచి టేకాఫ్, ల్యాండింగ్‌ అవ్వగలవు. వీటికి బాంబులు, క్షిపణుల్ని అమర్చవచ్చు. ఇలాంటి మానవరహిత విమానాన్ని 2022, జులైలో కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఎయిరో నాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌లో పరీక్షించారు. తర్వాత పూర్తిస్థాయిలో ఆరు సార్లు పరీక్షించనున్నారు. దీన్ని అటానమస్‌ అన్‌మ్యాన్డ్‌ రిసెర్చ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ (AURA) గా డీఆర్‌డీవో పిలుస్తోంది. వీటిని డిజైన్‌ చేసి, అభివృద్ధి చేసింది డీఆర్‌డీవోకు చెందిన ఎయిరో నాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సంస్థ. ఈ విమానం జీపీఎస్‌ ఆధారిత జియో అగ్‌మెంటెడ్‌ నావిగేషన్‌ వ్యవస్థ (గగన్‌) ఆధారంగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ శాటిలైట్‌కు అనుసంధానమై ఉంటుంది. ఈ ప్రయోగం దేశీయంగా స్టెల్త్‌ టెక్నాలజీతో యుద్ధం చేసే డ్రోన్ల అభివృద్ధికి ఉపయోగపడగలదు.

ఇంద్రజాల్‌ వ్యవస్థ: హైదరాబాద్‌లోని గ్రీన్‌ రోబోటిక్స్‌కు చెందిన యాంటీడ్రోన్‌ వ్యవస్థే ఇంద్రజాల్‌. దీన్నే ‘అటానమస్‌ డ్రోన్‌ డిఫెన్స్‌ డోమ్‌’ అంటారు. ఇది భారతదేశంలో మొదటిసారిగా ప్రైవేట్‌ రంగంలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్లను ఎదుర్కొనే సాంకేతికత. స్వయంచాలకంగా పనిచేసే ఈ వ్యవస్థ 1000-2000 చదరపు కిలోమీటర్ల పరిధిలోని చిన్న, మధ్యరకం, పెద్ద పరిమాణంలో ఉండే డ్రోన్లు, మానవరహిత విమానాలు, డ్రోన్ల దండును గుర్తిస్తుంది. కృత్రిమ మేధతో పనిచేయడం దీన్ని మరో ప్రత్యేకత. సుమారు 9 నుంచి 10 రకాల సాంకేతికతల కలయికతో దీన్ని రూపొందించారు. 360 డిగ్రీల కోణంతో అన్ని  సమయాల్లో, అన్ని రోజుల్లో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. 

నమూనా ప్రశ్నలు


1. యాంటిడ్రోన్‌ సిస్టమ్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?

1) దీన్ని అభివృద్ధి చేసింది డీఆర్‌డీవో

2) ఇది గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తుంది

3) దీనిలో సాఫ్ట్‌కిల్, హార్డ్‌కిల్‌ సాంకేతికత ఉంది

4) పైవన్నీ 


2. ప్రాజెక్టు -75 లో భాగంగా వేటిని నిర్మిస్తున్నారు?

1) కల్వరి తరగతికి చెందిన డీజిల్‌ జలాంతర్గాములు

2) విమానవాహక నౌకలు

3) అణు జలాంతర్గాములు

4) బాలిస్టిక్‌ క్షిపణులు


3. భారతదేశం... అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెజిల్‌  ప్రోగ్రామ్‌లో భాగంగా దేన్ని నిర్మించింది?

1) ఐఎన్‌ఎస్‌ వేలా  2) ఐఎన్‌ఎస్‌ కల్వరి  

3) ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌  4) ఐఎన్‌ఎస్‌ కరంజ్‌


4. ఐఎన్‌ఎస్‌  అరిహంత్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది?

1) ఇది అణుశక్తితో నడిచే జలాంతర్గామి

2) దీన్ని తిగిజు ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్మించారు

3) దీనిలో రీ15 క్షిపణులు ఉంటాయి.

4) పైవన్నీ 


5. నావికా దళానికి విమాన వాహక నౌకల తయారీ కోసం చేపట్టిన ప్రాజెక్టు?

1) ప్రాజెక్ట్‌ - 28   2) ప్రాజెక్ట్‌ - 75

3) ప్రాజెక్ట్‌ - 71   4) ప్రాజెక్ట్‌ - 100


జవాబులు: 1-4; 2-1; 3-3; 4-4; 5-3.

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌ 
 

Posted Date : 11-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌