• facebook
  • whatsapp
  • telegram

సూర్యపుటం - ఉష్ణోగ్రత

జీవ‌జాలం మ‌నుగ‌డకు మూలాధారం!

  సూర్యుడి నుంచి ఉద్భవించే అపరిమితమైన శక్తి ఏమవుతుంది? కొంత భూమిపైకి చేరుతుంది. కాంతి, ఉష్ణోగ్రతల రూపంలో విస్తరిస్తుంది.  రకరకాల చర్యల ద్వారా  భూమి మరీ వేడి ఎక్కకుండా, ఎక్కువగా చల్లబడిపోకుండా జీవుల మనుగడకు అనుకూలం చేస్తుంది. ఈ నేపథ్యంలో భూమిపై ప్రాంతాల వారీగా ఎక్కడెక్కడ ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి.? అందుకు నైసర్గిక స్వరూప స్వభావాలు ఎలా దోహదం చేస్తున్నాయి? తదితర వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

  

భూమి వైపు ప్రసరించే సౌర వికిరణ పరిమాణాన్ని లేదా భూమి గ్రహించుకునే సౌర వికిరణ పరిమాణాన్ని సూర్యపుటం అంటారు. భూమి వైపు ప్రసరించే సౌర వికిరణంలో కేవలం 1/2000 మిలియన్ల వంతు మాత్రమే భూఉపరితలాన్ని చేరుతుంది. ఇంత తక్కువ శక్తి భూఉపరితలాన్ని చేరడానికి కారణాలు..

* భూమికి, సూర్యుడికి మధ్య దూరం 149.5 మిలియన్‌ కి.మీ. ఉండటం.

* సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్‌ రెట్లు పెద్దది.

* సూర్యుడి వ్యాసం భూమి వ్యాసం కంటే 109 రెట్లు ఎక్కువ.

 

సౌరశక్తి: కేంద్రక సంలీనం ద్వారా సూర్యుడిలో పుట్టే శక్తినే సౌరశక్తి అంటారు. 

 

సౌర వికిరణం: సూర్యుడిలో పుట్టే శక్తి కాంతి, ఉష్ణం రూపంలో అన్ని దిశల్లో వికిరణం రూపంలో వెదజల్లే ప్రక్రియ. 

 

సౌర స్థిరాంకం: భూ ఉపరితలాన్ని చేరే 1/2000 మిలియన్ల వంతు సౌర వికిరణం భూమిపై ఉన్న చదరపు సెం.మీ. భూభాగాన్ని 1.94 గ్రాము క్యాలరీల చొప్పున వేడి చేస్తుంది. దీన్ని భూమి సగటు సౌరస్థిరాంకం విలువ అని పిలుస్తారు. (సౌరస్థిరాంకం = 1.94 గ్రా.క్యాలరీలు/చ.సెం.మీ/ని.)

 

ఉష్ణోగ్రత: వాతావరణంలోని వేడి తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు. భూ వాతావరణం పగటి సమయంలో భూమి వైపు హ్రస్వ తరంగాల రూపంలో ప్రసరించే సౌరవికిరణం ద్వారా కొద్దిగా వేడెక్కి, సాయంత్రం నుంచి దీర్ఘతరంగాల రూపంలో పైకి వెళ్లే ఉష్ణ వికిరణం ద్వారా (భౌమ వికిరణం) అధికంగా వేడెక్కుతుంది. 

* భూమిపై ఉష్ణోగ్రతను వివిధ ఉష్ణమాపకాలను ఉపయోగించి తెలుసుకోవచ్చు.

 

సిక్స్‌ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణమాపకం: దీన్ని ఏదైనా ప్రాంతంలో ఒక రోజులో నమోదయ్యే గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య తేడా తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.

 

పైరోమీటర్‌: ఏదైనా ప్రాంతంలో లేదా సూర్యుడిలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగిస్తారు.

 

క్రయోమీటర్‌: ఏదైనా ప్రాంతంలో అతితక్కువ ఉష్ణోగ్రతలను కొలిచే పరికరం.

 

బర్దోలి ట్యూబ్‌: నావికులు, వ్యోమగాములు వారు ప్రయాణించే ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం.

 

క్లినికల్‌ థర్మామీటర్‌: మానవ శరీర ఉష్ణోగ్రతను కొలిచే పరికరం.

 

ఉష్ణ బదిలీ విధానాలు 

వివిధ స్థితుల్లో ఉన్న పదార్థాల్లోని ఉష్ణం అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి మూడు విధాలుగా బదిలీ అవుతుంది. 

 

1) ఉష్ణవహనం: ఘనస్థితిలోని పదార్థాల్లో అణువులు లేదా కణాల స్థానాంతర చలనం లేకుండా ఉష్ణం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే పద్ధతిని ఉష్ణవహనం అంటారు. ఈ పద్ధతిలో ఉష్ణం బదిలీ జరగాలంటే రెండు పదార్థాలు తాకుతూ ఉండాలి. 

ఉదా: భూమి కింది పొరలు వేడెక్కడం

 

2) ఉష్ణ సంవహనం: ద్రవ, వాయు స్థితిలో ఉన్న పదార్థాల్లో అణువుల స్థానాంతర చలనం వల్ల ఉష్ణం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రసరించడాన్ని ఉష్ణ సంవహనం అంటారు.

ఉదా: సముద్ర, భూపవనాలు ఏర్పడటం

 

3) ఉష్ణ వికిరణం: యానకంతో సంబంధం లేకుండా శూన్యంలో ఉష్ణం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే పద్ధతిని ఉష్ణ వికిరణం అంటారు. 

ఉదా: సూర్యుడి నుంచి ఉష్ణం భూమిని చేరడం

భూఉపరితలంపై ఉష్ణోగ్రత అన్ని ప్రాంతాల్లో ఒకేవిధంగా ఉండకుండా భూమికి క్షితిజ సమాంతరంగా, ఊర్ధ్వముఖంగా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అందువల్ల ఉష్ణోగ్రత విస్తరణను రెండు భాగాలుగా విభజించి తెలుసుకోవచ్చు. 

 

క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ: కింది కారణాల వల్ల ఉష్ణోగ్రత భూమికి క్షితిజ సమాంతరంగా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

 

భూమిపై సూర్యకిరణాలు పడే తీరు (అక్షాంశాలు): భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లేకొద్దీ సూర్యుడి ఉన్నతి భూమి క్షితిజ తలానికి పెరుగుతుండటం వల్ల భూమి మీద సూర్యకిరణాలు పడే కోణం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి భూమిని చేరే సూర్యపుట పరిమాణం కూడా తగ్గడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అంటే భూమధ్యరేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు తక్కువ దూరం ప్రయాణించి నిట్టనిలువుగా పడి (నడినెత్తి సూర్యుడు) భూమి అధికంగా వేడెక్కడానికి కారణమవుతాయి. ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ కిరణాలు ఎక్కువ దూరం ప్రయాణించి ఏటవాలుగా పడి వేడి తక్కువగా ఉంటుంది.

 

భూమికి, సూర్యుడికి మధ్య దూరం: భూకక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉండటం వల్ల భూమి పరిహేళి స్థానంలో (జనవరిలో) ఉన్నప్పుడు భూమిని చేరే సూర్యపుటం అధికంగా, అపహేళి స్థానంలో ఉన్నప్పుడు (జులైలో) సూర్యపుటం తక్కువగా ఉంటుంది.

 

పగటి సమయం: రుతువు, అక్షాంశాన్ని అనుసరించి భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లేకొద్దీ పగటి సమయం మారుతూ ఉంటుంది. 

ఉదా: ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలంలో భూమధ్యరేఖ నుంచి ఉత్తర ధ్రువం వైపు అక్షాంశం పెరిగే కొద్దీ పగటి సమయం క్రమంగా పెరుగుతుంది. దీనివల్ల భూమిని చేరే సూర్యపుట పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధ గోళంలో శీతాకాలం ఉండటం వల్ల భూమధ్యరేఖ నుంచి దక్షిణ ధ్రువం వైపు అక్షాంశం పెరిగే కొద్దీ పగటి సమయం తగ్గుతున్నందున భూమిని చేరే సూర్యపుట పరిమాణం కూడా తగ్గుతూ ఉంటుంది. 

భూ, జల విస్తరణ: భూ, జల భాగాలు ఉష్ణోగ్రతకు విభిన్నంగా స్పందిస్తాయి. దీనికి కారణం నీటి విశిష్టోష్ణంతో పోలిస్తే భూభాగాల విశిష్టోష్ణం తక్కువగా ఉండటం. దీనివల్ల పగటి సమయంలో భూమి త్వరగా వేడెక్కి త్వరగా చల్లారుతుంది. నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది. కాబట్టి భూమిపై పగలు వేడిగా ఉంటే నీటిపై చల్లగా ఉంటుంది. రాత్రి భూమి చల్లగా ఉంటే నీరు వేడిగా ఉంటుంది. 

 

సముద్ర సామీప్యత: రోజులో ఎండలు ఎక్కువగా ఉన్న పగటి సమయంలో భూమి వేడెక్కి అల్పపీడనాన్ని కలిగి ఉంటుంది. అదే సమయంలో సమీపంలో ఉన్న సముద్రంపై నుంచి చల్లని గాలులు భూమిపైకి వీస్తూ ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. రాత్రిపూట భూమి కంటే సముద్రంపైన అల్పపీడనాలు ఏర్పడతాయి. తద్వారా భూమిపై నుంచి చల్లని గాలులు సముద్రం పైకి వీస్తాయి. వేసవిలో లోతట్టు ప్రాంతాలతో పోలిస్తే తీర ప్రాంతాలు చల్లగా ఉండటానికి సముద్ర సామీప్యతే కారణం. 

ఉదా: చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం లాంటి తీర ప్రాంతాలు చల్లగా ఉంటే తిరుపతి, కడప, రామగుండం లాంటి ఖండాంతర ప్రాంతాలు వేడిగా ఉంటాయి.

 

పవనాలు, సముద్ర ప్రవాహాలు: ఒక ప్రదేశం ఉష్ణోగ్రతను ధ్రువాల వైపు నుంచి వచ్చే పవనాలు, ప్రవాహాలు తగ్గిస్తే, భూమధ్యరేఖా ప్రాంతాల వచ్చేవి పెంచుతాయి.

 

భూభాగాలు (పర్వతాల వాలులు): ఉత్తరార్ధ గోళంలోని దక్షిణ వాలులు, దక్షిణార్ధ గోళంలోని ఉత్తర వాలులు అవతలి వైపు కంటే అధిక వేడిగా ఉంటాయి. కారణం ఉత్తరార్ధ గోళంలో భూభాగాల దక్షిణ వాలులు, దక్షిణార్ధ గోళంలో ఉత్తర వాలులు సూర్యుడికి ఎదురుగా ఉండటం వల్ల అక్కడ ఎక్కువ సూర్యపుటం చేరి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఉత్తరార్ధ గోళంలోని దక్షిణ వాలుల్లో మాత్రమే కాఫీ, తేయాకు పంటలను సాగుచేస్తారు. ఉత్తర వాలుల్లో చల్లగా ఉండి పొగమంచు ఎక్కువై పంటకు నష్టం చేకూరుతుంది. 

 

భూభాగాల ఎత్తు: ఒక అక్షాంశం మీద సముద్ర మట్టం నుంచి ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రదేశం ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. కారణం సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. 

ఉదా: ఒకే అక్షాంశం మీద ఉన్న పంజాబ్‌ లోని లుథియానాతో పోలిస్తే హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో చల్లగా ఉంటుంది.

 

వాతావరణ పారదర్శకత: వాతావరణం పారదర్శకంగా ఉన్నప్పుడు భూమిని చేరే సూర్యపుటం అధికంగా, పారదర్శకంగా లేనప్పుడు సూర్యపుటం తక్కువగా ఉంటుంది. వాతావరణ పారదర్శకత అన్ని ప్రాంతాల్లో ఒకేవిధంగా లేకపోవడం వల్ల ఉష్ణోగ్రత భూమికి క్షితిజ సమాంతరంగా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. 

పై అంశాలతో పాటు ఒక ప్రదేశంలోని నేలలు, వర్షపాతం, భూస్వరూపాలు, మేఘాలు కూడా ఉష్ణోగ్రత విస్తరణను ప్రభావితం చేస్తున్నాయి. 

ఉదాహరణకు భూమధ్యరేఖా ప్రాంతంలో ఉష్ణ సంవహనం వల్ల వర్షాలు అధికంగా పడి ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువ కాకుండా ఉంటాయి. 


ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ:  ఉష్ణోగ్రత, ఎత్తుల మధ్య సంబంధాన్ని ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ అని పిలుస్తారు. సాధారణంగా అన్ని భౌగోళిక ప్రాంతాల్లో  సముద్రమట్టం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కానీ కొన్ని ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో, కొన్ని రుతువుల్లో ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ప్రక్రియనే ఉష్ణోగ్రత విలోమం అంటారు. 


* పర్వత నదీలోయ ప్రాంతాలు, పారిశ్రామిక పట్టణ ప్రాంతాలు, సముద్రతీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత విలోమ ప్రక్రియ సంభవిస్తుంది. 

* ఉష్ణోగ్రత విలోమ ప్రక్రియ సంభవించడానికి కావాల్సిన పరిస్థితులు 

- అతి శీతాకాలమై ఉండాలి. 

- దీర్ఘరాత్రులు ఉండాలి. వాతావరణంలో గాలుల వేగం తక్కువగా ఉండాలి. 

- వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండాలి.

* ఉష్ణోగ్రత విలోమం కారణంగా పర్వత నదీలోయ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వారి నివాసాలు, పంటల సాగును పర్వత వాలుల వెంబడి చేపడతారు. కారణం ఇక్కడ ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువ, తక్కువ కాకుండా అనుకూలంగా ఉంటాయి.

 

ఉష్ణోగ్రత వ్యత్యాసం

దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం: ఒక ప్రదేశంలో రోజులో అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య భేదాన్ని ఆ ప్రదేశ దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటారు.

* భూమధ్యరేఖా ప్రాంతంలో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఇక్కడ సూర్యకిరణాలు నిలువుగా పడటం వల్ల సూర్యపుటం ఎక్కువగా చేరి పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీని కారణంగా గాలి అధికంగా సంవహనం చెంది వాతావరణంలో ఆర్ద్రత పరిమాణం పెరుగుతుంది. అదేవిధంగా రాత్రి సమయంలో భూఉపరితలం నుంచి పైకి వెళ్లే ఉష్ణశక్తి వాతావరణంలో ఆర్ద్రత కారణంగా తిరిగి భూమి మీదకు పరావర్తనం చెందడం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల భూమధ్యరేఖా ప్రాంతాల్లో దైనందిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎక్కువగా ఉండి ధృవాల వైపు వెళ్లేకొద్దీ తగ్గుతూ ఉంటాయి. 

* ఎడారి ప్రాంతాల్లో ఆకాశం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. కాబట్టి ఏ అడ్డంకి లేకుండా పగలు సూర్యపుటాన్ని గ్రహించడం, రాత్రి సమయాల్లో ఉష్ణాన్ని కోల్పోవడం జరుగుతుంది. అందువల్ల ఎడారి ప్రాంతాల్లో దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం మిగతా ప్రాంతాల్లో కంటే ఎక్కువగా ఉంటుంది.

* మంచుతో నిండిన ప్రాంతాలు, ముఖ్యంగా ధృవ ప్రాంతాలు సూర్యపుటాన్ని ఎక్కువగా పరావర్తనం చెందించడం వల్ల దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం తక్కువగా ఉంటుంది.

* ఎత్తయిన ప్రాంతాల్లో వాయు సాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలు సూర్యపుటాన్ని సులభంగా గ్రహించి, కోల్పోతుంటాయి. ఇక్కడ దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది.

* ఖండాంతర్గత ప్రాంతాల్లో సముద్రాల కంటే దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం సముద్రాల కంటే ఖండాంతర్గత ప్రాంతాలు త్వరగా వేడెక్కడం, త్వరగా ఉష్ణాన్ని కోల్పోవడం. 

వార్షిక ఉష్ణోగ్రతా వ్యత్యాసం: వేసవి, శీతాకాల మాసాల మధ్య సగటు ఉష్ణోగ్రతల వ్యత్యాసాన్ని వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటారు. 

* భూమధ్యరేఖా ప్రాంతాల్లో పగలు, రాత్రి సమానంగా ఉంటూ సంవత్సరం పొడవునా సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయి. దీనివల్ల వేసవి, శీతాకాలాల్లో ఉష్ణోగ్రతా వ్యత్యాసం పెద్దగా ఉండదు. ధృవాల వైపు వెళ్లేకొద్దీ పగటి కాలం, సూర్యకిరణాల వాలు పెరుగుతూ ఉంటుంది. అందుకే వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అత్యధికంగా నమోదవుతుంది.

* తీర ప్రాంతాల్లో కంటే ఖండాంతర్గత ప్రాంతాల్లో వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావమే.

* సముద్ర ప్రవాహాలు కూడా ఒక ప్రాంతం వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని ప్రభావితం చేస్తాయి. 

ఉదా: గల్ఫ్‌ ప్రవాహం వల్ల యూరప్‌ పశ్చిమ తీర ప్రాంతంలో శీతాకాల తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇది వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని తగ్గిస్తుంది.

* పవనాలు కూడా ఒక ప్రాంత వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని ప్రభావితం చేస్తాయి. ఎడారి ప్రాంతాల నుంచి వీచే పవనాలు వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం పెరగడానికి దోహదం చేస్తాయి. అందుకు భిన్నంగా సముద్ర పవనాలు ఈ వ్యత్యాసాన్ని తగ్గిస్తాయి. 

ఉదా: తూర్పు యూరప్‌లో పశ్చిమ యూరప్‌ కంటే వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అధికంగా ఉంటుంది.

 

ఉష్ణ సమతౌల్యం 

  భూఉపరితలం పగటి సమయంలో హ్రస్వ తరంగాల రూపంలో గ్రహించే సౌర వికిరణ పరిమాణానికి, సాయంత్రం నుంచి దీర్ఘతరంగాల రూపంలో కోల్పోయే భౌమ వికిరణానికి మధ్య నిష్పత్తిని ఉష్ణ సమతౌల్యం అంటారు. భూమిపై ఉష్ణ సమతౌల్యం కొనసాగినంత కాలం భూగ్రహంపై అనుకూల శీతోష్ణస్థితి పరిస్థితులు ఉండి జీవజాలం మనుగడను సాగిస్తుంది. ఇందులో సమతౌల్యం ఏ మాత్రం దెబ్బతిన్నా భూమిపై ఉన్న జాతులన్నీ నశించి భూగోళం నిర్జీవగోళంగా మారుతుంది.

ఉదా: భూమి వైపు ప్రసరించే మొత్తం సౌర వికిరణం 100 యూనిట్లు అనుకుంటే అందులో వాతావరణంలోని మేఘాల ద్వారా 25 యూనిట్లు, దుమ్ము, ధూళి కణాల నుంచి 6 యూనిట్లు, భూమి మీద మంచు ప్రాంతాల నుంచి 4 యూనిట్లు.. ఇలా మొత్తం 35 యూనిట్లు భూ ఉపరితలాన్ని చేరకుండానే భూవాతావరణం నుంచి పరావర్తనం చెందుతుంది. ఒక గ్రహ వాతావరణం నుంచి పరావర్తనం చెందే సౌరవికిరణ పరిమాణాన్ని ఆల్బిడో అని పిలుస్తారు. పైన తెలిపిన ప్రకారం భూమి సగటు ఆల్బిడో 35%.

* మొత్తం 100 యూనిట్ల సౌర వికిరణంలో 35 యూనిట్లు భూవాతావరణం నుంచి పరావర్తనం చెంద[గా, మిగిలిన 65 యూనిట్లలో 14 యూనిట్లు భూవాతావరణంలోని నీటిఆవిరి గ్రహించుకొని ఆ వేడిని మిగిలిన వాతావరణానికి సంవహన ప్రక్రియ ద్వారా అందజేస్తుంది. అంటే నికరంగా 51 యూనిట్లే భూ ఉపరితలాన్ని చేరి వేడిచేస్తుంది. భూఉపరితలంపై ఉన్న ఈ 51 యూనిట్ల సౌరశక్తి సమస్త జీవజాతులకు శక్తి అవసరాలను తీర్చడంలో వినియోగమవుతుంది. అందుకే ఈ 51 యూనిట్ల సౌరశక్తిని ‘నిర్వహణ సౌరశక్తి’ అని పిలుస్తారు.

* భూమి గ్రహించిన 51 యూనిట్ల ఉష్ణశక్తిలో 17 యూనిట్లు ఉష్ణాన్ని వహనం, సంవహనం, వికిరణం అనే ప్రక్రియల ద్వారా భూఉపరితలం నేరుగా వెనుకకు పంపగా మిగిలిన 34% ఉష్ణాన్ని వాతావరణం గ్రహించి వేడెక్కి తిరిగి వివిధ ప్రక్రియల ద్వారా వెనుకకు పంపుతుంది. ఇలాంటి సమతౌల్యంతోనే భూమిపై ఉష్ణోగ్రతలు పగటి సమయంలో మరీ ఎక్కువ, రాత్రి సమయాల్లో మరీ తక్కువ కాకుండా అనుకూలంగా ఉంటాయి.

 

రచయిత: సక్కరి జయకర్‌ 

Posted Date : 12-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌