• facebook
  • whatsapp
  • telegram

పట్టణ/నగర మానవ ఆవాస ప్రాంతాలు

ఆధునిక ప్రగతికి అసలైన చిరునామాలు! 
 


 

గ్రామాల నుంచి విద్య, ఉపాధి కోసం వలసలు పోటెత్తుతుండటంతో నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాజకీయ, ఆర్థిక, ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో జనసాంద్రత పెరిగి దేశంలో మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, సామాజిక సేవలపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతోంది. పేదరికం, నిరుద్యోగం వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతున్నాయి. కాబోయే ప్రభుత్వోద్యోగులుగా వాటిని పరిష్కరించాలంటే పట్టణీకరణ స్వరూప స్వభావాల గురించి తెలుసుకోవాలి.  జనాభా పరిమాణం ఆధారంగా పట్టణాల వర్గీకరణ, జాతీయ, అంతర్జాతీయ ప్రామాణికాంశాలపై అవగాహన పెంచుకోవాలి.


మనిషి కనీస అవసరాల్లో ఆహారం, దుస్తుల తర్వాత ముఖ్యమైనది నివాసం. ఆదిమకాలం నుంచి ఆధునిక యుగం వరకు జరిగిన పరిణామక్రమానికి నివాసం ఒక ముఖ్య సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రాచీన మానవుడు ఆహారం కోసం అన్వేషణ (వేట) సాగించేవాడు. నేడు తాను ఉన్న ప్రదేశంలోనే ఆహారాన్ని/వృత్తిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అవి ఆహారం ఎక్కడ ఉంటే అక్కడే నివసిస్తున్నాడు. ఈ ఆవాసాలు (సెటిల్‌మెంట్స్‌) మనకు సింధూ నాగరికత కాలం నుంచే ఉన్నట్లు ఆధారాలున్నాయి.

ప్రకృతి, జంతువులు, ఇతరుల నుంచి తమని తాము రక్షించుకోవడం కోసం ప్రాచీన కాలంలో మానవులు ఆవాసాలను దగ్గర దగ్గరగా ఏర్పాటు చేసుకునేవారు. ప్రస్తుతం కూడా మానవ ఆవాసాలు దగ్గర దగ్గరగానే ఉంటున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నప్పటికీ, అందులో ముఖ్యమైనవి విద్య, ఉపాధి, పరిపాలనా ప్రాంతాలుగా ఉండటం. ఈ ఆవాసాలు చిన్న పట్టణాల నుంచి మహానగరాల స్థాయికి విస్తరించాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే మన దేశంలో నగరీకరణ నెమ్మదిగానే జరుగుతున్నప్పటికీ త్వరలోనే భారతదేశ జనాభా సగానికి పైగా నగరాలకు వలస పోవచ్చని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 

పట్టణ నగర ప్రాంతం అంటే?:  2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం ఒక పట్టణ ప్రాంతం రెండు రకాల పరిపాలనా విభాగాలతో ఉంటుంది. అవి ఎ) చట్టబద్ధమైన పట్టణాలు బి) సెన్సస్‌ పట్టణాలు

ఎ) చట్టబద్ధమైన పట్టణాలు: చట్టం ద్వారా నిర్వచించిన అన్ని పరిపాలనా విభాగాలు ఉన్నవాటిని (మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, కంటోన్మెంట్‌ బోర్డులు, గుర్తించిన పట్టణ సమూహాలు, టౌన్‌ పంచాయతీలు, నగర పాలికలు) చట్టబద్ధమైన పట్ణణాలు అంటారు.

బి) సెన్సస్‌ పట్టణాలు: సెన్సస్‌ పట్టణాలుగా గుర్తించడానికి కొన్ని అంశాలు ఉండాలి.అవి 

1) కనీసం 5000 మంది జనాభా నివాసం ఉండాలి. 

2) పురుషుల్లో కనీసం 75 శాతం మంది వ్యవసాయేతర పనుల్లో నిమగ్నమై ఉండాలి.

3) ఒక చదరపు కిలోమీటరుకు 400 మంది (ఒక మైలుకు 1000 మంది) జనసాంద్రత ఉండాలి.

నగరం: ఒక ప్రాంతంలో లక్ష, అంత కంటే ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాలను నగరాలుగా పరిగణించారు.

మెట్రోపాలిటన్‌ నగరాలు: ఒక మిలియన్‌ (పది లక్షలు) జనాభా, అంతకంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలను మెట్రోపాలిటన్‌ నగరాలు అంటారు. ఈ నగరాల్లో పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలు ప్రధానంగా సాగుతుంటాయి. మన దేశంలో మెట్రోపాలిటన్‌ నగరాల సంఖ్య 1981లో 12 ఉంటే, 2011 లెక్కల ప్రకారం 53కు పెరిగింది.


మెగా సిటీలు: భారతదేశ జనాభా లెక్కల ప్రకారం 50 లక్షలు, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను మెగా సిటీలుగా పిలుస్తారు. కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం కోటి, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలనే మెగా సిటీలుగా పరిగణిస్తుంది. మనదేశంలో గ్రేటర్‌ ముంబయి, కోల్‌కతా, దిల్లీ ఈ మెగాసిటీలకు ఉదాహరణలు.


నగరవాసం (కానర్‌బేషన్‌): ఈ పదాన్ని పాట్రిక్‌ గెడ్డెస్‌ ఉపయోగించారు. గతంలో ఖాళీగా ఉన్న పట్టణ స్థావరాలను కలపడం ద్వారా ఇది ఉనికిలోకి వస్తుంది. ప్రధానంగా పట్టణం మధ్య నుంచి ఇతర సమీపంలోని నివాస ప్రాంతాలకు, ఇతర పట్టణాలకు రవాణా మార్గాలు మెరుగుపరచడం, రేడియల్‌ రోడ్లు లాంటివి అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంతాలు ప్రధాన పట్టణంలో కలుస్తాయి. దాంతో ఈ నగర ఆవాసాలు ఏర్పడతాయి.

ఉదా: ముంబయి, దిల్లీ, కోల్‌కతా


మెగాలో పొలీస్‌: ఇదొక గ్రీకు పదం. గ్రేట్, సిటీ అనే రెండు పదాల కలయిక ద్వారా ఏర్పడింది. నగర వాసం (కానర్‌బేషన్‌) లాంటి, ఒక పెద్ద నగర ప్రాంతంగా విస్తరించిన దానికి, చిన్న చిన్న పట్టణాలు, చుట్టుపక్కల నివాస ప్రాంతాలను కలపడం ద్వారా దాని పరిధి ఏర్పడుతుంది. 1964లో ‘గాట్‌మన్‌’ అనే వ్యక్తి మెగాలో పొలీస్‌ అనే పదాన్ని మొదటిసారి వాడారు. అమెరికాలోని బోస్టన్‌ ఉత్తర ప్రాంతం నుంచి వర్జీనియా నార్థోక్‌ వరకు ఉన్న ప్రదేశాన్ని సుమారు 960 కిలోమీటర్లకు పైగా (600 మైళ్ళు) ప్రాంతంలో నిరంతర నివాస ప్రాంతాలను కలిపి మెగాలో పొలీస్‌గా పేర్కొన్నారు.

ఉదా: న్యూయార్క్, టోక్యో. మన దేశంలో మెగాలో పొలీస్‌కు ఉదాహరణలు లేవు.


జనాభా లెక్కల విభాగం ప్రకారం నగరాల వర్గీకరణ

క్లాస్‌ జనాభా
I 1,00,000 ఆపైన
II 50000 - 99,999
III 20.000-49,999
IV 10,000 - 19,999
V 5,000 - 9,999
VI 5,000 కంటే తక్కువ


మెట్రోపాలిటనైజేషన్‌ (మహానగరీకరణ): మహానగరీకరణ అనేది నగరీకరణ వృద్ధిని, పారిశ్రామిక, తృతీయ ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను తెలియజేస్తుంది. ఇది స్థిర నివాసాలకు ప్రత్యేక రూపం. దీని అంతర్నిర్మాణం విశాలమైంది. అంతర ఆధారిత గ్రామాలు, పట్టణాల (ఉదా: సబర్బన్‌)ను కలిగి ఉంటుంది. మహానగరాలు అంటే పెద్దఎత్తున ప్రజల రాకపోకలు, పెద్ద మొత్తంలో వస్తువుల వినిమయం ఉంటుంది. పరిపాలనకు, రాజకీయ, ఆర్థిక శక్తులకు కేంద్రంగా ఉంటుంది. మహానగరీకరణ వేగం గ్రామీణ ప్రజలు, చిన్న చిన్న పట్టణాల నుంచి నేరుగా వలస వెళ్లేవారి రేటుపై ఆధారపడి ఉంటుంది.

మహానగరీకరణ అనేది భారతదేశ స్వాతంత్రోద్యమ కాలంలో జరిగిన పరిణామం. 1901 నాటికి మన దేశంలోని ఒకే ఒక్క మహానగరం కోల్‌కతా. 1911లో ముంబయి ఆ జాబితాలో చేరింది. ఇలాంటి నగరాల సంఖ్య 1941 వరకు మూడు దశాబ్దాల పాటు పెరగలేదు. స్వాతంత్య్రానంతరం 1951 మొదటి జనాభా లెక్కల ప్రకారం దిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ జనాభా 10 లక్షల మార్కును దాటడంతో వాటి సంఖ్య 5కు పెరిగింది. 1961లో 7, 1971లో 9, 1981లో 12కి పెరిగాయి. 1991 నాటికి అసాధారణంగా పెరిగి 23కు చేరింది. 2001లో 35 కాగా, 2011 నాటికి దేశంలో 53 మెట్రోపాలిటన్‌ నగరాలు అవతరించాయి.


నగర/పట్టణాల పెరుగుదల సంఖ్య:

* దేశంలోనే అత్యధిక పట్టణీకరణ చెందిన రాష్ట్రాలు గోవా, మిజోరాం.

* దేశంలో అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.

2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో పది లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలు 53. వీటిలో అత్యధిక జనాభా ఉన్న నగరం ముంబయి (1.8 కోట్లు). దిల్లీ (1.6 కోట్లు), కోల్‌కతా (1.4 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో తిరుచిరాపల్లి (10.2 లక్షలు) చివరి స్థానంలో ఉంది.

* 2011 లెక్కల ప్రకారం దేశంలో మెగా సిటీల సంఖ్య 8. యూఎన్‌ఓ లెక్కల ప్రకారం 3.

* దేశంలో అతిపెద్ద నగర సమూహాలుగా దిల్లీ, ముంబయి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

మిలియన్‌ జనాభా నగరాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌ (7).


రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌ 

 

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌