• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో వృత్తికళలు

చేతల చాతుర్యాలు.. అద్భుత నైపుణ్యాలు!
 

 

  అనాది నుంచి అనేక రకాల కళలు జనాన్ని అలరిస్తూ, చైతన్యాన్ని పెంచుతూ, ఆలోచింపజేస్తున్నాయి. అవే వృత్తులుగా, జీవనోపాధిగా కొనసాగుతున్నాయి. ఈ కళాకారులు విన్యాసాలతో వీరుల కథలు వినిపించేవారు. ఆటలు, మాటల చమత్కారాలతో ఆకట్టుకునేవారు. పగటి వేషాలు, అభినయాలతో హాస్యాన్ని పండించేవారు. కాటికాపరులుగా కనికట్టుతో ఇంద్రజాల విద్యలను ప్రదర్శించేవారు. రాజుల వంశ చరిత్రలను కీర్తించేవారు. సైన్యాలకు వీరత్వాన్ని బోధించేవారు. అవసరమైనప్పుడు రాయబారులుగా మారేవారు. అగ్నిగుండాలను తొక్కుతూ ఆశువుగా దండకాలు చదివేవారు. ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధ కవుల రచనల్లో వీరి ప్రస్తావనలు ఉన్నాయి. అవే చరిత్రకు ఆధారాలుగా నిలిచాయి. అలాంటి కళల్లో ప్రావీణ్యాన్ని సాధించి, వాటినే వృత్తిగా మార్చుకున్న కొన్ని ప్రత్యేక కులాలు, వర్గాలు తెలంగాణలో శతాబ్దాలుగా స్థిరపడ్డాయి. ఆ వృత్తికళలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. అప్పట్లో వాటికి లభించిన ఆదరణ, నేటికీ మనుగడలో ఉన్న తీరునూ తెలుసుకోవాలి. 

తెలంగాణ అనాదిగా వివిధ వృత్తి కళాకారులకు నిలయంగా ఉంది. వారు తమ వృత్తిని కొనసాగిస్తూ తెలంగాణ వీరుల చరిత్రను ప్రచారం చేసేవారు. ప్రజల్లో చైతన్యం కలిగించేవారు. తద్వారా జీవనోపాధిని పొందుతూ గత వైభవాన్ని అందరికీ గుర్తుచేసేవారు. 


దండాగానం: దండాగానం తెలంగాణ గ్రామాల్లో ఎక్కువ ప్రచారంలో ఉంది. ఈ పాటల్లో తెలంగాణలో జరిగిన వీరోచిత పోరాటాల చరిత్ర ఉంటుంది. హైదరాబాదుపై పోలీసు చర్య అనంతరం ప్రజాజీవితంలో వచ్చిన మార్పులను ఈ గానంలో వీరు ప్రతిబింబిస్తారు.


ఒగ్గుడోలు: ఒగ్గుడోలు ఒక మీటర్‌ పొడవుతో డ్రమ్ము ఆకారంలో ఉండే ఇత్తడి వాయిద్యం. ఈ కళాకారులు జానపద వీరుల కథలు వినిపిస్తారు. ఒగ్గుడోలు వాయిస్తే ప్రజలు వారి చుట్టూ చేరి తెల్లవారుజాము వరకు కథలు వినేవారు. ఒగ్గుడోలు విన్యాసాల్లో పల్టీలు కొట్టడం, గుండ్రంగా తిరగడం, ఒకరి మీద ఒకరు నిలబడడం ముఖ్యమైనవి. ఒగ్గు కథను మల్లన్న పండగ రోజు ప్రదర్శిస్తారు. కురుమలు, గొల్లలు వీటిని మంగళవాయిద్యాలుగా వాయిస్తారు.


శారదకాండ్రు: శారదకాండ్రు తెలంగాణ వీరుల కథలను చెబుతారు. వీరు ఉపయోగించే తంబురానే శారద అంటారు. అందువల్ల వీరికి శారదకాండ్రు అనే పేరు వచ్చింది. బుర్రకథలో మాదిరిగా వీరు కూడా ఢక్కీలను ఉపయోగిస్తారు.


వీధి బాగోతం: ‘ఆరె’ జాతి వారనే ఒక ప్రత్యేక తెగకు సంబంధించిన వారు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. వీరు గ్రామాల్లో ఆరె భాషలో వీధి బాగోతాలను ప్రదర్శిస్తారు.


మాలలు: మాలల్లో వైష్ణవ, శైవ శాఖీయులు ఉన్నారు. వైష్ణవులకు మాల దాసర్లు గురువులు కాగా, శైవులకు బుడిగె జంగాలు గురువులు. జంగాలు జంగం కథ చెబుతారు. రాత్రుల్లో వేషాలు వేసుకుని అభినయిస్తూ బొబ్బిలి కథ, అరె మరాఠీల కథ, బలమూరి కొండల రాయని కథ చెబుతారు. శ్రావ్యంగా పాడతారు. నృత్యం చేస్తారు.


దొమ్మరి ఆట: గ్రామాల్లో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దొమ్మర్లు తమ ప్రదర్శన ప్రారంభిస్తారు. ఆట ప్రారంభానికి సూచనగా గడను పాతి డోలు వాయిస్తారు. ఆ శబ్దానికి జనం గుమిగూడతారు. అప్పుడు ప్రదర్శనలో సూత్రధారుడి మాదిరి ప్రధాన పాత్ర పోషించే వ్యక్తి మాటల చమత్కారంతో జనాన్ని ఆకట్టుకుంటాడు. డోలు వాయించే మరో వ్యక్తి, అతడి మాటలకు వంత పలుకుతుంటాడు. తాడుపైన నడవడం, గడపై ఆడటం లాంటి అద్భుతమైన పనులు దొమ్మరుల ప్రదర్శనల్లో ఉంటాయి. ఈ ప్రదర్శనలే వారి వృత్తి జీవనం. ఇందులో ఆడ, మగ, పిల్ల, పెద్ద తేడా లేకుండా కుటుంబంలోని సభ్యులంతా వారికి అనువైన విద్యల ద్వారా ఏకాగ్రతతో కూడిన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ క్రమశిక్షణ కలిగిన ఒక కళా సమూహంగా వ్యవహరిస్తారు. సామాన్య జనం కోసం ప్రదర్శించే కళారూపాల్లో దొమ్మరి ఆట కూడా ఒకటి. ప్రసిద్ధ కవి పాల్కురికి సోమనాథుడు తన ‘పండితారాథ్య చరిత్ర’లో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించే జానపద కళారూపాలను వర్ణిస్తూ ‘అమరాంగనలు దివి నాదెడు మాడ్కి, సమరంగ గడలపై నాదెడు వారు’ అని దొమ్మరి ఆటను పేర్కొన్నాడు. ఎత్తయిన గడలపై గాలిలో ఆడే దొమ్మరి స్త్రీని ‘దివిలో ఆడే దేవతా స్త్రీ’తో పోల్చి దొమ్మరి కళకు పవిత్రతను చేకూర్చాడు. ‘పల్నాటి వీరచరిత్ర’లో శ్రీనాథుడు, ‘రామాభ్యుదయం’లో అయ్యలరాజు రామభద్రుడు దొమ్మరి ఆట గురించి ప్రస్తావించారు.


బహురూపులు (పగటి వేషాలు): బహురూపాల వారి కళావిశేషం పగటి వేషాలు. వీరిని బేరూపులు, బైరూపులు, పగటి వేషగాళ్లు అనే పేర్లతో పిలుస్తారు. బుడిగె జంగాల తెగకు చెందిన శైవులు పగటి వేషాలను వృత్తిగా స్వీకరించి, బహురూపాలను ప్రదర్శించడం వల్ల వీరికి పగటి వేషగాళ్లు, బహురూపులు అనే పేర్లు స్థిరపడ్డాయి. 64 కళల్లోని చిత్రయోగాన్ని బహురూపుల కళగా భావించవచ్చు. పౌరాణికం లేదా సాంఘికాంశాల్లో ఏదో ఒక ఘట్టాన్ని తీసుకుని ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది కళాకారులు ప్రదర్శనలో పాల్గొంటారు. స్త్రీ పాత్రలను కూడా పురుషులే ధరిస్తారు. వేషధారణ రంగులతో ఉంటుంది. వచన, పద్యాల మేళవింపులతో వాద్యాల సహకారంతో బహురూపుల వాళ్లు ఈ రూపాన్ని ప్రదర్శిస్తారు. సాంఘికాంశాల్లో విషయమే కాకుండా భాషోచ్చారణ, నడక తీరు, అభినయాలతో పాటు వ్యంగ్యం ఎక్కువగా ఉంటుంది. హాస్యాన్ని పండిస్తూ జనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. బైరాగులు, బుడబుక్కలవారు, సాతాని వైష్ణవులు, మందులవారు, సోమయాజులు, సోమిదేవమ్మ, అర్ధ నారీశ్వర మొదలైనవి వీరి సంప్రదాయ వేషాలు. రోజుకో వేషంతో గ్రామాల్లోని ఇళ్లు, వాకిళ్లల్లో, పట్టణాల్లోని వీధుల్లో ఉచితంగా ప్రదర్శిస్తూ చివరిరోజు ధనాన్ని, ధాన్యాన్ని, పాతదుస్తులను వీరు దానంగా స్వీకరిస్తారు. వీరు ప్రదర్శించే వేషాలన్నింటిలో అర్ధ నారీశ్వర వేషానికి ఎక్కువ ఆదరణ, ప్రచారం లభించింది. బహురూపుల పగటివేషాలు పూర్వం రాజదర్బారులో 31 రోజులు ప్రదర్శించేవారు. ప్రజల బాగోగులను మారువేషాల ద్వారా తెలుసుకోవాలనే రాజులకు బహురూపుల ప్రదర్శన పరోక్షంగా సహకరించేది. ఇది రాజులు, ప్రజలు మెచ్చిన కళారూపం. నాడు సమాజంలో ఆదరణ పొందిన బహురూపుల కళా విశేషాన్ని పాల్కురికి సోమనాథుడు తన ‘పండితారాధ్య చరిత్ర’లో, పోతన విరచిత ‘భాగవతం’లో, కొరవి గోపరాజు రచించిన ‘సింహాసన ద్వాత్రింశిక’లో పేర్కొన్నారు.


కాటిపాపలు - ఇంద్రజాలం: కాటిపాపలనే కాటికాపరులు అని కూడా అంటారు. వీరు తాము పురాణపురుషుల సంతతి వారమని పేర్కొంటారు. శివుడి కంటి మంటకు మన్మథుడు భస్మంగా మారిన తర్వాత, ఆ బూడిద నుంచి తమ జాతి పుట్టిందని కొందరు చెబుతారు. కాటికాపరైన హరిశ్చంద్రుడి సంతతివారమని మరికొందరు అంటుంటారు. శైవమతస్థులైన వీరికి బుడిగె జంగాలతో దగ్గర సంబంధం ఉంది. వీరు నేడు సాంఘికంగా వెనకబడిన తరగతికి చెందిన సంచార జాతిగా గుర్తింపు పొందారు. జనాన్ని దీవించే పాటలు పాడుతూ భిక్షమెత్తుకోవడం, శవం వెంట కాటికి వెళ్లడం, ఇంద్రజాల విద్యలను ప్రదర్శించి ప్రజలను సమ్మోహితులను చేయడం వీరి వృత్తి ధర్మం. శవం మీద కప్పే తెల్లటి వస్త్రాన్ని వీరు తమ హక్కుగా భావించి తీసుకుంటారు. ప్రతి ఇంటికి తిరిగి భిక్షాటన చేసే సందర్భాల్లో కాటికాపరులు ఇంద్రజాల విద్య ప్రదర్శిస్తారు. నడుముకు ఉండే చిన్న సంచిలో వీరి ప్రదర్శనకు పనికివచ్చే గచ్చకాయలు, మాయలబొమ్మ, పాములు, తేళ్లు, కప్ప, తిరిగే రాయిని పెట్టుకుంటారు. ఈ ఇంద్రజాల విద్యనే గారడీ విద్య అని, కనికట్టు విద్య, మహేంద్రజాలం, మాయాజాలం అని పలురకాల పేర్లతో పిలుస్తుంటారు. జనాన్ని సమ్మోహితులను చేసే ఈ కళలో దుస్తులు, వేషాలంకరణకు ప్రాధాన్యం ఉంటుంది. వేషధారణ గంభీరంగా, వింతంగా ఇంద్రజాల కళా ప్రదర్శనకు అనువైన ఆకర్షణతో ఉంటుంది.


భట్రాజులు: తెలుగు ప్రాంతాల్లో భట్రాజులను భట్టుమూర్తి, భట్టువాండ్లు అని పిలుస్తారు. వీరు రాజుల వంశ కీర్తన చేసేవారు. రాజాస్థానాల్లో ఉండే వందిమాగధులే ఈ భట్రాజులు అని పులికొండ సుబ్బాచారి పేర్కొన్నారు. వీరి ప్రసక్తి రామాయణం, మహాభారతం కాలం నుంచి కనిపిస్తుంది. రాజులను, వారి పరిపాలనను పొగిడి జీవించేవారే ఈ భట్రాజులని ఆంధ్రశబ్దరత్నాకరం చెబుతోంది.. ఆంధ్రప్రదేశ్‌లోని భట్రాజులు కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు. వీరు కేవలం రాజుల వంశ కీర్తన చేయడమే కాకుండా యుద్ధ సమయాల్లో సైనికులకు వీరాన్ని ఉద్భోదించడానికి, రాజ్యాల మధ్య రాయబారాలు నడపడానికి కూడా ఉపయోగపడేవారు. వీరి కీర్తనల వల్లనే రాజుల ప్రతాపాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండేది. సంస్థానాలు పోయిన తర్వాత భట్రాజులు వివిధ కులాలకు ముఖ్యంగా రెడ్డి, వెలమలకు వంశ కీర్తనలు చేశారు.


వీరముష్టి వారు: వీరముష్టివారిని వీరభద్రులు అని కూడా పిలుస్తారు. వీరు కోమటికుల ఆశ్రిత గాయకులు. కోమట్ల కులదైవమైన వాసవీ కన్యకాపరమేశ్వరి కథను పాడుతూ కేవలం కోమట్లనే యాచిస్తారు. కోమట్ల 102 గోత్రాలను వీరు కంఠోపాఠంగా చెబుతారు. నుదుటన విభూతిరేఖలు, చంకలో జోలె, చేతిలో ఒక జేగంట ఉంటాయి. ఆ గంటను ఎడమ చేతిలో ఎత్తిపట్టుకుని, కుడి చేతిలోని పిడి కర్రతో మోగిస్తూ కోమట్లను యాచించేవారు. తెలంగాణలోని కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో దసరాకు జరిగే ఉత్సవాల్లో వీరు పాల్గొని దండకాలు చదవడం, నారసాలు (నాలుకకు సూదులు గుచ్చుకోవడం) వేసుకోవడం చేస్తారు. శివరాత్రి పర్వదినాల్లో విజయప్రభలు కట్టడం, అగ్నిగుండాలు తొక్కుతూ ఆశువుగా దండకాలు చదవడం మొదలైన సంపద్రాయాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 

Posted Date : 17-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌