• facebook
  • whatsapp
  • telegram

చరిత్ర పూర్వయుగం  

(తెలంగాణ)

నదీలోయల్లో లక్షల ఏళ్ల ఆనవాళ్లు! 
 


 

మానవ పరిణామ క్రమంలో మొదటి దశ నుంచే తెలంగాణలో మనుషుల సంచారం, నివాసం ఉన్నట్టు ఆధారాలున్నాయి. మూడు లక్షల ఏళ్ల క్రితమే ఇక్కడి కృష్ణా నది ఒడ్డున, గోదావరి లోయలో ఆదిమానవుడు రాతి పనిముట్లతో వేట సాగించాడు. ఆసిఫాబాద్‌ నుంచి నాగార్జునకొండ వరకు, ఏటూరునాగారం అడవుల నుంచి నల్లమల పీఠభూమి వరకు ఎన్నోచోట్ల చరిత్ర పూర్వయుగం నాటి మనుషుల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆసక్తికరమైన ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు తెలంగాణ చరిత్ర అధ్యయనంలో భాగంగా తెలుసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా రాతియుగపు అవశేషాలు గుర్తించిన ప్రాంతాలు, పరిశోధనలు చేసిన వ్యక్తులు, అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలపై అవగాహన పెంచుకోవాలి.


తెలంగాణాలో చారిత్రక యుగాని కంటే పూర్వమే, సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం నుంచే మానవ మనుగడ కొనసాగుతోంది. చరిత్ర పూర్వయుగమంటే మానవ చరిత్ర నిర్మాణానికి లిఖితపూర్వక ఆధారాలు లేని యుగమని అర్థం. లిఖిత ఆధారాలు లభిస్తున్న గత 2,300 ఏళ్ల కాలాన్ని చారిత్రక యుగం అంటారు. ‘‘మానవ జీవపరిణామ క్రమాన్ని ఒక పూర్తిస్థాయి సినిమాగా తీస్తే, అందులో ఒక నిమిషం మాత్రమే చరిత్ర ఉంటుంది. మిగతా మొత్తం చరిత్ర పూర్వయుగమే ఉంటుంది’’ అని ప్రఖ్యాత చరిత్రకారుడు గార్డన్‌ చైల్డ్‌ అన్నారు.


ఆధారాలు: సుదీర్ఘమైన చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన ఆధారాలు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. 19వ శతాబ్దం మధ్యకాలంలో రాబర్ట్‌ బ్రూస్‌ ఫూట్‌ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వలిగొండలో కనుక్కున్న బృహత్‌ శిలాయుగపు సమాధులు, తెలంగాణ చరిత్ర పూర్వయుగ అధ్యయనానికి తెరతీశాయి. 1914లో ఏర్పాటైన హైదరాబాదు రాష్ట్ర పురావస్తు శాఖ.. చరిత్ర పూర్వయుగపు స్థలాలను శాస్త్రీయంగా గుర్తించింది. 1953లో ప్రచురించిన ‘యాంటిక్వేరియన్‌ రిమైన్స్‌ ఇన్‌ హైదరాబాద్‌ స్టేట్‌’ అనే పుస్తకంలో 188 స్థలాలను సంరక్షిత ప్రాంతాలుగా పేర్కొంది. అందులో ఆసిఫాబాద్, సిర్పూర్‌ (నిర్మల్‌ ప్రాంతం)లోని వృక్ష శిలాజాలు, 20 కొత్త రాతియుగపు స్థలాలు, 96 బృహత్‌ శిలాయుగపు స్థలాలు ఉన్నాయి. కొత్త రాతి యుగం కంటే ముందు యుగం గురించి అందులో పేర్కొనలేదు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పురావస్తు శాఖ వందలాది చరిత్ర పూర్వయుగ స్థలాలను గుర్తించింది. ఇందులో ఎక్కువ భాగం ముంపు సంరక్షక పురావస్తు తవ్వకాల వల్లే వెలుగుచూశాయి. ముప్పు పొంచి ఉన్న స్థలాల అధ్యయనాన్ని సాల్వేజ్‌ ఆర్కియాలజీ అంటారు.


నదీ లోయల్లోనే మానవ మనుగడ వికసించింది. తెలంగాణాలో నదులపై గత శతాబ్దం నుంచి ఆనకట్టలు కడుతూ వచ్చారు. ఆ విధంగా నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల్లో మునిగిపోయిన చారిత్రక, చరిత్ర పూర్వయుగ స్థలాలను పురావస్తు శాఖ అధ్యయనం చేసి, వాటి వివరాలను నివేదికలుగా ప్రచురించింది. పురావస్తు శాఖ సంచాలకులుగా పనిచేసిన వి.వి.కృష్ణశాస్త్రి తెలంగాణలోని అనేక చరిత్ర పూర్వయుగ స్థలాలను, ప్రత్యేకించి చిత్రలేఖనాలున్న స్థలాలను గుర్తించారు. తెలుగు విశ్వవిద్యాలయ శ్రీశైలం పీఠంలో ఆచార్యులుగా పనిచేసిన తిమ్మారెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కృష్ణా నది ఎడమ ఒడ్డున ఉన్న చరిత్ర పూర్వయుగ స్థలాలను వెలుగులోకి తెచ్చారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఎం.ఎల్‌.కె.మూర్తి పోలవరం ప్రాజెక్టులో మునిగిపోనున్న దిగువ గోదావరి లోయలోని స్థలాలను పరిశోధించారు. ఉత్తర తెలంగాణలో పారే గోదావరి లోయలో, బాసర నుంచి భద్రాచలం మధ్యలో ఉన్న ఎన్నో స్థలాలను రాజా రాంసింగ్‌ గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ పురావస్తు శాఖలో పనిచేసిన బి.సుబ్రమణ్యం 2012 నాటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రచించిన ‘తెలుగు నేలపై పురావస్తు పరిశోధనలు’ అనే పుస్తకం తెలంగాణ చరిత్ర పూర్వయుగం అధ్యయనానికి ఒక ముఖ్య ఆధారం.


కొత్త రాతియుగంలో రాగి లాంటి లోహాలను పనిముట్లుగా వాడటం ప్రారంభమైంది. రాక్షసగుళ్ల యుగంలో ఇనుప పనిముట్ల వాడటం మొదలైంది. ఈ కాలంలోనే పట్టణాలు, చిన్న రాజ్యాలు, లిపి లాంటి నాగరికతా చిహ్నాలు ఆవిర్భవించాయి. అందుకే ఈ యుగాన్ని చరిత్ర పూర్వయుగం, చారిత్రక యుగం మధ్య సంధి యుగం (ప్రొటో హిస్టరీ) అని, పురాచారిత్రక యుగమని, అయో (ఇనుము) యుగమని కూడా పిలుస్తారు. మానవులు దిగువ పాత రాతియుగంలో గులకరాయి పనిముట్లు, మధ్య పాత రాతియుగంలో రాతి పెచ్చుల పనిముట్లు, ఎగువ పాత రాతియుగంలో కొచ్చెటి పనిముట్లు, మధ్య రాతియుగంలో చిన్నచిన్న రాతి పనిముట్లు, కొత్త రాతి యుగంలో నున్నటి పనిముట్లు, రాక్షసగుళ్ల యుగంలో ఇనుప లోహ పనిముట్లు ఉపయోగించారు. 


దిగువ పాత రాతియుగం లక్షణాలు: తెలంగాణలో చిన్న చిన్న గుట్టల వరుసల పక్కన, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో కృష్ణా నది ఎడమ ఒడ్డునున్న నల్లమల అడవుల్లోని పీఠభూమిపైన దిగువ పాత రాతియుగపు ఆనవాళ్లు అనేకం కనిపించాయి. ఈ యుగపు ఆవాసాలు దిగువ గోదావరి లోయలోనూ ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి చుట్టుపక్కల 300 చ.కి.మీ. మేర రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి. సిర్పూర్‌ నుంచి నస్పూర్, మంచిర్యాల; చెన్నూరు నుంచి వేమనపల్లి వరకు, తూర్పు ఆదిలాబాద్‌ జిల్లాలో; కడెం నది ఉపనది అయిన పెద్దవాగు కుడిగట్టు మీదున్న బోధ్,  పొచ్చెర గ్రామాల్లోనూ; నిర్మల్‌ సమీపంలోని సువర్ణ నది కుడిగట్టు మీదున్న చిట్యాలలో, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఏటూరునాగారం అడవుల్లోని ఎక్కల, సెలిబాక గ్రామాల్లో; ఖమ్మం జిల్లా పాల్వంచ, చర్ల గోదావరి లోయల్లో దిగువ పాత రాతియుగపు స్థావరాలు 500 చ.కి.మీ. నుంచి 1,000 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయని ఠాకుర్‌ రాజా రాంసింగ్‌ కనుక్కున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని బోధ్,  పొచ్చెర జలపాతం; ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని గోదావరిఖని, రామగుండం; ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రాయవరం, ఏలేశ్వరం, నాగార్జునకొండ; ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చంద్రగుప్త పట్టణం, ఈర్లదిన్నె మొదలైన స్థలాలు ఈ యుగానికి చెందినవిగా గుర్తించారు. పెద్ద పెద్ద ఆకారాలతో ఉండే చేతి గొడ్డళ్లు, గోకుడు రాళ్లు, వృత్తాకారపు రాళ్లను ఈ యుగపు మనుషులు వేటలో, ఆహార సేకరణలో ఉపయోగించారు. ఈ కాలపు ఆయుధాలు ఆఫ్రికాలోని ఆష్యులియాన్‌ ప్రాంతపు ఆయుధాలను పోలిఉన్నాయి. ఆనాటి మనుషుల జీవనం ఇంచుమించు జంతువుల జీవన విధానాన్ని పోలి ఉండేది. గుహలు, పెద్దపెద్ద చెట్లతొర్రలు ఆవాసాలుగా ఉపయోగపడేవి.


మధ్య పాత రాతియుగానికి చెందిన రాతి పనిముట్లు అనేక నదీ లోయల్లో దిగువ రాతియుగపు పనిముట్లతో పాటుగా గుట్టలు గుట్టలుగా లభించాయి. ఇవి ప్రధానంగా రాతి పెచ్చులతో చేసినవి. కృష్ణానది ఎడమ ఒడ్డున ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని యాపలదేవిపాడు దగ్గర జరిపిన తవ్వకాల్లో మొదటిసారిగా ఎద్దు అస్థిపంజరం అవశేషాలు, ఈ యుగపు పనిముట్లతో పాటుగా బయటపడ్డాయి. అంటే ఆనాటి మానవులు ఎద్దులను మచ్చిక చేసినట్లు తెలుస్తోంది. ఈ యుగపు మానవులు చిన్నతరహా చేతి గొడ్డళ్లు, గండ్రగొడ్డళ్లు,  గోకుడురాళ్లను వాడారు. ఒక ముఖం, రెండు ముఖాలున్నవి, పార్శ్వంలో అంచు ఉన్నవి, వాలుగా, పుటాకార, కుంభాకార, పుటాకార-కుంభాకార రకాల అలుగులు (అరె -తోలుకు రంధ్రాలు చేసేవి), సాధాముఖం, రెండు ముఖాల కొనలున్నవి, తోక ఉన్నవి, వాలిన భుజాలు ఉన్నవి తదితర పలురకాల పెచ్చులతో చేసిన రాతి పనిముట్లను ఆనాటి మానవులు వాడారు. ఈ యుగానికి చెందిన ప్రధాన స్థలాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నల్లమల అడవుల్లో ఉన్న అప్పాపూర్, బోరాపూర్, చంద్రగుప్త పట్టణం లేదా చాకలిశిల, సలేశ్వరం, కదలీవనం, మేడిమాన్కల్, క్యాతూరు, సోమశిల, దసరాపల్లె; నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం, నాగార్జునకొండ; వరంగల్‌ జిల్లాలోని గణపవరం, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్, పొచ్చెర, నస్పూర్, మర్లవాయి; కరీంనగర్‌ జిల్లాలోని గోదావరిఖని, మేడిపల్లి, బుచ్చయ్యపల్లి, రామగుండం, మల్కాపురం మొదలైనవి ఉన్నాయి.


యుగాల వర్గీకరణ


చరిత్ర పూర్వయుగంలో మానవులు ప్రధానంగా రాతి ఆయుధాలు వాడారు. ఆ ఆయుధాలు, వాటి పరిమాణాన్ని బట్టి యుగాలను విభజించారు.తెలంగాణకు సంబంధించి చరిత్రకారుల ఆ వర్గీకరణ ఈ విధంగా ఉంది.

*  దిగువ పాత రాతియుగం: 3 లక్షల సంవత్సరాల క్రితం నుంచి 1.3 లక్షల సంవత్సరాల క్రితం వరకు

*  మధ్య పాత రాతియుగం: లక్ష సంవత్సరాల క్రితం నుంచి 20 వేల సంవత్సరాల క్రితం వరకు

*  ఎగువ పాత రాతియుగం: 20,000 - 10,000 ఏళ్ల క్రితం వరకు

*  మధ్య రాతియుగం: క్రీ.పూ.8,500 నుంచి 3,000 ఏళ్ల వరకు

*  కొత్త రాతియుగం: క్రీ.పూ. 3,000 నుంచి 1500 ఏళ్ల వరకు

*  రాక్షసగుళ్ల యుగం: క్రీ.పూ. 1,500 నుంచి క్రీ.శ.300 వరకు.


 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి 

Posted Date : 27-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌