• facebook
  • whatsapp
  • telegram

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం

ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు భరోసా!

ఈ పార్టీలో గెలవడం, ఆ పార్టీలో చేరడం. అక్కడ మంత్రి పదవి రాకపోతే మరో పార్టీలోకి మారడం. ఇటీవల ఎన్నికల సమయంలో ఈ ఊపు మరీ ఎక్కువగా కనిపించింది. పోటీ చేయడానికి టికెట్‌ ఇవ్వకపోయినా, రాదు అనే అనుమానం వచ్చినా వెంటనే పక్క పార్టీ కండువాలు వేసేసుకున్నారు. ఇవన్నీ ఓటర్ల ఆదేశాలను అణగదొక్కే అవకాశవాద రాజకీయాలు. ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీసే ప్రమాదకర చర్యలు. వీటిని అరికట్టేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలకు స్థిరత్వాన్ని చేకూర్చేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో అనర్హత వేటుకు అవకాశం ఏర్పడటంతో జంపింగ్‌ల జోరు తగ్గింది. రాజకీయ అవినీతికి, అనిశ్చితికి, అస్థిరతకు కారణమవుతున్న పార్టీ ఫిరాయింపుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి సాయపడుతున్న ఆ ఫిరాయింపుల నిరోధక చట్టంపైనా అవగాహన పెంచుకోవాలి.  


ఒక రాజకీయ పార్టీ తరఫున చట్ట సభలకు ఎన్నికైన సభ్యులు అధికార దాహంతో, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మరొక రాజకీయ పార్టీలోకి మారుతుంటారు. దీన్నే ‘పార్టీ ఫిరాయించడం’ అంటారు. దీన్ని నియంత్రించడానికి ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని’ అమలు చేస్తున్నారు. 

చారిత్రక నేపథ్యం: 1967లో హరియాణా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ‘గయాలాల్‌’ అనే శాసన సభ్యుడు ఒకే రోజులో రెండు రాజకీయ పార్టీలు మారడం, 15 రోజుల్లో మూడు రాజకీయ పార్టీలు మారడం దేశ రాజకీయాల్లో ప్రధానమైన చర్చనీయాంశమైంది. దీన్ని ఆధారంగా చేసుకుని పార్టీ ఫిరాయింపులను ‘ఆయారామ్‌ - గయారామ్‌ సంస్కృతి’ గా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రాజ్యాంగ వివరణ: రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను నియంత్రించే లక్ష్యంతో 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్‌ను చేర్చి, దానిలో ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని’ వివరించింది. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించి, బలోపేతం చేయడం. ‘ప్రజా జీవన ప్రక్షాళనలో ఇది మొదటి అడుగు’ అని రాజీవ్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఆర్టికల్స్‌ 101, 102 190, 191ల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి పేర్కొన్నారు.

చట్టంలోని ముఖ్యాంశాలు: ‘సభ’ అంటే పార్లమెంటులోని ఉభయ సభలు లేదా రాష్ట్ర శాసనసభ అని అర్థం. దీని ప్రకారం చట్ట సభలకు ఎన్నికైన సభ్యులను పలు సందర్భాల్లో అనర్హులుగా ప్రకటిస్తారు.

* ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు.

* స్వతంత్ర అభ్యర్థిగా చట్ట సభకు ఎన్నికైన సభ్యుడు తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరినప్పుడు.

* సభలో తన పార్టీ జారీ చేసిన ఆదేశాలకు (విప్‌) విరుద్ధంగా సభ్యుడు ఓటువేసినా, సభకు గైర్హాజరైన సందర్భంలో.

* సభకు నామినేట్‌ అయిన సభ్యుడు నామినేట్‌ అయిన రోజు నుంచి 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు.

మినహాయింపులు:  ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీలో విలీనమైనప్పుడు ఆ పార్టీకి చెందిన సభ్యులకు ఈ చట్టం ప్రకారం అనర్హత వర్తించదు.

* ఒక రాజకీయ పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు వేరొక రాజకీయ పార్టీలోకి మారినప్పుడు వారికి కూడా ఈ చట్టం వర్తించదు.

* లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, విధాన సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధాన పరిషత్‌ ఛైర్మన్, డిప్యూటీ ఛైౖర్మన్‌లు తమ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పటికీ ఈ చట్టం ప్రకారం అనర్హత వర్తించదు.

సభాధ్యక్షులకే నిర్ణయాధికారం: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యుల అనర్హతలను ప్రకటించే నిర్ణయాధికారం ఆయా సభాధ్యక్షులకే ఉంటుంది. లోక్‌సభ సభ్యుల అనర్హతలను లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ సభ్యుల అనర్హతలను రాజ్యసభ ఛైర్మన్, విధానసభ సభ్యుల అనర్హతలను విధానసభ స్పీకర్, శాసన మండలి సభ్యుల అనర్హతలను శాసన మండలి ఛైర్మన్‌ ప్రకటిస్తారు.

*  పార్టీ ఫిరాయింపు, పార్టీలో చీలిక, పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి ఓటు వేయడం మొదలైన అంశాలు వివాదస్పదంగా మారినప్పుడు ఈ వివాదాలపై అంతిమ నిర్ణయాధికారం సభాధ్యక్షులదే.

సభాధ్యక్షుల నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేయగలిగిన సందర్భాలు:

ఎ) ఎలాంటి ఆధారాలు లేకుండా సభాధ్యక్షులు రాజకీయ పార్టీ విలీనానికి అంగీకరించినప్పుడు

బి) సభ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో సభాధ్యక్షులు విఫలమైనప్పుడు

సి) ఫిర్యాదులపై సభాధ్యక్షులు తగిన నిర్ణయాన్ని తీసుకోవడంలో అలసత్వం వహించినప్పుడు.

సభాధ్యక్షులకే నియమాలను రూపొందించే అధికారం:  రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకు అవసరమైన నియమాలను రూపొందించే అధికారం సభాధ్యక్షులకు ఉంటుంది. అవి-

ఎ)  చట్ట సభలోని సభ్యులు ఒక రాజకీయ పార్టీలో చేరినప్పుడు సంబంధిత విషయాన్ని ఆ రాజకీయ పార్టీ ఎవరికి, ఎప్పటి లోపల రిపోర్ట్‌ చేయాలనే అంశాలపైన. 

బి) ఫిరాయింపులకు పాల్పడిన పార్టీకి చెందిన సభ్యుడిని క్షమించే విషయాల గురించి ఆ పార్టీ నాయకుడు ఎన్ని రోజుల్లోగా ఎవరికి పంపాలనే అంశాలపైన.

సి) ఈ అంశాలు/నియమాలు సభ ఆమోదం పొందిన తర్వాత 30 రోజుల నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నియమాలను ఎవరైన సభ్యులు ఉల్లంఘిస్తే సభా ఉల్లంఘనగా భావించి సభాధ్యక్షులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003:  వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 91వ రాజ్యాంగసవరణ చట్టం-2003 ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించింది. అది 2004 నుంచి అమల్లోకి వచ్చింది.

ముఖ్యాంశాలు:

* ఆర్టికల్, 75 (I A) ప్రకారం కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య ప్రధానమంత్రితో కలిపి లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. 

* ఎవరైనా పార్లమెంటు సభ్యుడిని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హుడిగా ప్రకటిస్తే, ఆ సభ్యుడు ఆ సభా కాలంలో మంత్రి పదవిని చేపట్టానికి అనర్హుడు.

* ఆర్టికల్‌ 164(IA) ప్రకారం రాష్ట్రమంత్రి మండలి సభ్యుల సంఖ్య ముఖ్యమంత్రితో కలిపి విధానసభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. చిన్న రాష్ట్రాల్లో మంత్రిమండలి సభ్యుల సంఖ్య ముఖ్యమంత్రితో కలిపి 12 మందికి తక్కువ ఉండకూడదు.

* ఎవరైనా శాసన సభ్యుడిని (ఎంఎల్‌ఏ/ఎంఎల్‌సీ) ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హుడిగా ప్రకటిస్తే, ఆ సభ్యుడు ఆ సభా కాలంలో మంత్రి పదవిని చేపట్టడానికి అనర్హుడు.

ఫిరాయింపుల నిరోధక చట్టం అనర్హులుగా ప్రకటించిన పార్లమెంటు/శాసన సభ్యులు ఎలాంటి లాభదాయక పదవులను చేపట్టడానికి వీల్లేదు. 

అనర్హతకు గురైన మొదటి సభ్యుడు:  పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతకు గురైన మొదటి సభ్యుడు ‘లాల్‌ డుహెమా’. ఇతడు 1984లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1986లో ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడంతో 1988, నవంబరు 24న లోక్‌సభ స్పీకర్‌ ఇతడిని అనర్హుడిగా ప్రకటించారు.

* ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతకు గురైన మొదటిశాసన సభ్యుడు కూడా డుహెమానే. ఇతడు 2018లో మిజోరం శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. తర్వాత ‘జోరాం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌’  పార్టీలో చేరడంతో 2020లో డుహెమాను అనర్హుడిగా ప్రకటించారు.

‘‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన కేసుల పరిష్కారానికి న్యాయ వ్యవస్థను ఆశ్రయించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సభాధ్యక్షులకు న్యాయపరమైన అంశాలు, చట్టాలపై సమగ్రమైన అవగాహన, 
పట్టు ఉండకపోవచ్చు.అందువల్ల ఈ కేసులపై సుప్రీం లేదా హైకోర్టు  న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వడమే సమంజసం.’’

 - మాజీ లోక్‌సభ స్పీకర్‌ శివరాజ్‌ పాటిల్‌

‘‘చికిత్స ఎప్పుడూ వ్యాధి కంటే ఘోరంగా ఉండకూడదు.’’

- మాజీ అటార్నీ జనరల్‌ సోలి జె సొరాబ్జీ (‘ద టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ వ్యాసంలో)

సుప్రీం కోర్టు తీర్పులు

కిహోట హాల్లో హాన్‌ వర్సెస్‌ జాచిల్హూ కేసు (1993):  ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల అనర్హతలను ప్రకటించడంలో స్పీకర్‌దే తుదినిర్ణయం కాదని పేర్కొంది. స్పీకర్‌ నిర్ణయం న్యాయసమీక్షకు లోబడి ఉంటుంది. సభాధ్యక్షుల నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలుచేయడం రాజ్యాంగబద్ధమేనని చెప్పింది.

జి.విశ్వనాథన్‌ వర్సెస్‌ తమిళనాడు శాసనసభ స్పీకర్‌ (1996): చట్టసభ సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు అతడిని ఆ సభకు చెందని వ్యక్తిగా పరిగణించాలి. కానీ, తను పాత రాజకీయ పార్టీలో సభ్యుడిగానే కొనసాగుతాడు. ఒకవేళ అతడు వేరొక రాజకీయ పార్టీలో చేరితే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు పరిగణిస్తారు. కాబట్టి ఆ సందర్భంలో ఆ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించవచ్చు.

కులదీప్‌ నాయర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (2006):  రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర శాసన సభ్యుడు తన పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఓటువేస్తే 10వ షెడ్యూల్‌ ప్రకారం అనర్హత వర్తించదని, రాష్ట్ర శాసనమండలి సభ్యుల ఎన్నిక విషయంలో మాత్రం అనర్హత వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

రచయిత: బంగారు సత్యనారాయణ 
 

Posted Date : 10-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌