• facebook
  • whatsapp
  • telegram

బిల్లులు - వివరణ

చట్టాల తయారీలో సభాపర్వం!

ప్రజల ఆకాంక్షలు, కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఎప్పటికప్పుడు పార్లమెంటు కొత్త చట్టాలను  చేస్తుంది. ఒక చట్టాన్ని రూపొందించేందుకు ముందు ఉభయ సభల్లో ముసాయిదా బిల్లు ప్రవేశపెడతారు. ఆ బిల్లులు రకరకాలుగా ఉంటాయి. వాటి గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. ఆ ప్రక్రియలపై, సాంకేతిక పదజాలంపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే సాధారణ, ద్రవ్య, ఆర్థిక బిల్లులు, పబ్లిక్, ప్రైవేట్‌ బిల్లుల రకాలు, నిర్వచనాలు, సంబంధిత రాజ్యాంగ నిబంధనలు, మౌలికాంశాలపై అవగాహన పెంచుకోవడం అవసరం. 

భారతదేశంలో ‘బిల్లులు’ పార్లమెంటులోని ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభలు అంగీకరించిన అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్రతో ‘శాసనాలు’గా మారతాయి.


సాధారణ బిల్లులు:

ఆర్టికల్‌ 107: సాధారణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో శాసనంగా మారుతుంది.

ఆర్టికల్‌ 108: రాష్ట్రపతి పలు సందర్భాల్లో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు.

* ఒక సాధారణ బిల్లును ఒక సభ ఆమోదించి, రెండో సభ తిరస్కరించినప్పుడు. 

* ఒక సభ ఆమోదించిన బిల్లును రెండో సభ 6 నెలలకుపైగా ఆమోదించకుండా నిలువరించినప్పుడు. 

* బిల్లులో ప్రతిపాదించిన సవరణల విషయంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు. 

* పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్‌ అందుబాటులో లేకపోతే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. ఆ వ్యక్తి కూడా అందుబాటులో లేకపోతే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ అధ్యక్షత వహిస్తారు.

* పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం కేవలం సాధారణ బిల్లుల ఆమోద ప్రక్రియల సందర్భంలో మాత్రమే ఏర్పాటవుతుంది. ద్రవ్యబిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోద ప్రక్రియల్లో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించాలంటే రెండు సభల్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో పదో వంతు (10%) సభ్యుల కోరం ఉండాలి. సమావేశం నిర్వహణ లోక్‌సభలోని నియమావళి ప్రకారం ఉంటుంది. సమావేశంలో సభ్యులు హాజరై ఓటింగ్‌లో పాల్గొని, సాధారణ మెజార్టీతో బిల్లులను ఆమోదిస్తే రెండు సభలు ఆమోదించినట్లుగా పరిగణిస్తారు. అనంతరం ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే చట్టంగా మారుతుంది.


ద్రవ్య బిల్లులు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 110 ద్రవ్య బిల్లుల గురించి నిర్వచించింది. భారత సంఘటిత నిధిపై భారం మోపే ప్రతి బిల్లును ద్రవ్య బిల్లుగా పేర్కొంటారు. రాష్ట్రపతి పూర్వానుమతితో ముందుగా లోక్‌సభలో మాత్రమే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టాలి. దీనిని పబ్లిక్‌ బిల్లుగా పరిగణిస్తారు. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించిన అనంతరం రాజ్యసభ ఆమోదం కోసం పంపుతారు. రాజ్యసభ 14 రోజుల్లోగా ఈ బిల్లుపై తన అభిప్రాయాన్ని/ ఆమోదాన్ని తెలియజేయాలి.


ద్రవ్య బిల్లుపై రాజ్యసభ అధికారాలు:  ద్రవ్య బిల్లుపై రాజ్యసభకు కేవలం నామమాత్రపు అధికారాలే ఉన్నాయి. ఈ బిల్లుపై రాజ్యసభ చర్చించవచ్చు. కొన్ని సిఫార్సులు చేయవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదించవచ్చు. ‘ద్రవ్య బిల్లు’ను తిరస్కరించే అధికారంలేదా సవరించే అధికారం రాజ్యసభకు లేదు. ద్రవ్య బిల్లుపై రాజ్యసభ 14 రోజుల్లోగా నిర్ణయాన్ని వెల్లడించాలి. లేకపోతే బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణించి, రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపుతారు. 

*  ఆర్టికల్‌ 110(1) ప్రకారం పన్నుల విధింపు, రద్దు, తగ్గింపు, మార్పు చేయడం, క్రమబద్ధీకరించడం మొదలైన అంశాల్లో ఏ ఒక్క అంశం ఉన్నా దాన్ని ‘ద్రవ్య బిల్లు’గా పేర్కొంటారు.


* ఆర్టికల్‌ 110(2) ప్రకారం జరిమానాలు, లైసెన్స్‌ ఫీజులు, స్థానిక  స్వపరిపాలనా సంస్థలు విధించే సుంకాలు ఉన్నంత మాత్రాన దాన్ని ద్రవ్యబిల్లుగా పరిగణించరు. 

 

*  ఆర్టికల్‌ 110(3) ప్రకారం ఒక బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? అనే ప్రశ్న వచ్చినప్పుడు లోక్‌సభ స్పీకర్‌ తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఆ అధికారం స్పీకర్‌కే ఉంటుంది. ఆ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో లేదా పార్లమెంటులో సవాలు చేయడానికి వీల్లేదు. రాష్ట్రపతి కూడా దీనిపై ప్రశ్నించకూడదు. ప్రతి ద్రవ్య సంబంధ బిల్లుని ప్రభుత్వ బిల్లుగా పరిగణిస్తారు. దీనిని మంత్రివర్గ సభ్యుడు మాత్రమే సభలో ప్రవేశపెట్టాలి. 

 

* ఆర్టికల్‌ 110(4)ను అనుసరించి ద్రవ్య బిల్లును ఆర్టికల్‌ 109 ప్రకారం రాజ్యసభకు పంపేటప్పుడు, ఆర్టికల్‌ 111 ప్రకారం రాష్ట్రపతి ఆమోదానికి పంపేటప్పుడు సంబంధిత బిల్లును ద్రవ్య బిల్లుగా లోక్‌సభ స్పీకర్‌ ధ్రువీకరించాలి.


ఆర్థిక బిల్లు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 117 ఆర్థిక బిల్లుల గురించి వివరిస్తుంది. ప్రభుత్వ ఆదాయం, వ్యయానికి సంబంధించిన ప్రస్తావన ఉన్న బిల్లులను ‘ఆర్థిక బిల్లులు’ అంటారు. వీటిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు.


మొదటి తరగతి ఆర్థిక బిల్లు: ఈ బిల్లులో కేంద్ర ప్రభుత్వం రుణాలను సేకరించే నియమ నిబంధనలు ఉంటాయి. దీనిని రాష్ట్రపతి పూర్వానుమతితో లోక్‌సభలో ప్రవేశపెట్టాలి. ఇది లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో ఓటింగ్‌కు వచ్చినప్పుడు సాధారణ బిల్లుగానే పరిగణించి, రాజ్యసభ కూడా లోక్‌సభతో సమానంగా అధికారాలను కలిగి ఉంటుంది. బిల్లును సవరించే ప్రక్రియను రాజ్యసభ సూచించవచ్చు లేదా బిల్లును తిరస్కరించవచ్చు. ఆమోదించే క్రమంలో ఉభయ సభల మధ్య అంగీకారం కుదరకపోతే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు.


రెండో తరగతి ఆర్థిక బిల్లు: ఈ బిల్లులో కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలు ఉంటాయి. ఆర్టికల్‌ 110లో పేర్కొన్న అంశాలు ఉండవు. ఈ బిల్లును సాధారణ బిల్లుగానే పరిగణించవచ్చు. పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ తరహా బిల్లును రాజ్యసభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆమోదించే క్రమంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. నీ ద్రవ్య బిల్లులను, మొదటి తరగతి ఆర్థిక బిల్లులను కేవలం రాష్ట్రపతి సిఫార్సుతో మాత్రమే లోక్‌సభలో ప్రవేశపెట్టాలి. 

* రెండో తరగతి ఆర్థిక బిల్లులను, సాధారణ బిల్లులను రాష్ట్రపతి ముందస్తు అనుమతితో సంబంధం లేకుండానే పార్లమెంటు ఉభయ సభల్లో ఎందులో అయినా ప్రవేశపెట్టవచ్చు.


వార్షిక బడ్జెట్‌: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 112 ‘వార్షిక బడ్జెట్‌’(Anual Financial Statement) గురించి వివరిస్తుంది. బడ్జెట్‌ అనేది ఒక రకమైన ఆర్థిక బిల్లు. వార్షిక ఆదాయ, వ్యయాల అంచనాల విత్త పట్టికను ‘బడ్జెట్‌’ అంటారు. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. ఈ విధానం 1863 నుంచి కొనసాగుతోంది. స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్‌ను 1947లో నాటి ఆర్థిక మంత్రి ఆర్‌.కె.షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు. 1921లో విలియం ఆక్వర్త్‌ కమిటీ సూచనల మేరకు 1924 నుంచి సాధారణ వార్షిక బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేశారు. 2017లో దెబ్రాయ్‌ కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్‌ను వార్షిక బడ్జెట్‌లో విలీనం చేశారు.


* వార్షిక బడ్జెట్‌లో వ్యయ అంచనాలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు. అవి 

1) భారత సంఘటిత నిధి నుంచి చెల్లించే వ్యయాలు. 

2) భారత సంఘటిత నిధి నుంచి తీసుకునే వ్యయాలు.

భారత సంఘటిత నిధి నుంచి చెల్లించే వ్యయాలు: 

* రాష్ట్రపతి జీతభత్యాలు, రాష్ట్రపతి కార్యాలయ ఖర్చులు, రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ జీతభత్యాలు. 

*  సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తుల జీతభత్యాలు, పెన్షన్, హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్‌.నీ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యుల జీతభత్యాలు, పెన్షన్‌.నీ భారత ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలు, రుణాలపై వడ్డీ.

* ఏదైనా న్యాయస్థానం లేదా ట్రైబ్యునల్‌ ఇచ్చే తీర్పును అమలు చేయడానికి అయ్యే ఖర్చులు, సుప్రీంకోర్టు, కాగ్, యూపీఎస్సీకి సంబంధించిన పాలనా ఖర్చులు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్‌లు.


భారత సంఘటిత నిధి నుంచి తీసుకునే వ్యయాలు: 

పార్లమెంటులో బడ్జెట్‌ ద్వారా ప్రవేశపెట్టే ‘డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌’లో ఉండే 109 రకాల ఖర్చులపై ఓటింగ్‌ నిర్వహించవచ్చు. ఆ సందర్భంలో ఖర్చులు తగ్గించుకోమని సూచిస్తూ కోత తీర్మానాలను కూడా ప్రవేశపెట్టవచ్చు. ఈ కోత తీర్మానాలు 3 రకాలుగా ఉంటాయి. అవి 

1) విధాన కోత తీర్మానం 

2) పొదుపు కోత తీర్మానం 

3) టోకెన్‌ కోత తీర్మానం.

వార్షిక బడ్జెట్‌ ఆమోదంలో 6 దశలు ఉంటాయి. అవి 

1) ప్రవేశ దశ 

2) సాధారణ చర్చ 

3) డిపార్ట్‌మెంట్‌ స్టాండింగ్‌ కమిటీల ద్వారా పరిశీలన 

4) గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగ్‌ 

5) ఉపకల్పన బిల్లు ఆమోదం 

6) ద్రవ్య బిల్లు ఆమోదం.


వార్షిక బడ్జెట్‌తో పాటు ఆమోదించే ఇతర గ్రాంట్లు: సాధారణ ఆదాయ, వ్యయ అంచనాలతో ఉండే వార్షిక బడ్జెట్‌తోపాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పార్లమెంటు కొన్ని ఇతర గ్రాంట్లను కూడా ఆమోదిస్తుంది. అవి  

1) అనుబంధ గ్రాంట్లు 

2) అదనపు గ్రాంట్లు 

3) ఎక్సెస్‌ గ్రాంట్లు 

4) నామమాత్రపు గ్రాంట్లు 

5) ఓట్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌.



 

 

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 18-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌