• facebook
  • whatsapp
  • telegram

కులవ్యవస్థ

సామరస్య సామాజిక సమూహాలు!

 

హిందూ సామాజిక నిర్మాణం మూలాల్లో కులవ్యవస్థ ప్రధానమైనది. వ్యక్తులను, వారి సామాజిక స్థాయిని గుర్తించేందుకు ఆర్యులు అప్పట్లో ఆ విధమైన ఏర్పాట్లు చేశారు. ఒకే తరహా జీవనవిధానం, వృత్తి, ఆహార అలవాట్లు, అంతర్వివాహాలు ఉన్న సమూహాలు కులాలుగా స్థిరపడ్డాయి. తర్వాత కాలంలో పుట్టుక ఆధారంగా కులం నిర్ణయం కావడం మొదలవడంతో, అది సామాజికంగా, రాజకీయంగా ప్రభావపూరిత శక్తిగా మారింది.  దేశంలో కులం పుట్టిన తీరు, దాని లక్షణాలు, అందులో వర్ణం, జాతి వంటి అంశాల ప్రాధాన్యం, చాతుర్వర్ణాల ఆవిర్భావం, ఇతర పరిణామాల గురించి అభ్యర్థులకు పరిజ్ఞానం ఉండాలి. సమాజంలో తలెత్తిన అసమానతలు, కులాల ఆధిపత్యం, కులవివక్ష తదితర సామాజిక సమస్యలకు మూలాలను తెలుసుకోడానికి కులవ్యవస్థ లక్షణాలు, పుట్టుకపై ఉన్న సిద్ధాంతాలనూ తెలుసుకోవాలి.

 


  భారతదేశంలో కులవ్యవస్థ రూపంలో ఒక ప్రత్యేకమైన సామాజిక స్తరీకరణ కనిపిస్తుంది. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లోనూ కులం లక్షణాలు కొన్ని ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న కులవ్యవస్థ విశిష్టమైనది. హిందూ సామాజిక వ్యవస్థ కులవిధానం మీదే ఆధారపడి ఉంది. కులానికి సరళత ఉండదు. అందుకే ఏ వ్యక్తీ తన కులాన్ని మార్చుకోలేడు.


ప్రతి కులానికి ఒక హోదా ఉంటుంది. దాని ప్రకారం కులాలన్నీ ఒక క్రమశ్రేణిలో అమర్చి ఉంటాయి. కొన్ని కులాలు ఎక్కువ హోదాతో పై అంతస్తులో ఉంటే, కొన్ని కులాలు తక్కువ హోదాతో కింది అంతస్తులో ఉంటాయి. ఈ రెండింటి మధ్య అనేక కులాలు వివిధ అంతస్తుల్లో ఉంటాయి. కులం పుట్టుకతో సంక్రమిస్తుంది. ఆ కులంలో పుట్టినవారికి కులశ్రేణి హోదా పుట్టుకతో వస్తుంది. ప్రయత్నం, ప్రార్థన, సంపద వంటివేవీ పుట్టుకతో వచ్చిన కుల అంతస్తును మార్చలేవు. ఈ అంశంలో కులవ్యవస్థ కఠినమైనది.


వర్ణం, జాతి:  మన దేశంలో కులవ్యవస్థను పాశ్చాత్యులు మొదట జాతి సంబంధమైన, జన్మ సంబంధమైన వ్యవస్థగా పరిగణించారు. ఈ భావనతోనే మొదట పోర్చుగీసువారు, వారి భాషలో ‘కాస్ట’ అనే పదాన్ని ఉపయోగించేవారు. ‘కాస్ట’ అంటే వంశపారంపర్య లక్షణాల సంక్లిష్ట రూపం. ఆ తర్వాత వచ్చిన ఆంగ్లేయులు వాడిన ‘కాస్ట్‌’ అనే పదం ‘కాస్ట’ పదం నుంచే వచ్చింది.


 ‘‘ఒకే ఇతిహాస పూర్వీకుడి వంశంగా భావిస్తూ, వంశానుగతంగా అనేక వృత్తులు చేసి, ఒకే సామరస్యపూరిత సమూహంగా ఉంటూ, ఒకే నామం ఉన్న కుటుంబాలు లేదా సమూహాల చీలికే వర్ణం.‘‘  -హెర్బర్ట్‌ రిస్లే 


కులాన్ని వ్యవహారికంగా వర్ణం అని కూడా అంటారు. వర్ణం అంటే రంగు. 2000-1500 బి.సి మధ్య కాలంలో భారతదేశంపైకి దండెత్తి వచ్చిన ఆర్యులు, వారి భౌతిక ఆకారంలో ముఖ్యంగా రంగులో భారతీయులకు భిన్నంగా ఉన్నారు. ఆర్యులు తెలుపు రంగులో ఉంటే, స్థానికులైన భారతీయులు నల్లగా ఉన్నారు. మంచి వర్ణంలో ఉండటం ఆర్యుల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసింది. నల్ల రంగున్న స్థానికుల నుంచి దూరంగా ఉండేవారు. ఈ ధోరణి సమాజాన్ని శరీర రంగు ఆధారంగా రెండుగా తరగతులుగా విభజించింది. ఈ తరగతులనే వర్ణంగా పిలిచేవారు. ఆర్యులు తమను శ్వేతవర్ణంగా, స్థానిక ప్రజలను దస్య వర్ణంగా (నలుపు రంగు తరగతి) పేర్కొన్నారు. మొట్టమొదటి హిందూ సమాజంలో ఈ అర్థంతోనే వర్ణ విభజన జరిగినట్టు తెలుస్తోంది. ఆర్యులకు, దస్యులకు మధ్య శరీరచ్ఛాయలోని భేదం కారణంగా రెండు వర్ణాలు ఏర్పడ్డాయని ఆచార్య పి.ఎన్‌.ప్రభు వివరించాడు. ఆర్యులకు, ద్రావిడులకు ఉన్న వర్ణ విభేదాలను శూద్రులకు అన్వయింపజేసే వారని ఘర్వే పేర్కొన్నారు.


కాలక్రమంలో ఆర్యవర్గం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అనే మూడు తరగతులుగా ఏర్పడింది. బోధన వృత్తిని బ్రాహ్మణులు, విదేశీ దండయాత్రల నుంచి ప్రజలను రక్షించే బాధ్యతను క్షత్రియులు, వ్యాపార వాణిజ్యాలను వైశ్యులు స్వీకరించారు. దాసులను శూద్రులుగా పేర్కొంటూ, మొదటి మూడు తరగతుల వారికి సేవలందించాలని నిర్దేశించారు. ఉన్నత వర్ణాల వారికి సేవ చేసేందుకే శూద్రులను భగవంతుడు సృష్టించాడని పాలకులుగా ఉన్న ఆర్యులు ప్రకటించారు.


* శరీర రంగు భేదాలను ప్రకటించేందుకు మొదట్లో వాడిన ‘వర్ణం’ పదం క్రమంగా ఆ అర్థాన్ని కోల్పోయింది. ప్రకార్య విభజన కోసం సమాజంలో ఏర్పరిచిన నాలుగు తరగతులను వర్ణాలుగా పిలవడం ప్రారంభమైంది. మహాభారతంలోని శాంతి పర్వంలో భృగు మహర్షి వర్గాల పుట్టుకను వర్ణించాడు. భగవంతుడు మొట్టమొదట బ్రాహ్మణులకు మాత్రమే సృష్టించాడని, ఆ తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్రులు ఏర్పడినట్లు చెప్పాడు. శ్వేతవర్ణులు బ్రాహ్మణులు, లోహిత (ఎర్ర రంగు) వర్ణులు క్షత్రియులు, పసుపు వర్ణులు వైశ్యులు, ఆశ్రిత (నల్లని) వారు శూద్రులని పేర్కొన్నాడు. తర్వాత వర్ణ విభజన చేసేది శరీర ఛాయ కాదని పుట్టుకతో ప్రతి వ్యక్తి శూద్రుడని, అతడు సముపార్జించుకునే గుణాల ఆధారంగా ఆ నాలుగు వర్ణాల్లో ఏదో ఒక వర్గానికి చెందుతాడని హిందూ శాస్త్రకారులు వివరించారు. ఈ నాలుగు వర్ణాలు బ్రహ్మ శరీర అంగాల నుంచి ఉద్భవించాయని మను ధర్మశాస్త్రం పేర్కొంటోంది. 

కులవ్యవస్థ లక్షణాలు: పురాతన, ఆధునిక భారతదేశంలో కులవ్యవస్థ అనేది ఒక ప్రత్యేక స్తరీకరణ పద్ధతి. అది భారతీయుల ఆర్థిక, రాజకీయ, సామాజిక జీవితాల్లో కీలకపాత్ర నిర్వహిస్తోంది. కులాన్ని సమాజ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు.


* ఒకే మూల పురుషుడిని కలిగి, ఒకే వారసత్వ వృత్తిని పాటిస్తూ, అంతర్వివాహాన్ని మాత్రమే చేసుకుంటూ, ఒకే పేరుతో చెలామణి అయ్యే కొన్ని కుటుంబాలు లేదా బంధు సమూహాలనే కులం అంటారు.


బోగెల్‌ ప్రకారం సంఘాన్ని వంశపారంపర్య సమూహాలుగా కులవ్యవస్థ విడదీస్తుంది. ఈ సమూహాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. మళ్లీ కొన్నిరకాల సంబంధాలనూ కలిగి ఉంటాయి. వాటి ముఖ్య లక్షణాలను పరిశీలిస్తే వివాహాల్లో, సంపర్కాల్లో, భోజన విషయాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇచ్చిపుచ్చుకోవడాల్లో వ్యత్యాసం ప్రదర్శిస్తాయి. శ్రమవిభజన సూత్రం ప్రకారం ప్రతి సమూహానికి సంప్రదాయసిద్ధంగా ఒక వృత్తి ఉంటుంది. ఆ వృత్తిని కొన్ని సందర్భాల్లో కొంతవరకు వదిలిపెడతాయి. ఆ విధంగా ఒకే అంతస్తుల క్రమంలో ఉన్నత, అల్పశ్రేణులుగా ఏర్పడి ఉంటాయి.


* కులం రెండు ముఖ్య లక్షణాలున్న సాంఘిక సమూహం అని కేట్కర్‌ అభిప్రాయం. మొదటిది సభ్యత్వం. సభ్యులకు జన్మించిన వాళ్లకే సభ్యత్వం ఉంటుంది. రెండోది తమ సమూహ సభ్యులు కానివారిని వివాహం చేసుకోవడం నిషిద్ధం. ప్రతి సమూహానికి ఒక నామధేయం ఉంటుంది.


* ఒక కుటుంబంలో జనన మరణాల విషయంలో రక్తసంబంధీకులంతా మైలను ఆచరించడంలో, పాటించడంలో కులానికి, కులానికి మధ్య వ్యత్యాసాలున్నాయి. దక్షిణ భారతదేశంలో శిశువు జన్మించినప్పుడు జనన ఆశుచి బ్రాహ్మణుల్లో 10 రోజులు, క్షత్రియ కులాల్లో 11 రోజులు, నాయర్‌ కులంలో 15 రోజులు, కురిచ్చియన్‌ కులంలో 28 రోజులు పాటించాలి. శ్వాసకు సంబంధించిన విశ్వాసాల ద్వారా కూడా మలినం పాటించేవారు. అందుకే రాజసేవకులు, దేవాలయాల్లో పనిచేసే కింది కులస్థులు నోటికి, ముక్కుకు అడ్డంగా వస్త్రం కట్టుకోవాలి. కులాల మధ్య సామాజిక సంబంధాలు కఠినతరంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనం. 


కుల సంఘాలు: ప్రతి కులానికి ఒక సంఘం ఉంటుంది. కుల సంఘాలు కుల నిబంధనలను పరిరక్షిస్తుంటాయి. కులంలోని వ్యక్తుల ప్రవర్తనను నియంత్రిస్తుంటాయి. కుల సంస్కృతిని కాపాడతాయి. కుల వ్యక్తులకు రక్షణ, భద్రత కల్పిస్తాయి. సభ్యులు పాటించాల్సిన నియమ నిబంధనలను నిర్ణయిస్తాయి. వాటిని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు. కుల సంఘాలు చిన్న ప్రాంతాల్లో ఉంటాయి.


కులవ్యవస్థ పుట్టుక:  కులవ్యవస్థ పుట్టుక గురించి అనేక సిద్ధాంతాలున్నాయి.


1) మతపరమైన సిద్ధాంతం: చాతుర్వర్ణాలు కులవ్యవస్థకు మూలాలు. అది దైవ నిర్మితమని హిందువుల నమ్మకం. చాతుర్వర్ణాల ప్రసక్తి హిందూ మత ప్రాచీన సాహిత్యంలో చాలాచోట్ల ఉంది. కులవ్యవస్థ, దాని పరిణామ వికాసాల ప్రస్తావన మనుసంహితలో ఉంది. నాలుగు వర్ణాలను బ్రహ్మ ఏర్పరిచాడని వివరిస్తుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు భగవంతుడి నిర్దేశాలని రుగ్వేదంలోని పురుష సూక్తం చెబుతుంది. వర్ణ వ్యవస్థను, వర్ణ ధర్మాలను భగవంతుడే నిర్ణయించినట్లు భగవద్గీతలో ఉంది. అయితే ఆ  వర్గాలే కాకుండా ఇతర కులాల పుట్టుకల గురించి మనుసంహితలో, గౌతమ సంహితలో సమాచారం దొరుకుతుంది. చాతుర్వర్ణాలే కాకుండా 134 కులాల ప్రసక్తి ప్రాచీన భారతీయ శాస్త్రాల్లో ఉన్నట్లు విల్సన్‌ పేర్కొన్నాడు.


2) వృత్తి సిద్ధాంతం: వృత్తి ప్రాతిపదికన కులవ్యవస్థ ఏర్పడిందని భావించిన వారిలో నెస్‌ఫీల్డ్‌ ముఖ్యుడు. ఇతడి అభిప్రాయంలో కులవ్యవస్థ మతప్రభావంపై ఆధారపడి సృష్టించింది కాదు. పూర్వకాలంలో ఒకే వృత్తి చేసే వారంతా కలిసి ఒక ప్రత్యేక వృత్తి సంఘంగా ఏర్పడ్డారు. కాలక్రమేణా వంశపారంపర్యంగా అదే వృత్తిని స్వీకరించడం వల్ల వృత్తుల ఆధారంగా వేర్వేరు కులాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా వృత్తుల వల్ల ఏర్పడిన కులాల అంతస్తుల్లోనూ హెచ్చుతగ్గులు ఉన్నాయి.


3) జాతి సిద్ధాంతం: హెర్బర్ట్‌ రిస్లీ అనే శాస్త్రవేత్త తన ‘ద పీపుల్‌ ఆఫ్‌ ఇండియా’ గ్రంథంలో జాతి వ్యత్యాసాల మీద కులవ్యవస్థ రూపొందిందని సిద్ధాంతీకరించాడు. శరీర ఛాయ, ఒడ్డు, పొడవు మొదలైన శారీరక లక్షణాల్లో వ్యత్యాసాలున్న వ్యక్తులు వివిధ సమూహాలుగా ఏర్పడ్డారు. ఆ సమూహాలే కులాలుగా మార్పు చెందాయి. శారీరక లక్షణాలు జాతికి సంబంధించినవి. ఈ లక్షణాల్లో వివిధ కులాల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తాయి.


4) సంస్కారాల సిద్ధాంతం: ఎ.ఎమ్‌.హెకార్ట్‌ తన ‘ఇండియా అండ్‌ ది పసిఫిక్‌’ గ్రంథంలో సంస్కార సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భారతదేశంలో కులవ్యవస్థ మత సంస్కారాల నిర్వహణలో వ్యక్తుల మధ్య ఏర్పడిన సంబంధాలపై ఆధారపడిందని అభిప్రాయపడ్డాడు. రంగులకు తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు వంటి సంజ్ఞలు ఏర్పడినట్లే మత సంస్కార సంబంధమైన విధులు నిర్వహించడానికి నిర్దేశించిన వ్యక్తులకు వారి విధుల ఆధారంగా కుల సంజ్ఞలు వచ్చాయి. ఉదాహరణకు మంత్రాలు చదవడం, మేళతాళాలు వాయించడం, నివేదనకు మట్టి పాత్రలు తయారు చేయడం, కాగడాలు పట్టడం, పల్లకీ మోయడం మొదలైన పనులు లేకుండా మతానికి సంబంధించిన ఏ ఉత్సవం జరగదు. ఈ విధులు నిర్వహించడంలో వివిధ కులాల వారు నేటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మత సంబంధమైన ఈ విధులను వంశానుక్రమంగా వ్యక్తులు నిర్వహించడం వల్ల కులవ్యవస్థ దృఢపడిందని ఈ సిద్ధాంతం చెబుతోంది.


5) భౌగోళిక సిద్ధాంతం: భౌగోళిక వ్యత్యాసాలే కులవ్యవస్థకు మూలమని గిల్బర్ట్‌ తన ‘ది ఆరిజన్‌ ఆఫ్‌ ది క్యాస్ట్‌’ పుస్తకంలో ప్రతిపాదించాడు. పల్లపు ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో ప్రజలు నివసించినట్లుగా పురాతన తమిళ సాహిత్యంలో ఉంది. ఆ విధంగా నివాస ప్రాంతాలకు అనుగుణమైన వృత్తులు చేపడుతూ, ప్రత్యేకమైన ఆర్థిక, సాంఘిక వ్యవస్థల్లో ఉన్నారు. దానికి తగినట్లుగా ఆహార నియమాల్లో, సాంస్కృతిక జీవనంలో, నాగరికతలో వారి మధ్య భిన్న లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు తీర ప్రాంతాల్లో చేపలు పడుతూ జీవించే ‘బెస్త’ వారి జీవన పద్ధతులకు, కొండ ప్రాంతాల్లో ఉండే పశుకాపరుల జీవన విధానాలకు మధ్య చాలా తేడాలున్నాయి. అయితే కాలక్రమంలో ఒక ప్రాంత ప్రజలు మరో ప్రాంతానికి తరలి వెళ్లడంతో భిన్న ఆచార వ్యవహారాల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ విధంగా ఒకే ప్రాంతంలో విభిన్నమైన వృత్తులు, సంస్కృతులు ఉన్న సమూహాలే కులాలుగా రూపాంతరం చెందాయి.


* ఒక ప్రాంతానికి వలస వెళ్లినవారు కొత్త ప్రాంతంలో వారి పాత వృత్తులు కొనసాగించవచ్చు, లేదా కొత్త వృత్తులు స్వీకరించవచ్చు. ఏ వృత్తులు అనుసరించినప్పటికీ ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారితో కలిసి జీవించడం వల్ల వేర్వేరు కుల సమూహాలుగా ఏర్పడ్డారు. అలాగే ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి వెళ్లిన తర్వాత కూడా వారిని పూర్వప్రాంతాల పేరుతోనే వ్యవహరించడం వల్ల కులంగానో, ఉపకులంగానో ఏర్పడ్డారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మణ కులంలోని చాలా ఉపకులాలు పలు ప్రాంతాల పేర్లతో ఉన్నాయి.

 


రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

Posted Date : 24-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌