• facebook
  • whatsapp
  • telegram

కులతత్వం

సామాజిక అవ్యవస్థకు సజీవ సాక్ష్యం!
 


వ్యక్తులను వృత్తులవారీగా విభజించి గుర్తించేందుకు భారతీయ  సమాజంలో చేసిన సంక్లిష్ట వర్గీకరణ కులవ్యవస్థ. ప్రాచీన వర్ణ విధానమే కాలక్రమంలో కులవ్యవస్థగా రూపుదిద్దుకుంది. తరాలు, యుగాలు మారినా వంశపారంపర్యంగా పాటించే సంప్రదాయంగా స్థిరపడింది. ఆధునిక కాలంలో ప్రధాన దురవస్థగా నిలిచిపోయి ఆర్థిక అసమానతలు, అంటరానితనం లాంటి ఎన్నో జాఢ్యాలకు  కారణమవుతోంది. ఈ సామాజిక రుగ్మత గురించి పోటీ పరీక్షార్థులు మూలాల నుంచి తెలుసుకోవాలి. కులం లక్షణాలు, అది సృష్టిస్తున్న అనర్థాలు, దాన్ని నిరసిస్తూ వచ్చిన ఉద్యమాలు, సమస్యకు రాజ్యాంగం సూచించిన పరిష్కారాలు, సమాజంలో రావాల్సిన    పరివర్తనపై అవగాహన పెంచుకోవాలి. 


ఆధునిక కాలంలోని అన్ని సమాజాలు సామాజిక  సమస్యలతో సతమతమవుతున్నాయి. అవి సమాజంలో క్రమరాహిత్యాన్ని పెంచుతూ, సామాజిక అవ్యవస్థకు  కారణమవుతున్నాయి. వాటిని గుర్తించి, అధ్యయనం చేసి, నివారణ మార్గాలు రూపొందించే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయి. భారత సమాజం కూడా పలు  సామాజిక సమస్యలను ఎదుర్కొంటోంది. వాటిలో  ప్రధానమైంది ‘కులతత్వం’.


కులవ్యవస్థ పరిచయం: ప్రపంచంలో ఒక్క భారత దేశంలోనే కులవ్యవస్థ కనిపిస్తుంది. దేశ స్థిరీకరణకు అది దోహదం చేస్తున్నప్పటికీ, దాన్ని ఆధారం చేసుకుని కులతత్వం, అంటరానితనం లాంటి సామాజిక     సమస్యలు తలెత్తుతున్నాయి. 


కులం అనే పదం పోర్చుగీసు పదమైన ‘ద్చి(్మ్చ’ నుంచి వచ్చింది. కులానికి అర్థం ‘పుట్టుక’ లేదా ‘జాతి’. కుల వ్యవస్థ పుట్టుక గురించి విభిన్న ధోరణులు ప్రచారంలో ఉన్నాయి. ఆ పుట్టుక ఏ విధంగా జరిగినప్పటికీ భారత సమాజంలో మాత్రం దాని ఉనికి ప్రబలంగా ఉంది. కులభావనను అర్థం చేసుకోవడానికి కులానికి ఉన్న కొన్ని లక్షణాలు కొంతవరకు తోడ్పడతాయి. అవి-


* కులం పుట్టుకను నిర్ణయిస్తుంది.నీ సమాజంలో ప్రతి కులానికి ప్రత్యేకమైన అంతస్తు ఉంటుంది. అది సభ్యులకు కులం ద్వారా సంక్రమిస్తుంది.నీ ప్రతి కులానికి ప్రత్యేక వృత్తి ఉంటుంది.నీ ఆహారం, వివాహం, ఇతరులతో సాంగత్యం పెట్టుకోవడం లాంటి వాటి పరంగా సభ్యులపై ఆంక్షలను విధిస్తుంది.నీ కులం అంతర్వివాహ సమూహం. ఏ కులంవారు ఆ కులంలో వారినే వివాహమాడాల్సి ఉంటుంది.నీ కులంలో అంతస్తు పరమైన వరుసక్రమం ఉంటుంది. అగ్రస్థానంలో బ్రాహ్మణులు, అధమ స్థానంలో అంటరాని కులాలు ఉంటాయి.


కుల ఆర్థిక అసమానతలు:  భారత సమాజంలో వివిధ కులాల మధ్య నెలకొన్న ఆర్థిక అసమానతలు, కుల ఘర్షణలు, కులతత్వ భావం పెరిగేందుకు తోడ్పడుతున్నాయి. కులాల మధ్య ఆర్థిక అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కులవృత్తులే ఇందుకు ప్రధాన కారణం. అన్నికులాల వృత్తులు లాభసాటిగా ఉండవు. కొన్ని కులాల వృత్తులు లాభదాయకంగా ఉండి, ఆ కులాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంటే, మరికొన్ని కులాల వృత్తు లు లాభసాటిగా లేక పేదరికంలో మగ్గుతున్నాయి. కులాల జనాభా సంఖ్య కూడా ఈ అసమానతలు ఏర్పడేందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. ఆర్థిక అసమానతల వల్ల కులాల మధ్య సహకారం, సమన్వయం కుదరక ద్వేషం, అసూయ, ఈర్ష్య ప్రబలి కులతత్వం పెరుగుతోంది.


కుల ఘర్షణలు: కుల వ్యవస్థను భారత రాజ్యాంగం నిరసిస్తోంది. మేధావి వర్గం వ్యతిరేకిస్తోంది. రాజకీయ వ్యవస్థ కూడా దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఇన్నివిధాలుగా కులవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ, భారత సమాజంలో కుల ఘర్షణలు నానాటికీ అధికమవుతున్నాయి. ఇది మేధావులకు కూడా అంతుపట్టని విషయంగా మారింది.


గతంలో కులవ్యవస్థ పటిష్ఠంగా ఉన్నప్పుడు కులవృత్తులను పూర్తిస్థాయిలో పాటించేవారు. అర్హత, సామర్థ్యం ఉండి కూడా అనేకమంది లాభదాయకమైన ఇతర కులాల వృత్తులు చేపట్టే అవకాశం లేకపోవడంతో ఆర్థికాభివృద్ధిని సాధించలేక పేదరికంలో మిగిలిపోయేవారు. మరికొందరు సామర్థ్యం లేకపోయినా, ఎక్కువగా శ్రమించకుండానే లాభదాయకమైన కులవృత్తిని ఆధారం చేసుకుని, ఆర్థిక అభివృద్ధి సాధించారు. కేవలం దాని ఆధారంగానే అగ్ర కులస్థులుగా సమాజంలో గుర్తింపు పొందారు.


* ఆర్థిక అసమానతలను తొలగించి కులాల మధ్య సయోధ్య ఏర్పరిచి, కులతత్వ భావన పెరగకుండా చేసేందుకు ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. అయితే అగ్రకులాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల సౌకర్యం పొందుతున్న కులాల వారంతా తాము ఇంతకాలం కులవృత్తి సిద్ధాంతం వల్ల అణచివేతకు గురై ఆర్థికాభివృద్ధి పొందలేకపోయామని, ఇప్పుడు ఈ రిజర్వేషన్ల ద్వారా ఆర్థికాభివృద్ధి పొందడం తమ జన్మహక్కు అని భావిస్తున్నారు.


అజాత్‌ఉద్యమం (కుల ఉద్యమాలు):  ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతంలోనే కుల ఉద్యమాలు ఎక్కువగా జరిగాయి. దీనికి ప్రధాన కారణం ఇక్కడున్న బ్రాహ్మణ ఆధిపత్యం. 1920లో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ‘మంగ్రోల్‌దస్తగిర్‌’ గ్రామంలో గణపతి భభుత్కర్‌అనే సంఘ సంస్కర్త మనుషులంతా సమానమేనని చెప్పి కులం, మతం పట్టింపులేని వారందరినీ ‘అజాత్‌’ అనే సామాజిక వర్గంగా మార్చే ఉద్యమం చేపట్టారు. భభుత్కర్‌సందేశం నచ్చి విదర్భ ప్రాంతంలో దళిత, మాలి, బ్రాహ్మణ లాంటి దాదాపు 18 కులాలవారు కలిసిపోయారు. 1950 నాటికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌రాష్ట్రాల్లో అజాతీయులుగా చెప్పే వారి సంఖ్య సుమారు 60 వేలకు చేరింది. 1960, 70ల్లో ‘అజాత్‌’ ఒక ప్రత్యేక సామాజిక వర్గంగా గుర్తింపు పొందింది. వీరి పాఠశాల ధ్రువీకరణ పత్రాల్లోనూ కులం పేరు అజాత్‌అని ఉంటుంది. మంగ్రోల్‌లో గణపతి భభుత్కర్‌నిర్మించిన ఆలయ ప్రాంగణంలో ఏటా నవంబరులో అజాత్‌సమావేశం జరుగుతుంది. 106 కుటుంబాలకు చెందిన 2000 మంది దానికి హాజరవుతారు. జనాభా గణనలో కులం పేరు తప్పనిసరిగా చేర్చాలనుకుంటే, ఏ కులమూ లేదని చెప్పేవారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని వీరు డిమాండ్‌చేస్తున్నారు.


కులతత్వం - పర్యవసానాలు: సమాజంలోని కులతత్వం పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉండటంతో భారత ప్రభుత్వం దాన్ని ముఖ్యమైన సామాజిక సమస్యగా గుర్తించి, నివారణోపాయాలను యోచిస్తోంది. కులతత్వం పర్యవసానాలను పలు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. అవి-


* కులఘర్షణలు, వివిధ కులాల మధ్య అనైక్యత వల్ల నానాటికీ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరుగుతున్నాయి.


* వివిధ కులాల మధ్య ద్వేషం, అంటరానితనాన్ని పెంచి కులాల మధ్య అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి.


* ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల అర్హతను కులాలకు కూడా కల్పించాలని కులసంఘాలు బహిరంగంగా డిమాండ్‌చేస్తున్నాయి. తద్వారా కులపరమైన ఉద్రిక్తతలు రోజురోజుకీ ఎక్కువై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.


* కులాల మధ్య సామరస్యాన్ని తగ్గిస్తూ, అలౌకిక భావనలను పెంపొందిస్తూ సంకుచిత భావనలు, ఆలోచనలను వృద్ధి చేస్తున్నాయి. 


కులతత్వ నివారణ:  ఇటీవల భారత సమాజంలో అమలు చేస్తున్న పారిశ్రామికీకరణ, నూతన విద్యావిధానం లాంటివి కులతత్వం బలహీనపడేందుకు కొంతవరకు తోడ్పడుతున్నాయి. అయినా ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదు. పి.ఎన్‌.ప్రభు అభిప్రాయం ప్రకారం నూతన విలువలను ఏర్పరిచి అమలు చేయడం ద్వారా కులతత్వాన్ని కొంతవరకు నిర్మూలించవచ్చు. భారత సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యల్లో కులతత్వం ప్రధానమైంది. అది పెరగడం సమాజానికి క్షేమకరం కాదు. ప్రభుత్వపరంగా, బలప్రయోగాలతో దాన్ని తొలగించడం సాధ్యం కాదు. వ్యక్తుల్లో, వారి ఆలోచనల్లో పరివర్తన రావాలి. తమ ఇళ్లలో అతి సాధారణ క్రిమికీటకాలను తిరగనిచ్చే అగ్రకులాలవారు, తోటిమానవులను దూరంగా ఉంచి, వారిపట్ల హీనంగా ప్రవర్తించడం అమానుషం, ఘోరం. ఈ అంశాన్ని ప్రతి వ్యక్తి గుర్తించి స్వచ్ఛందంగా కులతత్వ నిర్మూలనకు కృషి చేయాలి.

తమిళనాడు మహిళకు తొలిసారి కుల, మత రహిత సర్టిఫికెట్‌

తమిళనాడులోని వెల్లూరుకు చెందిన స్నేహ పార్తీబరాజా 2019, ఫిబ్రవరి 5న ‘కుల రహిత, మత రహిత సర్టిఫికెట్‌’ పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఈమె జనన ధ్రువీకరణ, పాఠశాల ధ్రువీకరణ పత్రాల్లో ‘ఇండియన్‌’ అనే పేరుతో నమోదు చేసుకున్నారు. తొమ్మిదేళ్ల  నిరీక్షణ, పోరాటం అనంతరం స్నేహ ఈ విజయం సాధించారు.   - స్నేహ పార్తీబరాజా

 


 

ర‌చ‌యిత‌: వ‌ట్టిప‌ల్లి శంక‌ర్‌రెడ్డి

Tags:

 

Posted Date : 15-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు