• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సంబంధాలు

 పాలనలో సహకారం.. సమతూకం! 
 


తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల పంపిణీపై, మరో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులపై వివాదాలు తలెత్తాయని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. వాటిని ఎవరు, ఏ విధంగా పరిష్కరించాలి? రాష్ట్రాల సమాఖ్యగా ఏర్పడిన దేశంలో ఇలాంటి ఇబ్బందులను తొలగించడానికి భారత రాజ్యాంగం స్పష్టమైన మార్గదర్శకాలను సూచిస్తోంది. సహకార సమాఖ్యగా కొనసాగడానికి అవసరమైన అధికారాలను కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజించింది. దీని వల్ల దేశంలో రక్షణ, శాంతిభద్రతల నిర్వహణ, ఆర్థిక వనరుల పంపిణీ, సమర్థ పాలనకు వీలు కలుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిపాలనా పరమైన సంబంధాలను అర్థం చేసుకోవడానికి సంబంధిత ఆర్టికల్స్, అందులోని వివరణలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధికి లోబడి పరిపాలన నిర్వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 73 కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికార పరిధిని, ఆర్టికల్‌ 162 రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక అధికార పరిధిని తెలియజేస్తున్నాయి.

రాజ్యాంగంలోని XI భాగంలో ఆర్టికల్‌ 256 నుంచి 263 మధ్య కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సంబంధాలను వివరించారు.

ఆర్టికల్‌ 256(1): కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు తమ పరిపాలనను నిర్వహించకూడదు.

ఆర్టికల్‌ 256(2): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేస్తుంది. వాటిని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.

ఆర్టికల్‌ 257(1): జాతీయ స్థాయిలో పార్లమెంటు రూపొందించిన పరిపాలనా విధానాలకు విరుద్ధంగా రాష్ట్రాలు తమ కార్యనిర్వహణ అధికారాలను వినియోగించకూడదు.

ఆర్టికల్‌ 257(2): జాతీయ లేదా సైనిక ప్రాధాన్యం కలిగిన సమాచార వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేయవచ్చు.

ఆర్టికల్‌ 257(3): రైలుమార్గాల సంరక్షణ కోసం రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వవచ్చు.

ఆర్టికల్‌ 257(4): రాష్ట్రాలకు అప్పగించిన పనుల నిర్వహణకు అయిన వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా చెల్లించాలి. దీనికి సంబంధించిన అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం ఉండాలి. అవసరమైతే కావాల్సిన మధ్యవర్తిని సుప్రీంకోర్టు నియమిస్తుంది.

ఆర్టికల్‌ 258(1): కేంద్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికార పరిధిలోని అంశాలను షరతులతో లేదా షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించవచ్చు. దీనికి సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ అంగీకారం అవసరం.

ఆర్టికల్‌ 258(2): పార్లమెంటు రూపొందించిన ఏదైనా ఒక శాసనం రాష్ట్రాల శాసనాధికార పరిధిలోనిది కాకపోయినప్పటికీ సంబంధిత శాసనాన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని రాష్ట్రాలకు/రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేయవచ్చు.

ఆర్టికల్‌ 258(A):ఒక రాష్ట్ర గవర్నర్‌ సంబంధిత రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిలోని అంశాలను షరతులతో లేదా షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులకు అప్పగించవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వ పూర్వానుమతిని గవర్నర్‌ పొందాలి. ఈ అంశాన్ని 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (ఆర్టికల్, 258(A)) రాజ్యాంగంలో చేర్చారు.

ఆర్టికల్‌ 259: రాష్ట్రాల్లో శాంతిభద్రతల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను మోహరించవచ్చు. ఈ ఆర్టికల్‌ను 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు.

ఆర్టికల్‌ 260: అంతర్జాతీయ ఒప్పందాలు, విదేశాలతో కుదుర్చుకున్న ఒడంబడికల ఆధారంగా భారతదేశ పరిధిలో లేని ఏ ప్రాంతంలోనైనా యూనియన్‌ పరిపాలనా విధులను చేపట్టవచ్చు.

ఆర్టికల్‌ 261(1): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన నియమాలను దేశమంతటా గౌరవించాలి.

ఆర్టికల్‌ 261(2): వివిధ చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన చర్యలు లాంటి వాటిని రుజువు చేసే విధానం, వాటి ప్రభావాన్ని పార్లమెంటు ఒక శాసనం ద్వారా నిర్దేశిస్తుంది.

ఆర్టికల్‌ 261(3): సివిల్‌ కోర్టులు వెలువరించే అంతిమ తీర్పులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా చట్టప్రకారం అమలు చేయవచ్చు.

ఆర్టికల్‌ 262(1): అంతర్రాష్ట్ర నది లేదా నదీలోయకు సంబంధించిన జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం పార్లమెంటు చట్టం చేస్తుంది. దీనిలో భాగంగా 1956లో పార్లమెంటు అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం, రివర్‌ బోర్డు యాక్ట్‌ను రూపొందించింది.

ఆర్టికల్‌ 262(2): అంతర్రాష్ట్ర నదీజలాల పంపకంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్‌ తీర్పును అనుసరించి భారత పార్లమెంటు ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తూ న్యాయస్థానాల జోక్యాన్ని నియంత్రిస్తూ నిర్దేశించవచ్చు.


ఇప్పటివరకు మన దేశంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర నదీజలాల ట్రైబ్యునల్స్‌ 9 ఉన్నాయి. 

1) కృష్ణా నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌  - I:  1969లో ఏర్పాటు చేశారు. దీని పరిధిలోని రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.

2) గోదావరి నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 1969లో ఏర్పాటు చేశారు. దీని పరిధిలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలున్నాయి.

3) నర్మదా నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 1969లో ఏర్పాటైంది. దీని పరిధిలోని రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.

4) రావి, బియాస్‌ నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 1986లో ఏర్పాటైన దీని పరిధిలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

5) కావేరి నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 1990లో ఏర్పాటు చేశారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు; కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి దీని పరిధిలో ఉన్నాయి. 

6) కృష్ణా నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌ - II: 2004లో ఏర్పాటు చేశారు. దీని పరిధిలోని రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.

7) వంశధార నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 2010లో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా దీని పరిధిలో ఉన్నాయి.

8) మహదాయి నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 2010లో ఏర్పాటు చేశారు. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక దీని పరిధిలో ఉన్నాయి.

9) మహానది నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 2018లో ఏర్పాటైంది. దీని పరిధిలోని రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌.

 

1956 నాటి అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టాన్ని 2019లో సవరించారు. 2019లో రూపొందించిన ‘అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల సవరణ చట్టం’ ప్రకారం అంతర్రాష్ట్ర నదీజలాలు, నదీ లోయల వివాదాలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వివాద పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు.

ఆర్టికల్‌ 263: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య విభేదాలు వచ్చినప్పుడు; ఒక రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి మధ్య వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించేందుకు, సమన్వయం సాధించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 263 ప్రకారం కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర మండలిని (ఇంటర్‌ స్టేట్‌ కౌన్సిల్‌) ఏర్పాటు చేస్తుంది.


* సర్కారియా కమిషన్‌ సిఫార్సుల్లో కీలకమైంది అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు. వి.పి.సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం 1990, మే 28న అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలి విధుల నిర్వహణకు 1991లో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర మండలి ఏడాదికి 3 సార్లు సమావేశం కావాలి.

అంతర్రాష్ట్ర మండలి - నిర్మాణం:  * ఛైర్మన్‌ - ప్రధానమంత్రి * సభ్యులు - అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు (లెఫ్టినెంట్‌ గవర్నర్లు) * కేంద్ర హోంమంత్రితో కలిపి ఆరుగురు కేబినెట్‌ మంత్రులు * ప్రధాని నామినేట్‌ చేసే శాశ్వత ఆహ్వానితులు 10 మంది (కేంద్ర మంత్రులు).


రాజ్యాంగ ఇతర భాగాల్లో వివరించిన సంబంధాలు:

ఆర్టికల్‌ 352: జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు కేంద్రం కార్యనిర్వాహక ఆదేశాలను రాష్ట్రాలకు జారీ చేయవచ్చు. ఆ సమయంలో రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తుంది.

ఆర్టికల్‌ 355: రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రధాన బాధ్యతలను రాష్ట్రాల పట్ల నిర్వహించాలి. ఎ) ప్రతి రాష్ట్రాన్ని విదేశీ దురాక్రమణ, అంతర్గత అల్లకల్లోలాల నుంచి రక్షించడం. బి) ప్రతి రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగం ప్రకారం జరిగే విధంగా చూడటం.

ఆర్టికల్‌ 356: ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రంలో సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ ద్వారా రాష్ట్ర పరిపాలనను కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది.

ఆర్టికల్‌ 365: కేంద్ర ప్రభుత్వం జారీ చేసే పరిపాలనాపరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే సంబంధిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉదా: కేరళలో 1959లో నంబూద్రిపాద్‌ ప్రభుత్వం కేంద్రం ఆదేశాలను ధిక్కరించడంతో ఆర్టికల్‌ 356ను ప్రయోగించి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.

ఆర్టికల్‌ 312: మన దేశంలో అఖిలభారత సర్వీసులను కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల నియామకం యూపీఎస్సీ ద్వారా జరిపి వివిధ రాష్ట్రాలకు కేటాయిస్తుంది.

ఆర్టికల్‌ 315: రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరితే కేంద్ర ప్రభుత్వం జాయింట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది.

ఆర్టికల్‌ 155: రాష్ట్ర స్థాయిలో రాష్ట్రాధినేతలుగా వ్యవహరించే గవర్నర్లు రాష్ట్ర పరిపాలనలో కీలకపాత్ర పోషిస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, నియంత్రిస్తుంది.

ఆర్టికల్‌ 339: షెడ్యూల్డ్‌ తెగల శ్రేయస్సును పెంపొందించడానికి తగిన ప్రణాళికలను రూపొందించి, అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేయవచ్చు.

ఏకీకృత న్యాయవ్యవస్థ: రాజ్యాంగ నిర్మాతలు దేశంలో ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ప్రకారం అత్యున్నత స్థాయిలో సుప్రీంకోర్టు, దానికి దిగువన రాష్ట్ర స్థాయిలో హైకోర్టులతో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఏర్పడింది. కేంద్రం, రాష్ట్రాలు రూపొందించే చట్టాలను ఈ ఏకీకృత న్యాయ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది.

* హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తే, గవర్నర్‌ వారితో ప్రమాణస్వీకారం చేయిస్తారు.

* రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటుచేస్తూ పార్లమెంటు చట్టం చేయవచ్చు.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

 

Posted Date : 14-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌