• facebook
  • whatsapp
  • telegram

  కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు

 విస్పష్టంగా పన్నుల వసూళ్లు.. పంపకాలు! 


సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక బంధాలు నిర్దిష్టంగా ఉన్నప్పుడే వాటి మధ్య సఖ్యత, సహకారం సాధ్యమవుతాయి. మన దేశంలో ఆ రెండు ప్రభుత్వాల ఆదాయ మార్గాల విభజన, పన్నుల విధింపు, వసూలు, పంపకాల విషయంలో విధివిధానాలను రాజ్యాంగం స్పష్టంగా వివరించింది. తగిన పరిధులను, పరిమితులను నిర్దేశించింది. అంతిమంగా పాలన, ప్రజా సంక్షేమాల కోసం పన్ను ఆదాయం సమకూర్చుకుంటూ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపకరించే ఈ నియమ నిబంధనలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలను అంశాలవారీగా, ఆర్టికల్స్‌తో సహా వివరంగా తెలుసుకోవాలి.


భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటికి సంబంధించి రాజ్యాంగంలో సమగ్ర వివరణను పొందుపరిచారు. XIIవ భాగంలో ఆర్టికల్‌ 264 నుంచి 300(A) మధ్య కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించి వివరణ ఉంది.


ఆర్టికల్‌ 264: ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఆర్థిక సంఘం నియమాలను పరిగణనలోకి తీసుకోవాలి.


ఆర్టికల్‌ 265: మన దేశంలో చట్టబద్ధంగా మాత్రమే పన్నులు విధించి వసూలు చేయాలి. చట్టం చేయకుండా ఎలాంటి పన్నులు విధించకూడదు. పార్లమెంటు రూపొందించే చట్టాలను అనుసరించి దేశవ్యాప్తంగా, రాష్ట్ర శాసనసభలు చేసే చట్టాలకు అనుగుణంగా రాష్ట్రాల్లో పన్నులు విధించి వసూలు చేయవచ్చు.


* కేంద్ర జాబితాలో పేర్కొన్న 15 అంశాలపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు, రాష్ట్ర జాబితాలో పొందుపరిచిన 20 అంశాలపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాల శాసనసభలకు ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని ఆర్థిక అంశాలపై పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు చట్టాలు చేయవచ్చు. అవశిష్ట అంశాలపై అంటే సంపదపై పన్ను, బహుమతిపై పన్ను, వ్యయంపై పన్ను లాంటి వాటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది.

 

ఆదాయ మార్గాలు


కేంద్ర ప్రభుత్వం:

పన్నులు: ఆదాయపు పన్ను, ఎగుమతి-దిగుమతి సుంకాలు, కార్పొరేషన్‌ పన్ను, ఎక్సైజ్‌ సుంకం, ఎస్టేట్‌ సుంకం (వ్యవసాయ భూములు మినహా), వారసత్వ పన్ను (వ్యవసాయ భూములు మినహా), విత్త సంబంధ పత్రాలపై స్టాంప్‌ డ్యూటీ.


ఇతర మార్గాలు: వార్తాపత్రికల కొనుగోళ్లు, అమ్మకాలు, వాటిలో ప్రచురించిన ప్రకటనలపై పన్నులు, రైల్వే రవాణా, జల, వాయు మార్గాల ద్వారా వస్తు, ప్రయాణికుల రవాణాకు విధించే టెర్మినల్‌ పన్నులు.


రాష్ట్ర ప్రభుత్వం:

పన్నులు: భూమి శిస్తు, వినియోగ వస్తువులపై పన్ను, విద్యుచ్ఛక్తి అమ్మకం/వినియోగంపై పన్ను, ప్రకటనలపై పన్ను (వార్తాపత్రికలు కాకుండా రేడియో, టెలివిజన్‌ వంటి ప్రసార సాధనాల్లో వచ్చే వాటిపై), రహదారులపై తిరిగే వాహనాలపై విధించే పన్ను, వృత్తి పన్ను.

ఇతర మార్గాలు: అడవులు, నీటిపారుదల, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయం.

ఆర్టికల్‌ 266: కేంద్ర సంఘటిత నిధి గురించి వివరిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని కేంద్ర సంఘటిత నిధిలో జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాల కోసం చేసే ఖర్చులన్నీ ఈ నిధి నుంచే చెల్లిస్తారు. ఈ నిధి నుంచి నగదు తీసి ఖర్చు చేయాలంటే పార్లమెంటు ముందస్తు అనుమతి తప్పనిసరి.


ఆర్టికల్‌ 266(1): రాష్ట్ర సంఘటిత నిధి గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని దీనిలో జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చులన్నీ ఈ నిధి నుంచే చెల్లిస్తారు. ఈ నిధి నుంచి నగదు ఖర్చు చేయాలంటే రాష్ట్ర శాసనసభ ముందస్తు ఆమోదం ఉండాలి.


ఆర్టికల్‌ 267: కేంద్ర ఆగంతుక నిధి గురించి వివరిస్తుంది. ఈ నిధి రాష్ట్రపతి నియంత్రణలో ఉంటుంది. జాతీయ విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు లాంటి ఊహించని, అనుకోని ఖర్చులు కేంద్ర ప్రభుత్వానికి ఎదురైనప్పుడు రాష్ట్రపతి అనుమతితో ఆగంతుక నిధి నుంచి నగదు తీసి ఖర్చు చేయవచ్చు. తర్వాత ఈ ఖర్చుకు సంబంధించిన ఆమోదాన్ని పార్లమెంటు నుంచి పొందవచ్చు.


* భారత ఆగంతుక నిధి చట్టం-1950 ద్వారా 1950, ఆగస్టు 14న రూ.50 కోట్లతో ఈ నిధిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రూ.500 కోట్లతో నిర్వహిస్తున్నారు.


ఆర్టికల్‌ 267(1): రాష్ట్ర ఆగంతుక నిధి గురించి వివరిస్తుంది. ఈ నిధి గవర్నర్‌ నియంత్రణలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని, అనుకోని ఖర్చులు ఎదురైనప్పుడు గవర్నర్‌ అనుమతితో ఈ నిధి నుంచి నగదు ఖర్చు చేయవచ్చు.  తర్వాత శాసనసభ ఆమోదం ద్వారా ఆ ఖర్చును చట్టబద్ధం చేస్తారు.


క్యాపిటేషన్‌ పన్ను: ఆదాయం, సంపదతో సంబంధం లేకుండా వ్యక్తులపై విధించే పన్నును ‘క్యాపిటేషన్‌ పన్ను’ అంటారు.


ఉదా: వినోదం, జూదం, పందేలపై విధించే పన్ను, స్టాంపు డ్యూటీ (ఆర్థిక సంబంధ పత్రాలు మినహాయించి).


టోల్‌ట్యాక్స్‌: రహదారుల నిర్మాణానికి అయ్యే ఖర్చు వసూలు, నిర్వహణ వ్యయం, వాహనాల భద్రత కోసం ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు. జాతీయ హైవేల చట్టం-1956, జాతీయ హైవేల నిబంధనలు-2008 ప్రకారం దేశంలోని జాతీయ రహదారులపై టోల్‌ట్యాక్స్‌ వసూలు చేస్తారు.


ఆర్టికల్‌ 268: కొన్ని పన్నులను కేంద్రం విధిస్తుంది. వాటిని రాష్ట్రాలు వసూలు చేసి ఉపయోగించుకుంటాయి.


ఉదా: టాయిలెట్‌ ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం, ఆల్కహాల్‌ ఆధారంగా తయారు చేసిన ఔషధాలు, బీమా పాలసీల బదలాయింపు, విత్త సంబంధ పత్రాలపై స్టాంప్‌ డ్యూటీ.


ఆర్టికల్‌ 268(A): దీన్ని 88వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ద్వారా చేర్చారు. దీని ప్రకారం సర్వీస్‌ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. వసూలైన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. 10వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 80వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసి, కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో 29% వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్దేశించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రాలకు 42% బదిలీ చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ వాటాను 41%గా నిర్ణయించారు.


ఆర్టికల్‌ 269: కేంద్రం కొన్నిరకాల పన్నులను విధించి, వసూలు చేసి వాటిలో కొంత వాటాను రాష్ట్రాలకు ఇస్తుంది.


ఉదా: వారసత్వపు పన్ను, నౌకాయాన, రైల్వే, వైమానిక స్థావరాలను రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేసి వినియోగిస్తుండటంతో, వాటి ఆదాయంలో కొంత మొత్తాన్ని రాష్ట్రాలకు చెల్లిస్తారు.


ఆర్టికల్‌ 269(A): ఇది సర్వీస్‌ ట్యాక్స్‌కు సంబంధించింది. అంతర్‌ రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్య, వ్యాపారాలపై పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి, వసూలు చేసి, కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది.


ఆర్టికల్‌ 270: దీని ప్రకారం ఆదాయ పన్నును కేంద్రం విధించి, వసూలు చేసి రాష్ట్రాలతో పంచుకుంటుంది.


* కార్పొరేషన్‌ పన్ను, సంపద పన్ను, కస్టమ్స్‌ సుంకం, బహుమతిపై పన్ను, ఆదాయ పన్నుపై సర్‌ఛార్జీ లాంటి వాటిని కేంద్రం విధించి, వసూలుచేసి కేంద్రమే ఉపయోగించుకుంటుంది.


* కమర్షియల్‌ ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ట్యాక్స్‌ లాంటి వాటిని రాష్ట్రాలు విధించి, వసూలు చేసి రాష్ట్రాలే వినియోగించుకుంటాయి.

ఆర్టికల్‌ 271: ఆదాయపు పన్నుపై వేసే సెస్‌ను కేంద్ర ప్రభుత్వమే వసూలు చేసుకుని వాడుకుంటుంది. దీనిలో రాష్ట్రాలకు వాటా ఉండదు.


ఆర్టికల్‌ 272: కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సిన వివిధ పన్నుల వివరాలను పేర్కొంటుంది. ఈ ఆర్టికల్‌ను 80వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు.


ఆర్టికల్‌ 273: బిహార్, అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ లాంటి జౌళి వస్తువులను ఎగుమతి చేసే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుంది.


ఆర్టికల్‌ 274: రాష్ట్రాల ప్రయోజనాలపై ప్రభావం చూపే బిల్లులను రాష్ట్రపతి ఆమోదం ద్వారానే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.


ఆర్టికల్‌ 275: కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు సహాయక గ్రాంట్లను మంజూరు చేస్తుంది. ఈ సహాయం రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో షెడ్యూల్డు తెగల సంక్షేమం కోసం రాష్ట్రాలు చేపట్టే అభివృద్ధి పథకాలకు అవసరమైన సహాయక గ్రాంట్లను కేంద్రమే మంజూరు చేస్తుంది.


ఆర్టికల్‌ 276: వృత్తి, వ్యాపారం, ఉపాధి లాంటి అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వాలు ఒక్కో వ్యక్తిపై సంవత్సరానికి రూ.2500 మించకుండా పన్నును విధించి వసూలు చేయవచ్చు.


ఆర్టికల్‌ 277: ఆర్థికపరమైన వివిధ రకాల మినహాయింపుల గురించి వివరిస్తుంది.


ఆర్టికల్‌ 278: రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పరచుకునే వివిధ రకాల పన్నుల ఒప్పందాలను వివరిస్తుంది.


ఆర్టికల్‌ 279: పన్నులకు సంబంధించిన నియమ నిబంధనలు కేంద్రం రాష్ట్రాలకు ఆదాయ వనరులను సమకూర్చేటప్పుడు పాటించే పద్ధతులను వివరిస్తుంది.


ఆర్టికల్‌ 279(A): 101వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 60 రోజుల్లోపు  రాజ్యాంగబద్ధమైన ‘వస్తువులు, సేవల పన్నుల’ కౌన్సిల్‌ను రాష్ట్రపతి ఏర్పాటు చేయాలి.


ఆర్టికల్‌ 280: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేసేందుకు అయిదేళ్లకోసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఆర్థిక సంఘంలో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు.


ఆర్టికల్‌ 281: కేంద్ర ఆర్థిక సంఘం సమర్పించిన సిఫార్సులను అనుసరించి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను రాష్ట్రపతి పార్లమెంటుకు నివేదిస్తారు.


ఆర్టికల్‌ 282: కొన్ని రకాల ప్రజాప్రయోజనాల కోసం శాసనం రూపొందించే అధికారం పార్లమెంటుకు లేదా రాష్ట్ర శాసనసభలకు లేకపోయినప్పటికీ అవి తమ రెవెన్యూల నుంచి ఆ ప్రజాప్రయోజనాల కోసం గ్రాంట్లను విడుదల చేయవచ్చు.


ఆర్టికల్‌ 283: ప్రభుత్వ నిధులైన సంఘటిత నిధి, ఆగంతుక నిధి, ప్రభుత్వ ఖాతాల నియంత్రణ గురించి తెలియజేస్తుంది. వీటికి అవసరమైన నియమాలను జాతీయ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో శాసనసభలు నిర్ణయిస్తాయి.


ఆర్టికల్‌ 284: కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు భారత ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల కోసం ప్రజలు/ఇతర సంస్థలు చెల్లించే సొమ్ము సందర్భానుసారం ఆయా ఖాతాల్లో జమ అవుతుంది. 


* న్యాయస్థానాలు స్వీకరించే పిటిషనర్‌ డిపాజిట్లు, ఇతర మార్గాల ద్వారా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సొమ్ము సందర్భానుసారం ఆయా ఖాతాలకు జమ అవుతుంది.


ఆర్టికల్‌ 285: కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు విధించకూడదు.


ఆర్టికల్‌ 286: కొన్ని రకాల క్రయవిక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించకూడదు.


ఆర్టికల్‌ 287: కేంద్ర ప్రభుత్వం వినియోగించిన, కొనుగోలు చేసిన విద్యుత్తుపై రాష్ట్రాలు ఎలాంటి పన్నులు విధించకూడదు.


ఆర్టికల్‌ 288: అంతర్‌ రాష్ట్ర నదులు, నదీలోయల అభివృద్ధి కోసం పార్లమెంటు శాసనం ద్వారా ఏర్పాటు చేసిన అథారిటీ నిల్వ ఉంచుకునే, ఉపయోగించుకునే నీరు లేదా విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు పన్నులు విధించకూడదు.


ఆర్టికల్‌ 289: రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులు, ఆదాయాలపై కేంద్రం పన్నులు విధించకూడదు.


ఆర్టికల్‌ 290: కొన్ని రకాలైన ఖర్చులు, పెన్షన్లకు సంబంధించిన సర్దుబాట్ల గురించి వివరిస్తుంది. కొన్ని దేవస్థానాలకు సాలీనా చెల్లించాల్సిన మొత్తాన్ని వివరిస్తుంది.


ఆర్టికల్‌ 291: మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు చెల్లించే రాజ భరణాల గురించి వివరిస్తుంది. ఇందిరాగాంధీ ప్రభుత్వం 26వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971 ద్వారా రాజ భరణాలను రద్దు చేసింది.


ఆర్టికల్‌ 292: పార్లమెంటు నిర్ణయించిన మేరకు భారత సంఘటిత నిధిని హామీగా పెట్టి కేంద్ర ప్రభుత్వం రుణాలు పొందవచ్చు.


ఆర్టికల్‌ 293: రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు రాష్ట్ర సంఘటిత నిధిని హామీగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రుణాలను సేకరించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వవచ్చు.


ఆర్టికల్‌ 294: కొన్ని కేసుల్లో వారసత్వం, ఆస్తులు, హక్కులు, రుణాల విషయంలో ప్రభుత్వ బాధ్యతలను వివరిస్తుంది.


ఆర్టికల్‌ 295: ఇతర వివాదాల విషయంలో వారసత్వంగా సంక్రమించే ఆస్తులు, హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది.


ఆర్టికల్‌ 296: స్వాతంత్య్రానికి ముందు ఉన్న రాష్ట్రాలు, సంస్థానాల ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి ఉండే హక్కులను వివరిస్తుంది.


ఆర్టికల్‌ 297: సరిహద్దు జలాలు లేదా ఖండాంతర్భాగంలోని ఖనిజాలు, ఇతర వనరులన్నింటిపై కేంద్రానికి ఉండే అధికారాన్ని వివరిస్తుంది.


ఆర్టికల్‌ 298: వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన విధానాలను వివరిస్తుంది.


ఆర్టికల్‌ 299: ఆర్థిక, వాణిజ్య ఒప్పందాల గురించి వివరిస్తుంది.


ఆర్టికల్‌ 300: ఆర్థికపరమైన వివాదాలు, వ్యాజ్యాల్లో అనుసరించాల్సిన మార్గాలను వివరిస్తుంది.


ఆర్టికల్‌ 300(A): చట్టప్రకారం తప్ప వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదు. ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా పరిగణిస్తారు.

 


రచయిత: బంగారు సత్యనారాయణ


 

 

Posted Date : 25-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌