• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర ఎన్నికల సంఘం

ఓట్ల పండుగలో అన్నీ తానై!


అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలకపాత్ర పోషిస్తోంది. ఇది చట్టాలను, రాజ్యాంగ సూత్రాలను నిక్కచ్చిగా అమలు చేస్తూ, న్యాయాధికారాలను చెలాయించే స్వయంప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అన్నీ తానై నడిపిస్తుంది. దేశంలో అత్యంత ప్రధానమైన ఈ స్వతంత్ర సంఘం గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. రాజ్యాంగంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఉన్న నిబంధనలతో పాటు దాని కూర్పులో జరిగిన మార్పుచేర్పులు, సభ్యుల విధులు- అధికారాలు, నియామకాలు- తొలగింపులు తదితర ప్రక్రియలపై అవగాహన పెంచుకోవాలి. నోటిఫికేషన్‌ నుంచి ఫలితాల వెల్లడి వరకు అంతా ఎన్నికల సంఘం కనుసన్నల్లోనే జరిగే తీరును అర్థం చేసుకోవాలి.


రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్‌ 324 నుంచి 329 వరకు కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఉంది. 


ఆర్టికల్‌ 324: భారతదేశంలో ఎన్నికల నిర్వహణకు ‘కేంద్ర ఎన్నికల సంఘం’ ఏర్పాటవుతుంది.


ఆర్టికల్‌ 324(1): ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ అధికారాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నాయి. సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉపఎన్నికలను నిర్వహిస్తుంది. అత్యున్నత రాజ్యాంగ పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. లోక్‌సభ, రాజ్యసభ, విధానసభ, విధాన పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహిస్తుంది. భారత ప్రజాప్రాతినిధ్య చట్టాల అమలుకు కృషి చేస్తుంది. రాజకీయ పార్టీల చిహ్నాల (గుర్తులు) వివాదాలు పరిష్కరించడంలో ‘అర్థ న్యాయవ్యవస్థ’గా పనిచేస్తుంది.


ఆర్టికల్‌ 324(2): కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం గురించి వివరిస్తుంది. పార్లమెంటు రూపొందించిన చట్టానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన కమిషనర్, ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.


బహుళ సభ్య ఎన్నికల సంఘంగా మార్పు: 1950, జనవరి 25 నుంచి 1989, అక్టోబరు 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏకసభ్య సంఘంగా కొనసాగింది. అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఒక్కరే ఉండేవారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో 1989, అక్టోబరు 16న కేంద్ర ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య సంఘంగా మార్పు చేశారు. అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఇతర కమిషనర్లు. 1990, జనవరి 15 వరకు త్రిసభ్య సంఘం కొనసాగింది.


* వి.పి.సింగ్‌ ప్రభుత్వ కాలంలో 1990, జనవరి 16న తిరిగి ఏక సభ్య సంఘంగా మార్పు చేశారు. 1993, జూన్‌ 15 వరకు ఏక సభ్య సంఘంగా ఉంది.


 పీవీ నరసింహారావు ప్రభుత్వకాలంలో 1993, అక్టోబరు 1న కేంద్ర ఎన్నికల సంఘాన్ని మరోసారి త్రిసభ్య సంఘంగా మార్చారు. దీనిప్రకారం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఇతర కమిషనర్లు ఉంటారు. ఎన్నికల సంఘంలో ఏదైనా అంశంపై భేదాభిప్రాయాలు తలెత్తితే మెజార్టీ ఓటింగ్‌ ద్వారా నిర్ణయం తీసుకుంటారు. అంటే ముగ్గురికి ఓటు విలువ సమానంగా ఉంటుంది.


టీఎన్‌ శేషన్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: పార్లమెంటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య ఎన్నికల సంఘంగా మార్పు చేయడాన్ని సవాల్‌ చేస్తూ అప్పటి ఎన్నికల ప్రధాన కమిషనర్‌ టి.ఎన్‌.శేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త్రిసభ్య ఎన్నికల సంఘం ఏర్పాటు సమర్థనీయమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


నియామకం - తొలగింపు:

ప్రధాన, ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. వీరి పదవీ కాలం పదవి చేపట్టిన తేదీ నుంచి ఆరు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వయసు నిండే వరకు ఉంటుంది. పదవీకాలం కంటే ముందే వీరు తమ పదవులకు రాజీనామా చేయవచ్చు. రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.


*  ప్రధాన ఎన్నికలకమిషనర్‌ను అసమర్థత, అధికార దుర్వి నియోగం వంటి కారణాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలో అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు. ఈ తీర్మానాన్ని లోక్‌సభలో లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. తీర్మానం ప్రవేశపెట్టిన సభాధిపతి ఆరోపణలపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. లోక్‌సభ, రాజ్యసభ విడివిడిగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదిస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్రపతి తొలగిస్తారు. అభిశంసన తీర్మానంపై ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే తీర్మానం వీగిపోతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.


ఎన్నికల సంఘంలోని మిగిలిన ఇద్దరు కమిషనర్లు రాజ్యాంగబద్ధంగా నియమించిన అధికారులు కారు. 1993లో పార్లమెంటు రూపొందించిన చట్టాన్ని అనుసరించి వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరిని అసమర్థత, అధికార దుర్వినియోగం వంటి కారణాలతో కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సంప్రదించి రాష్ట్రపతి తొలగిస్తారు.


జీతభత్యాలు: ప్రధాన, ఇతర ఎన్నికల కమిషనర్ల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.


అర్థ న్యాయాధికారాలు: కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటుకు జరిగే ఎన్నికలకు రాష్ట్రపతి పేరుతో, శాసనసభకు జరిగే ఎన్నికలకు గవర్నర్‌ పేరుతో నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.


*   ఎన్నికలు ముగిసిన తరువాత 15 రోజుల్లోగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించని అభ్యర్థుల అభ్యర్థిత్వాలను రద్దు చేస్తుంది.


*   పార్లమెంటు సభ్యుల అనర్హతలపై రాష్ట్రపతికి, శాసనసభ్యుల అనర్హతలపై గవర్నర్‌కు సలహానిస్తుంది.


*   ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను అంగీకరించడం లేదా తిరస్కరించడం.


*   టెలివిజన్, రేడియోలలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం కోసం సమయం కేటాయిస్తుంది.


*   ఎన్నికల నేరాలు, అభ్యర్థుల మరణం వంటి కారణాల ఆధారంగా ఎన్నికలు వాయిదా వేస్తుంది.


ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం, పోలింగ్‌ తేదీకి 48 గంటలకు ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసేలా చర్యలు చేపట్టడం.


ఆర్టికల్‌ 325: ఎన్నికల సంఘం ఓటు హక్కును అందించడంలో కుల, మత, జాతి, స్త్రీ, పురుష, వర్గ, వర్ణ విచక్షణలు పాటించకూడదు. ఎన్నికల నిర్వహణ విషయంలో, ఓటర్ల జాబితా రూపకల్పనలో పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో ఒకే జాబితాను రూపొందించాలి.


ఆర్టికల్‌ 326: భారత రాజ్యాంగం దేశంలోని నిర్ణీత వయసు నిండిన ప్రజలందరికీ సార్వజనీన వయోజన ఓటు హక్కును ప్రసాదించింది. 18 ఏళ్లు నిండిన భారత పౌరులందరూ ఓటు హక్కు పొందేందుకు అర్హులు.


*  ఆర్టికల్‌ 326 ప్రకారం ఓటు హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు.


*  1950 నాటి భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటు హక్కు చట్టబద్ధమైన హక్కు.


*  
2002లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఓటు హక్కును ప్రజల ప్రాథమిక హక్కుగా పేర్కొంది.


ఆర్టికల్‌ 327: ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. లోక్‌సభ, రాజ్యసభ, విధానసభ, విధాన పరిషత్‌ల ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలు, అర్హతలు, అనర్హతలు మొదలైన అంశాలకు సంబంధించిన చట్టాలను, ఓటర్ల జాబితాలకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. ఉదాహరణకు భారత ప్రజాప్రాతినిధ్య చట్టాలు.


శివన్‌ పిళ్ళై Vs ఎ.సి.జోస్‌ కేసు: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్నికల నిర్వహణ కోసం పార్లమెంటు రూపొం దించిన ప్రజాప్రాతినిధ్య చట్టాల్లోని నియమ నిబంధనలను ఎన్నికల కమిషన్‌ తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.


ఆర్టికల్‌ 329: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దానిలో న్యాయస్థానాల జోక్యాన్ని అనుమతించరు. ఎన్నికల సంఘం పూర్తిగా స్వయంప్రతిపత్తితో ఎన్నికలు నిర్వహించవచ్చు.


సుప్రీంకోర్టు తీర్పు- మక్కల్‌శక్తికట్చి Vs కేంద్ర ఎన్నికల సంఘం కేసు:  ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఎన్నికలు నిర్వహించే తేదీలను, ఓట్ల లెక్కింపు తేదీలను నిర్ణయించే సంపూర్ణ అధికార పరిధి పూర్తిగా ఎన్నికల సంఘం నియంత్రణలో ఉంటుందని, ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని పేర్కొంది.రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 28-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌