• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - కమిటీల సిఫార్సులు

సమగ్రత సాధనలో సహకార పాలన!

 


  భిన్న జాతులు, భాషలు, మతాలు, సంస్కృతులతో నిండిన సువిశాల భారతదేశంలో పరిపాలన ప్రజాస్వామ్యయుతంగా సాగడానికి రాజ్యాంగం అనేక ఏర్పాట్లు చేసింది. అందులో ప్రధానమైనది సమాఖ్య వ్యవస్థ. జాతీయస్థాయిలో కేంద్రం, రాష్ట్రాల్లో ప్రాంతీయ ప్రాతినిధ్యం, పరస్పర సహకార పాలన, వనరుల కేటాయింపులో సమానత్వం, మొత్తం మీద దేశ సమగ్రతను, ఐకమత్యాన్ని పరిరక్షించడం సమాఖ్య వ్యవస్థ లక్ష్యం. ఇందుకోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  మెరుగైన సంబంధాలు ఉండాలి. ఈ విషయాన్ని సందర్భానుసారం అనేక కమిటీలు స్పష్టం చేశాయి. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 


  రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని సిద్ధాంతపరమైన సమాఖ్యగా కాకుండా కేవలం పరిపాలనా పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేశారు. 1947 నుంచి 1967 వరకు కేంద్రం, రాష్ట్రాల్లో ఒకే రాజకీయ పార్టీ (భారత జాతీయ కాంగ్రెస్‌) అధికారంలో ఉండటంతో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సజావుగా, సాఫీగా సాగాయి. 1967లో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, 7 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీలు అధికారాన్ని చేపట్టాయి. ఆ తర్వాత మరిన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రజాదరణతో అధికారంలోకి వచ్చాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణిని ప్రశ్నిస్తూ, తమకు ఎక్కువ అధికారాలు బదిలీ చేయాలని డిమాండ్‌ చేసేవి. దీంతో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై అధ్యయనం చేసి, నిర్మాణాత్మక సిఫార్సులు చేయడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు.

 


మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం (1966): కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడానికి ఇందిరా గాంధీ ప్రభుత్వం 1966లో మొరార్జీ దేశాయ్‌ అధ్యక్షతన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో ఆరుగురు సభ్యులున్నారు. మొరార్జీ దేశాయ్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయడంతో కె.హనుమంతయ్య ఆ సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. * మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ఎం.సి.సెతల్వాడ్‌ నేతృత్వంలో అధ్యయన బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ బృందం సూచనల ఆధారంగా మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం తన నివేదికను 1969లో కేంద్రానికి సమర్పించింది. ఆ నివేదిక కేంద్ర, రాష్ట్ర సంబంధాల  మెరుగు పరిచేందుకు 22 సిఫార్సులు చేసింది.  

 


కీలక సిఫార్సులు: * ప్రజాసేవ, పరిపాలనలో విశేష అనుభవం ఉన్న వ్యక్తులు, వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే గవర్నర్లుగా నియమించాలి.


* ఆర్టికల్‌ 280 ప్రకారం ఏర్పడిన కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ జరగాలి.


* ఆర్టికల్‌ 263లో నిర్దేశించిన విధంగా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి.

 

* రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదు.


* రాష్ట్ర ప్రభుత్వాల వినతి మేరకే కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాలకు పంపాలి.


* ప్రణాళికా సంఘంలో ప్రతి రాష్ట్రం నుంచి ఒక ఆర్థికవేత్తకు ప్రాతినిధ్యం కల్పించాలి.


* ఆర్టికల్‌ 356 దుర్వినియోగం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలి.


* ఆర్టికల్‌ 275 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే సహాయక గ్రాంట్లను ఉత్పాదకతతో కూడిన పరిశ్రమలకు మాత్రమే ఇవ్వాలి.


* ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు.

 


సర్కారియా కమిషన్‌ (1983): కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనానికి ఇందిరా గాంధీ ప్రభుత్వం 1983లో రంజిత్‌ సింగ్‌ సర్కారియా (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి) అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ సభ్యులుగా బి.శివరామన్, ఎస్‌.ఆర్‌.సేన్‌; కార్యదర్శిగా ఆర్‌.ఎం.సుబ్రహ్మణ్యం, రాజ్యాంగ సలహాదారుగా ఎల్‌.ఎన్‌.సిన్హా వ్యవహరించారు.1987, అక్టోబరు 27న సర్కారియా కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి (రాజీవ్‌గాంధీ ప్రధాని) నివేదిక సమర్పించింది. 1988, జనవరిలో ఈ నివేదికలోని అంశాలను వెల్లడించారు.ఇందులో 247 సిఫార్సులు ఉన్నాయి.

 


శాసన సంబంధ సిఫార్సులు: * అఖిల భారత సర్వీసుల ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వాలు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదు. కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలి.* అవశిష్టాంశాల్లో పన్నులకు సంబంధించిన అంశాలను పార్లమెంటు పరిధిలో ఉంచి, మిగిలిన అంశాలను రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేయాలి.


* భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేసి, దాన్ని క్రియాశీలకంగా మార్చాలి.


* అంతర్రాష్ట్ర మండలిని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేయాలి.


* అన్నిరకాల సూచనలు చేసిన తర్వాత కేంద్రం రాష్ట్రాలకు ఆర్టికల్‌ 365 ప్రకారం ఆదేశాలు జారీ చేయాలి.


* ఆర్టికల్‌ 258 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను క్రమానుగత శ్రేణిలో వికేంద్రీకరించాలి.


* ఆర్టికల్స్‌ 256, 257, 365లలో సూచించిన కేంద్ర శాసనాలు, జాతీయ విధానాలను అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు పటిష్ఠంగా ఉండాలి.

 


గవర్నర్‌ వ్యవస్థపై: * గవర్నర్‌ పదవికి ప్రవర్తనా నియమావళి ఏర్పాటు చేయాలి. ఒక వ్యక్తిని తన సొంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు.


* వివాదరహితులు, విశిష్ట వ్యక్తిత్వం ఉన్నవారినే గవర్నర్‌గా నియమించాలి.


* గవర్నర్‌ను నియమించే ముందు కేంద్రం తప్పనిసరిగా సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి.


* గవర్నర్‌ పదవి నిర్వహించినవారు పదవీవిరమణ అనంతరం తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించకూడదు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు మాత్రమే పోటీ చేయవచ్చు.


* గవర్నర్ల పేర్లను సిఫార్సు చేయడానికి ప్రధాని అధ్యక్షతన స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలి.


* గవర్నర్‌ పదవికి వ్యక్తులను ఎంపికచేసే సమయంలో అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి.


* విశ్వవిద్యాలయాలకు ఛాన్సెలర్‌గా వ్యవహరించేటప్పుడు గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరించాలి.


* ఏదైనా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనప్పుడు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రాజ్యాంగపరమైన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించినప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలి. ఆర్టికల్‌ 356ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలి.


* శాసనసభలో మెజార్టీ సభ్యుల మద్దతు, విశ్వాసం ఉన్నంతకాలం రాష్ట్ర మంత్రిమండలిని గవర్నర్‌ రద్దు చేయకూడదు.


* బలమైన కారణం ఉంటే తప్ప గవర్నర్‌ పదవీకాలానికి (5 సంవత్సరాలు) భంగం కలిగించకూడదు.


* కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తులను ఇతర రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించకూడదు.

 


ఆర్థిక అంశాలపై: * జాతీయాభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థికాభివృద్ధి మండలిగా మార్చాలి.


* కార్పొరేషన్‌ పన్నులో కొంత భాగాన్ని రాష్ట్రాలకు బదిలీ చేయాలి.


* రైల్వే ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి.


* వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక నిపుణులకు కేంద్ర ఆర్థిక సంఘంలో భాగస్వామ్యం కల్పించి వారి సేవలను వినియోగించుకోవాలి.


* ప్రకృతి వైపరీత్యాలు, సంక్షోభాల సందర్భంలో కేంద్రం రాష్ట్రాలకు కాలపరిమితి లేని రుణాలు ఇచ్చి ఆదుకోవాలి.


* కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దుర్వినియోగం చేసిన రాష్ట్రాలపై తగిన చర్యలు తీసుకోవాలి.


* బ్యాంకుల నుంచి ఒక సంవత్సరం కాలపరిమితితో రుణాలు తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించాలి.

 


సర్కారియా కమిషన్‌ - ఇతర సిఫార్సులు:  * రాష్ట్రాల్లో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు సంబంధిత రాష్ట్రం అనుమతి లేకపోయినా కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను పంపవచ్చు.


* దేశంలో అన్ని రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలుచేయాలి.


* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు నిర్దిష్ట పదవీకాలం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి.


* రాష్ట్ర స్థాయిలో ఎగువసభ అయిన శాసనమండలి (విధాన పరిషత్‌) ఏర్పాటు/రద్దు విషయంలో పార్లమెంటు నిర్ణీత సమయంలో తన అభిప్రాయాన్ని తెలియజేయాలి.


* గనులకు సంబంధించిన కీలకమైన విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.


* జోనల్‌ కౌన్సిళ్లను పునర్వ్యవస్థీకరించాలి. ప్రసార భారతికి స్వయంప్రతిపత్తి కల్పించాలి.


* జాతీయ కార్యక్రమాలను ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయడం ద్వారా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, సమగ్రతను పెంపొందించవచ్చు.


* సర్కారియా కమిషన్‌ చేసిన 247 సిఫార్సుల్లో 180 సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది.

 


రాజమన్నార్‌ కమిటీ:  1969 సెప్టెంబరులో తమిళనాడులోని కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి పి.వి.రాజమన్నార్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై సమగ్ర అధ్యయనంతో పాటు రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ఈ కమిటీలో లక్ష్మణస్వామి మొదలియార్, పి.పి.చంద్రారెడ్డి సభ్యులు. ఇది 1971లో తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

 


సిఫార్సులు: * అవశిష్టాధికారాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలి.


* అఖిల భారత సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లను రద్దు చేయాలి.


* రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి.


* ప్రణాళికా సంఘాన్ని శాశ్వత సంస్థగా ఏర్పాటుచేసి చట్టబద్ధత కల్పించాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణను తగ్గించాలి.


* కేంద్ర మంత్రిమండలిలో రాష్ట్రాల వారీగా ప్రాతినిధ్యం కల్పించాలి.


* ఉమ్మడి జాబితాలోని అంశాలను వెంటనే పునఃసమీక్షించి రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో బదిలీ చేయాలి.


* రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్‌ చేసే విధానాన్ని రద్దు చేయాలి.


* రాజ్యాంగం నుంచి ఆర్టికల్స్‌ 356, 357, 365లను తొలగించాలి. రాజ్యాంగాన్ని పార్లమెంట్‌ 2/3వ వంతు మెజార్టీతో సవరించాలి. రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్రను పెంచాలి.


* ఆర్టికల్‌ 252 ప్రకారం పార్లమెంట్‌ రూపొందించిన చట్టాన్ని మార్పు చేసే అధికారం రాష్ట్ర శాసనసభలకు కల్పించాలి. హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియలో రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.


* రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ లభించకపోతే శాసనసభను సమావేశపరిచి మెజార్టీ సభ్యులు బలపరిచిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా గవర్నర్‌ నియమించాలి.


* గవర్నర్‌ సంతృప్తి ఉన్నంతవరకే రాష్ట్ర మంత్రిమండలి పదవిలో ఉంటుందన్న నియమ నిబంధనను రాజ్యాంగం నుంచి తొలగించాలి.


* ప్రధాని అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల ప్రయోజనాలను ప్రభావితం చేసే బిల్లులను అంతర్రాష్ట్ర మండలి అనుమతితోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి.


* రాష్ట్రాల ఆర్థిక వనరులను పెంచడం కోసం పన్నుల వ్యవస్థలో మార్పులు చేయాలి. గవర్నర్‌ నివేదిక లేనిదే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించకూడదు.


* ‘రాజమన్నార్‌ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలుచేస్తే భారతదేశం ముక్కలు చెక్కలవుతుంది. దేశ సమైక్యత, సమగ్రత ప్రమాదంలో పడతాయి. అనేక రంగాలు అభివృద్ధికి నోచుకోకుండా పోతాయి’ అని ఎం.సి.సెతల్వాడ్‌ వ్యాఖ్యానించారు.

 


రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 05-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌