• facebook
  • whatsapp
  • telegram

క్రైస్తవ మతం 

ప్రేమ.. క్షమాపణ.. పశ్చాత్తాపం!


అందరిపట్ల ప్రేమను కలిగి ఉండటం, అపకారం చేసిన వారినీ క్షమించడం, చేసిన పాపాలకు పశ్చాత్తాప పడటం వంటి అంశాలను ప్రధానంగా ప్రబోధించే క్రైస్తవం ప్రపంచంలోనే అతి పెద్ద మతం. అనేక శాఖలుగా విస్తరించి విశ్వానికి శాంతి సందేశాలను అందిస్తోంది.  ప్రత్యేక వివాహ వ్యవస్థను కలిగి ఉంది. స్త్రీలకు పురుషులతో సమానస్థాయిని కల్పిస్తోంది. ఈ మతం ఆవిర్భావం, ప్రధాన బోధనలు, వివాహం తదితర వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

క్రైస్తవ మతం

 

ప్రపంచ జనాభాలో అధిక శాతం క్రైస్తవులే. దాదాపు అన్ని సమాజాల్లో క్రైస్తవ మతం ఉంది. క్రైస్తవులు ఏసుక్రీస్తును దేవుడిగా విశ్వసిస్తారు.ఆయన బోధనలను ప్రబోధించే దే క్రైస్తవ మతం. ఆ మత గ్రంథం బైబిల్‌. దాన్ని రెండు ప్రధాన భాగాలుగా విభజించారు. క్రీస్తు పుట్టుకకు పూర్వం రాసిన గ్రంథం పాత నిబంధన. దీనిలో సృష్టి ఆరంభం, దేవుడు మానవులను సృష్టించడం లాంటి అంశాలు ఉంటాయి. క్రీస్తు పుట్టుక, ప్రబోధాలు, ఆయన మరణం, పునరుత్థానం (మరణాన్ని జయించి రావడం), క్రైస్తవ మత సిద్ధాంతాలను వివరించేది కొత్త నిబంధన. ‘జెరూసలెమ్‌’ (యెరూషలెం)లోని బెత్లెహేమ్‌ గ్రామంలో ‘యేసేపు’ అనే వ్యక్తికి భార్య అయిన కన్య ‘మరియ’ గర్భాన క్రీస్తు మానవుడిగా జన్మించారు. క్రీస్తు ముప్ఫై మూడున్నరేళ్లు జీవించి, చివరి మూడున్నరేళ్లు బోధనలు చేశారని లేఖనాలు తెలియజేస్తున్నాయి. క్రీస్తు ‘యూదా’ వంశస్థుడు. ఆయన బోధనలు ఆనాటి పాలకులను కలవరపరిచాయి.

* క్రీస్తు తన సేవ కొనసాగించడానికి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో ఒకరైన  ‘యూదా’ 30 వెండి నాణేలకు క్రీస్తును మత పెద్దలకు అమ్మాడు.

* పాలకులు ఏసుక్రీస్తుపై నేరం మోపి శిలువ మరణ దండన విధిస్తారు. మూడు రోజుల తర్వాత ఆదివారం ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారని క్రైస్తవులు నమ్ముతారు. కొద్దిరోజుల తర్వాత తన శిష్యులు మరికొందరు చూస్తుండగా పరలోకానికి వెళ్లినట్లుగా చెబుతారు. పరలోకానికి వెళ్లిన క్రీస్తు మళ్లీ రెండో రాక ద్వారా భూమ్మీదకు వచ్చి అందరికీ శాంతి, సంతోషాలను అందిస్తారని క్రైస్తవులు విశ్వసిస్తారు.

 

10 ఆజ్ఞలు 

1. దేవుడు ఒక్కడే.

2. దేవుడి పేరును వ్యర్థంగా వాడకూడదు.

3. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి 

4. తల్లిదండ్రులను సన్మానించాలి.

5. నరహత్య చేయకూడదు.

6. వ్యభిచారం చేయకూడదు.

7. దొంగతనం చేయకూడదు.

8. ఇతరులపై అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు.

9. పొరుగువాడి ఇల్లు ఆశించకూడదు.

10. పొరుగువాడికి సంబంధించిన దేనినైనా ఆశించకూడదు.

ఈ ఆదేశాలను క్రైస్తవులు తప్పనిసరిగా పాటించాలి. 

నిన్ను నీవు ప్రేమించుకున్న‌ట్లుగా నీ పొరుగువారినీ ప్రేమించాలని, అపకారం చేసిన వారిని క్షమించాలని, శాంతియుతంగా జీవించాలని ఈ మతం ప్రధానంగా బోధిస్తోంది. పాపం చేసినప్పుడు పశ్చాతాపం అవసరమని పేర్కొంటోంది. కపటత్వాన్ని విస్మరించాలని చెబుతోంది. 

 

పండగలు: క్రీస్తు పుట్టినరోజైన డిసెంబరు 25ను క్రిస్మస్‌ పండగగా క్రైస్తవులు నిర్వహిస్తారు. క్రీస్తు మరణించిన రోజును ‘మహా శుక్రవారం’గా ఆచరిస్తారు. ఆయన పునరుత్థానం (మరణాన్ని జయించి రావడం)ను ‘ఈస్టర్‌’ పండగగా జరుపుతారు. కొన్ని శాఖల వారు శనివారాన్ని విశ్రాంతి దినంగా పరిగణిస్తారు. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. మహాశుక్రవారం పండగ (గుడ్‌ ఫ్రైడే) రోజు ముందు 40 రోజులు ఉపవాసం పాటిస్తారు.

 

రెండు శాఖలు

క్రైస్తవ మతంలో ప్రధానంగా రెండు శాఖలు ఉన్నాయి. 

క్యాథలిక్కులు: ప్రపంచ క్రైస్తవ జనాభాలో వీరు అధిక శాతం ఉన్నారు. ఈ మత శాఖ అధిపతి ‘పోప్‌’ (వాటికన్‌ నగరం).

ఈ శాఖ ప్రబోధాలు, క్రైస్తవ సిద్ధాంతాలు బైబిల్‌ గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్నాయని డాక్టర్‌ మార్టిన్‌ లూథర్‌ అనే జర్మనీ దేశస్థుడు భావించాడు. ఆ ప్రబోధాల్లోని తప్పులను బహిరంగం చేశారు. దాంతో క్యాథలిక్‌ శాఖ ఆయనను బహిష్కరించింది. లూథర్‌ను అనుసరించిన వారిని ‘ప్రొటెస్టంట్లు’ అని పిలిచారు. ఆ విధంగా క్రైస్తవ మతంలో రెండో శాఖ ప్రారంభమైంది. తర్వాత కాలంలో అనేక శాఖలు ఏర్పడ్డాయి.

ప్రొటెస్టంట్లు: దీనిలో కొన్ని వందల శాఖలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. క్రీస్తు మరణించిన తర్వాత ఆయన 12 మంది శిష్యుల్లో ఒకరైన ‘తోమాసు’ భారతదేశానికి వచ్చి క్రైస్తవ మతాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చాడు. ఇతడు కేరళ ప్రాంతంలో అగ్ర కులాల వారిని క్రైస్తవులుగా మార్చాడు. దాంతో కొందరు ఇతడిని మద్రాసులో హతమార్చారు. ఆ కాలంలో క్రైస్తవులుగా మారిన వారిని సిరియన్‌ క్రైస్తవులని పిలుస్తారు. వీరు కాకుండా కేరళ రాష్ట్రంలో మారత్‌మా క్రైస్తవ శాఖ, జాకోబైట్ల క్రైస్తవ శాఖ మొదలైనవి ఉన్నాయి.

మత శాఖలు: లూథరన్‌ శాఖ, చర్చ ఆఫ్‌ ది సౌత్‌ ఇండియా, బాప్టిస్టు శాఖ, ఆంగ్లికన్‌ శాఖ, మెథడిస్ట్‌ శాఖ, పెంతెకొస్తు శాఖ, సాల్వేషన్‌ ఆర్జ్మిశాఖ, సెవెన్త్‌ డే ఎడ్వంటిస్ట్‌ శాఖ, విశ్వాసుల శాఖ వంటివి వివిధ దేశాల నుంచి వచ్చాయి. ఇవన్నీ స్వతంత్ర వ్యవస్థలను కలిగి ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ఐక్య క్రైస్తవ సంఘ శాఖగా స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

మతం - స్వీకారం 

‘ఈ లోకంలో ఇక నుంచి నేను దేవుడి కోసం బతుకుతాను’ అని తనను తాను దేవుడికి అంకిత చేసుకోవడాన్ని ‘బాప్టిజం’ అంటారు. చర్చిలో పాస్టరు ఈ బాప్టిజం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొన్ని శాఖల్లో చిన్న వయసులోనే దీన్ని జరిపిస్తారు. మరికొన్ని శాఖల్లో యుక్తవయసులో చేపడతారు. బాప్టిజం జరిపించే పద్ధతిలో కూడా శాఖల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి.

నీళ్లు చిలకరించడం: కొన్ని శాఖల్లో ‘తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాన్ని’ చెబుతూ బాప్టిజం తీసుకునే వ్యక్తి తలపై ఫాదర్‌ మూడు సార్లు నీళ్లు చిలకరిస్తారు.

నీటిలో ముంచడం: ‘తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాన్ని’ చెబుతూ బాప్టిజం తీసుకునే వ్యక్తి తలను మూడుసార్లు నీటిలో ముంచి లేపుతారు.

జెండా కింద నడవడం: ‘తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం’ ఆవిష్కరించిన జెండా కింద నడిచి వెళ్లడం ద్వారా ఈ కార్యక్రమం ముగుస్తుంది. 

 

వివాహ వ్యవస్థ: క్రైస్తవ సామాజిక వ్యవస్థలో, మతంలో వివాహానికి ప్రత్యేకస్థానం ఉంది. దాని గురించి ‘బైబిల్‌’లో ప్రస్తావన ఉంది. క్రీస్తు స్వయంగా ‘కానా’ అనే గ్రామంలో వివాహానికి హాజరైనట్లుగా బైబిల్‌ చెబుతోంది. 

వివాహ నిబంధనలు: * ఇద్దరూ క్రైస్తవ మతస్థులై ఉండాలి. నిర్ణయించిన వయసు కలిగి ఉండాలి.  

*మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. 

* ఇరువురు వివాహితులై ఉండకూడదు. లేదా విడాకులు పొంది ఉండాలి.

* సంఘ గురువుల నుంచి ధ్రువపత్రాన్ని తీసుకుని ఇతర సంఘ గురువులకు ఇవ్వాలి. 

* భారత క్రైస్తవ వివాహ చట్టం - 1872 ఈ కింది నిబంధనలను తెలియజేస్తోంది.

- వివాహం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలలోపు జరగాలి.

- విధిగా చర్చిలోనే జరగాలి. 

- వివాహం జరిపించే మతగురువుకు వివాహ లైసెన్స్‌ ఉండాలి.

 

హిందూ సంస్కృతి ప్రభావం: భారత క్రైస్తవులపై హిందూ సంస్కృతి ప్రభావం ప్రతి అంశంలోనూ కనిపిస్తుంది. క్రైస్తవ వివాహంలో వాడే తాళిబొట్టు, పసుపు బియ్యం, వరకట్నం లాంటివి పాశ్చాత్య క్రైస్తవ వివాహ వ్యవస్థలో లేవు. కానీ భారత క్రైస్తవులు ఇక్కడి సంస్కృతి ప్రభావంతో ఆ సంప్రదాయాలను ఆచరిస్తున్నారు. 

విడాకులు: బైబిల్‌ ప్రకారం విడాకులు తీసుకోవడం పాపం.భారత విడాకుల చట్టం 1896 ప్రకారం కింది పరిస్థితుల్లో విడాకులు మంజూరు చేస్తారు. అలాగే కింది పరిస్థితుల్లో భర్త నుంచి క్రైస్తవ స్త్రీ విడాకులు పొందవచ్చు.

* భర్త క్రైస్తవ మతాన్ని విడిచి వేరే మతాన్ని స్వీకరించినప్పుడు. 

* భర్త వదిలేసినప్పుడు.

* భర్త వివాహేతర సంబంధం కలిగి ఉన్నప్పుడు.

* వేరే స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు.

* భార్యతో బలవంతంగా లైంగిక సంభోగం జరిపినప్పుడు.

* భర్త రెండు సంవత్సరాలు కనిపించకుండా పోయినప్పుడు.

* క్రూరత్వం కలిగి ఉన్నప్పుడు

క్రైస్తవ వివాహచట్టం - 1872 ప్రకారం భార్య నుంచి పురుషుడు విడాకులు పొందవచ్చు. ఈ వివాహ వ్యవస్థలో బాల్యవివాహాలు జరిగినట్లుగా ఆధారాలు లేవు. వితంతువులు పునర్వివాహాలు చేసుకోవచ్చు.

 

క్రైస్తవ స్త్రీ అంతస్థు: బైబిల్‌ ప్రకారం స్త్రీ, పురుషులు సమానం. వితంతు పునర్వివాహాలు, విడాకుల హక్కును క్రైస్తవ స్త్రీలు కలిగి ఉంటారు.  వీరు అన్ని రంగాల్లో పురుషులతోపాటు సమానంగా పాల్గొనవచ్చు.

 

ముఖ్యాంశాలు: * క్యాథలిక్కుల క్రైస్తవ మత వ్యాప్తికి ప్రధాన కేంద్రం రోమన్‌ చర్చి.

* 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో క్రైస్తవులు 2.3 శాతం (2.78 కోట్లు) 

* భారత్‌లో 3వ పెద్ద మతం క్రైస్తవం.

* క్యాథలిక్‌ విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడిన మత శాఖ ప్రొటెస్టంట్లు.

* రోమన్‌ క్యాథలిక్‌ శాఖ 16వ శతాబ్దంలో పోర్చుగీసు, ఇటలీ దేశాల నుంచి మనదేశంలోకి ప్రవేశించింది.

* భారత్‌లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది ప్రొటెస్టంట్‌ సంఘాలు

* పాప పరిహార పత్రాల పేరు ఇండల్జన్‌.

సంఘాలు: * చర్చ్‌ ఆఫ్‌ నార్త్‌ ఇండియా * చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా * ప్రెస్బిటేరియన్‌ చర్చ్‌ ఇండియా

దర్శనీయ స్థలాలు
                                       

చర్చి పేరు ప్రదేశం
మెదక్‌ చర్చి తెలంగాణ
సీకేథడ్రల్‌ గోవా
మళమత్తుర్‌ కేరళ
వేలంకని చర్చి తమిళనాడు
వల్లార్‌ పదమ్‌ కొచ్చిన్‌ (కేరళ)
సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కొచ్చిన్‌(కేరళ)
పెరుమల తిరుమేని మన్నార్, కేరళ
బాసిలికా ఆఫ్‌ బామ్‌ జీసస్‌ గోవా

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ తెలంగాణ సామాజిక పరిస్థితులు

‣  భారతీయ సమాజం

‣ బంధుత్వం - అనుబంధం

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 02-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌