• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ ప్రవేశిక 

      మన రాజ్యాంగానికి ముందు మాటే ప్రవేశిక. రాజ్యాంగం లక్ష్యాలు, ఆశయాలు, ఆదర్శాలను ప్రవేశిక వివరిస్తుంది. రాజ్యాంగంలో స్థూలంగా, సుదీర్ఘంగా ఉన్న అంశాలను ఇందులో తాత్వికంగా పొందుపరిచారు. రాజ్య స్వభావాన్ని ఇది వివరిస్తుంది. మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ ప్రవేశికలో గొప్ప పదజాలాన్ని, భావజాలాన్ని పొందుపరిచారు. ప్రవేశిక రాజ్యాంగానికి తాత్విక పునాదిగా పేర్కొనవచ్చు.
      'భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక (సార్వభౌమాధికార), సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రంగా ప్రకటిస్తున్నాం. భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, నమ్మకం, విశ్వాసం, ఆరాధనలో స్వేచ్ఛను, హోదా, అవకాశాల్లో సమానత్వాన్ని కల్పించి ప్రజలందరిలో సమైక్యతను అఖండతా భావాన్ని, సోదరభావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందిస్తామని, రాజ్యాంగ పరిషత్ ద్వారా ఈ 26 నవంబరు 1949న మాకు మేము రూపొందించుకుని సమర్పించుకుంటున్నాం'.


పై ప్రవేశిక వల్ల మనకు తెలుస్తున్న విషయాలు:
1. రాజ్యాంగ ఆధిక్యానికి ఆధారం: ప్రవేశిక ప్రకారం ఈ దేశంలో రాజ్యాంగ ఆధిక్యానికి, అధికారానికి ప్రజలే ఆధారం. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రజల వల్ల రూపొంది, ప్రజలు తమకు తాము సమర్పించుకున్నదని ప్రవేశికలో పేర్కొన్నారు.
2. రాజ్య స్వభావం: భారతదేశాన్ని ఒక సర్వసత్తాక (సార్వభౌమాధికార), సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మన ప్రవేశిక ప్రకటిస్తోంది.
3. రాజ్యాంగ ఆశయాలు: దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించడమే రాజ్యాంగ ఆశయంగా మనకు కనిపిస్తుంది.

 

సార్వభౌమాధికారం
      సార్వభౌమాధికారం అంటే రాజ్యం ఒక సర్వ స్వతంత్రమైన వ్యవస్థ అని అర్థం. అంతర్గతంగా భారత రాజ్యం వ్యక్తులందరిపై, సమూహాలన్నింటిపై, సంస్థలన్నింటిపై తన అధికారం కలిగి ఉంటుందని, బహిర్గతంగా ఏ ఒక్క రాజ్యం జోక్యాన్ని సహించదని అర్థం. అయితే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కామన్వెల్త్ సభ్యత్వం స్వీకరించాలా వద్దా అనే ప్రశ్న తలెత్తింది. నెహ్రూ అభిప్రాయం ప్రకారం కామన్వెల్త్ సభ్యత్వం వల్ల దేశ సార్వభౌమాధికారానికి ఎలాంటి ముప్పు వాటిల్లదు. అంతర్జాతీయ సహకారాన్ని ఇచ్చి పుచ్చుకునే తత్వాన్ని దేశాలు పెంపొందించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
* మన దేశంలా స్వతంత్య్రం సంపాదించుకున్న చాలా తృతీయ ప్రపంచ దేశాలకు ప్రచ్ఛన్న యుద్ధం (Cold war) రూపంలో పెద్ద సమస్య తలెత్తింది. అమెరికా, అప్పటి USSR మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధంలో పాలుపంచుకుని తమ దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టుపెట్టకూడదని నెహ్రూ (భారతదేశం), నాజర్ (ఈజిప్ట్), టిటొ (యుగోస్లేవియా), సుకర్ణో (ఇండోనేషియా) లాంటి తృతీయ ప్రపంచ నాయకులు అలీనోద్యమాన్ని (Non-AlignedMovement) తీసుకొచ్చారు. అగ్రరాజ్యాల సామ్రాజ్యవాద కాంక్షలను నిరోధిస్తూ తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ ప్రపంచ శాంతిని నెలకొల్పడం ఈ అలీనోద్యమ ధ్యేయం.

 

సామ్యవాదం
      ఆస్తిలోనూ, సామాజిక హోదాలోనూ హెచ్చుతగ్గులను నివారించడమే సామ్యవాదం ఉద్దేశం. 1917లో రష్యాలో లెనిన్ సామ్యవాద విప్లవం తీసుకొచ్చిన తర్వాత ఈ రాజకీయ భావజాలం ప్రపంచాన్ని, ముఖ్యంగా తృతీయ ప్రపంచ దేశాలను ఆకర్షించింది.
* 1929 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కేవలం పూర్వపు USSR మాత్రమే తట్టుకుని నిలబడగలిగింది. ఇది గమనించిన మన జాతీయోద్యమ నాయకులు సామ్యవాదం పట్ల ఆకర్షితులయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ వారిలో ప్రముఖులు. మన రాజ్యాంగ రచనలోనూ మనకు సామ్యవాద స్ఫూర్తి కనిపిస్తుంది. ఆదేశిక సూత్రాల్లో సామ్యవాద లక్షణాలను చేర్చారు.
* 'సామ్యవాదం' అనే పదం మన రాజ్యాంగ రచనా సమయంలో ప్రవేశికలో లేదు. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాన్ని చేర్చారు. అంతవరకు రాజ్యాంగంలో ఉన్న ఒక అంశాన్ని, విలువను ఒక పదంగా ప్రవేశికలో చేర్చారు.
* 1955లోనే నెహ్రూ ఆవడిలో (ఇప్పటి చెన్నైకి సమీపాన ఉంది) జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 'సామ్యవాద సమాజం' కాంగ్రెస్ లక్ష్యంగా పేర్కొన్నారు. అయితే 1960, 1970 దశకాల్లో ఇందిరాగాంధీ తన రాజకీయ అవసరాల రీత్యా రాజకీయాలకు సామ్యవాద హంగు చేకూర్చారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాలను రద్దు చేయడం, గరీబీ హఠావో నినాదం ఇవ్వడం, ప్రవేశికలో 'సామ్యవాదం' అనే పదాన్ని జోడించటం లాంటి అంశాలను ఇందులో భాగంగానే పరిగణించాలి.

 

లౌకిక రాజ్యం 
      మత ప్రమేయం లేని రాజ్యాన్ని 'లౌకిక రాజ్యం' అంటారు. మత ప్రమేయం లేనిది అంటే ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించే అవకాశం కల్పించే రాజ్యవ్యవస్థ అని. మన రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో 25 నుంచి 28 వరకు ఉన్న అధికరణాలు మత స్వేచ్ఛ గురించి పేర్కొంటున్నాయి.
* 'లౌకిక' అనే పదాన్ని కూడా 1976లో (సామ్యవాదంలాగే) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు.
* లౌకికత (Secular) అనేది ఆధునిక రాజ్యవ్యవస్థకు ఉండాల్సిన ఒక తప్పనిసరి లక్షణం.
* మాకియవెల్లి లాంటి రాజనీతి శాస్త్రజ్ఞులు మతం నుంచి రాజకీయాలను వేరు చేయాలని గట్టిగా వాదించారు. తర్వాతి కాలంలో జాతీయ రాజ్యాల ఆవిర్భావానికి, పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడటానికి మధ్యయుగాల్లో రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయడం ఒక పునాదిగా పేర్కొనవచ్చు.

 

ప్రజాస్వామ్యం 
      లౌకిక రాజ్యంలాగే ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా మనం పాశ్చాత్య దేశాల నుంచి అందిపుచ్చుకున్న గొప్ప అంశం. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో తొలుత ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థను నెలకొల్పినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో Democracy అంటారు. Demos అంటే ప్రజలు, Kratos అంటే పాలన. పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రభుత్వం రాణిస్తుంది. అందుకే రూసో 'ప్రజా వాక్కే దైవ వాక్కు' అన్నారు.
* ఇంగ్లండ్ వలస పాలన వల్ల భారత జాతీయోద్యమ నాయకత్వానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం పట్ల అవగాహన ఏర్పడింది. ఇప్పుడు మన దేశమే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ ఓటు వేసేందుకు అర్హులు. (రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇది 21 సంవత్సరాలుగా ఉండేది. అయితే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 18 సంవత్సరాలు చేశారు.)

 

గణతంత్రం 
      రాజ్యాధినేత వంశపారంపర్యంగా కాకుండా (ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ) ఎన్నికైతే అలాంటి రాజకీయ వ్యవస్థను గణతంత్రం అంటారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని సంరక్షించే మహత్తర బాధ్యత కలిగిన రాష్ట్రపతి ఒక ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నికవుతారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి (26 జనవరి 1950) భారతదేశం ఒక బ్రిటిష్ dominio (అధినివేశ ప్రతిపత్తి కలిగిన దేశం)గా కాకుండా ఒక గణతంత్ర రాజ్యంగా ఏర్పడిందని చెప్పొచ్చు.
 

న్యాయం 
      రాజ్యాంగ ప్రవేశిక ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందాలని ప్రవచిస్తోంది. రాజ్యాంగంలోని 38 (1)వ అధికరణం రాజ్యం ప్రజలందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయబద్ధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను నెలకొల్పాలని అభిప్రాయపడుతోంది.
* సామాజిక న్యాయం కోసం రాజ్యాంగంలో ఎన్నో అంశాలను పొందుపరిచారు.
ఉదా: 17వ అధికరణం అంటరానితనాన్ని నిషేధిస్తుంది.
* ప్రజలందరికీ ఆర్థిక న్యాయం అందాలనే ఉద్దేశంతో వెట్టిచాకిరిని నిషేధించారు. (24 వ అధికరణం)
* ప్రజలందరూ రాజకీయ కార్యకలాపాల్లో స్వేచ్ఛగా పాల్గొంటేనే రాజకీయ న్యాయం సాధించినట్లు. 325 వ అధికరణం ఏ వ్యక్తి అయినా రాజకీయ హక్కుల వినియోగంలో ఎలాంటి మత, జాతి, లింగ వివక్షకు గురికాకూడదని అభిప్రాయపడుతోంది.

 

స్వేచ్ఛ 
      1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవ నినాదాల్లో 'స్వేచ్ఛ' ముఖ్యమైంది. లాటిన్ పదమైన Liber నుంచి Liberty అనే ఆంగ్ల పదం ఉద్భవించింది. Liberty (స్వేచ్ఛ) అంటే బానిసత్వం, నియంతృత్వం, నియంత్రణ నుంచి విముక్తి. ప్రజల రోజువారీ జీవితాల్లో ప్రభుత్వ నియంత్రణ, జోక్యం ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని ఉదారవాదులు (స్వేచ్ఛావాదులు) విశ్వసిస్తారు.
* ప్రాథమిక హక్కుల్లో 19 నుంచి 22వ అధికరణం వరకు స్వేచ్ఛా హక్కులను రాజ్యాంగం ప్రతిపాదిస్తోంది.
* 19వ అధికరణం పౌరులకు ఆరు రకాల స్వాతంత్య్రాలను కల్పిస్తోంది. అవి ఉపన్యాస, భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, స్థిర నివాసం ఏర్పరుచుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు, నచ్చిన వృత్తిని, వ్యాపకాన్ని ఎంచుకునే స్వేచ్ఛ.

 

సమానత్వం 
      ఇది కూడా ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి నినాదం. 'సమానత్వం' అంటే సమానమైన అవకాశాల కల్పన. భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ సమానమైన హక్కులు కల్పించారు. అలాగే ఒక వ్యక్తి లేదా ఒక వర్గం వేరొకరిని పీడించేందుకు వీల్లేదు. రాజ్యాంగం 14 నుంచి 18వ అధికరణం వరకు సమానత్వ హక్కుల గురించి పేర్కొంటోంది. ముఖ్యంగా ఇక్కడ 14వ అధికరణం గురించి చెప్పుకోవాలి. 'చట్టం ముందు అందరూ సమానమే' అని ఈ అధికరణం స్పష్టం చేస్తోంది. ఈ భావనను బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
 

సౌభ్రాతృత్వం 
      స్వేచ్ఛ, సమానత్వంలా ఇది కూడా ఫ్రెంచ్ విప్లవ నినాదమే. సౌభ్రాతృత్వం అంటే సోదరభావం. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం సౌభ్రాతృత్వం పౌరుల్లో జాతీయ ఐక్యత, సమగ్రతా భావాన్ని నింపుతూనే వ్యక్తి గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఉండాలి. ఇక్కడ సమగ్రత అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అలాగే రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల్లో (51 - A అధికరణం) 5వ అంశం మత, భాష, ప్రాంతీయ వర్గ విభేదాలకు అతీతంగా దేశ ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించాలని చెబుతోంది.
 

ప్రవేశిక విశిష్టత 
* ఎర్నెస్ట్ బార్కర్ అనే ప్రముఖ రాజనీతి తత్వవేత్త మన రాజ్యాంగ ప్రవేశికను 'Principles of Social and Political Theory' అనే తన పుస్తకానికి తొలి పలుకుగా ఉపయోగించారు.
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన ఎం. హిదయతుల్లా ప్రవేశిక మన రాజ్యాంగానికి ఆత్మ లాంటిదని పేర్కొన్నారు.
* మహావీర్ త్యాగి లాంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని పేర్కొన్నారు. అలాగే 1960లో సుప్రీంకోర్టు బేరూ-బారీ వివాదంలో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని వివరించింది. అయితే కేశవానంద భారతి వివాదంలో (1978) ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదే విషయాన్ని ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వివాదంలో (1995) మరోసారి పునరుద్ఘాటించింది.

 

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌