• facebook
  • whatsapp
  • telegram

దళిత ఉద్యమాలు

తరాల వివక్షపై తిరుగుబాటు!

  హిందూ సమాజంలో ఆది నుంచి అణచివేతకు గురైన దళితులను జాగృతం చేసేందుకు తెలంగాణలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే చైతన్యశీల ఉద్యమాలు జరిగాయి. ఫూలే బాటలో పలువురు అభ్యుదయవాదులు దళితుల సామాజిక, రాజకీయ ఉన్నతికి కృషి చేశారు. అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. అణగారిన ప్రజల అభివృద్ధికి ఆటంకంగా మారిన సాంఘిక దురాచారాలను ఎదిరించారు. నిమ్నవర్గాల వారిలో విద్య, ఆత్మగౌరవం పెంపొందించేందుకు కృషి చేశారు. అలాంటి మహనీయులు, వారు నెలకొల్పిన సంస్థలు, పత్రికలు, వాటి ప్రభావం గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

  హైదరాబాద్‌లో 20వ శతాబ్దపు తొలి దశాబ్దంలో అస్పృశ్యత, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. భాగ్యరెడ్డివర్మ నాయకత్వంలో ఆదిహిందూ ఉద్యమం పేరుతో దళిత ఉద్యమం జరిగింది. ఈయన దళిత అభ్యున్నతి కోసం అనేక సంస్థలను స్థాపించారు.

 

ఆదిహిందూ ఉద్యమం: సంఘసంస్కర్త అయిన భాగ్యరెడ్డి వర్మ (1888-1939) హైదరాబాద్‌లో జన్మించారు. ఈయన అసలు పేరు భాగయ్య. హైదరాబాద్‌లో దళిత ఉద్యమానికి పునాది వేశారు. అందుకోసం ఆదిహిందూ ఉద్యమాన్ని ప్రారంభించారు. సమాజంలో నిమ్న వర్గాలుగా ఉన్న దళితుల హక్కుల కోసం పోరాడారు. ఆదిహిందువులే ఈ దేశ మూలవాసులని, అగ్రవర్ణాల వారు ఆర్యులని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన అగ్రవర్ణ కులస్థులు దళితులపై పెత్తనం చెలాయించడాన్ని ఖండించారు. ఈయన 1906లో అస్పృశ్యతా నిర్మూలన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయనపై బ్రహ్మసమాజ ప్రభావం ఉంది.

 

న్యాయ పంచాయతీలు: భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌లో దళితుల సమస్యలను పరిష్కరించడానికి న్యాయపంచాయతీలను ఏర్పాటు చేశారు. అవి ప్రభుత్వ న్యాయస్థానాల్లా పనిచేసేవి. భాగ్యరెడ్డి వర్మ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించేవారు. కేంద్ర న్యాయ పంచాయతీ హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లోని ఆదిహిందూ సోషల్‌ సర్వీస్‌ లీగ్‌ భవనంలో కొలువుదీరేది. ఆదిహిందూ భవనంలో గ్రంథాలయం, పఠనాలయం, బాలబాలికలకు పాఠశాలలు నిర్వహించేవారు. హరిజనుల సమస్యల పరిష్కారం కోసం భాగ్యరెడ్డి వర్మ ‘హైదరాబాదు’ అనే తెలుగు వారపత్రికను నడిపారు.

 

జగన్‌ మిత్ర మండలి: భాగ్యరెడ్డి వర్మ ‘జగన్‌ మిత్ర మండలి’ అనే సంస్థను 1906లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సభ్యులు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 1925లో హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వీరు రోగులకు సేవలందించారు.

* భాగ్యరెడ్డి వర్మ స్వస్తిక్‌దళ్‌ అనే సంస్థను 1915లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సభ్యులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈయన ఇంకా ఆదిహిందూ వాలంటీర్‌ దళం, దేవదాసీ నిర్మూలనా సంఘం వంటి సంస్థలను ఏర్పాటుచేశారు. జగన్‌ మిత్రమండలి 1911 నాటికి మన్య సంఘంగా మారింది. ఇది బాల్య వివాహాలను నిరోధించడం, దేవదాసీ, జోగిని లాంటి సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పనిచేసింది. ధర్మవీర వామన్‌నాయర్, పాండురంగ జోషి, మాడపాటి హనుమంతురావు సహాయంతో భాగ్యరెడ్డి వర్మ అంబర్‌పేటలో హిందూ శ్మశానవాటికను ఏర్పాటు చేశారు.

 

ఆదిహిందూ సామాజిక సేవా సమాఖ్య: భాగ్యరెడ్డి వర్మ 1921లో ఆదిహిందూ సామాజిక సేవా సమాఖ్యను ఏర్పాటు చేశారు. మొదటి ఆదిహిందూ సదస్సు 1921లో హైదరాబాద్‌లో జరిగింది. ఈ సదస్సుకు టి.జె.పాపన్న (బెల్గాం వాసి) అధ్యక్షత వహించారు. 1924 వరకు జరిగిన ఆదిహిందూ మహాసభలకు కేశవరావు, వామన్‌ నాయర్, రాజాధన్‌ రాజ్‌గిర్‌ అధ్యక్షత వహించారు. 1930లో జోగిపేటలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ సమావేశంలో భాగ్యరెడ్డి పాల్గొని అంటరానితనం నిర్మూలన, హరిజన విద్యాభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు చేయించారు. 1931లో జరిగిన రెండో ఆంధ్ర మహాసభలో ఈయన ఆదిహిందువుల హక్కుల కోసం అనేక ప్రతిపాదనలు చేయగా, అవన్నీ నెగ్గాయి. ఈ సమావేశంలో మాటూరి బలరామయ్య, చిత్తారయ్య, అరిగె రామస్వామి లాంటి దళిత నాయకులు పాల్గొన్నారు. ఆదిహిందూ ఉద్యమ ప్రచారం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అనేక నాటకాలు వేశారు. వీటిలో ప్రధానమైంది ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం.

 

జాగృతి కోసం..

  1925లో భాగ్యరెడ్డి వర్మ ఆదిహిందూ వర్గాల కళాకారులను ప్రోత్సహించడానికి, జాగృతం చేయడానికి వారు  వేసిన పెయింటింగ్‌లు, చేసిన శిల్పాలతో ప్రదర్శనను హైదరాబాదులోని రెసిడెన్సీ బజారులో ఏర్పాటు చేశారు. ప్రేమ్‌ థియేటర్‌ మైదానంలో ఆదిహిందూ యూత్‌ జిమ్నాస్టిక్స్‌ పోటీలను నిర్వహించారు. 1931లో బౌద్ధం వైపు ఆకర్షితుడైన భాగ్యరెడ్డి వర్మ వైశాఖ పౌర్ణమి రోజు మొదటిసారిగా బుద్ధ జయంతిని నిర్వహించారు. పద్మజా నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, చంద్రవర్మ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరి బుద్ధ జయంతి 1937, మే 25న వర్మ నేతృత్వంలో జరిగింది. ఈయన ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఆత్మగౌరవ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 1917లో బెజవాడలో జరిగిన పంచమ సదస్సుకు అధ్యక్షత వహించారు.

  ఆర్యసమాజం తరఫున బాజీ కృష్ణారావు 1913లో భాగ్యరెడ్డికి ‘వర్మ’ అనే బిరుదును ప్రదానం చేశారు. భాగ్యరెడ్డి వర్మకు హైదరాబాద్‌లో ధర్మవీర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో జరిగిన సభలో ‘శివశ్రేష్టి’ అనే బిరుదు ఇచ్చారు. 1921 మార్చిలో ఆదిఆంధ్ర సమావేశంలో వర్మకు సంఘమాన్య బిరుదు ఇచ్చారు. 1925లో గుంటిమల్ల రామప్ప నాయకత్వంలో మాతంగ జనసభ ఏర్పాటు చేశారు. 1927లో మల్లేపల్లిలో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన మాతంగ సభ జరిగింది. 1937లో అరుంధతీయుల్లో చైతన్యానికి జాంబవర్ణ సేవాసమితి కృషి చేసింది. గాంధీజీ 1929లో భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన ఆదిహిందూ సోషల్‌ సర్వీస్‌ లీగ్, ఆదిహిందూ పాఠశాలను సందర్శించి ఆయన పనితీరును ప్రశంసించారు.

 

విద్యాసంస్థలు

  1910లో ఇసామియా బజారు, లింగపల్లిలో దళితుల కోసం ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఎం.ఎల్‌.ఆదయ్య సికింద్రాబాదులో ఆదిహిందూ పాఠశాలను ప్రారంభించారు. 1934 నాటికి 26 పాఠశాలలను ఏర్పాటుచేశారు. వీటన్నింటినీ నిజాం ప్రభుత్వం చేపట్టి నడిపింది. భాగ్యరెడ్డి వర్మ దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు ‘దేవదాసీ నిర్మూలన సంఘాన్ని’ స్థాపించారు. ఆయన కృషి వల్లే నిజాం ప్రభుత్వం దేవదాసీ వ్యవస్థను నిర్మూలిస్తూ ఫర్మానా జారీ చేసింది.

 

మరికొందరు మహామహులు

  బి.ఎస్‌. వెంకటరావు: ఈయన పుణెలో ఫూలే నడిపిన ఉద్యమాలతో స్ఫూర్తి పొందారు. ‘హైదరాబాదు అంబేడ్కర్‌’గా పేరుగాంచిన వెంకటరావు దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు పాటుపడ్డారు. 1922లో ఆదిద్రవిడ సంఘాన్ని స్థాపించారు. 1936లో అంబేడ్కర్‌ యూత్‌ లీగ్‌ను ఏర్పాటుచేసి దళిత యువకుల ప్రగతి కోసం శ్రమించారు. 1938లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు సభ్యుడిగా, 1939లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కౌన్సెలర్‌గా, 1946లో స్థానిక సంస్థల తరఫున హైదరాబాద్‌ శాసనసభ సభ్యుడిగా, 1947లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1936 మేలో పుణెలో మహర్‌ మహాసభకు అధ్యక్షత వహించారు. 1934లో హైదరాబాదు ప్రధాని అక్బర్‌ హైదరీని కలిసి దళితులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని, జనాభా ప్రాతిపదికన వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నిజాం నవాబును ఒప్పించి దేశంలోనే తొలిసారిగా రూ.కోటితో షెడ్యూల్డ్‌ కులాల ట్రస్ట్‌ ఫండ్‌ పేరుతో దళిత సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయించిన ఘనత వెంకటరావుదే. చిన్న చిన్న దళిత సంఘాలన్నింటినీ కలిపి 1938లో హైదరాబాదు డిప్రెస్డ్‌ క్లాసెస్‌ అసోసియేషన్‌గా ఏర్పాటు చేశారు. అరుంధతీ నాయకుడిగా ప్రసిద్ధిగాంచిన సుబేదార్‌ సాయన్న అధ్యక్షతన 1925లో ఆదిహిందూ బస్తీల్లో అనేక సభలు జరిగాయి. ‘జీవదయ ప్రచారసభ’ను స్థాపించి జంతుబలికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిలో భాగ్యరెడ్డి వర్మ, మల్లేశ్‌రావు, చిత్తారయ్య, అరిగె రామస్వామి, బలరామయ్య ముఖ్యులు. 1937లో అరుంధతీయుల్లో చైతన్యం కోసం ‘జాంబవర్ణ సేవాసమితి’ ఏర్పడింది.

  బత్తుల శ్యాంసుందర్‌: ఈయన 1942, మే 30న మరట్వాడ పర్బనీలో జరిగిన డిప్రెస్డ్‌ క్లాసెస్‌ మహాసభకు అధ్యక్షత వహించారు. వెంకటరావుతో కలిసి దళిత జాతుల సమాఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అంబేడ్కర్‌ స్థాపించిన షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. 1944లో నాగ్‌పుర్‌లో జరిగిన అఖిల భారత షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ ఫెడరేషన్‌ మహాసభకు హైదరాబాదు నాయకులతో కలిసి హాజరయ్యారు. 1954లో ఆల్‌ ఇండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ అసోసియేషన్‌కు అధ్యక్షులయ్యారు. 1968లో భారతీయ భీమసేనను స్థాపించారు. ‘అవర్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఎమాన్సిపేషన్‌’ పుస్తక రచయిత పి.ఆర్‌.వెంకటస్వామి ఒక సందర్భంలో శ్యాంసుందర్‌ దళితోద్యమ ప్రవేశాన్ని ‘రెడ్‌లెటర్‌ డే’ గా అభివర్ణించారు.

 

పత్రికలు

తెలంగాణలో అచ్చయిన మొదటి దళిత పత్రిక ‘ది పంచమ’ 1918, డిసెంబరు 31న జె.ఎస్‌.ముత్తయ్య సంపాదకత్వంలో వెలువడింది. ఇది ఆంగ్ల మాసపత్రిక, హైదరాబాదులో ప్రచురితమయ్యేది. దీనిలో దళితుల స్థితిగతులు, ఉపకులాల గురించి చర్చించేవారు. 1936లో భాగ్యరెడ్డి వర్మ ‘భాగ్యనగర్‌’ అనే పత్రికను స్థాపించారు. ఇది ‘ఆదిహిందూ’ అని పేరు మార్చుకుని మాసపత్రికగా నడిచింది. 1926లో హైదరాబాదులోని చాదర్‌ఘాట్‌ నుంచి ‘ఆదిశక్తి’ అనే తెలుగు మాసపత్రిక నడిచేది.

 

హరిజన్‌: ‘నవజీవన్‌’ అనే గుజరాతీ పత్రికకు ఒక పాఠకుడు సూచించిన పదమే ‘హరిజన్‌’. ఈ పదాన్ని గాంధీజీ తన ఉపన్యాసాలు, వ్యాసాల్లో వాడటం వల్ల ప్రాచుర్యంలోకి వచ్చింది. 1937లో గాంధీజీ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు ‘హరిజన్‌’ పదాన్ని పిసరి వీరన్న (కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో దళితుల వెట్టిచాకిరీ నిర్మూలన ఉద్యమ నాయకుడు) వ్యతిరేకించారు. తాము ఆదిహిందువులం అన్నాడు. 1937, డిసెంబరు 19న మజ్లిస్‌ ఎఖ్వనిన్‌ సంస్కరణలపై ఆదిహిందువుల 43 శాఖల సమావేశం భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో బి.ఎస్‌.వెంకటరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో హైదరాబాద్‌ రాష్ట్ర విస్తరణకు కాశీనాథరావు వైద్య రూపొందించిన అనధికార బిల్లుపై భాగ్యరెడ్డి వర్మ మాట్లాడారు. ఆదిహిందువులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండే 10 నియోజక వర్గాలు కేటాయించాలని తీర్మానం చేయించాడు. 1939లో భాగ్యరెడ్డి వర్మ మరణానంతరం దళిత ఉద్యమాన్ని కొనసాగించిన వారిలో టి.వి.నారాయణ ముఖ్యుడు. ఐక్యరాజ్య సమితిలో నిజాం ప్రతినిధిగా వ్యవహరించిన వి.శ్యాంసుందర్‌ రాసిన ‘దే బర్న్‌’ అనే గ్రంథం ఆనాటి హైదరాబాద్‌ దళితుల స్థితిగతులను తెలుపుతుంది.

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

Posted Date : 20-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌