• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానులు

క్రీ.శ.1206లో మహ్మద్‌ఘోరీ మరణానంతరం కుతుబుద్దీన్‌ ఐబక్‌ ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత క్రీ.శ.1526 వరకు అంటే సుమారు మూడు శతాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు పరిపాలించాయి. వీరు సువిశాల సామ్రాజ్య స్థాపనతోపాటు ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేశారు.

బానిస వంశం
  బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్‌ ఐబక్‌. ఇతడు క్రీ.శ.1206లో తన యజమాని మహ్మద్‌ఘోరీకి వారసులు లేకపోవడం వల్ల తన స్వాతంత్య్రాన్ని భారతదేశంలో ప్రకటించుకొని క్రీ.శ.1210 వరకు పరిపాలించాడు. ఇతడి వారసుల్లో ఇల్‌టుట్‌మిష్, రజియా సుల్తానా, ఘియాజుద్దీన్‌ బాల్బన్‌ ప్రముఖులు. ఈ వంశాన్నే మామ్లూక్‌ వంశంగా పేర్కొంటారు. వీరు 1206 నుంచి 1290 మధ్య పరిపాలించారు.


కుతుబుద్దీన్‌ ఐబక్‌ 
బానిసగా జీవితాన్ని ప్రారంభించిన ఐబక్‌ తన శక్తి సామర్థ్యాలతో ఘోరీ మహ్మద్‌  సేనానిగా ఎదిగాడు. తరైన్‌ యుద్ధాలు, ఘోరీ భారతదేశ దండయాత్రల్లో పాల్గొన్న ఐబక్, భారతదేశంలో ఘోరీ ప్రతినిధిగా నియమితుడయ్యాడు. ఢిల్లీని ఆక్రమించుకున్నందుకు గుర్తుగా ‘కువ్వత్‌-ఉల్‌-ఇస్లామ్‌’ అనే మసీదును నిర్మించాడు. ఘోరీ మరణానంతరం క్రీ.శ. 1206లో ఐబక్‌ స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతడి అధికారాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసిన బెంగాల్‌ పాలకుడు అలీమర్థాన్‌ను అణచివేసి ఆయన స్థానంలో మహ్మద్‌ షెరాన్‌ను గవర్నర్‌గా నియమించాడు. ఘజనీ పాలకుడైన తాజ్‌-ఉద్దీన్‌-యల్‌డజ్‌ ఢిల్లీపై దండెత్తగా అతడిని ఓడించాడు. అజ్మీర్‌లో ‘అర్హిదిన్‌ కా జోంప్రా’ అనే మసీదును నిర్మించాడు. లాహోర్‌ను రాజధానిగా చేసుకుని పాలించాడు. తన రెండో రాజధానిగా ఢిల్లీని ప్రకటించాడు (ఢిల్లీని పూర్తి రాజధానిగా చేసింది ఇల్‌టుట్‌మిష్‌). భారతదేశంలో ఇస్లాం రాజ్యస్థాపనకు గుర్తుగా ఢిల్లీలో కుతుబ్‌మీనార్‌ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కుతుబ్‌మీనార్‌ అనేది తన గురువు కుతుబుద్దీన్‌ భక్తియార్‌ కాకి  సమాధి. ఐబక్‌ తన దానగుణం వల్ల లాక్‌భక్ష్గా పిలవబడ్డాడు. ఇతడు 1210లో లాహోర్‌లో చౌగాన్‌ (పోలో) ఆడుతూ గుర్రంపై నుంచి పడి మరణించాడు. అనంతరం అతడి కుమారుడు ఆరామ్‌షా (ఆరామ్‌భక్ష్) పాలకుడయ్యాడు. 

ఇల్‌టుట్‌మిష్‌ (క్రీ.శ.1211 - 1236)
   ఆరామ్‌షాను పదవి నుంచి తొలగించి ఇల్‌టుట్‌మిష్‌ క్రీ.శ.1211లో సుల్తాన్‌ పదవిని చేపట్టాడు. ఇతడు ఐబక్‌ అల్లుడు. ఇతడు ఐబక్‌ మరణించే నాటికి బదయాన్‌ (బదక్షాన్‌) ప్రాంత గవర్నర్‌గా ఉన్నాడు. ఇల్‌టుట్‌మిష్‌ ఇల్బారీ తెగకు చెందినవాడు. అసలు పేరు ష్‌మ్స్‌ - ఉద్దీన్‌ - ఇల్‌టుట్‌మిష్‌. ఖలీఫా నుంచి భారతదేశ సుల్తాన్‌గా అనుమతి పత్రం పొందిన తొలి ఢిల్లీ సుల్తాన్‌ ఇతడే. ఢిల్లీని శాశ్వత రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఘజనీ పాలకుడు తాజ్‌వుద్దీన్‌ యల్‌డజ్‌ను, ముల్తాన్‌ పాలకుడు నాసిరుద్దీన్‌ కుబాచాను ఓడించాడు. విశాల సామ్రాజ్య స్థాపన చేశాడు. చెంఘీజ్‌ఖాన్‌ నాయకత్వంలోని మంగోలుల దాడులను సమర్థంగా తిప్పికొట్టాడు. ఇతడి కాలంలోనే 40 మంది తురుష్క సర్దారుల  కూటమి చిహల్‌గనీ ఏర్పడింది. ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యంలో ‘ఇక్తా’ అనే సైనిక విధానాన్ని ప్రవేశపెట్టాడు. నాటి సైనిక రాష్ట్రాలను ఇక్తాలు, వాటి అధిపతిని ముక్తీ అని పిలిచేవారు. ఇతడు ఢిల్లీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా ‘హౌజ్‌-ఇ-సుల్తానీ’ అనే రాజుల స్నాన ఘట్టాన్ని నిర్మించాడు. ఐబక్‌ ప్రారంభించిన కుతుబ్‌మీనార్‌ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. టంకా అనే వెండి నాణేలు, జితాల్‌ అనే రాగి నాణేలను ముద్రించాడు.  ఇతడికి గల పరమత ద్వేషం వల్ల భిల్సా, ఉజ్జయిని దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ప్రముఖ చరిత్రకారుడు ఆర్‌.పి.త్రిపాఠీ ప్రకారం భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారాన్ని నెలకొల్పినవారు ఇల్‌టుట్‌మిష్‌. తన ఆస్థానంలో మిన్హజ్‌-ఉస్‌-సిరాజ్‌ (మిన్హజుద్దీన్‌ షిరాజ్‌), తాజుద్దీన్‌ లాంటి కవులను పోషించాడు. 

ఘియాజుద్దీన్‌ బాల్బన్‌ (క్రీ.శ.1266 - 1287)
     బానిసవంశ పాలకుల్లో గొప్పవాడు బాల్బన్‌. ఇతడు బానిసగా, తోటమాలిగా, నీరు మోసేవాడిగా, సేనానిగా, సర్దార్‌గా చివరకు సుల్తాన్‌గా అనేక పాత్రలను పోషించాడు. బానిసగా భారతదేశానికి వచ్చిన బాల్బన్‌ ఇల్‌టుట్‌మిష్‌ కొలువులో చేరి చిహల్‌గనీ కూటమిలో ప్రధానపాత్ర పోషించాడు. తన శక్తి సామర్థ్యాల ద్వారా ఖాస్‌దార్, అమీర్‌-ఇ-షకార్‌ లాంటి పదవులను పొందాడు. రజియా సుల్తానా మరణానంతరం బహరాంషా, మసూద్‌షా, నాసిరుద్దీన్‌ల పాలనాకాలంలో బాల్బన్‌ కీలకపాత్ర పోషించాడు. వారి నుంచి రేవరి, హాన్సీ లాంటి జాగీర్‌లను పొందాడు. నాసిరుద్దీన్‌ తన కుమార్తెను బాల్బన్‌కు ఇచ్చి వివాహం చేయడమే కాకుండా నాయబ్‌-ఐ-మీ మాలిక్‌ (ఉపప్రధాని)గా నియమించాడు. 1266లో నాసిరుద్దీన్‌ మరణించగా బాల్బన్‌ ఢిల్లీ సుల్తాన్‌ పదవిని చేపట్టాడు. బాల్బన్‌ అనేక విజయాలు సాధించాడు. పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. మంగోలుల దండయాత్రను సమర్థంగా తిప్పికొట్డాడు. అనేక పర్షియా రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. చిహల్‌గనీ కూటమిని నిర్మూలించి రాజ్యంలో శాంతిభద్రతలు నెలకొల్పాడు. బెంగాల్‌ గవర్నర్‌ టుగ్రిల్‌కాన్‌ తిరుగుబాటును అణచివేశాడు. చిహల్‌గనీ ముఠా నాయకుడు అమీర్‌ఖాన్‌ను హత్య చేయించాడు. రాచరికం దైవదత్తం (జిల్లీ - ఇల్లాహే/రాజు భగవంతుడి నీడ) అనే సిద్ధాంతాన్ని బాల్బన్‌ విశ్వసించాడు. సామాన్య ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు కాదు.  సుల్తాన్‌ అధికారాన్ని పెంచడానికి అనేక పర్షియన్‌ రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. వాటిలో ప్రధానమైనవి సిజ్ధా, ఫైబోస్‌/జమ్నిబోస్‌. సుల్తాన్‌ ఆస్థానంలోనికి వచ్చినవారెవరైనా అతడికి సాష్టాంగ నమస్కారం చేయాలన్నదే సిజ్ధా అర్థం. అలాగే సుల్తాన్‌ పాదాలను లేదా సింహాసనాన్ని ముద్దుపెట్టుకోవాలన్నది ఫైబోస్‌/జమ్నిబోస్‌ అర్థం. బాల్బన్‌ నిరంకుశ భావాలతో పరిపాలన చేశాడు. దివాన్‌-ఇ-అర్జ్‌ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఇమాద్‌-ఉల్‌ ముల్క్‌ను అధిపతిగా నియమించాడు. సైనిక వ్యవస్థలో వృద్ధాప్య పెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అడువులను నరికించి, వ్యవసాయ భూములుగా మార్చిన తొలి ఢిల్లీ సుల్తాన్‌గా కీర్తించబడ్డాడు. మంగోలుల దండయాత్రలను ఎదుర్కోవడానికి రక్షణ ఏర్పాట్లు చేశాడు. లాహోర్‌ కోటను సందర్శించి దానికి మరమ్మతులు చేయించాడు. మంగోలుల దండయాత్రల వల్ల బాల్బన్‌ పెద్ద కుమారుడు మహ్మద్‌ మరణించాడు. బాల్బన్‌ అనంతరం అతడి మనుమడైన కైకూబాద్‌ చివరి బానిస సుల్తాన్‌గా పరిపాలించాడు.

సుల్తానా రజియా (క్రీ.శ.1236 - 1240)
    భారతదేశాన్ని పరిపాలించిన తొలి, ఏకైక ముస్లిం మహిళ రజియా సుల్తానా. ఈమె ఇల్‌టుట్‌మిష్‌ కుమార్తె. రజియా శక్తి సామర్థ్యాలను గమనించిన ఇల్‌టుట్‌మిష్‌ తన కుమారులను (మహ్మద్, రక్నుద్దీన్‌) కాదని ఈమెను వారసురాలిగా ప్రకటించాడు. అయితే ఒక మహిళ పాలకురాలు కావడం ఇష్టం లేని ఆస్థాన సర్దారులు, సామంతులు ఆమెపై అనేక తిరుగుబాట్లు చేశారు. లాహోర్, ముల్తాన్‌ పాలకులు చేసిన తిరుగుబాట్లను రజియా సమర్థంగా అణచివేసింది. మాలిక్‌ జమాలుద్దీన్‌ యాకూత్‌ అనే అబిసీనియా దేశస్థుడిని  అశ్వదళాధిపతి (అమీర్‌- ఇ- అబూఖత్‌)గా నియమించింది. ఈ నియామకం స్వదేశీ ముస్లింలు, సర్దారుల్లో మరింత ద్వేషాన్ని పెంచింది. రజియా యొక్క సర్దార్‌ నిజామ్‌-ఉల్‌-జునైడీ భటిండా పాలకుడు అల్‌తునియాతో చేరి ఆమెను ఓడించి భటిండా కారాగారంలో బంధించారు. కానీ అవసరం తీరిన జునైడీ అల్‌తునియాను మోసం చేయడంతో అల్‌తునియా భటిండా కారాగారం నుంచి ఆమెను విడిపించి, వివాహం చేసుకుని ఇద్దరూ ఢిల్లీపైకి వస్తుండగా క్రీ.శ.1240లో ఖైతాల్‌ అనే ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఫలితంగా ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యంలో సుల్తానా రజియా శకం ముగిసింది.

బాల్బన్‌ ఒక బానిసగా, నీటి సంచులు మోసే కూలీగా,  వేటాధికారిగా, సేనాధిపతిగా, రాజనీతిజ్ఞుడిగా, చివరికి సుల్తాన్‌గా ఎదిగాడు’’ - ప్రముఖ చరిత్రకారుడు లేన్‌పూలే

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌