• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానుల యుగ విశేషాలు

    క్రీ.శ.1206లో కుతుబుద్దీన్‌ ఐబక్‌ స్థాపించిన ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యం క్రీ.శ.1526 వరకు కొనసాగింది. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాల పాలనలో భారతదేశంలో సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులు; సాంస్కృతిక అంశాల్లో ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ సుల్తానులు భారతదేశ చరిత్రకు, సాంస్కృతిక ప్రగతికి కృషి చేశారు.

పరిపాలనా విధానం
కేంద్రపాలన 
   ఢిల్లీ సుల్తానులు ఇస్లామిక్‌ సంప్రదాయ ‘షరియత్‌’ ప్రకారం భారతదేశాన్ని పరిపాలించారు. సుల్తాన్‌ను భగవంతుడి ప్రతిరూపంగా భావించి పాలించారు. వారు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఇక్తాలు - షిక్‌లు - పరగణాలు - గ్రామాలుగా విభజించారు. కేంద్రస్థాయిలో సుల్తాన్‌ సర్వాధికారి, నిరంకుశుడు. సుల్తాన్‌కు పరిపాలనలో సహాయపడటానికి మంత్రిమండలి ఉండేది. నాడు కేంద్ర మంత్రిమండలిలో వజీర్‌ (ఆర్థికమంత్రి), దివాన్‌-ఇ-అర్జ్‌ (యుద్ధ మంత్రి), దివాన్‌-ఇ-రిసాలత్‌ (విదేశీ వ్యవహారాల మంత్రి), దబీర్‌-ఇ-మమాలిక్‌ (సమాచార మంత్రి), సదర్‌-ఉస్‌-సుదూర్‌ (ధర్మాదాయ, ధార్మిక మంత్రి), దివాన్‌-ఇ-ఖాజీ/ ఖాజీ-ఉల్‌-కుజత్‌ (న్యాయశాఖా మంత్రి) లాంటి మంత్రులు ఉండేవారు. సుల్తాన్‌కు సహాయపడటానికి నాయిబ్‌ సుల్తాన్‌ (ఉప ప్రధానమంత్రి) కూడా ఉండేవాడు. ఈ విధంగా కేంద్రంలో సుల్తాన్‌ సర్వాధికారాలు కలిగి ఉండి మంత్రిమండలి, ఉద్యోగ బృంద సహాయంతో పరిపాలించేవాడు.

రాష్ట్ర పాలన 
    ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాష్ట్రాలను ఇక్తాలు అనేవారు. ఇల్‌టుట్‌మిష్‌ ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక్తా అధిపతిని ముక్తీ అనేవారు. ఇక్తాలు అనేవి సైనిక రాష్ట్రాలుగా పేరొందాయి. ముక్తీలు రాజు ద్వారా నియమితులై ఇక్తాల నుంచి వచ్చిన ఆదాయంలో కొంత భాగం తీసుకుని సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో సుల్తాన్‌కు సరఫరా చేయాలి. ఇక్తాల్లో ఉండే రాజ ప్రతినిధిని (గవర్నర్‌) నాయిమ్‌/వలి అని పిలిచేవారు. ముక్తీ, నాయిమ్‌తో పాటు రాష్ట్రాల్లో వజీర్, అరిజ్, ఖ్వాజీ లాంటి అధికారులు ఉండేవారు. రాష్ట్రాల్లో ఇక్తాలతో పాటు ప్రాంతాలు, సామంత రాజ్యాలు కూడా ఉండేవి. ప్రాంతాలను ఉప రాజ్యాలు అనేవారు.

స్థానిక పాలన
    ఢిల్లీ సుల్తానులు రాష్ట్రాలు/ప్రాంతాలు/ఇక్తాలను షిక్‌లు, పరగణాలు, గ్రామాలుగా విభజించి పరిపాలించారు. షిక్‌ల అధిపతిని షిక్‌దార్, పరగణాల అధిపతిని అమీల్, గ్రామ అధికారులను చౌదరీ, ముఖద్దమ్‌ అని పిలిచేవారు. గ్రామపాలనలో స్వయంప్రతిపత్తి ఉండేది. కొన్ని గ్రామాల్లో పట్వారీ అనే అధికారి ఉండేవాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తానులు ఇస్లాం న్యాయ షరియత్‌ ప్రకారం పాలించినప్పటికీ గతంలో భారతదేశంలో ఉన్న పాలనా వ్యవస్థనే అనుసరించారని అర్థమవుతుంది. రాజు స్థానంలో సుల్తాన్‌ వచ్చాడు. అదే మంత్రిమండలి విధానం, రాజ్య విభజన విధానం, ఉద్యోగ బృంద సహకారం కొనసాగింది కానీ వారి పేర్లు మార్పు చెందాయి. 

రెవెన్యూ పాలన 
    ఢిల్లీ సుల్తానులు రెవెన్యూ విధానంలో అనేక నూతన మార్పులను ప్రవేశపెట్టారు. ప్రత్యేక శాఖలను రూపొందించి భూముల సర్వే, విభజన, పంట ఆధారంగా భూమిశిస్తును నిర్ణయించారు. కుతుబుద్దీన్‌ ఐబక్‌ కాలంలో పంటలో 1/10వ వంతును శిస్తుగా నిర్ణయిస్తే అల్లావుద్దీన్‌ ఖిల్జీ, మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ కాలంలో 1/2వ వంతుగా నిర్ణయించారు. కానీ ఎక్కువ మంది సుల్తానులు 1/3వ వంతునే భూమిశిస్తుగా వసూలు చేశారు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ రెవెన్యూ శాఖలో అవినీతిని నిర్మూలించడానికి ప్రత్యేక అధికారులను నియమించాడు. మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ‘దివాన్‌-ఇ-కోహీ’ అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటుచేసి రెవెన్యూ పాలనను పటిష్ఠం చేశాడు. బాల్బన్‌ తొలిసారిగా అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చాడు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ రైతు బాంధవుడిగా పేరొందాడు.

సైనిక పాలన
    ఢిల్లీ సుల్తానుల కాలం నాటి సైనిక విధానాన్ని ‘ఇక్తా పద్ధతి’ అంటారు. ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్య ప్రగతి ఎక్కువగా సైనిక వ్యవస్థపైనే ఆధారపడి ఉండేది. ముఖ్యంగా మంగోలుల లాంటి విదేశీయుల దండయాత్రలను సమర్థంగా ఎదుర్కోవడానికి, రాజ్య విస్తరణకు సైనికశక్తి అవసరమని గుర్తించిన ఢిల్లీ సుల్తానులు సైనిక పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. 

ఇల్‌టుట్‌మిష్‌ ‘ఇక్తాలు’ అనే సైనిక రాష్ట్రాలను ఏర్పాటుచేసి, వాటిపై ముక్తీలనే అధికారులను నియమించాడు. ముక్తీలు తమ అధీనంలో ఉన్న ఇక్తాల నుంచి శిస్తు వసూలు చేసి కొంతభాగాన్ని సుల్తాన్‌కు చెల్లించి, మిగిలిన దానితో సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో సుల్తాన్‌కు సరఫరా చేసేవారు. బాల్బన్‌ తన పాలనా కాలంలో దివాన్‌-ఇ-అర్జ్‌ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశాడు. సుల్తానుల కాలం నాటి సైనిక వ్యవస్థలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ అనేక మార్పులు చేపట్టాడు. 

    ఇతడు ఇక్తా పద్ధతిని రద్దుచేసి, సైనికులకు నగదు రూపంలో జీతం ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ముక్తీలు చేస్తున్న అక్రమ గుర్రాల మార్పిడిని నియంత్రించడానికి గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతి (దాగ్‌)ని ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా సుల్తాన్‌ సొంత సైన్యం (సిద్ధ సైన్యం)ను రూపొందించాడు. సైనికుల్లో క్రమశిక్షణ పెంచడానికి చెహ్రా అనే హాజరుపట్టీ/మస్తరు విధానాన్ని రూపొందించాడు. తక్కువ జీతం గల సైనికులకు నిత్యావసరాలను తక్కువ ధరలకు అందించడానికి మార్కెట్‌ సంస్కరణలు అమలుచేశాడు. కానీ ఫిరోజ్‌షా తుగ్లక్‌ కాలంలో ఇక్తా పద్ధతిని తిరిగి జాగిర్ధారీ పద్ధతిగా ప్రవేశపెట్టారు. సైనిక పదవులు వంశపారంపర్యం కావడంతో క్రమంగా సైనిక వ్యవస్థ నిర్వీర్యమైంది. ఫలితంగా సుల్తానుల సామ్రాజ్యం పతనమైంది. 

న్యాయపాలన
    సామ్రాజ్యంలో సుల్తాన్‌ అత్యున్నత న్యాయాధికారి. అతనికి న్యాయపాలనలో సాయపడటానికి ప్రధాన ఖాజీ అనే న్యాయశాఖ మంత్రి ఉండేవాడు. అదే విధంగా రాష్ట్ర, స్థానిక స్థాయిల్లోనూ న్యాయపాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. గ్రామస్థాయిలో గ్రామపెద్దలే తీర్పులు చెప్పేవారు. ఇలానే ఢిల్లీ సుల్తానులు ఖురాన్, షరియత్‌ ప్రకారం న్యాయ పాలన నిర్వహించేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. అల్లావుద్దీన్‌ ఖిల్జీ మరింత కఠినంగా వ్యవహరించేవాడు. ‘నాకు షరియత్‌ (ముస్లిం చట్టం) తెలియదని, రాజ్య శ్రేయస్సుకు ఏది మంచిదయితే దాన్నే అమలు చేస్తానని’ బహిరంగంగా ప్రకటించాడు.

సాంఘిక పరిస్థితులు 
    అల్‌బెరూనీ, అమీర్‌ఖుస్రూ, బరౌనీ, ఇసామీ, ఇబన్‌  బటూటా వంటి సమకాలీన రచయితలు, చరిత్రకారుల రచనల ద్వారా ఢిల్లీ సుల్తానుల కాలం నాటి వివిధ పరిస్థితులను తెలుసుకోవచ్చు. నాటి సమాజంలో అధిక శాతం హిందువులే ఉన్నారు. సమాజంలో వివిధ వర్గాలు, వారి మధ్య వ్యత్యాసాలు, కుల వ్యవస్థ, ఆచార సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, స్త్రీ స్థానం, సాంఘిక దురాచారాలు వంటి అంశాలను పరిశీలిస్తే నాటి సాంఘిక వ్యవస్థపై ఒక అవగాహన కలుగుతుంది. అంత వరకు పాలకులుగా ఉన్న అధిక శాతం హిందువులు మహ్మదీయుల పాలనలో పాలితులుగా మారడంతో సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముస్లింల సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, సాంఘిక దురాచారాలు భారతీయ సమాజంలో ప్రవేశించాయి. ముఖ్యంగా పరదా పద్ధతి, బహు భార్యత్వం, జౌహార్‌ వంటి సాంఘిక దురాచారాలు అధికమయ్యాయి. ఫలితంగా సమాజంలో స్త్రీకి ప్రాధాన్యం తగ్గింది. స్త్రీ విద్యకు ప్రోత్సాహం కరవైంది. అనేక నూతన వర్గాలు వెలిశాయి. పెద్దఎత్తున మత మార్పిడులు జరిగాయి. మహ్మదీయులు కులవ్యవస్థను అనుసరించారు. హిందువుల పండగలను ముస్లింలు, ముస్లింల సంప్రదాయాలను హిందువులు అనుసరించారు. నూతనంగా ఏర్పడిన ఉలేమాలు, కుట్స్, కులీనులు వంటి వర్గాలవారు అధిక పెత్తనం చెలాయిస్తూ ఆర్థికవ్యత్యాసాలకు కారణమయ్యారు.

ఆర్థిక పరిస్థితులు 
    ఢిల్లీ సుల్తానుల కాలంలో వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల రంగాల అభివృద్ధిని పరిశీలిస్తే నాటి ఆర్థిక పరిస్థితులు అర్థమవుతాయి. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఢిల్లీ సుల్తానులు అనేక చర్యలు చేపట్టారు. ఫలితంగా పట్టణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో అనేక నూతన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆహార, వాణిజ్య పంటలకు సమాన ప్రాధాన్యం  ఇచ్చారు. నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. బంజరు భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చడానికి కృషి చేశారు. నాటి కాలంలో ఇక్తా భూములు, ఖలీసా భూములు, మదద్‌ - ఇ - మాష్‌ భూములు అనే మూడు ప్రధాన రకాలు ఉండేవి. ముక్తీల అధీనంలో ఉండే భూములు ఇక్తా భూములు. సుల్తాన్‌ అధీనంలో ఉండే భూములు ఖలీసా భూములు. వీటి నుంచి వచ్చే ఆదాయం నేరుగా ఖజానాకు చేరేది. వివిధ వర్గాలవారికి పాలకులు దానంగా ఇచ్చిన భూములను మదద్‌ - ఇ - మాష్‌ భూములు అనేవారు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ వ్యవసాయ అభివృద్ధికి నాలుగు ప్రధాన కాలువలు తవ్వించి రైతుబాంధవుడిగా పేరొందాడు. సుల్తానుల కాలంలో తోటపంటలు బాగా అభివృద్ధి చెందాయి.

    ఫలితంగా గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. భూమిశిస్తుతో పాటు ఖామ్స్, జకత్, జిజియా వంటి పన్నులు వసూలు చేసేవారు. రాజ్యానికి అధిక ఆదాయం భూమిశిస్తు (ఖరజ్‌) ద్వారా సమకూరేది. కానీ ప్రజలు అధిక పన్నుల భారంతో బాధపడేవారు. పట్టణాల సంఖ్య పెరగడం, వృత్తి పనివారు అధికంగా వస్తువులు ఉత్పత్తి చేయడం, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడం అనే మూడు ప్రధాన కారణాల వల్ల పట్టణ ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులు చోటుచేసుకున్నాయి. తురుష్కుల రాకతో వస్త్ర, పట్టు, కాగితం పరిశ్రమల అభివృద్ధి సాధ్యమైంది. భవన నిర్మాణ రంగంలో సాంకేతికత పెరిగింది. ఢిల్లీలో ఉన్న భవన నిర్మాణ మేస్త్రీలు ఇస్లాం రాజ్యాలున్న అన్ని దేశాల కంటే నైపుణ్యం కలవారని అమీర్‌ఖుస్రూ పేర్కొన్నాడు. చర్మ, లోహ పరిశ్రమలు, తివాచీల అల్లకం, ఆభరణాల రూపకల్పన వంటి రంగాల్లో అభివృద్ధి జరిగింది.

    వ్యవసాయ, పరిశ్రమల రంగాలతో పాటు వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి. భారతదేశం నుంచి పర్షియన్‌ సింధుశాఖ, ఎర్ర సముద్రం, ఆగ్నేయాసియా దేశాలకు వస్తువులు ఎగుమతయ్యేవి. విదేశీ వాణిజ్యంతో పాటు  దేశీయ వాణిజ్యం కూడా వృద్ధి చెందింది. మార్వాడీలు, జైనులు, ముల్తానీలు దేశీయ వ్యాపారంలో ప్రధాన పాత్ర పోషించారు.  ముల్తానీలు చాలా ధనవంతులని, కులీన వంశస్థులకు భారీగా రుణాలు ఇచ్చే వారని బరౌనీ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. విదేశాల నుంచి భారీగా వృత్తి పని వారు వలస వచ్చేవారని ఇస్సామీ తెలిపాడు. ఎంత అభివృద్ధి జరిగినా ధనిక, కులీన వర్గాలు మాత్రమే లబ్ధి పొందాయని చెప్పొచ్చు. రైతాంగం, బానిసలు, కూలీలు, మధ్య తరగతి వర్గం అధిక పన్నుల భారంతో బాధపడేవారని సమకాలీన చరిత్రకారుల అభిప్రాయం.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌