• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానులు (తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాల చరిత్ర)

    క్రీ.శ.1206లో కుతుబుద్దీన్‌ ఐబక్‌ స్థాపించిన ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యాన్ని మొదట బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశాలు పరిపాలించాయి. గియాజుద్దీన్‌ తుగ్లక్‌ క్రీ.శ.1320లో చివరి ఖిల్జీ వంశ పాలకుడైన నాసిరుద్దీన్‌ ఖుస్రూషాను హత్య చేయించి తుగ్లక్‌ వంశ పాలనను ప్రారంభించాడు. తుగ్లక్‌ వంశ పాలన అనంతరం సయ్యద్, లోడీ వంశాలు పరిపాలించాయి. క్రీ.శ.1526లో చివరి లోడీ వంశ పాలకుడైన ఇబ్రహీం లోడీని బాబర్‌ ఓడించి మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించడంతో ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యం అంతరించింది.

తుగ్లక్‌ వంశం (క్రీ.శ.1320-1414) 
ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌
    తుగ్లక్‌ వంశ పాలనను ప్రారంభించినవారు ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌. ఇతడు తరుష్కుల్లో కరౌనా/ఖరౌనా తెగకు చెందినవాడు. అల్లావుద్దీన్‌ పరిపాలనా కాలంలో ఘియాజుద్దీన్‌ దీపాల్‌పూర్‌ వైస్రాయ్‌గా పనిచేశాడు. క్రీ.శ.1320లో చివరి ఖిల్జీ వంశ పాలకుడైన నాసిరుద్దీన్‌ ఖుస్రూషాను వధించి తుగ్లక్‌ వంశ పాలనను ప్రారంభించాడు. తుగ్లకాబాద్‌ అనే నగరాన్ని నిర్మించాడు. కఠిన శిక్షలను తగ్గించాడు. రైతు రుణాలను రద్దు చేశాడు. భూమిశిస్తును 1/3వ వంతుగా నిర్ణయించాడు. తన కుమారుడు జునాఖాన్‌ (మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌)ను దక్షిణ భారతదేశంపైకి పంపి యాదవ రాజ్యంపై విజయం సాధించాడు. క్రీ.శ.1323 నాటికి కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. కానీ క్రీ.శ.1325లో మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ తండ్రిని హత్యచేసి సింహాసనాన్ని అధిష్టించాడు. 

మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ (క్రీ.శ.1325-1351) 
    ఢిల్లీ సుల్తానుల సార్వభౌమాధికారాన్ని దక్షిణపథంపై నెలకొల్పిన ఏకైన ఢిల్లీ సుల్తాన్‌ మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌. ఢిల్లీ సుల్తానులందరిలో అత్యంత విద్యావంతుడు, ఉదార స్వభావం గల వ్యక్తిగా పేరొందిన ఇతడు తన చర్యల ద్వారా ‘పిచ్చి తుగ్లక్‌’గా పేరొందాడు. ఈయనను విరుద్ధ గుణాలు మూర్తీభవించిన వ్యక్తిగా సమకాలీన చరిత్రకారులు అభివర్ణించారు. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ అసలు పేరు జునాఖాన్‌. తండ్రి ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ పాలనా కాలంలో యాదవ, కాకతీయ రాజ్యాలపై దండెత్తి అపార ధనరాశులను కొల్లగొట్టాడు. వరంగల్‌/ఓరుగల్లును ఆక్రమించి దానికి సుల్తాన్‌పూర్‌ అని పేరు పెట్టాడు. క్రీ.శ.1325లో తండ్రిని హత్యచేయించి సుల్తాన్‌గా పాలనను ప్రారంభించాడు. అనేక విజయాలు సాధించడమే కాకుండా పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా గంగా, యమునా మైదానంలో భూమిశిస్తు పెంచడం, రాజధాని మార్పిడి, టోకెన్‌ కరెన్సీ ముద్రణ లాంటి సంస్కరణలు విఫలమవడంతో పిచ్చి తుగ్లక్‌గా పేరొందాడు.

గంగా - యమునా అంతర్వేదిలో భూమిశిస్తు పెంచడం
    గంగా - యమునా అంతర్వేది (దోవాబ్‌)లో సారవంతమైన భూములు ఉండటం వల్ల అక్కడ భూమిశిస్తును 1/2వ వంతుకు పెంచాడు. రాజ్య ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ అదే ఏడాది ఆ ప్రాంతంలో తీవ్ర కరవు సంభవించడంతో రైతులు శిస్తు చెల్లించలేకపోయారు. అధికారులు ప్రజల పరిస్థితులను పట్టించుకోకుండా దౌర్జన్యంగా శిస్తు వసూలు చేశారు. ఆ తర్వాత సుల్తాన్‌ ప్రతిస్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ‘దివాన్‌-ఇ-కోహీ’ అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. రైతులకు తక్కావీ రుణాలు (పంట రుణాలు) మంజూరు చేశాడు. బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చాడు. 

రాజధాని మార్పు  
    మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ క్రీ.శ.1327లో రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి (దౌలతాబాద్‌) మార్చాడు.  ఢిల్లీ వాయవ్య భారతదేశానికి దగ్గరగా ఉండటం వల్ల నిత్యం విదేశీ దండయాత్రలకు గురికావడం, దక్షిణపథంపై పట్టు సాధించడం లాంటి కారణాలతో రాజధానిని మార్చాడు. కానీ రాజధానిని మార్చే సమయంలో అతడు జారీచేసిన శాసనాలు ప్రజలకు బాధ కలిగించాయని సమకాలీన చరిత్రకారులు పేర్కొన్నారు. రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రజలందరినీ దౌలతాబాద్‌కు వెళ్లమని ఆదేశించాడని, వెళ్లనివారిని చిత్రహింసలకు గురిచేశాడని, ఫలితంగా ప్రజలు అతడిని మంచివాడు కాదని భావించినట్లు చరిత్రకారులు తెలిపారు. అనేక వ్యయప్రయాసల అనంతరం రాజధానిని దౌలతాబాద్‌కు మార్చినా కొంత కాలానికే క్రీ.శ.1335లో రాజధానిని ఢిల్లీకి మార్చాడు.

టోకెన్‌ కరెన్సీ ముద్రణ
    మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో తీవ్ర విమర్శలకు గురైంది ఈ నూతన కరెన్సీ ముద్రణ. ఇతడి పరిపాలనా కాలంలో వెండి కొరత ఏర్పడింది. ఢిల్లీ సుల్తాన్‌ రాజ్యంలో వెండి ‘టంకాలు’ అధికారిక నాణేలుగా చలామణీ అయ్యేవి. వెండి కొరత వల్ల సుల్తాన్‌ రాగి, తోలు నాణేలు ముద్రించాడని చరిత్రకారులు పేర్కొన్నారు. కరెన్సీ ముద్రణపై ఆంక్షలు జారీచేయకపోవడం, ప్రభుత్వమే కరెన్సీ ముద్రించాలనే షరతులు లేకపోవడంతో రాజ్యంలో నకిలీ నాణేల ముద్రణ అధికమైంది. నాడు దిల్లీలో ప్రతి ఇల్లు ఒక టంకశాలగా మారిందని చరిత్రకారులు తెలిపారు. ఫలితంగా నాణేల చలామణి అధికమై ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సుల్తాన్‌ టోకెన్‌ కరెన్సీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో ప్రజలంతా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజల బాధలను అర్థం చేసుకున్న సుల్తాన్‌ వారి వద్ద ఉన్న టోకెన్‌ కరెన్సీకి అసలు, నకిలీ అనే తేడా లేకుండా తన ఖజానాలోని వెండి టంకాలను మార్పిడి చేశాడు. ఫలితంగా ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. ఇలాంటి చర్యలతో మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ‘పిచ్చి తుగ్లక్‌గా’ పేరొందాడు. ఈ కరెన్సీ ముద్రణ వల్ల మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ‘ప్రిన్స్‌ ఆఫ్‌ మనీయర్‌’ (నాణేల యువరాజు)గా పేరొందాడు.
   మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ సంస్కరణలు అనేక ఆదర్శ భావాలతో ఉండేవి. రాజ్య రక్షణ, రాజ్యం మధ్యలో రాజధాని ఉండాలనే ఆలోచనతోనే రాజధానిని మార్చాడు. దానివల్ల ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ఆధునిక రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. తురుష్కుల నాగరికత, సంస్కృతి, సాంఘిక ఆలోచనా ధోరణి దక్షిణాదికి వ్యాపించింది. రెవెన్యూ సంస్కరణల ద్వారా వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశాడు. ప్రత్యేక వ్యవసాయ శాఖ ‘దివాన్‌-ఇ-కోహీ’ని ఏర్పాటు చేశాడు. భూమిశిస్తు బకాయిలు వసూలు చేయడానికి సెంచూరియన్‌ అనే ప్రత్యేక అధికారులను నియమించాడు. క్రీ.శ.1351లో నాటి గుజరాత్‌ పాలకుడు ధాగి సుల్తాన్‌ను శిక్షించడానికి వెళ్లిన మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ‘థట్టా’ అనే ప్రాంతంలో మరణించాడు. అతడి మరణం గురించి పేర్కొంటూ ‘అతడి బాధ ప్రజలకు, ప్రజల బాధ అతడికి తప్పింది’ అని లేన్‌పూలే చరిత్రకారుడు తెలిపాడు. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ పాలనా కాలంలోనే దక్షిణ భారతదేశంలో విజయనగర (1336), బహమనీ (1347) సామ్రాజ్యాలు అవతరించాయి.

ఫిరోజ్‌షా తుగ్లక్‌ (క్రీ.శ.1351-1388)
    మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ మరణానంతరం అతడి సోదరుడు ఫిరోజ్‌షా తుగ్లక్‌ పరిపాలించాడు. ఇతడు వ్యవసాయరంగ అభివృద్ధికి అనేక కాలువలు నిర్మించి ‘రైతు బాంధవుడు’గా పేరొందాడు. తన ప్రధానమంత్రి ఖాన్‌-ఇ-జహాన్‌-మక్బూల్‌ సాయంతో పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేశాడు. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ చర్యల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేపట్టాడు. నీటిపారుదల వసతులు కల్పించాడు. యమునా నది నుంచి ఫిరోజాబాద్‌ వరకు, సట్లెజ్‌ నది నుంచి ఘఘ్గర్‌ వరకు, మాండవ నుంచి హిస్సార్‌ వరకు నీటిపారుదల కాలువలు ఏర్పాటు చేశాడు. ఆ కాలువలు నేటికీ పంజాబ్, హరియాణాల్లో నీటిని అందిస్తున్నాయి. సుమారు 23 రకాల పన్నులను రద్దు చేసి ముస్లిం మత సూత్రాల ప్రకారం ఖరజ్, ఖామ్స్, జకత్, జిజియా అనే నాలుగు ప్రధానమైన పన్నులను వసూలు చేశాడు. ఫిరోజాబాద్, జాన్‌పూర్, ఫతేబాద్, హిస్సార్‌ లాంటి నూతన పట్టణాలను నిర్మించాడు. పేదల సంక్షేమం కోసం ‘దివాన్‌-ఇ-ఖైరాత్‌’ అనే శాఖను, బానిసల సంక్షేమానికి ‘దివాన్‌-ఇ-బందగాని’ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. అదా, భిఖ్‌ అనే నూతన నాణేలను ప్రవేశపెట్టాడు. ఢిల్లీలో దారుల్‌-షఫా (దార్‌-ఉల్‌-షిఫా) అనే ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేశాడు. బాటసారులు, యాత్రికుల కోసం సుమారు 200 సరాయిల (విశ్రాంతి మందిరాలు)ను నిర్మించాడు.
   సమకాలీన చరిత్రకారుడైన షమ్స్‌ ఇ సిరాజ్‌ ఫిరోజ్‌షా తుగ్లక్‌ పాలనా వ్యవహారాల గురించి అనేక విషయాలు తెలిపాడు.  ఫిరోజ్‌షా తుగ్లక్‌ పరమత సహనాన్ని అనుసరించలేదు. అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి, జిజియా పన్ను విధించాడు. బ్రాహ్మణులపై కూడా ఈ పన్ను విధించాడు. ఒరిస్సాలోని జ్వాలాముఖి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఇతడి ఆస్థానంలో బరౌనీ, షమ్స్‌ ఇ సిరాజ్, మహ్మద్‌ అఫీఫ్‌ లాంటి చరిత్రకారులు, కవులు; జలాలుద్దీన్‌-రూమీ లాంటి పండితులు ఉండేవారు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ రద్దు చేసిన ఇక్తా పద్ధతిని తిరిగి జాగిర్దారీ పద్ధతిగా ప్రవేశపెట్టాడు. సివిల్, మిలిటరీ ఉద్యోగాలను వంశపారంపర్యం చేశాడు. ముఖ్యంగా 1,80,000 మంది బానిసలను పోషించి ఖజానా ఖాళీ చేశాడని అఫీఫ్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. పెరిస్టా అనే చరిత్రకారుడి ప్రకారం ఫిరోజ్‌షా తుగ్లక్‌ 50 ఆనకట్టలు, 40 మసీదులు, 30 కళాశాలలను నిర్మించినట్లు తెలుస్తుంది. మీరట్, తోప్రా ప్రాంతాల్లో ఉన్న అశోక స్తంభాలను ఢిల్లీకి (ఫిరోజాబాద్‌) తరలించాడు. ఈ విధంగా అనేక ప్రజా సంక్షేమ చర్యలతోపాటు ప్రజా, హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ ‘ఫతూహత్‌-ఇ-ఫిరోజ్‌ షాహీ’ పేరుతో తన స్వీయచరిత్రను రాశాడు. ఇతడి అనంతరం రెండో ఘియాజుద్దీన్, అబూబకర్, మహ్మద్‌ బీన్‌ ఫిరోజ్, నాసిరుద్దీన్‌ మహ్మద్‌ తుగ్లక్‌ లాంటి పాలకులు పాలించారు. వీరు అసమర్థులు కావడంతో తుగ్లక్‌ వంశం పతనమైంది. చివరి తుగ్లక్‌ వంశ పాలకుడైన నాసిరుద్దీన్‌ మహ్మద్‌ తుగ్లక్‌ పాలనా కాలంలోనే క్రీ.శ.1398-99లో తైమూర్‌ దండయాత్ర జరిగింది. క్రీ.శ.1414లో ఖిజీర్‌ఖాన్‌ నాసిరుద్దీన్‌ తుగ్లక్‌ను తొలగించి సయ్యద్‌ వంశ పాలనను ప్రారంభించాడు.

సయ్యద్‌ వంశం
    క్రీ.శ.1414-1451 మధ్య సయ్యద్‌ వంశీయులు ఢిల్లీ సుల్తానత్‌ రాజ్యాన్ని పరిపాలించారు. తైమూర్‌ ప్రతినిధి ఖిజీర్‌ ఖాన్‌ (ఖైదర్‌ ఖాన్‌) క్రీ.శ.1414లో సయ్యద్‌ వంశ పాలనను ప్రారంభించాడు. అతడి అనంతరం ముబారక్‌ షా, మహ్మద్‌ షా, అల్లావుద్దీన్‌ ఆలంషా పరిపాలించారు. ఖిజీర్‌ ఖాన్‌ కాలంలోనే గుజరాత్, మాళ్వా, జాన్‌పూర్‌ పాలకులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ముబారక్‌ షా కులీనుల చేతిలో హత్యకు గురయ్యాడు. చివరి సయ్యద్‌ వంశ పాలకుడైన అల్లావుద్దీన్‌ ఆలమ్‌షాను తొలగించి బహులాల్‌ లోడీ క్రీ.శ.1451లో లోడీ వంశ పాలనను ప్రారంభించాడు.

లోడీ వంశం
    క్రీ.శ.1451-1526 మధ్య ఢిల్లీని పాలించిన చివరి సుల్తానత్‌ వంశం లోడీ వంశం. లోడీ వంశపాలన ప్రారంభకుడు బహాలూల్‌ లోడీ. అతడి అనంతరం సికిందర్‌ లోడీ, ఇబ్రహీం లోడీ పరిపాలించారు. బహాలూల్‌ లోడీ వ్యక్తిత్వం గురించి అబ్దుల్లా అనే కవి ‘తారిఖ్‌-ఇ-దావుదీ’ అనే గ్రంథంలో వివరించాడు. అతడి మరణానంతరం కుమారుడైన నిజాంఖాన్‌ ‘సికిందర్‌ షా’ (సికిందర్‌ లోడీ) అనే బిరుదుతో రాజ్యపాలనకు వచ్చాడు. లోడీ వంశ పాలకుల్లో గొప్పవాడిగా పేరొందాడు. ఇతడు బిహార్, గ్వాలియర్‌ ప్రాంతాలపై విజయం సాధించాడు. ఆగ్రా నగరాన్ని నిర్మించి దాన్ని నూతన రాజధానిగా చేశాడు. వ్యవసాయాభివృద్ధికి చర్యలు చేపట్టాడు. పన్ను భారాన్ని తగ్గించాడు. ఇతడి ఆస్థాన కవి మియాన్‌ భువా ‘తిత్భీ సికిందరీ’ అనే గ్రంథాన్ని పారశీక భాషలోకి తర్జుమా చేశాడు. చివరి లోడీ వంశ పాలకుడు ఇబ్రహీం లోడీని క్రీ.శ.1526లో బాబర్‌ మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించడంతో ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యం అంతరించింది.

Posted Date : 19-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు