• facebook
  • whatsapp
  • telegram

ప్రజాస్వామ్యం - రకాలు

 ప్రజల ఆకాంక్షలకే పట్టం! 

పాలనా వ్యవస్థల్లో అత్యుత్తమంగా నిలిచిన ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, పాలితులు. పరిపాలనా నిర్ణయాలను, చట్టాలను స్వయంగా రూపొందించుకొని అమలు చేసుకుంటూ, తమను తామే పాలించుకుంటారు. అయితే సమాజ స్వరూపాలు, పాటించే విలువల ఆధారంగా ప్రజాస్వామ్యంలోనూ స్వపరిపాలన, పరోక్ష పాలన అనే రకాలున్నాయి. వాటి ఆధారంగానే సార్వభౌమాధికారం, వాస్తవాధికారం చెలాయించే తీరు మారుతుంది. ఈ మౌలికాంశాలను పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి. ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్యాల్లోని కీలక భావనలు, ప్రయోజనాలు, అందుకు అవసరమైన సాధనాలు, పరిస్థితుల గురించి సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి.

ప్రజాస్వామ్యంలో అసమ్మతివాదులు, వ్యతిరేకులు, విరుద్ధ భావాలు ఉన్నవారికి కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రక్రియలో సంప్రదింపులు, ఏకాభిప్రాయం, సఖ్యత, రాజీ మొదలైన అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకొని పరిపాలన సాగిస్తారు. ఈ ప్రజాస్వామ్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..

 1) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం 

2) పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం


ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ప్రజలు ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే ప్రభుత్వ పాలనా విధానమే ‘ప్రత్యక్ష ప్రజాస్వామ్యం’. ఇందులో శాసన సంబంధమైన అధికారాలన్నీ ప్రజలే చెలాయిస్తారు. రాజ్య వ్యవహారాల్లో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రాచీన కాలంలో గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టా, ఏథెన్స్‌లో అనుసరించారు. ప్రస్తుతం ఈ విధానాన్ని స్విట్జర్లాండ్‌ దేశంలో కొనసాగిస్తున్నారు. ఒక ప్రదేశంలో పరిమిత సంఖ్యలో ప్రజలు నివసించే చిన్న దేశాలకు ఈ విధానం సరైంది. విస్తారమైన భౌగోళిక ప్రదేశం ఉన్న దేశాలు, అధిక జనాభా దేశాలకు అనుకూలం కాదు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు రకాలు  


1) ప్రజాభిప్రాయ సేకరణ(Referendum): ఏదైనా ఒక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రక్రియనే ‘ప్రజాభిప్రాయ సేకరణ’ అంటారు. శాసనసభ అప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఉద్దేశించింది. ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల సార్వభౌమాధికారాన్ని బలపరుస్తుంది. మెజార్టీ పార్టీ నియంతృత్వం నుంచి రాజకీయ వ్యవస్థను పరిరక్షిస్తుంది. శాసన నిర్మాణంలో ప్రజలు తరచూ పాల్గొనేందుకు సహాయకారిగా ఉంటూ, శాసనసభ్యుల బాధ్యతను మరింత పెంచుతుంది. ప్రజాబాహుళ్య చట్టాలకు హామీ ఇస్తుంది. అయితే ఈ విధానం శాసనసభ్యుల హోదా, అధికారాలను బలహీనపరుస్తుందని కొందరి అభిప్రాయం. .


2) ప్రజాభిప్రాయ నివేదన: ప్రత్యక్ష ప్రజాస్వామ్య సమర్థకులు ‘ప్రజాభిప్రాయ నివేదన’ ఆవశ్యకతను గుర్తించారు. ఈ విధానం ప్రకారం కొంతమంది పౌరులు ఏదైనా ఒక అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిందిగా కోరుతూ ఒక అర్జీపై సంతకాలు చేసి శాసనసభకు సమర్పిస్తారు. ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి పంపుతారు. మెజార్టీ ప్రజలు ఆమోదిస్తే, ఆ అంశం చట్టంగా మారి అమల్లోకి వస్తుంది. ప్రజాభిప్రాయ నివేదన ప్రజల్లో అవిధేయత/తిరుగుబాటు వంటి అంశాలను నిరోధించి, ప్రజలు వర్గాలుగా ఏర్పడి చట్టాలను ఆమోదించే ప్రమాదాన్ని తొలగిస్తుంది. ప్రజాసార్వభౌమత్వ భావనకు హామీ ఇస్తుంది.


3) పునరాయనం(Recall): ఈ విధానంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుక్కు పిలిచి, పదవి నుంచి తొలగించేందుకు అవకాశం ఉంటుంది. అంటే సరిగా పనిచేయని ప్రతినిధులను ప్రజలు తొలగించి, ప్రజలే సార్వభౌములుగా వ్యవహరిస్తారు.


4) ప్రజాభిప్రాయ నిర్ణయం(Plebiscite):ప్లెబిసైట్‌ అనే పదం లాటిన్‌ భాషలోని Plebis, Scitum అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది. Plebis అంటే ప్రజలు, Scitum అంటే నిర్ణయం లేదా తీర్పు అని అర్థం. ఏదైనా ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోడానికి అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ‘ప్రజాభిప్రాయ నిర్ణయం’. ప్రజానిర్ణయానికి దైనందిన, చట్ట నిర్మాణ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రజా ప్రాముఖ్యత ఉన్న చట్టాన్ని రూపొందించడానికి ఈ విధానం తోడ్పడుతుంది. 1804లో ఫ్రాన్స్‌లో అప్పటికే అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు నెపోలియన్‌ మొదటిసారిగా ఈ విధానాన్ని వినియోగించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం ప్రకారం మొత్తం ప్రజానీకం లేదా ప్రజానీకంలోని ఒక వర్గం వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి పలు దేశాలు ఈ విధానాన్ని వినియోగించాయి.


పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం: ఆధునిక రాజ్యాలు సాధారణంగా జనాభాపరంగా, భౌగోళికంగా పెద్దవిగా ఉంటాయి. ఇలాంటి రాజ్యాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని ఊహించడం సాధ్యం కాదు. ఈ రాజ్యాల్లో ప్రభుత్వ పరిపాలన ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా కొనసాగుతుంది. ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పరోక్షంగా రాజ్యాభీష్టాన్ని రూపొందించి వ్యక్తీకరిస్తారు. సార్వభౌమాధికారం ప్రజలకే చెందుతుందని, ప్రజల ప్రతినిధులు ఆ సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తారనే సూత్రంపై ఆధారపడి పరోక్ష ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు.  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించడంలో విఫలమైతే, వారిని ఎన్నికల సమయంలో ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించి తొలగిస్తారు. అందువల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు ధర్మకర్తలు (సంరక్షకులు)గా వ్యవహరిస్తూ ప్రజాభిప్రాయానికి విలువ ఇస్తారు.


పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా అని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో అధికారాలన్నీ ఒకే కార్యనిర్వాహక అధిపతి వినియోగించడమే కాకుండా, కార్యనిర్వాహక అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి.  


ఉదా: అమెరికా అధ్యక్షుడు


పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక వర్గంలో నామమాత్రపు కార్యనిర్వాహక వర్గం, వాస్తవ కార్యనిర్వాహక వర్గం ఉంటాయి. ఇందులో దేశాధినేతకు కేవలం నామమాత్రపు కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ప్రధాని నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు చెలాయిస్తుంది. ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి శాసన వ్యవస్థకు బాధ్యత వహించాలి. 


ఉదా: బ్రిటన్, ఇండియా, జపాన్‌

 

ప్రజాస్వామ్యం విజయానికి అవసరమైన పరిస్థితులు


* ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి పౌరులకు సరైన విద్య అవసరం. ప్రభుత్వ విధానాలను అంచనా వేయడంలో, సమీక్ష జరపడంలో విద్యావంతులైన పౌరులు కీలక పాత్ర పోషిస్తారు. విద్య అనేది ఓటర్లను చైతన్యపరచి, పలు విషయాలపై అవగాహనకు తోడ్పడి, సమర్థులైన నాయకుల ఎంపికకు తోడ్పడుతుంది.


* బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ప్రతిపక్షం వెలుగులోకి తీసుకొస్తుంది. అధికారపక్షం నియంతృత్వ పోకడలను కట్టడి చేసేందుకు తోడ్పడుతుంది.


* సాంఘిక సమానత్వం అనేది ప్రజాస్వామ్య విజయానికి కీలక అంశం. కులం, మతం, వర్గం, జాతి, లింగం వంటి వివక్షలతో సంబంధం లేకుండా అందరికీ సమానత్వం కల్పించడం వల్ల ప్రజాస్వామ్య పునాదులు బలోపేతం అవుతాయి.


* దేశంలో ఆర్థిక అసమానతలు లేనప్పుడు ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అందుకే పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఆర్థిక అసమానతలు లేని సమాజం అవసరం.


* వివేకవంతమైన నాయకత్వం ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. వివేకవంతులైన పాలకులు తమ పరిపాలనా దక్షత, రాజకీయ పరిజ్ఞానం, సామాజిక అంకితభావం వంటి లక్షణాలతో ప్రజాస్వామ్యాన్ని మహోన్నత స్థాయికి తీసుకెళతారు.


* సైన్యం పెత్తనం లేని దేశాల్లో ప్రజాస్వామ్యం బలపడుతుంది. సైనిక ఆధిపత్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.


* స్వతంత్ర, నిష్పక్షపాత పత్రికా వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. పత్రికలు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని కచ్చితంగా, పక్షపాతరహితంగా ప్రజలకు తెలియజేయాలి. వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించడంలో, తద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయి.


* ప్రజాస్వామ్య విజయం అధికారాల వికేంద్రీకరణపై ఆధారపడి ఉంటుంది. స్థానిక సంస్థల ద్వారా ప్రజలు పాలనలో భాగస్వాములవుతారు. పౌరుల్లో కొందరు స్థానిక సంస్థల నిర్వహణలో తగిన శిక్షణ పొందగలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి శిక్షణ ఇతర, ఉన్నత పదవులు చేపట్టేందుకు ఉపకరిస్తుంది.


* ప్రజాస్వామ్యంపై ప్రజలు విశ్వాసం ఉంచాలి. రాజ్యాంగ సూత్రాలు, చట్టబద్ధమైన పరిపాలన, పరస్పర చర్చలపై విశ్వాసం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది.


ప్రజాస్వామ్యం-ప్రయోజనాలు:


* ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాల్లో, అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా కొనసాగించవచ్చు.


* ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి.


* వ్యక్తుల స్వేచ్ఛకు హామీ లభిస్తుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.


* ఒకే సమయంలో శాంతి, ప్రగతి ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతాయి.


* ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌములుగా ఉంటారు.


* ఎలాంటి యుద్ధాలు, రక్తపాతం లేకుండా, ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాల మార్పు జరుగుతుంది.


* సామాన్యులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కావచ్చు.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

 

 

Posted Date : 01-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌