• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో ప్రజాస్వామ్యం - పనితీరు (మొదటి అయిదు లోక్‌సభలు) 

 చీకట్లోకి దూకి.. విశ్వాసంతో సాగి! 

భిన్న మతాలు, సంస్కృతులు,  విభిన్న భాషలు, భావోద్వేగాలతో ఉన్న భారతదేశంలో ప్రజాస్వామ్యం సక్రమంగా సాగుతుందా అనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. దశాబ్దాలుగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తూ, సంక్షేమ పాలన అందిస్తూ, ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా మన దేశం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్య ప్రస్థానం, స్వాతంత్య్రానంతరం నిర్ణీత కాలవ్యవధుల్లో జరిగిన సాధారణ ఎన్నికల వివరాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. లోక్‌సభల వారీగా దేశ రాజకీయాల్లో జరిగిన మార్పులు, వ్యక్తుల ప్రభావాలు, క్రమానుగతంగా వచ్చిన పాలనా సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలు, ముఖ్యమైన రాజ్యాంగ సవరణలను సంపూర్ణంగా తెలుసుకోవాలి.


భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతోంది. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం భారతీయులు  ఎంతో ధైర్యసాహసాలు, విశ్వాసంతో కృషి చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం రాజకీయ వ్యవస్థ పరిణామం, పనితీరే అందుకు నిదర్శనం. నిర్ణీత వ్యవధుల్లో ఎన్నికలు నిర్వహించడం, ప్రాతినిధ]్య సంస్థలను ఏర్పాటు చేయడం, రాజకీయ ప్రక్రియలను అనుసరించడం లాంటివన్నీ రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయి. గత ఎనిమిది దశాబ్దాలుగా కులతత్వం, ప్రాంతీయతత్వం, మతతత్వం, రాజకీయాల్లో ధన ప్రవాహం, ప్రజారంగంలో లంచగొండితనం, హింస, ఆశ్రిత పక్షపాతం లాంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత ప్రజాస్వామ్యం వాటిని అధిగమించి చక్కగా పనిచేస్తోందని చెప్పవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పడిన భారత ఎన్నికల సంఘం పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేస్తూ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దేశంలో 17 సార్లు సాధారణ ఎన్నికలు నిర్వహించడం భారత ప్రజాస్వామ్య సమర్థతకు నిదర్శనం.

మన దేశంలో ప్రజాస్వామ్యానికి, ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ‘లోక్‌సభ’ను పేర్కొనవచ్చు. వివిధ లోక్‌సభలకు జరిగిన ఎన్నికలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 

ఒకటో లోక్‌సభ: మొదటి లోక్‌సభకు 1951-52లో ఎన్నికలు జరిగాయి. 489 స్థానాల కోసం జరిగిన ఈ ఎన్నికల్లో 21 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించారు. 46% పోలింగ్‌ నమోదైంది. 22 మంది మహిళలు ఎన్నికయ్యారు. 1952, ఏప్రిల్‌ 17న మొదటి లోక్‌సభ ఏర్పాటైంది. దీని తొలి సమావేశం 1952, మే 13న జరిగింది. రాష్ట్రపతిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్, ఉపరాష్ట్రపతిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉన్నారు. లోక్‌సభ నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌ గణేశ్‌ వాసుదేవ మౌలాంకర్‌ పదవిలో ఉండగానే మరణించడంతో అనంతశయనం అయ్యంగార్‌ స్పీకర్‌గా (1956, మార్చి 8 నుంచి 1957, మే 10) వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్‌గా సర్దార్‌ హుకుంసింగ్‌ (1956, మార్చి, 20 నుంచి 1957, ఏప్రిల్, 4) చేశారు.


* మొదటి లోక్‌సభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ (ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ - INC) 364 స్థానాలు గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు 41 మంది ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను ‘చీకటిలో ముందుకు దూకడం’గా విమర్శకులు పేర్కొనగా, ‘విశ్వాసంతో కూడిన చర్య’ అని ఆశావహులు అన్నారు. మొదటి లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం, అరగంట చర్చ, రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ, ధన్యవాద తీర్మానం మొదలైన కొత్త అంశాలను స్పీకర్‌ గణేశ్‌ వాసుదేవ మౌలాంకర్‌ పరిచయం చేశారు. మొదటి లోక్‌సభను నిర్ణీత పదవీకాలానికి 38 రోజుల ముందే 1957, ఏప్రిల్‌ 4న రద్దు చేశారు.

రెండో లోక్‌సభ: రెండో లోక్‌సభ పదవీకాలం 1957, మే నుంచి 1962, మార్చి వరకు సాగింది. 48% పోలింగ్‌ నమోదైంది. 27 మంది మహిళలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ 371 స్థానాలు, కమ్యూనిస్టులు 27 స్థానాలు గెలుపొందారు. లోక్‌సభ నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌గా అనంతశయనం అయ్యంగార్, డిప్యూటీ స్పీకర్‌గా సర్దార్‌ హుకుంసింగ్‌ వ్యవహరించారు. ఈ సభా కాలంలోనే 1961లో ‘వరకట్న నిషేధ బిల్లు’ ఆమోదం కోసం తొలిసారిగా ‘పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం’ నిర్వహించారు. ముంద్రా కుంభకోణం వెలుగులోకి రావడంతో మంత్రి కృష్ణమాచారి రాజీనామా చేశారు. రాష్ట్రపతిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్, ఉపరాష్ట్రపతిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వ్యవహరించారు. రెండో లోక్‌సభను నిర్ణీత పదవీకాలానికి 40 రోజుల ముందే 1962, మార్చి 31న రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు.

మూడో లోక్‌సభ: ఈ ఎన్నికల్లో 55% పోలింగ్‌ నమోదైంది. 34 మంది మహిళలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ 361 స్థానాలు, కమ్యూనిస్టులు 29 స్థానాలు గెలుపొందారు. లోక్‌సభ నాయకుడిగా నెహ్రూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌గా సర్దార్‌ హుకుంసింగ్, డిప్యూటీ స్పీకర్‌గా ఎస్‌.వి.కృష్ణమూర్తి వ్యవహరించారు. 1962లో భారత్‌పై చైనా దురాక్రమణకు పాల్పడిన సందర్భంగా నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1963, ఆగస్టులో తొలిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని ఆచార్య కృపలానీ ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానం వీగిపోయింది. 1964, మే 27న ప్రధాని నెహ్రూ మరణించడంతో గుల్జారీలాల్‌ నందా తాత్కాలిక ప్రధానిగా 1964, మే 27 నుంచి 1964, జూన్‌ 9 వరకు వ్యవహరించారు. అనంతరం లాల్‌బహదూర్‌ శాస్త్రి లోక్‌సభ నాయకుడిగా ఎన్నికై 1964, జూన్‌ 9న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సభా కాలంలోనే తొలిసారిగా 1962లో ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించారు. 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది. ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి తాష్కెంట్‌ పర్యటనలో ఉండగా 1966, జనవరి 11న అక్కడే మరణించారు. ఫలితంగా గుల్జారీలాల్‌ నందా తాత్కాలిక ప్రధానిగా 1966, జనవరి 11 నుంచి 1966, జనవరి 24 వరకు వ్యవహరించారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ 1966, జనవరి 24న ప్రధాని పదవి చేపట్టారు. మూడో లోక్‌సభ కాలంలోనే 1964లో కమ్యూనిస్ట్‌ పార్టీలో చీలిక ఏర్పడి CPI (M), CPI గా ఏర్పడ్డాయి. రాష్ట్రపతిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతిగా జాకీర్‌ హుస్సేన్‌ వ్యవహరించారు. మూడో లోక్‌సభను నిర్ణీత పదవీకాలానికి 44 రోజుల ముందే రద్దు చేశారు. ఈ సభా కాలంలోనే 1965లో భారత ఆహార సంస్థ (FCI)ను స్థాపించారు. 1966లో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టి వ్యవసాయోత్పత్తుల గణనీయ పెంపుదలకు ప్రయత్నించారు.

నాలుగో లోక్‌సభ: ఈ ఎన్నికల్లో 61% పోలింగ్‌ నమోదైంది. 31 మంది మహిళలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ 283, జనసంఘ్‌ 35, సీపీఐ 23, సీపీఎం 19 స్థానాలు గెలుపొందాయి. ఈ లోక్‌సభ పదవీకాలం 1967 మార్చి నుంచి 1970 డిసెంబరు వరకు కొనసాగింది. ఒక సంవత్సరం 79 రోజులు ముందుగానే సభను రద్దు చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన నీలం సంజీవరెడ్డి 1969లో తన పదవికి రాజీనామా చేయడంతో, గురుదయాళ్‌ సింగ్‌ థిల్లాన్‌ స్పీకర్‌ పదవి చేపట్టారు. డిప్యూటీ స్పీకర్‌గా కాదిల్‌కర్‌ వ్యవహరించారు. ఇందిరాగాంధీ లోక్‌సభ నాయకురాలుగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1969లో కాంగ్రెస్‌ పార్టీలో చీలిక ఏర్పడి కాంగ్రెస్‌ (ఓ), కాంగ్రెస్‌ (ఆర్‌)లు ఏర్పాటయ్యాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ మొదటిసారిగా మైనార్టీ ప్రభుత్వాన్ని కొనసాగించింది.


నాలుగో లోక్‌సభ కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఈ సమయంలోనే నీలం సంజీవరెడ్డి, వి.వి.గిరి రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. ఎలక్టోరల్‌ కాలేజ్‌’ సభ్యులు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇందిరా గాంధీ పిలుపునివ్వడంతో కాంగ్రెస్‌ పార్టీ బలపరచిన నీలం సంజీవరెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వి.వి.గిరి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అప్పుడే ఇందిరాగాంధీ ప్రభుత్వం తొలిసారిగా పలు ప్రైవేటు వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. 1969, జులై 19 నుంచి 14 ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వపరం అయ్యాయి. అలాగే ప్రభుత్వం మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు ఇస్తున్న ‘రాజభరణాలు’ రద్దు చేస్తూ(Abolition of Privy purse) 1971లో సాహసోపేతమైన చర్యలు చేపట్టారు.


అయిదో లోక్‌సభ: ఇది మధ్యంతర ఎన్నికల ద్వారా ఏర్పడిన తొలి లోక్‌సభ. దేశంలో మొదటిసారిగా 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 55% పోలింగ్‌ నమోదవగా, 22 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ అనే నినాదంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ‘ఇందిరాకో హఠావో - భారత్‌కో బచావో’ అనే నినాదంతో ప్రచారం చేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌ 352 స్థానాలు గెలవగా, సీపీఐ 23, సీపీఎం 25, భారతీయ జనసంఘ్‌ 22 స్థానాలు గెలిచాయి. లోక్‌సభ నాయకురాలిగా ఇందిరాగాంధీ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లోక్‌నాయక్‌గా ప్రసిద్ధి చెందిన జయప్రకాష్‌ నారాయణ్‌ సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చారు. ఈ లోక్‌సభకు స్పీకర్‌గా గురుదయాళ్‌సింగ్‌ థిల్లాన్‌ వ్యవహరించారు. ఈయన 1975లో రాజీనామా చేయడంతో బలిరాం భగత్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్‌గా జి.జి.స్వాల్‌ చేశారు. ఈ లోక్‌సభ కాలంలోనే అత్యధికంగా 19 రాజ్యాంగ సవరణ చట్టాలు చేశారు (24వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి 42వ రాజ్యాంగ సవరణ చట్టం వరకు). ఇందులో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని (1976) మినీ రాజ్యాంగంగా పేర్కొంటారు. ఆ చట్టం ద్వారా రాజ్యాంగానికి అనేక మార్పుచేర్పులు జరిగాయి. అవి-


* రాజ్యాంగ ప్రవేశికను సవరించి సౌమ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చారు.


* రాజ్యాంగంలో కొత్తగా 10 ప్రాథమిక విధులను పొందుపరిచారు.


* న్యాయస్థానాలకు ఉండే న్యాయ సమీక్షాధికారంపై పరిమితులు విధించారు.


* లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి ఆరేళ్లకు పొడిగించారు.


* ఈ లోక్‌సభ పదవీకాలం 1971 మార్చి నుంచి 1977 జనవరి వరకు కొనసాగింది. అత్యధిక కాలం ఉన్న లోక్‌సభ ఇదే (5 సంవత్సరాల 10 నెలల 6 రోజులు).


అయిదో లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని 1975లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఆయుధంగా మలచుకున్న ప్రతిపక్షాలు ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చేపట్టాయి. ఫలితంగా పత్రికలపై ఆంక్షలు, ప్రతిపక్ష రాజకీయ నాయకుల నిర్బంధాలు కొనసాగాయి. ఈ లోక్‌సభ కాలంలో రాష్ట్రపతులుగా వి.వి.గిరి, ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్, బి.డి.జెట్టి వ్యవహరించారు. ఆ సమయంలో గరిష్ఠంగా 482 చట్టాలు రూపొందాయి. అప్పట్లోనే బంగ్లాదేశ్‌ అవతరణ సందర్భంగా భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య యుద్ధం జరగడంతో అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి ఆర్టికల్‌ 352ను ప్రయోగించి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లుబాటు కాదని అలహాబాదు హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో దేశంలో శాంతిభద్రతలు నెలకొల్పే ఉద్దేశంతో ఇందిరా గాంధీ ప్రభుత్వ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ‘అంతరంగిక అల్లకల్లోలాలు’ నియంత్రణ కోసం 1975, జూన్‌ 26న ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.

 

బంగారు సత్యనారాయణ


 

 

Posted Date : 11-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌