• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో ప్రజాస్వామ్యం - పనితీరు

కూలిపోయి.. కూటమి కట్టి.. కుదురుకొని!

పదకొండో లోక్‌సభ అయిదేళ్లలో ముగ్గురు ప్రధానులు మారారు. పదమూడు నెలలకే పన్నెండో సభ కూలిపోయింది. అత్యంత అస్థిర పరిస్థితుల్లో కొలువుతీరిన పదమూడో సభ రెండు పదులపైగా పార్టీల కూటమితో మొదలై పూర్తికాలం పాలన చేసింది. మళ్లీ అధికారాన్ని దక్కించుకున్న యూపీఏ మరో పదేళ్లు సంకీర్ణాల సహకారంతోనే ప్రభుత్వాన్ని నడిపించింది. తిరిగి గత రెండు విడతలుగా ఎన్‌డీఏ స్థిరమైన సర్కారును నెలకొల్పి కుదురుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని పరిష్కరించుకుంటూ ప్రజాస్వామ్యం విశిష్టతను కాపాడుకోగలిగింది. దేశం కోసం పాలనాపరమైన పలు విధానాలను రూపొందించి అమలు చేసింది. ఆ విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వాటితోపాటు వివిధ లోక్‌సభల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు, మారిన ప్రభుత్వాల ప్రాధాన్యాలు, ముఖ్యమైన చట్టాలు, నిర్ణయాలపై అవగాహన పెంచుకోవాలి.   

 

11వ లోక్‌సభ:  ఈ ఎన్నికల్లో 58% పోలింగ్‌ నమోదైంది. 40 మంది మహిళలు ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 161 స్థానాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సి) 140, జనతాదళ్‌ 46, సీపీఐ 12, సీపీఎం 32, తెలుగుదేశం పార్టీ 16 స్థానాలు పొందాయి. ఈ లోక్‌సభ 1996, మే 15న ఏర్పడి 1997, డిసెంబర్‌ 4న రద్దయింది. అంటే కేవలం 1 సంవత్సరం 6 నెలల 13 రోజులు మాత్రమే మనుగడలో ఉంది. ఈ సభా కాలంలో ముగ్గురు ప్రధానులు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు.


* 1996లో బీజేపీ నాయకుడైన అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమవడంతో 13 రోజుల అనంతరం ఆ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది.


* హెచ్‌.డి.దేవేగౌడ జనతాదళ్, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ‘యునైటెడ్‌ ఫ్రంట్‌’ పేరుతో కూటమిని ఏర్పాటు చేసి, కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీల మద్దతుతో 1996, జూన్‌ 1న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే దేవేగౌడ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోవడంతో అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఐ.కె.గుజ్రాల్‌ నాయకత్వంలో ‘యునైటెడ్‌ ఫ్రంట్‌’ ప్రభుత్వం 1997, ఏప్రిల్‌లో కొలువుదీరింది. ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో 1998, మార్చిలో అధికారాన్ని కోల్పోయింది.


* ఈ లోక్‌సభకు ప్రతిపక్ష పార్టీకి చెందిన పి.ఎ.సంగ్మా స్పీకర్‌గా, సూరజ్‌భాన్‌ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. శంకర్‌దయాళ్‌ శర్మ, కె.ఆర్‌.నారాయణన్‌ రాష్ట్రపతి పదవులు నిర్వహించారు.


* మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు’ను తొలిసారిగా ఈ సభా కాలంలోనే ప్రవేశపెట్టారు. హెచ్‌.డి.దేవేగౌడ, ఐ.కె.గుజ్రాల్‌ రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవులు నిర్వహించారు. ఐ.కె.గుజ్రాల్‌ భారతదేశ విదేశాంగ విధానంలో నూతనంగా ‘గుజ్రాల్‌ డాక్ట్రిన్‌’ పేరుతో వ్యూహాన్ని ప్రవేశపెట్టారు.

12వ లోక్‌సభ: ఈ ఎన్నికల్లో 62% పోలింగ్‌ నమోదైంది. 43 మంది మహిళలు ఎన్నికయ్యారు. బీజేపీ 182, కాంగ్రెస్‌ 141, సీపీఐ 9, సీపీఎం 32, తెలుగుదేశం పార్టీ 12 స్థానాలు సాధించాయి. వాజ్‌పేయీ లోక్‌సభాపక్ష నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 13 నెలలు మాత్రమే ఈ ప్రభుత్వం కొనసాగింది. వాజ్‌పేయీ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం కేవలం ఒక్క ఓటు తేడాతో వీగిపోవడంతో ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది.ఏఐఏడీఎంకే  పార్టీ వాజ్‌పేయీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. స్పీకర్‌గా జి.ఎం.సి. బాలయోగి, డిప్యూటీ స్పీకర్‌గా పి.ఎమ్‌.సయీద్‌ వ్యవహరించారు. ఈ సభ కాలం 1998, మార్చి నుండి 1999, ఏప్రిల్‌ వరకు అంటే 13 నెలల 4 రోజులు మాత్రమే కొనసాగింది. వార్షిక బడ్జెట్‌ను సమర్పించే సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్పు చేశారు. కె.ఆర్‌.నారాయణన్‌ రాష్ట్రపతిగా వ్యవహరించారు.


13వ లోక్‌సభ: ఈ ఎన్నికల్లో 59% పోలింగ్‌ నమోదైంది. 49 మంది మహిళలు ఎన్నికయ్యారు. బీజేపీ 182, కాంగ్రెస్‌ 114, సీపీఐ 4, సీపీఎం 33, తెలుగుదేశం పార్టీ 29 స్థానాలు గెలుపొందాయి. స్పీకర్‌గా జీఎంసీ బాలయోగి వ్యవహరిస్తూ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. తదుపరి స్పీకర్‌గా మనోహర్‌ జోషి వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్‌గా పీఎం సయీద్‌ ఉన్నారు. కె.ఆర్‌.నారాయణన్, ఏపీజే అబ్దుల్‌ కలాం రాష్ట్రపతులుగా చేశారు.


* వాజ్‌పేయీ 21 రాజకీయ పార్టీలతో కూడిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఈ లోక్‌సభ కాలంలోనే దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 2000 సంవత్సరంలో ‘భారత్‌ నిర్మాణ్‌’ అనే కార్యక్రమం చేపట్టారు. 2001, డిసెంబరు 13న పార్లమెంటుపై పాకిస్థాన్‌ ఉగ్రవాదుల దాడి జరిగింది. 2001లో సార్వత్రిక ప్రాథమిక విద్య సాధనకు ‘సర్వశిక్ష అభియాన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


* 2000 సంవత్సరంలో జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య నేతృత్వంలో ‘రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌’ ఏర్పాటైంది. 2002లో పోటా చట్టం విషయంలో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించారు.


* పాకిస్థాన్‌తో ‘కార్గిల్‌’ యుద్ధం సంభవించింది. ‘భారతదేశం వెలిగిపోతోంది’(Shine India) అనే నినాదం ప్రాచుర్యం పొందింది. మైనార్టీ సంక్షేమంపై అధ్యయనం కోసం రంగనాథ్‌ మిశ్రా కమిటీని ఏర్పాటుచేశారు.


* ఈ లోక్‌సభ కాలంలోనే 86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002 ద్వారా రాజ్యాంగానికి ఆర్టికల్‌ 21(ఎ)ను చేర్చి ‘ఉచిత ప్రాథమిక విద్య’ను ప్రాథమిక హక్కుగా చేయాలని నిర్దేశించారు. 89వ రాజ్యాంగ సవరణ చట్టం-2004 ద్వారా ‘నేషనల్‌ ఎస్టీ కమిషన్‌’ ఏర్పాటు చేసి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు. ఈ లోక్‌సభ  1999, అక్టోబరు నుంచి 2004, ఏప్రిల్‌ వరకు కొనసాగింది.

 

14వ లోక్‌సభ: ఈ ఎన్నికల్లో 58% పోలింగ్‌ నమోదైంది. 45 మంది మహిళలు ఎన్నియ్యారు. కాంగ్రెస్‌ 145, బీజేపీ 138, సీపీఐ 10, సీపీఎం 43, తెలుగుదేశం పార్టీ 5, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) 5 స్థానాలు గెలిచాయి. ఎన్నికల్లో ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్స్‌) వినియోగించారు. ప్రొటెం స్పీకర్‌గా పనిచేసిన సోమ్‌నాథ్‌ చటర్జీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా చరణ్‌జిత్‌ సింగ్‌ అతవాలే వ్యవహరించారు. కాంగ్రెస్‌ పార్టీ, ఇతర పార్టీలతో కలిసి ‘ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి’ (యూపీఏ)గా ఏర్పడి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ సభ కాలంలోనే 2005లో గృహహింస చట్టాన్ని రూపొందించారు. 2006, అక్టోబర్‌ 26 నుంచి అమలులోకి వచ్చింది. ‘జాతీయ సమాచార హక్కు చట్టం’ 2005లో రూపొంది అదే ఏడాది అక్టోబర్‌ 12 నుంచి అమల్లోకి వచ్చింది. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం’(MGNREG Act) కూడా 2005లోనే ఆమోదం పొంది, 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. 2005లోనే ‘జాతీయ బాలల హక్కుల చట్టం’ రూపొందించారు. 2007లో ‘జాతీయ బాలల హక్కుల కమిషన్‌’ ఏర్పాటైంది. 2007లో ‘ఆదివాసీ హక్కుల చట్టం’ రూపొందింది.


* సభ 2004, మే నుంచి 2009 మే వరకు సాగింది. ఈ సమయంలో రాష్ట్రపతి (డా.ఏపీజే అబ్దుల్‌ కలాం), ఉపరాష్ట్రపతి (హమీద్‌ అన్సారి), ప్రధానమంత్రి (మన్మోహన్‌ సింగ్‌) ముగ్గురూ మైనార్టీ వర్గానికి చెందినవారే.


* భారతదేశం ఆమెరికాతో ‘123’ అనే ‘పౌర అణు ఒప్పందం’ కుదుర్చుకుంది. దాన్ని పార్లమెంటు ఆమోదించే సందర్భంలో జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడానికి పార్లమెంటు సభ్యులు కొందరు లంచం తీసుకున్నారనే ‘ఓటుకు నోటు’ కుంభకోణం 2008, జులై 22న వెలుగులోకి వచ్చింది.

 

15వ లోక్‌సభ: ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 58%. ఎన్నికైన మహిళలు 59 మంది. కాంగ్రెస్‌ 206, బీజేపీ 116, తృణమూల్‌ కాంగ్రెస్‌ 19, తెదేపా 6, తెరాస 2 స్థానాలు గెలుపొందాయి. స్పీకర్‌గా మీరాకుమార్‌ (లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్‌), డిప్యూటీ స్పీకర్‌గా కరియా ముండా వ్యవహరించారు. ఆహార భద్రతా చట్టం, లోక్‌పాల్‌ చట్టం, నిర్భయ చట్టం రూపొందాయి. సభ 2009, మే నుంచి 2014 మే వరకు కొనసాగింది. మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన ‘ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి’(UPA) ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రతిభా పాటిల్, ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి పదవులు నిర్వహించారు. 


* ‘ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యాహక్కు చట్టం 2009’ రూపొందింది. ఈ చట్టం 2010, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం 6-14 సంవత్సరాలు వయసున్న బాలబాలికలకు 1 నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్యను ‘ప్రాథమిక హక్కు’గా మార్చారు. 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2012 ద్వారా సహకార సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. ఈ కాలంలో రాష్ట్రపతి, స్పీకర్, అధికార పార్టీ అధ్యక్షురాలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అందరూ మహిళలే కావడం విశేష పరిణామం.

16వ లోక్‌సభ: ఈ ఎన్నికల్లో 66% పోలింగ్‌ నమోదైంది. 62 మంది మహిళలు ఎన్నికయ్యారు. విదీతి కూటమి 336 స్థానాలు గెలుపొందింది. ఈ కూటమిలోని బీజేపీ 282, శివసేన 18, తెలుగుదేశం పార్టీ 16, లోక్‌ జనశక్తి పార్టీ 6, శిరోమణి అకాలీదళ్‌ పార్టీ 4 స్థానాలు గెలుపొందాయి. ఇక UPA కూటమి 60 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఆ కూటమిలోని కాంగ్రెస్‌ 44, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) 6, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) 4 స్థానాలు సాధించాయి. స్పీకర్‌గా సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్‌గా తంబిదొరై వ్యవహరించారు. లోక్‌సభ నాయకుడిగా నరేంద్ర మోదీ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభ 2014, మే నుంచి 2019, మే వరకు కొనసాగింది. జాతీయ ప్రణాళిక సంఘం పేరును ‘నీతి ఆయోగ్‌’గా మార్పు చేశారు. ప్రణబ్‌ ముఖర్జీ, రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి పదవులు నిర్వహించారు.


* 2017లో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తీసుకొచ్చారు. 2019, జనవరిలో 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి  విద్యాసంస్థల్లో 10% రిజర్వేషన్లు నిర్దేశించారు.

17వ లోక్‌సభ: ఈ ఎన్నికల్లో విదీతి కూటమి 353 స్థానాలు సాధించింది. కూటమిలోని బీజేపీ 303, శివసేన 18, జనతాదళ్‌ (యునైటెడ్‌) 16, లోక్‌జనశక్తి పార్టీ 6 స్థానాలు గెలిచాయి. UPA కూటమి 91 స్థానాలు గెలిచింది. ఇందులోని కాంగ్రెస్‌ 52, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) 23, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఇతర పార్టీల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 22, తెరాస 9, తెదేపా 3 స్థానాలు దక్కించుకున్నాయి. ఈ లోక్‌సభ 2019, జూన్‌ 7న ఏర్పడి ప్రస్తుతం కొనసాగుతోంది. స్పీకర్‌గా ఓం ప్రకాష్‌ బిర్లా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం ముగియడంతో ద్రౌపది ముర్ము ఆ పదవికి ఎన్నికయ్యారు.


* 104వ రాజ్యాంగ సవరణ చట్టం, 2020 ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి లోక్‌సభ, రాష్ట్రాల విధాన సభల్లో రిజర్వేషన్‌ సదుపాయాన్ని 2020 నుంచి 2030 వరకు పొడిగించారు. ఆర్టికల్‌ 331 ప్రకారం రాష్ట్రపతి లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను, ఆర్టికల్‌ 333 ప్రకారం రాష్ట్ర విధానసభకు గవర్నర్‌ ఒక ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్‌ చేసే విధానాన్ని రద్దు చేశారు.


* 105వ రాజ్యాంగ సవరణ చట్టం, 2021 ద్వారా ఓబీసీ బిల్లును చట్టంగా చేశారు. దీని ప్రకారం ఓబీసీ జాబితాను తయారు చేసుకునే విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు.


* జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 అమలును నిలిపివేశారు. 


రచయిత: బంగారు సత్యనారాయణ

 

 

Posted Date : 26-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌