• facebook
  • whatsapp
  • telegram

అభివృద్ధి సమస్యలు: ప్రాంతీయ అసమానతలు, పర్యావరణ క్షీణత

సమానత్వ సాధనే సమగ్ర ప్రగతి!

బ్రిటిష్‌ వలస పాలనలో వనరుల దోపిడీకి గురై, అన్నివిధాలా వెనుకబడిపోయిన భారతదేశాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నిలిపే క్రమంలో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విశాల దేశంలో ప్రాంతాలవారీగా వనరులు, భౌగోళిక అనుకూలతలు, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో అసాధారణ అసమానతలున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, అధిక జనాభా, నిరుద్యోగం, ప్రగతి దిశగా ప్రేరణ కొరవడటం మొదలైన అభివృద్ధి నిరోధకాలు అడుగడుగునా ఎదురవుతున్నాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ సమగ్ర పురోగతిని సాధించడంలో తలెత్తుతున్న సవాళ్ల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రాంతీయ అసమానతలు, పర్యావరణ క్షీణత, వలసలు లాంటి సామాజిక సమస్యల పరిష్కారాలు, అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అనుసరించిన ప్రణాళికలు, వ్యూహాల గురించి తెలుసుకోవాలి.

ఏ దేశాన్నైనా ప్రగతి పథంలోకి తీసుకెళ్లడం అంత సులువైన విషయం కాదు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం కోసం సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను; ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలను పరిగణనలోకి తీసుకుంటూ   అభివృద్ధి సాధించాల్సి ఉంటుంది. అనుకున్న విధంగా పురోగతి సాధించే క్రమంలో దాని పర్యవసానాలు, పరిణామాలు సమాజంపై ఏ విధంగా ఉంటాయో సరిగ్గా అంచనా వేయగలగడం విధాన రూపకర్తలకు,  సామాజిక శాస్త్రవేత్తలకు సవాలు లాంటిది.

అభివృద్ధి సమస్యలు: భారతదేశంలో అభివృద్ధి అనేది పరస్పర విరుద్ధమైన అంశాలతో ముడిపడి ఉంది. ఒకవైపు ప్రపంచస్థాయి సమాచార సాంకేతిక రంగం, పరిశ్రమలు, పట్టణాలు, వాటికి కావాల్సిన ఉన్నతమైన మౌలిక వసతులు ఉంటే; మరోవైపు తీవ్ర పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు కనిపిస్తారు. అ పరిస్థితే అభివృద్ధి ఎంత సంక్లిష్టమైందో చెబుతోంది. ఆర్థిక అభివృద్ధినే అసలైన అభివృద్ధి అనుకోవడానికి వీల్లేదు.  జనాభాలో ఎక్కువ శాతం ప్రజలకు ఆరోగ్యం, విద్య, సరైన జీవన సదుపాయాలు అందనప్పుడు, దాన్ని అభివృద్ధిగా పరిగణించడం కుదరదు. అభివృద్ధిని అమర్త్యసేన్‌ మానవీయ కోణం నుంచి చూశారు. ‘‘ప్రజలు గౌరవంగా జీవించడానికి, కనీస సదుపాయాలు అందుకునే విధంగా వారి శక్తిసామర్థ్యాలను పెంపొందించగలగడమే అభివృద్ధి’’ అని పేర్కొన్నారు. అభివృద్ధి దానికదే సాధనంగా, అంతిమ లక్ష్యంగా ఉండాలి. దాన్ని సాధించేందుకు లేదా పొందేందుకు ప్రజలకు స్వాతంత్య్రం ఉండాలి. అభివృద్ధి అంటే ప్రజలు కేవలం సంపన్నులుగా జీవించడమే కాదు, వారు దీర్ఘకాలం, సుస్థిరంగా సుఖసంతోషాలు అనుభవించే విధంగా ఉండాలి. అందుకు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలు తగిన సామర్థ్యాలు కలిగి ఉండాలని వివరించారు. కేవలం ఆర్థిక దృక్పథంలో రూపొందించిన అభివృద్ధి నమూనాల అమలు    క్రమంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రాంతీయ అసమానతలు: భారత దేశంలో బ్రిటిష్‌ పాలకుల వలస విధానం, వనరుల దోపిడీ లాంటివి, కొన్ని ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడానికి, మరికొన్ని ప్రాంతాల వెనుకబాటుకు కారణమయ్యాయి. స్వాతంత్య్రానంతరం సమీకృత అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలు, ఇంకా ఇతర ప్రణాళికల ద్వారా విశేష కృషి జరిగింది. అయినప్పటికీ ప్రాంతీయ అసమానతలను పూర్తిస్థాయిలో తగ్గించలేకపోయాయి. దీనికి అనేక సామాజిక, రాజకీయ కారణాలున్నాయి. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కావాల్సినవి సహజ వనరులు, రవాణా వసతులు, రాజకీయ చొరవ, సంకల్పం. పెట్టుబడులు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. మౌలిక, సహజ వనరులు ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందితే, మిగతా ప్రాంతాలు వెనుకబడ్డాయి.

* భారత దేశంలో సమగ్ర, సమాన అభివృద్ధి సాధించేందుకు ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌ (ప్రణాళిక సంఘం) లాంటి రెండు ప్రధాన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీటిలో నీతి ఆయోగ్‌ పరిధి ఎక్కువ. ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించడంలో దానికి ఎక్కువ బాధ్యతలు, అధికారం ఉంటాయి. ప్రణాళికల తొలినాళ్లలో వెనుకబాటు ప్రాంతాలను అభివృద్ధిపరిచే విధంగా ప్రభుత్వరంగ సంస్థలను పలు ప్రాంతాల్లో స్థాపించారు. కానీ అసమానతలు ఆశించిన విధంగా తొలగిపోలేదు. దీనికి ప్రధాన కారణం వివిధ ప్రాంతాల వెనుకబాటుతనం, ఆర్థిక, సామాజిక అసమానతలు. ఈ వ్యత్యాసం దేశీయ తలసరి ఉత్పత్తిలో స్పష్టంగా కనిపిస్తుంది. భారత దేశంలో సరళీకరణ తర్వాత, ప్రైవేటు రంగం ఆర్థిక అభివృద్ధిలో నిర్ణయాత్మక శక్తిగా మారింది. ఈ పరిస్థితుల వల్ల దేశంలోని విభిన్న ప్రాంతాల్లో పరిశ్రమలు, ప్రజాసేవలు, విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి రంగాల్లో పెట్టుబడులు తగ్గిపోయాయి.

భారతదేశంలో ప్రాంతీయ అసమానతలకు కారణాలు

1) చారిత్రక కారణాలు: బ్రిటిషర్లు కోల్‌కతా, ముంబయి, చెన్నైల్లో మాత్రమే వారి కార్యకలాపాలు, పరిశ్రమలను కేంద్రీకరించి దేశంలోని మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు.

2) భౌగోళిక కారణాలు: భారత్‌లో కొండలతో ఉన్న కఠినమైన భూభాగాలు, నదులు, దట్టమైన అడవులు, ఎడారులు, బీడు భూములు, వరదలు సంభవించే ప్రాంతాలతో భూభాగ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట అభివృద్ధి పనులు, పరిపాలనకు ఎక్కువగా ఖర్చవుతోంది.

3) ప్రణాళిక వైఫల్యం: బిహార్, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలు నీతిఆయోగ్‌ నిర్దేశించిన సమతౌల్య ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో విఫలమయ్యాయి. విద్య, ఆరోగ్యం, మహిళా అక్షరాస్యత, లింగనిష్పత్తులు, గ్రామీణ-పట్టణ విభజన లాంటి అంశాలవల్ల పలుప్రాంతాల మధ్య సామాజికఅసమానతలు కనిపిస్తాయి.

4) ఆర్థిక కారణాలు: ఆర్థిక సంస్కరణలు సరళీకరణ, ప్రైవేటీకరణకు బాటలు వేశాయి. బహుళజాతి కంపెనీల ప్రవేశం, విస్తరణతో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా సంస్థలు పతనమవుతున్నాయి.

5) మౌలిక వసతులు: భారత్‌లో మొదటిశ్రేణి నగరాలైన ముంబయి, బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్, చెన్నైల్లో అద్భుతమైన మౌలిక వసతులున్నాయి. మిగతాప్రాంతాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి.

6) రాజకీయ సంకల్పం: రాజకీయ అస్థిరత్వం, శాంతిభద్రతల సమస్య, తీవ్రవాదం లాంటివి అభివృద్ధికి అవరోధకాలు. రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు ప్రేరణ లేకపోవడం కూడా ప్రాంతీయ అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకి.

ప్రాంతీయ అసమానతల పర్యవసానాలు

1) రాష్ట్రంలో, రాష్ట్రాల మధ్య ఉన్న ఆందోళనలు: అసమాన అభివృద్ధి రాష్ట్రంలో, రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఉదా: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, అస్సాంలోని ప్రత్యేక బోడోల్యాండ్‌ పోరాటం, మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ ఉద్యమాలు మొదలైనవి.

2) వలస: వెనుకబడిన ప్రాంతాల నుంచి ప్రజలు జీవనోపాధి కోసం అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలసపోతారు. దాంతో అక్కడ వనరుల కొరత తలెత్తుతుంది. కొత్తరకం సామాజిక సమస్యలు, అశాంతి నెలకొంటాయి.

3) గృహ సమస్య: గృహ సదుపాయాల కొరత కారణంగా పట్టణాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అద్దెలు పెరుగుతున్నాయి. జనాభా పెరుగుదలతో నీటికి డిమాండ్‌ అధికమైంది.

4) పర్యావరణ క్షీణత: కేంద్రీకృత పారిశ్రామిక అభివృద్ధి కారణంగా అన్నిరకాల కాలుష్యాలు పెరిగిపోతాయి (గాలి, నీరు, భూమి, ధ్వని కాలుష్యం మొదలైనవి).

5) సామాజిక అశాంతి: సంపద, అభివృద్ధిలో వ్యత్యాసం సామాజిక అశాంతికి, సమాజంలో వివిధ వర్గాల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. గ్రామాలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోని చదువుకున్న యువత నిరుద్యోగంతో   నిరుత్సాహపడతారు. ఈ నిరాశే నక్సల్బరీ లాంటి తీవ్ర ఉద్యమాలకు దారితీస్తుంది.

ప్రాంతీయ అసమానతలను అధిగమించేందుకు భారత ప్రభుత్వం మూడు అంశాల  విధానాన్ని అవలంభించింది.

1) వనరుల వెనుకబాటుతనం బదిలీ:  వనరులు, నిధుల కేటాయింపు తదితర రూపాల్లో రాష్ట్ర ప్రణాళికలకు కేంద్రం సహాయం అందిస్తుంది. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం తాత్కాలిక బదిలీలు, కేంద్రీకృత ప్రాయోజిత పథకాల  కేటాయింపులు, ఆర్థిక సంస్థల నుంచి స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల మంజూరు మొదలైనవి ఉంటాయి.

2) ప్రత్యేక ప్రాంతీయ అభివృద్ధి: నిర్దిష్ట కార్యక్రమాల ద్వారా కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, కరవు ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహాయం అందించింది. ఉదాహరణకు SFDA, MEAL, DPAP, CSRE  మొదలైనవి. 

3) వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడిని పెంపొందించేందుకు ప్రోత్సాహకాలు: వివిధ పారిశ్రామిక, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; ఇతర ఆర్థిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

* కేంద్ర ప్రభుత్వ ఆదాయ పన్ను రాయితీలు.

* పన్ను సెలవు దినాలు

* కేంద్ర పెట్టుబడి రాయితీలు

* రవాణా రాయితీ, సబ్సిడీ పథకం

* వెనుకబడిన ప్రాంతాల్లో కొత్త ఆర్థిక సంస్థల్ని ప్రోత్సహించడం

* రాష్ట్రప్రభుత్వ ప్రోత్సాహకాలు.పర్యావరణ క్షీణత: ప్రపంచ దేశాలన్నింటికీ పర్యావరణ క్షీణత ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. ప్రజల ఆరోగ్యం క్షీణించడంతో పాటు శీతోష్ణస్థితి మార్పులు, ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం, ఆహార భద్రతకు ముప్పు లాంటివన్నీ దీని పర్యవసానాలే. ఈ పరిస్థితులను నివారించి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వ్యూహాన్ని రూపొందించింది.

భారతదేశంలో పర్యావరణ విధానం: భారత్‌లో 1976లో సరికొత్త పర్యావరణ విధానాలు రూపొందించేందుకు రాజ్యాంగాన్ని సవరించారు. రాజ్యాంగంలోని   నాలుగో భాగంలో ఆర్టికల్‌ 48(ఎ) ప్రకారం పర్యావరణ పరిరక్షణకు, అటవీ, వన్యప్రాణుల రక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆర్టికల్‌ 51 ఎ(జి) ప్రకారం దేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం పలు చట్టాలు రూపొందాయి. అవి..

* నీటి (కాలుష్య నివారణ నియంత్రణ) చట్టం 1974

* అటవీ (పరిరక్షణ) చట్టం 1980

* స్టాక్‌హోం సమావేశం నిర్ణయాలతో రూపొందిన వాయు (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1981 

* పర్యావరణ (పరిరక్షణ) చట్టం 1986. (భోపాల్‌ గ్యాస్‌ విషాదం ఇందుకు మూలం)

* శబ్దకాలుష్య నియమాలు (నియంత్రణ) - 2000.

‘‘ప్రజలు గౌరవంగా జీవించడానికి, కనీస సదుపాయాలు అందుకునే విధంగా వారి శక్తిసామర్థ్యాలను పెంపొందించగలగడమే అభివృద్ధి’’

 - అమర్త్యసేన్‌  (నోబెల్‌ అవార్డు గ్రహీత)

 



రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి 

Posted Date : 03-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌