• facebook
  • whatsapp
  • telegram

భ‌క్తి, సూఫీ ఉద్య‌మాలు

భారతదేశంలో మధ్యయుగంలో వచ్చిన మత ఉద్యమాలే భక్తి, సూఫీ ఉద్యమాలు. ప్రాచీనకాలం నుంచే భాగవత మతంలో భాగంగా భక్తి ఉద్యమ లక్షణాలు మన దేశంలో కనిపిస్తాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో మోక్షసాధన కోసం చేసే దైవపూజను భక్తిగా పేర్కొంటారు. భారతదేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించడంతో హిందూ- ఇస్లాం మతాలు పరస్పరం ప్రభావితం చేసుకోవడం వల్ల భక్తి, సూఫీ ఉద్యమాలు విస్తృతమయ్యాయి. ఇవి మతసామరస్యానికి, సాంఘిక సంస్కరణల ఆధ్యాత్మిక భావాల అభివృద్ధికి దోహదపడ్డాయి. నానక్, కబీర్, చైతన్యుడు లాంటి ఎంతో మంది భక్తి ఉద్యమకారులు; ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ, షేక్‌ సలీం చిస్తీ, నిజాముద్దీన్‌ ఔలియా, బాబా ఫరీద్‌ లాంటి సూఫీ తత్వవేత్తలు తమ రచనలు, బోధనలు, గీతాల ద్వారా భక్తి, సూఫీ ఉద్యమాలకు, మతసామరస్యానికి ఎంతో కృషి చేశారు.

 

‘భక్తి’ అంటే నిర్మలమైన మనస్సుతో మోక్షసాధన కోసం భగవంతుడిని ప్రార్థించడం. ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో భక్తిభావం ఉంది. ఆదిమానవుడు ముసుగులు ధరించి ప్రకృతి శక్తులను ఆరాధించడం; సింధు ప్రజలు అమ్మతల్లి, పశుపతిని పూజించడం; ఆర్యులు ఇంద్రుడిని, త్రిమూర్తులను ఆరాధించడంలో భక్తిభావం కనిపిస్తుంది. కానీ ప్రాచీనకాలంలో బ్రాహ్మణ ఆధిక్యం పెరగడం, కర్మకాండలకు ఎక్కువ ఖర్చు లాంటి కారణాల వల్ల సామాన్యులు భగవంతుడిని పూజించడానికి సాధ్యమయ్యేది కాదు. కాబట్టి జైన, బౌద్ధ మతాలు మోక్షసాధన కోసం సల్లేఖన వ్రతం, అష్టాంగ మార్గాలను ప్రబోధించాయి. గుప్తులకాలంలో వచ్చిన భాగవత మతంలో ఈ భక్తి ఉద్యమ భావాలు స్పష్టంగా ఉన్నాయి. తమిళదేశంలో క్రీ.శ.5వ శతాబ్దంలో ‘భక్తి’ అనే పదాన్ని పేర్కొన్నారు. ఆళ్వార్లు, నయనార్లు తమ బోధనలు, కీర్తనల ద్వారా భక్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ భారతదేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించడంతో వాస్తవంగా భక్తి, సూఫీ ఉద్యమాలు అసలైన రూపాన్ని సంతరించుకున్నాయి. మొదట్లో కేవలం సాహిత్యపరంగా ఉన్న భక్తి ఉద్యమం క్రమంగా సాంఘిక, ఆర్థిక, సంస్కరణల వైపు దృష్టి సారించింది. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యాన్ని తెచ్చింది. ముఖ్యంగా హిందూ ముస్లి మత సామరస్యాన్ని ప్రచారం చేసింది.

 

ఇస్లాం మతంలో ఉన్న ఏకేశ్వరోపాసన, సోదరభావం, కుల వ్యవస్థ లేకపోవడం లాంటి అంశాలను హిందూమతం స్వీకరించి భక్తి ఉద్యమాన్ని విస్తృతం చేసింది. యూసఫ్‌ హుస్సేన్‌ అనే చరిత్రకారుడు భక్తి ఉద్యమాన్ని రెండు దశలుగా విభజించారు. భగవద్గీత కాలం నుంచి 13వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మొదటి దశగా, 13 నుంచి 16వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని రెండో దశగా పేర్కొన్నారు. భక్తి అనే పదం తొలిసారిగా ‘శ్వేతాశ్వేతర ఉపనిషత్తు’లో కనిపిస్తుంది. భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభమవడంతోనే భక్తి ఉద్యమం మొదలైందని తారా చంద్, అహ్మద్‌ నిజామి, మహ్మద్‌ ఖురేషి లాంటి చరిత్రకారులు పేర్కొన్నారు. అయితే ఇది భగవద్గీతలోని బోధనల వల్ల ప్రభావితమైందని, రామానుజాచార్యుడు, శంకరాచార్యుడు, ఆళ్వార్లు, నయనార్ల బోధనల్లో భక్తి ఉద్యమ బీజాలున్నాయని ఆర్‌.జి. భండార్కర్‌ లాంటి చరిత్రకారులు పేర్కొన్నారు. 

 

భ‌క్తి ఉద్య‌మ‌కారులు - బోధ‌న‌లు

క్రీ.శ.6వ శతాబ్దంలో తమిళ ప్రాంతంలో ఆళ్వార్లు అనే వైష్ణవ భక్తులు, నయనార్లు అనే శైవభక్తులు తమ రచనల ద్వారా భక్తిభావాన్ని ప్రచారం చేశారు. ఆళ్వార్లు, నయనార్లు పాశురాలు, తేవరం/ తిరువాచకాలు అనే భక్తి గీతాల ద్వారా భగవంతుడిని ఆరాధించారు. అనంతరం త్రిమతాచార్యులైన శంకరాచార్యులు (అద్వైతం), రామానుజాచార్యులు (విశిష్టాద్వైతం), మద్వాచార్యులు (ద్వైతం) బోధనల్లో భక్తి ఉద్యమ ఛాయలు కనిపిస్తాయి. విష్ణువుపై అమితమైన భక్తి మోక్షసాధనకు మార్గమని రామానుజుడు బోధించారు. భాగవత మతంలోనూ ఇదే సాంప్రదాయం ఉంది. 

 

ఆదిశంకరుడు: ఈయన కేరళలోని కాలడిలో జన్మించారు. కాశీ (బెనారస్‌)కి చెందిన గోవిందయోగి బోధనలకు ప్రభావితమై, అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. భక్తి ఉద్యమానికి పునాదులు వేసి హిందూమత రక్షకుడిగా పేరొందారు. మోక్షసాధనకు జ్ఞానమార్గమే ఏకైక సాధనమని ప్రబోధించారు. శృంగేరి, బదరీ, ద్వారక, పూరీ ప్రాంతాల్లో నాలుగు మఠాలు స్థాపించారు.

 

రామానుజాచార్యులు: తమిళనాడులోని పెరంబదూర్‌లో జన్మించారు. యానప్రకాశుడు అనే గురువు ప్రభావంతో విశిష్టాద్వైత మత సిద్ధాంతాన్ని రూపొందించారు. శంకరాచార్యుల జ్ఞానమార్గాన్ని కాదని, మోక్షమార్గాన్ని ప్రబోధించారు. నిమ్నకులాల వారు దేవాలయాల్లోకి వెళ్లేలా కృషి చేశారు. కులోత్తుంగ చోళుడు ఇతడి వైష్ణవ మత ప్రచారాన్ని వ్యతిరేకించారు. దీంతో రామానుజుడు హొయసాల రాజ్యానికి వెళ్లిపోయారు. అన్ని కులాలవారు దేవుడిని చేరుకోవడానికి, పూజించానికి అర్హులే అని రామానుజుడు ప్రబోధించారు. 

ద్వైతమతాన్ని ప్రబోధించిన మద్వాచార్యుడు, ద్వైతాద్వైతాన్ని ప్రచారంచేసిన నింబార్కుడు; శుద్ధాద్వైతాన్ని ప్రబోధించిన వల్లభాచార్యులు తమ బోధనల్లో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు.

 

చైతన్యుడు: ఈయన బెంగాల్‌లో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. రాధాకృష్ణులకు పూజ చేసేందుకు అన్నివర్గాల వారు అర్హులేనని, రాగమార్గమే మోక్షమార్గానికి సాధన అని ప్రబోధించారు. ప్రేమ, భక్తి, గానం, నృత్యాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చని చెప్పారు. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనే శ్రీకృష్ణుడు/ హరి అని ప్రచారం చేశారు. 

 

రామానందుడు: ఈయన ఉత్తర భారతదేశంలో రామభక్తిని ప్రచారం చేసి, అనేక కులాల వారిని శిష్యులుగా చేర్చుకున్నారు. ఈయనకు ధర్మ(జాట్‌), సేనా(నాయి బ్రాహ్మణ), రవిదాస్‌(చర్మకారుడు), కబీర్‌(మహ్మదీయుడు)  పురుష శిష్యులు కాగా; పద్మావతి, సురస్త్రీ మహిళా శిష్యులుగా ఉన్నారు. స్త్రీలకు వైష్ణవమతంలో చేరే అవకాశాన్ని కల్పించారు. ఒకరు మరొకరి కులాన్ని అడగకూడదని, దేవుడిని ప్రార్థించే అర్హత అందరికీ ఉందని ప్రబోధించారు. 

 

భక్త కబీర్‌: భక్తి ఉద్యమకారుల్లో ఈయనకు గొప్ప పేరు ఉంది. హిందూ-ముస్లిం ఐక్యతను ప్రచారం చేసి, కులవ్యవస్థను ఖండించారు. విగ్రహారాధన, కర్మకాండలు, తీర్థయాత్రలను వ్యతిరేకించారు. రాముడు, రహీం ఒక్కటే అని, వారు ఒకే మట్టితో చేసిన రెండు కుండలని బోధించారు. కబీర్‌ రచనలను దోహాలు/ బీజక్‌లు అని, వారి శిష్యులను కబీర్‌పంథి అని పిలుస్తారు. పవిత్రమైన హృదయం లేకుండా పవిత్రనదీ స్నానం చేయడం వల్ల ప్రయోజనం ఉండదని కబీర్‌ పేర్కొన్నారు. 


గురునానక్‌: ఈయన హిందూ-ముస్లిం ఐక్యతను చాటిన మరో ప్రముఖ భక్తి ఉద్యమకారుడు. 1469లో పంజాబ్‌లోని తాల్వండి  గ్రామంలో జన్మించారు. ఈయనే సిక్కుమతాన్ని స్థాపించారు. ఇతడి బోధనలు ఆదిగ్రంథ్‌ (అర్జున్‌ సింగ్‌ రచన)లో ఉన్నాయి. గురునానక్‌ ప్రధాన బోధనలు ‘నామ్‌ జప్నా, కీర్త్‌ కర్నా, వంద్‌ చక్నా’. అంటే భగవంతుడి నామాన్ని జపిస్తూ, భగవంతుడిని కీర్తిస్తూ అతడికి నిత్యవందనం సమర్పిస్తూ మోక్షం పొందవచ్చని ప్రబోధించారు. 

 

వారణాసికి చెందిన హరిజనుడైన రామదాసు, రాజస్థాన్‌కు చెందిన మీరాబాయి, సూరదాస్, తులసీదాస్‌ లాంటి భక్తి ఉద్యమకారులు కూడా తమ రచనల ద్వారా భక్తి ఉద్యమ భావాలను ప్రచారం చేశారు. ఉన్నత వర్గానికి చెందిన రాజపుత్ర రాణి అయిన మీరాబాయి కృష్ణుడిపై భక్తితో బ్రిజ్‌ భాషలో గీతాలు రచించారు. అవి మీరాభజనలుగా ప్రసిద్ధి చెందాయి.

 

జ్ఞానదేవుడు, నామదేవుడు, తుకారం, సమర్థ రామదాసు లాంటి మరాఠా భక్తి ఉద్యమకారులు మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. వారు రాసిన భక్తి గీతాలను అభంగాలుగా పేర్కొంటారు. మహారాష్ట్ర ధర్మగా పేరొందిన మరాఠా భక్తి మార్గానికి జ్ఞానదేవుడు పునాది వేశారు. ఈయన జ్ఞానేశ్వరి, అమృతానుభవ లాంటి గ్రంథాలను రాశారు. నామదేవుడు పండరీపురం కేంద్రంగా విష్ణుభక్తిని ప్రచారం చేశారు. ఏకనాథుడు కులవ్యవస్థను వ్యతిరేకిస్తూ, నిమ్నకులాల వారిపై సానుభూతితో గీతాలు రాశారు. అవి కీర్తనలు, భజనలుగా పేరొందాయి. జ్ఞానదేవుడి శిష్యుడైన తుకారం తన బోధనల ద్వారా మహారాష్ట్రలో జాతీయతా భావానికి పునాది వేశారు. శివాజీని అమితంగా ప్రభావితం చేసి, అతడి మత గురువుగా పేరొందినవారు సమర్థరామదాసు. ఈయన దశబోధ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు.

 

నర్సీమెహతా గుజరాత్‌ ప్రాంతంలో; శంకరదేవుడు అస్సాం ప్రాంతంలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. గాంధీజీకి అత్యంత ఇష్టమైన ‘వైష్ణవ జనతో తేనో కహియే’ అనే భజన గీతాన్ని నర్సీ మెహతానే రచించారు.

 

భక్తి ఉద్యమ ప్రభావం

భక్తి ఉద్యమం భారతదేశంలోని మత, సామాజిక, ఆధ్యాత్మిక, సాహిత్య రంగాల్లో అనేక మార్పులకు కారణమైంది. మొదట్లో హిందూ-మహ్మదీయ మతాలు పరస్పర ద్వేషంతో ఉండేవి. భారతదేశం మొత్తాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలన్న మహ్మదీయమతం; భారత్‌ నుంచి ఇస్లాం మతాన్ని పారదోలాలని హిందూమతం భావించాయి. కానీ అవి తమ లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. కాబట్టి కలిసిమెలిసి జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. రెండుమతాల వారు అవతలి మతంలో ఉన్న కొన్ని మంచి లక్షణాలను స్వీకరించి; భక్తి, సూఫీ ఉద్యమాలను ప్రారంభించారు. వీటి ఫలితంగానే ఇండో ఇస్లామిక్‌ సాంప్రదాయం ఏర్పడింది. పరమత సహన విధానాన్ని పాటించారు. కులమత భేదాలను ఖండించారు. విగ్రహారాధనను వ్యతిరేకించారు. 

 

రామానందుడు, భక్త కబీర్‌ హిందీభాషలో రచనలు చేశారు. నామదేవుడు, తుకారం, సమర్థ రామదాసు లాంటి వారు మరాఠీ భాషలో భక్తి సాహిత్యాన్ని సృష్టించారు. హిందూమతానికి చెందిన పండగలు, ఉత్సవాల్లో ముస్లింలు; ముస్లింల పండగల్లో హిందువులు పాల్గొని హిందూ-ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. హిందువుల్లో ఉన్న సతీసహగమన విధానాన్ని, స్వస్తిక్‌ గుర్తును వాడటం లాంటి వాటిని ముస్లింలు అనుసరించారు. ముస్లిం పండగలైన మొహర్రం, రంజాన్‌ లాంటి పండగల్లో హిందువులు పాల్గొని మత సామరస్యానికి దోహదపడ్డారు. అది నేటికీ కొనసాగుతోంది.

 

భక్తి ఉద్యమ లక్షణాలు

‣ ఈశ్వరుడి ఏకత్వం(ఏకేశ్వరోపాసన)పై గాఢమైన అనురక్తి ఉండటమే భక్తిఉద్యమ ప్రధాన లక్షణం. మోక్షసాధన కోసం భగవంతుడి కృపను పొందడమే భక్తుడి ప్రధాన లక్ష్యం.
‣ ప్రాచీన కాలం నుంచి ఉన్న పూజాపునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్ర మనసు, స్వచ్ఛమైన జీవనం, మానవత్వ విలువలు పాటించడం ద్వారా భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని ప్రచారం చేశారు.

‣ భక్తి ఉద్యమం సుగుణ, నిర్గుణ భావాలను పెంపొందించింది. దేవుడు అనేక రూపాలు, గుణాలతో ఉంటాడని భావించే చైతన్యుడు, సూరదాసు, శంకరదాసు, మీరాబాయి, తులసీదాసు లాంటి వారు సగుణోపాసనను ప్రబోధించారు. కబీర్, గురునానక్, దాదుదయాళ్‌ లాంటి వారు భగవంతుడు నిర్వికారుడు, సర్వాంతర్యామి, ఎలాంటి రూపం, గుణం లేనివాడని భావించారు. వీరు  నిర్గుణోపాసనను ప్రబోధించారు.

‣ జ్ఞానార్జనలో భక్తి ప్రధానపాత్ర పోషిస్తుందని, నిజమైన జ్ఞానం పొందాలంటే గురువు అవసరం ఎంతో ఉందని భక్తి ఉద్యమకారులు భావించారు.

‣ భక్తి ఉద్యమం సంస్కృత భాష, కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించింది. నిమ్నకులాలు, తరగతులకు చెందిన వ్యక్తులే ప్రధాన భక్తి ఉద్యమకారులుగా పేరొందారు. ధన్నా భగత్‌ నిమ్న కులం; కబీర్‌ దిగువ కులం; నామదేవుడు దర్జీకులం; తుకారం శూద్ర కులానికి చెందినవారు.

‣ బ్రాహ్మణ ఆధిక్యాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు ప్రాంతీయ భాషలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వాటిలోనే తమ రచనలు చేశారు. కాబట్టి భక్తి ఉద్యమకాలాన్ని ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగంగా పేర్కొంటారు.

‣ భక్తి, సూఫీ ఉద్యమాలు హిందూ-ముస్లిం ఐక్యతను, మత సామరస్యాన్ని ప్రబోధించాయి. గురునానక్, కబీర్‌ లాంటి వారు హిందూ-ముస్లిం ఐక్యతకు ఎంతో కృషి చేశారు. మానవ ఆవిర్భావం నుంచి మనుషులను విడదీసే తేడాలేవీ లేవని, విభేదాలన్నీ మనం సృష్టించుకున్నవే అని కబీర్‌ పేర్కొన్నారు.

‣ భక్తి ఉద్యమకారులు ప్రేమతత్వాన్ని ఆరాధించారు. శాస్త్ర గ్రంథాలను పఠించడం వల్ల మానవులు పండితులు కాలేరని, ప్రేమించడం, ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే పండితులు అవుతారని కబీర్‌ బోధించారు.

‣ భక్తి ఉద్యమకారులు వృత్తి పనివారిని, హస్తకళా నిపుణులను ఆకర్షించి మత, సామాజిక వ్యవస్థల్లో ప్రజాస్వామిక, సమానత విలువలు రావాలనే లక్ష్యాలను ప్రచారం చేశారు.

‣ భక్తి ఉద్యమం కర్మకాండలు; ఎక్కువ ఖర్చుతో కూడిన పూజా విధానం; విగ్రహారాధనలను తీవ్రంగా వ్యతిరేకించింది.
 

సూఫీ ఉద్యమాలు
మధ్యయుగంలో భారతదేశంలోని హిందూ మతంలో భక్తి ఉద్యమం వచ్చినట్లే ఇస్లాం మతంలో సూఫీ ఉద్యమం వచ్చింది. ముస్లిం మతపెద్దలు హిందూ మతంలో ఉన్న కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను; యోగా విధానాలను గ్రహించి సూఫీ ఉద్యమాన్ని ప్రారంభించారు. హిందూ, ఇస్లాం మతాల సమగ్ర సంగమమే సూఫీ, భక్తి ఉద్యమాల ప్రారంభానికి ప్రధాన కారణంగా చరిత్రకారులు పేర్కొంటారు. ఉలేమాల ఆధిపత్య ధోరణిని, వారి ఖురాన్‌ వర్గీకరణను సూఫీ సన్యాసులు వ్యతిరేకించారు. ‘‘భగవంతుడ్ని (అల్లాను) ప్రేమించడమే అతడ్ని చేరుకునే ప్రధాన మార్గం’’ అని వారు బోధించారు. సూఫీలు హిందూ-ముస్లింల ఐక్యతకు పాటుపడ్డారు.


అర్థం:  క్రీ.శ. 19వ శతాబ్దంలో ‘‘సూఫీ ఇజం’’ అనే ఆంగ్ల పదం వాడుకలోకి వచ్చింది. ‘సఫా’ అనే పదం నుంచి సూఫీ ఏర్పడింది. ‘సఫా’ అంటే పరిశుభ్రమైన, స్వచ్ఛమైన మనసు అని పండితులు వ్యాఖ్యానించారు. మరికొందరు ‘సుఫా’ అనే పదం నుంచి సూఫీ వచ్చినట్లు పేర్కొన్నారు. సుఫా అంటే మసీదు లోపల మహమ్మద్‌ శిష్యులు సమావేశం జరిపే అరుగు అని తెలిపారు. సూఫీ పదాన్ని తొలిసారి బస్రా ప్రాంతానికి చెందిన జహీజ్‌ అనే పండితుడు ఉపయోగించారు. భక్తి ఉద్యమం లాగానే పరిశుభ్రమైన మనసుతో భగవంతుడ్ని ప్రార్థిస్తే మోక్షం లభిస్తుందనేది సూఫీ ఉద్యమంలో ప్రధాన అంశం. సూఫీ బోధకులు పశ్చాత్తాపం, దేవుడిపై విశ్వాసం లాంటి ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అరేబియాలో పుట్టిన ఈ సూఫీ ఉద్యమం అరబ్బుల ద్వారా భారత దేశంలోకి ప్రవేశించి ఇక్కడి ముస్లింలను అధికంగా ప్రభావితం చేసింది.
          సూఫీలు మొదట పంజాబ్, సింధు ప్రాంతాల్లో తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. గుజరాత్, దక్కన్‌ బెంగాల్‌ ప్రాంతాల్లో స్థిరపడిన సూఫీ సన్యాసులు తమ బోధనల ద్వారా వీటిని మొత్తం భారతదేశానికి విస్తరింపజేశారు. సూఫీలు తొలుత పారశీక సంప్రదాయాన్ని అనుసరించి, కాలక్రమేణా భారతీయ సంప్రదాయంలోకి మారారు. హిందూ మత విశ్వాసాలను గ్రహించారు. సూఫీ సన్యాసులు, హిందూ భక్తి ఉద్యమకారులు చెప్పే విషయాలు, ఇచ్చే సమాధానాలు సామాన్య ప్రజలను ఎంతో ఆకర్షించాయి. భక్తి, సూఫీ ఉద్యమాలకు సహజీవనం, మానవత ఉమ్మడి లక్ష్యాలుగా మారాయి. సూఫీ ప్రవక్తలు ఏకాంత జీవితాన్ని గడుపుతూ, దైవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. వీరి ప్రవచనాలు, బోధనలు సంప్రదాయ విరుద్ధమైనవని ఇస్లాం మత ప్రచారకులైన ఉలేమాలు విమర్శించారు. సూఫీ ఉద్యమం మద్యపానాన్ని వ్యతిరేకిస్తూ, సన్యాస జీవితానికి ప్రాముఖ్యం ఇచ్చింది. ఇది సామాన్య ప్రజలు, బలహీన వర్గాలను బాగా ఆకర్షించింది.


సూఫీ మతం ఆవిర్భవించడానికి కారణాలు
భారతదేశంలోకి ముస్లిం మతం ప్రవేశించాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇస్లాం రాజ్య విస్తరణలో భాగంగా ముస్లిం మతంలోనే అనేక ముఠా తాగాదాలు సంభవించాయి. ముఖ్యంగా ఇస్లాం మత పెద్ద అయిన ‘ఖలీఫా’ విషయంలో ముస్లింలకు పరస్పర విరుద్ధ భావాలు ఉన్నాయి. దీంతో వీరు సున్నీలు, షియాలు అనే రెండు ప్రధాన వర్గాలుగా విడిపోయారు.  ‘ఖలీఫా’ను వంశపారంపర్యంగా నియమించాలని షియాలు భావిస్తే, ఎన్నుకోవాలని సున్నీలు పేర్కొన్నారు. ఢిల్లీ సుల్తానులు సున్నీలు. వీరు భారతదేశంలో తమ శాఖ వారికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో షియాల ప్రాబల్యం క్రమంగా క్షీణించింది. తమ ప్రాధాన్యాన్ని తిరిగి పొందడానికి షియా వర్గంవారే సూఫీ ఉద్యమాన్ని విస్తృతం చేశారు. వీరు సుల్తాన్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఓడిపోయారు. సమాజానికి సైతం దూరమయ్యారు. ఇస్లాం ఛాందసవాదులు షియా వర్గాన్ని సమాజ శత్రువులుగా ప్రచారం చేశారు. 
          సూఫీలుగా మారిన షియా వర్గంవారు మాత్రం పరమత సహన విధానాన్ని, దైవ ప్రార్థనా ప్రాధాన్యతను, మోక్షమార్గ విశిష్టతను ప్రచారం చేస్తూ హిందూ, ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. దయ, సహనం, సమత లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ బోధనలు చేశారు. ఫలితంగా సామాన్య, బలహీన వర్గాల నుంచి సూఫీలకు మద్దతు లభించింది. వీరు పీర్, షేక్‌ పేర్లతో సన్యాసుల బృందాలను ఏర్పాటు చేసి మత విశ్వాసాలు, నైతిక నియమాలను ప్రచారం చేశారు. సన్యాసం, భగవత్‌ భక్తి లాంటి ఉపనిషత్తుల్లోని ఉపదేశాలకు, సూఫీ సన్యాసుల బోధనలకు తేడా లేకపోవడంతో భారతదేశంలో సూఫీల బోధనలు, విశ్వాసాలకు ప్రాచుర్యం లభించింది.
         ఉలేమాలు, వారి అనుచరులు మతాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తమకు అనుగుణంగా మలచుకోవడం కూడా సూఫీతత్వం జన్మించడానికి కారణమైంది. ఈ వర్గాలవారు నియంత ప్రభుత్వాలకు మద్దతు తెలిపి, సుల్తాన్‌కు సహకరించినట్లు సూఫీలు పేర్కొన్నారు. తద్వారా ప్రజాస్వామ్యయుతమైన సర్వ సమానత్వాన్ని బోధించే ఇస్లాం మత సిద్ధాంతాలు భ్రష్టుపట్టాయని  విశ్వసించారు. వీరు ప్రాపంచిక సుఖాలను త్యజించి సూఫీ సంప్రదాయాలను ప్రచారం చేశారు. ఏకాంత, సన్యాస, పవిత్ర జీవనానికి ప్రాధాన్యం ఇచ్చారు. రైతులు, వృత్తి పనివారు, బలహీన, సామాన్య వర్గాలు సూఫీ బోధనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మానవత, సమానత, హేతుబద్ధత లాంటి దృక్పథాలను ప్రచారం చేసిన సూఫీ మతం భారతీయుల ఆలోచనా ధోరణులను ఎంతో ప్రభావితం చేసింది.


సూఫీ బోధకులు - బోధనలు
‣ భారతదేశంలో చిష్ఠీ సంప్రదాయానికి చెందిన ఖ్వాజా మొయినుద్దీన్‌ చిష్ఠీ సూఫీ ఉద్యమ ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈయన దర్గా అజ్మీర్‌ (రాజస్థాన్‌)లో ఉంది. చిష్ఠీలు హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. షేక్‌ హమీదుద్దీన్, షేక్‌ కుతుబుద్దీన్, భక్తియార్‌ కాకి మొదలైన చిష్ఠీ శాఖవారు సమానత్వాన్ని బోధిస్తూ, సామాన్య జీవితాన్ని గడిపారు. శాకాహారులైన వీరు స్థానిక హిందువులతో సన్నిహితంగా ఉంటూ, హిందూ-ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. రాజపోషణ, దానాలు తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. గాత్ర, వాయిద్య సంగీతాల్లో గొప్ప ఆధ్యాత్మికత ఉందని బోధించారు. వీరు ఏర్పాటు చేసిన సంగీత విభావరులు అశేష ప్రజానీకాన్ని ఆకర్షించాయి. 
‣ ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన షేక్‌ ఫరీద్‌ (బాబా ఫరీద్‌) అనే తత్వబోధకుడు అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ సూఫీ సిద్ధాంతాలను ప్రబోధించారు. ఈయన శిష్యుడైన నిజాముద్దీన్‌ ఔలియా ఘజియాపూర్‌ కేంద్రంగా సూఫీ ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. హజ్రత్‌ నిజాముద్దీన్‌ ఔలియా తన బోధనల ద్వారా అనేక మంది శిష్యులను పొందారు. అక్బర్‌ను ఎంతగానో ప్రభావితం చేసిన షేక్‌ సలీంచిష్ఠీ కూడా సూఫీ ఉద్యమకారుడే. అక్బర్‌ తన కుమారుడికి సలీం పేరు పెట్టడానికి ఈయనే కారణం. ఈశాన్య భారతదేశంలో ముల్తాన్‌ కేంద్రంగా సుహ్రవర్దీ/ సుహ్రవాదీ శాఖ వర్దిల్లింది. ఖ్వాజాపీర్‌ మహ్మద్, ఖ్వాజా బాకీఖిల్లా మొదలైన సూఫీ సన్యాసులు భారతదేశమంతా సూఫీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. హజరత్‌ షేక్‌ బహఉద్దీన్‌ జకారియా, బహరుద్దీన్‌ ఆరీఫ్, సయ్యద్‌ జలాలుద్దీన్‌ బుఖారీ లాంటి వారు సుహ్రవర్ది శాఖలో ఎంతో ప్రాధాన్యం పొందారు. షత్తారీ/  ఫిరదౌసియా శాఖలో హజరత్‌ షేక్‌ షరీఫ్‌ ఉద్దీన్‌; ఖాద్రీ శాఖలో హజరత్‌-షేక్‌ అబ్దుల్‌ ఖాద్రి జిలానీ; నక్షబందీ శాఖలో హజ్రత్‌ ఖ్వాజా-బాక్వీ-బిలాహ్‌ మొదలైన సన్యాసులు విశేష ప్రాచుర్యం పొందారు.


సూఫీ సంప్రదాయాలు
సూఫీ మతంలో ప్రధానంగా ఆరు రకాల చింతనా సంప్రదాయాలు అభివృద్ధి చెందాయి. అవి: చిష్ఠీ, సుహ్రవర్ది, కాద్రీ, షత్తారీ, నక్షబందీ, రేషానియా. ఇవి సూఫీ ఉద్యమ వ్యాప్తికి విశేష కృషి చేశాయి. భారతదేశంలో చిష్ఠీ, సుహ్రవర్దిలుప్రధానమైన శాఖలు. ఢిల్లీ సుల్తానుల కాలానికి ముందే ఈ సంప్రదాయాలు మనదేశంలోకి ప్రవేశించి, క్రీ.శ. 13వ శతాబ్దం నాటికి ప్రాచుర్యాన్ని పొందాయి. ధ్యానం, ఏకాంత జీవనం, భక్తిసంగీత సంకీర్ణం లాంటి అంశాలు చిష్ఠీ శాఖలోని ప్రత్యేకతలు. ప్రముఖ చరిత్రకారుడైన బరానీ అమీర్‌ఖుస్రూ ఈ శాఖకు చెందినవారే. మతంలో ఉలేమాల ఆధిపత్యాన్ని, ప్రభుత్వ జోక్యాన్ని చిష్ఠీ సన్యాసులు నిరసించారు. 
      సూఫీ ఉద్యమ వ్యాప్తిలో సుహ్రవర్ది సంప్రదాయం కూడా ప్రధాన పాత్ర పోషించింది. సూఫీ సన్యాసి షేక్‌ జకారియా ఈ శాఖకు చెందిన వారే. ఈ శాఖవారు ఎక్కువగా ముల్తాన్‌ ప్రాంతంలో జీవించేవారు. వీరు చిష్ఠీలకు భిన్నంగా ప్రభుత్వ వ్యవస్థతో సన్నిహితంగా ఉండేవారు. రాజకీయాలకు, మతానికి అవినాభావ సంబంధం ఉందని వాదించే ముస్లిం మతవాదులకూ, సుహ్రావర్ది సంప్రదాయవాదులకు భావాలు, విశ్వాసాల్లో పెద్ద తేడా లేదు. అయినప్పటికీ హిందూ, ఇస్లాం మతాల మధ్య సయోధ్య అవసరం అని ప్రచారం చేయడం వల్ల ఈ శాఖ ప్రాచుర్యం పొందింది. అనంతరకాలంలో ఖాద్రీ/ కాద్రీ సంప్రదాయం భారతదేశంలోకి ప్రవేశించింది. ఇది ఇస్లాం మతంలోని ఛాందస భావాల వైపు మొగ్గు చూపుతూనే జీవితానందాన్ని అన్ని రకాలుగా అనుభవించాలని ప్రచారం చేసింది. వీరిది ఉదారవాద సంప్రదాయంగా పేర్కొంటారు.  క్రీ.శ. 15, 16 శతాబ్దాల్లో షత్తారీ సంప్రదాయం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది భారతీయ ముస్లింల ఆలోచనలను, కర్మకాండలను సంగమించడానికి ప్రయత్నించింది. అక్బర్‌ చక్రవర్తి కాలంలో నక్షబందీ సంప్రదాయం బాగా ప్రాచుర్యం పొందింది. భౌతిక ప్రపంచంలో ఒక క్రమం ఉందని, అందుకే ప్రజలంతా ఐక్యంగా ఉండాలని వీరు ప్రచారం చేశారు. 
         రేషానియా శాఖ వారు ఆత్మవైరాగ్యాన్ని ప్రబోధించారు. మత సారాంశం, అభివృద్ధే ముఖ్యమని, పైపై మెరుగులు కాదని వీరు ప్రచారం చేశారు. సూఫీ ఉద్యమం మత సామరస్యాన్ని కోరుకుంది. సూఫీ సన్యాసులు మంచి ప్రవర్తన, స్వయంకృషి, సమానత్వం లాంటి అంశాలకు తమ బోధనల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. సూఫీ మత గురువులను పీర్లుగా పిలిచేవారు. వీరు ఎలాంటి బహుమతులను స్వీకరించరు. దయ, నిరాడంబరత, సహనం, దైవంపై అపార విశ్వాసం, మోక్షసాధన లాంటి విషయాలపై అధిక విశ్వాసాన్ని ఉంచేవారు.

Posted Date : 11-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌