• facebook
  • whatsapp
  • telegram

ఆదేశిక సూత్రాల అమలు తీరు

ఉదారవాద నియమాలు (liberal principles) :
ఆధునిక భారతదేశ నిర్మాణానికి ప్రవేశపెట్టాల్సిన నూతన విధానాలు, సంస్కరణలను ఉదారవాద నియమాల్లో భాగంగా ఆర్టికల్స్‌ 44, 45, 50, 51లో పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 44: భారతదేశంలో నివసించే పౌరులందరికీ  (హిందూ, ముస్లిం, క్రైస్తవ మొదలైనవారు) ఒకే రకమైన ఉమ్మడి పౌరస్మృతిని (Common Civil Code) ఏర్పాటు చేయాలి. మన దేశంలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం గోవా.

సరళా ముద్గల్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు(1995)
పౌరులకు ఒకే విధమైన ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు తీసుకున్న చర్యల గురించి  అఫిడవిట్‌ను సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టికల్‌ 44 ప్రకారం వివాహాలు, వారసత్వ విధానం లౌకిక స్వభావాన్ని కలిగి ఉన్నాయని, అందువల్ల వాటిని చట్టం ద్వారా క్రమబద్ధీకరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసుపై అప్పీల్‌ విచారణ జరిపిన సుప్రీంకోర్ట్‌ కేంద్ర ప్రభుత్వానికి తాము ఇచ్చిన ఆదేశం కేవలం సలహా పూర్వకమైందని(Obiter dicta) పేర్కొంది.

షాబానో కేసు: 1985
ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ముస్లిం మహిళకు విడాకుల అనంతరం భర్త మనోవర్తి చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పును అధిగమించేందుకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1986లో ముస్లిం మహిళల వివాహం, విడాకుల చట్టాన్ని రూపొందించింది.

మహర్షి అవధేష్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: (1994)
ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ‘మాండమస్‌ రిట్‌’ను జారీ చేయడం సాధ్యంకాదని పేర్కొంది.

ఆర్టికల్‌ 45: 14 ఏళ్లలోపు బాలబాలికలందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించాలి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యను ఆర్టికల్‌ 21(A)లో ‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు’గా మార్చారు. ప్రస్తుతం ఆర్టికల్‌ 45లో 6 సంవత్సరాల లోపున్న బాలబాలికలు పూర్వ ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణ పొందే వెసులుబాటు కల్పించారు.

ఆర్టికల్‌ 50: కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేసి, న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి.

ఆర్టికల్‌ 51: అంతర్జాతీయ శాంతి సంరక్షణకు భారతదేశం కృషి చేయాలి. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించాలి. ఇతర దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలి. ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ న్యాయసూత్రాలు, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలి. అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ప్రతి భారతీయుడు ప్రపంచ శాంతికి కృషి చేయాలి.

రాజ్యాంగంలోని IVవ భాగం కాకుండా - ఇతర భాగాల్లోని ఆదేశిక సూత్రాలు
XVIవ భాగం - ఆర్టికల్‌ 335: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.
XVIవ భాగం ఆర్టికల్‌ 339: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం జారీచేసే ఆదేశాలను రాష్ట్రాలు  తప్పనిసరిగా పాటించాలి.
XVIIవ భాగం - ఆర్టికల్‌ 350(A): మాతృభాషలో విద్యాబోధనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయవచ్చు.
XVIIవ భాగం - ఆర్టికల్‌ 350(B): భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల హక్కుల పరిరక్షణకు రాష్ట్రపతి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు.
XVIIవ భాగం - ఆర్టికల్‌ 351: హిందీని జాతీయ భాషగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
1973లో కేశవానంద భారతి జు( స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించిన 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సమర్థించడం ద్వారా ఆదేశిక సూత్రాల ప్రాధాన్యాన్ని గుర్తించింది.

* మినర్వామిల్స్ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 1980
ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేస్తూ కింది అంశాలను వివరించింది.
* ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పరం విరుద్ధమైనవి కావు.
* ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు భారత ప్రజాస్వామ్యానికి రథ చక్రాల్లాంటివి.
* ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సంఘర్షణ మొదలైతే ప్రాథమిక హక్కులే ఆధిక్యాన్ని కలిగిఉంటాయి.
* ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకు అనుబంధంగా ఉంటాయి.
* ఆదేశిక సూత్రాల విషయంలో ఆర్టికల్‌ 39(b), ఆర్టికల్‌ 39(c)ల అమలు కోసం చేసే చట్టాలకు మాత్రమే న్యాయసంరక్షణ ఉంటుంది.

ఆదేశిక సూత్రాల అమలు - ఆటంకాలు
* మన దేశంలో వీటిని అమలు చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులు లేవు.
* దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత.
* బ్రిటిష్‌ వలస పాలనలో దేశ సహజ వనరుల నిర్వీర్యం. 
* తగిన రాజకీయ సంకల్పం లేకపోవడం, న్యాయవ్యవస్థ క్రియాశీలత.

ప్రముఖుల వ్యాఖ్యానాలు
నీ ఆదేశిక సూత్రాలను చిత్తశుద్ధితో అమలు చేస్తే అనతి కాలంలోనే భారతదేశం ‘భూతల స్వర్గంగా’ అవతరిస్తుంది - ఎం.సి. చాగ్లా
నీ  రాజ్యాంగంలోని IVవ భాగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలను ప్రజలకు బాధ్యత వహించే ఏ ప్రభుత్వం కూడా తేలికగా తీసుకోలేదు - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ 
నీ ‘ప్రజల ఓటుపై ఆధారపడే ఏ ప్రభుత్వమైనా తన విధాన రూపకల్పనలో ఆదేశిక సూత్రాలను విస్మరించలేదు. ఒకవేళ ఏ ప్రభుత్వమైనా వాటిని విస్మరిస్తే ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు తప్పనిసరిగా సమాధానం చెపాల్సి ఉంటుంది’. - డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌  
నీ ఆదేశిక సూత్రాలు పవిత్ర ఆశయాలు - ఐవర్‌ జెన్నింగ్స్‌

ప్రభుత్వాల కృషి
* 1950లో జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి, 1951 నుంచి పంచవర్ష ప్రణాళికల అమలు ద్వారా దేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ, సంక్షేమ ఫలాలను పేదలకు అందేలా కృషి చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015, జనవరి 1 నుంచి ‘జాతీయ ప్రణాళికా సంఘం’ పేరును ‘నీతి ఆయోగ్‌’గా అమల్లోకి తీసుకొచ్చింది.
* సంపద కేంద్రీకరణను నివారించేందుకు 1969లో ‘ఏకస్వామ్య నిరోధక చట్టం’ రూపొందించారు. 1956లో ఎల్‌ఐసీని జాతీయం చేశారు. 1969లో 14, 1980లో 6 ప్రయివేట్‌ వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. 
* 1970లో మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు ఇచ్చే రాజభరణాలను రద్దు చేశారు. 1957లో సంపదపై పన్ను చట్టం; 1958లో బహుమతిపై పన్ను చట్టం; 1958లో జాతీయ పురాతన కట్టడాల, శిల్పసంపద పరిరక్షణ చట్టం; 1961లో ఆదాయపు పన్ను చట్టం; ప్రసూతి సెలవుల చట్టం; 1976లో స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం లాంటి చట్టాలను రూపొందించారు.
* 1982లో మహిళా సాధికారత సాధనకు DWACRA(development women and children in rural area) పథకాన్ని ప్రారంభించారు.
* 986లో శాస్త్రీయ విద్యను అందించేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రారంభించారు. 
* 1987లో సార్వత్రిక ప్రాథమిక విద్య సాధనకు నల్లబల్ల పథకం OBB - oparation black board, 1988లో వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు జాతీయ అక్షరాస్యత మిషన్‌(National litaracy mission)ను, 1989లో గ్రామీణ ప్రాంతాల స్వయం సమృద్ధికి జవహార్‌ రోజ్‌గార్‌ యోజన(JRY) పథకాన్ని ప్రారంభించారు.
* 1987లో పేద ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీని నెలకొల్పారు.
* 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు; 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా కల్పించారు.
* 1995లో వృద్ధాప్య పింఛన్‌ చట్టాన్ని రూపొందించారు. పేదవర్గాల వారికి ఉపాధిని కల్పించే లక్ష్యంతో 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2001లో సార్వత్రిక ప్రాథమిక విద్య సాధనకు ‘సర్వశిక్షా అభియాన్(SSA), 2009లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని రూపొందించారు.
* 1954లో ఆంధ్రరాష్ట్రంలో, 1994లో ఆంధ్రప్రదేశ్‌లో మద్యాన్ని నిషేధించారు. 1954లో గోవధను నిషేధిస్తూ బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని మహ్మద్‌ హనీఫ్‌ ఖురేషి VS స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో సుప్రీంకోర్టు సమర్థించింది. 
* 1973లో నేర విచారణ స్మృతి (Criminal procedure Code) చట్టాల్లో మార్పులు చేసి జిల్లా కలెక్టర్‌కు ఉన్న న్యాయాధికారాలను పూర్తిగా న్యాయశాఖకు బదిలీ చేయడం ద్వారా కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌