• facebook
  • whatsapp
  • telegram

వైకల్యం

సమానంగా.. సగౌరవంగా!


సమాజంలో భాగమే, కానీ సాధారణ జీవితాన్ని గడపలేరు. అందరితో సమానమే అయినా ఆత్మవిశ్వాసంతో సాగలేరు. కొన్ని శారీరక, మానసిక పరిస్థితులు వారికి ప్రతిబంధకాలవుతున్నాయి. పుట్టుకతోనో, ప్రమాదం వల్లనో వచ్చిన అశక్తత అభివృద్ధిని నిరోధిస్తోంది. అందుకే ఆ అసహాయులకు అండగా ప్రభుత్వాలు అనేక ప్రత్యేక చట్టాలను చేశాయి. అవసరమైన రాయితీలను అందిస్తున్నాయి. సమానత్వంతో, సగౌరవంగా జీవించే అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 

 

 

వైకల్యం అనేది సంక్లిష్టతతో కూడిన వాస్తవ స్థితి. అది సాధారణంగా భౌతికంగా ఉంటుంది. పరిజ్ఞానం, ప్రవర్తన తదితరాలకు సంబంధించి కూడా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగులకు సంపూర్ణ మానవహక్కులు అందడం లేదు. సామాజిక వివక్షకు గురవుతున్నారు.

 

నిర్వచనం: వివిధ కారణాల వల్ల సామాజిక ప్రక్రియలకు సాధారణ స్థాయిలో స్పందించలేని పరిస్థితినే వైకల్యం అంటారు. దీన్నే నిస్సహాయత/అశక్తత అని కూడా వ్యవహరిస్తారు. అది కలిగి ఉన్నవారిని దివ్యాంగులుగా పేర్కొంటారు. ఈ వైకల్యం సమాజంలో ప్రధానంగా రెండు రకాలుగా కనిపిస్తుంది.

1) శారీరక వైకల్యం: వృద్ధాప్యం, పుట్టుకతో కలిగే అంగవైకల్యం వల్ల ఏర్పడే స్థితి శారీరక వైకల్యం. ఇది ఉన్నవారిని ‘ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌’ అని పిలుస్తారు.

2) మానసిక వైకల్యం: ఇది మానసిక బలహీనతల వల్ల కలిగే వైకల్యం. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారిని ‘మెంటల్లీ ఛాలెంజ్డ్‌’గా వ్యవహరిస్తారు.

 

రకరకాలు

అంగవైకల్యం ప్రధానంగా పుట్టుక ద్వారా సంక్రమించవచ్చు. పుట్టిన తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల కలగవచ్చు. అనారోగ్యం, ప్రమాదాల వల్ల కూడా ఏర్పడవచ్చు. దివ్యాంగుల హక్కు చట్టం - 1995 ప్రకారం ఈ లోపం 7 రకాలు. కానీ 2016 దివ్యాంగుల హక్కు చట్టంతో కొత్తగా మరో 14 లోపాలను చేర్చారు. ఎవరైనా ఒకరికి 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉందని వైద్యాధికారులు నిర్ధారిస్తే, వారిని దివ్యాంగులు అంటారు. 

మొత్తం 21 రకాలు: 1) చలనశీల వైకల్యం/ కదలిక లోపం 2) మానసిక బలహీనత 3) అంధత్వం 4) తక్కువ కంటి చూపు 5) వినికిడి లోపం 6) మానసిక వైకల్యం 7) కుష్ఠు వ్యాధిగ్రస్తులు 8) మరుగుజ్జుతనం 9) పార్కిన్‌సన్స్‌ 10) యాసిడ్‌ దాడి బాధితులు 11) ఇంటలెక్చువల్‌ డిజెబిలిటి 12) ఆటిజం 13) మస్కులార్‌ డిస్ట్రోఫి 14) దీర్ఘకాల (క్రానిక్) నాడీ సంబంధ వ్యాధులు 15) ప్రత్యేక అభ్యసన వైకల్యం 16) మల్టిపుల్‌ స్ల్కీరోసిస్‌ 17) మాట, భాషా వైకల్యం 18) తలసీమియా 19) హీమోఫీలియా 20) సికిల్‌సెల్‌ ఎనీమియా 21) బహుళ వైకల్యాలు.

 

గణాంకాలు

2001 లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం దివ్యాంగుల సంఖ్య 2.19 కోట్లు. 2011 నాటికి 2.68 కోట్లకు పెరిగారు. ఇందులో 1.5 కోట్ల మంది పురుషులు, 1.18 కోట్ల మంది స్త్రీలు. 2011 లెక్కల ప్రకారం తెలంగాణలో 2.1% మందికి వైకల్యం ఉన్నట్లు గుర్తించారు. 2014లో తెలంగాణలో నిర్వహించిన ఇంటింటి సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం దివ్యాంగుల సంఖ్య 5,01,643 (1.4%). ఇందులో అంధులు 65,199 మంది; మూగ, చెవిటివారు 66,469 మంది ఉన్నారు.

* 2011 లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఎక్కువశాతం దివ్యాంగుల జనాభా ఉన్న రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్‌ (15.5%), మహారాష్ట్ర (11.05%), బిహార్‌ (8.69%), ఆంధ్రప్రదేశ్‌ (8.4%), పశ్చిమ బెంగాల్‌ (7.52%).

* దివ్యాంగుల జనాభా ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత రాష్ట్రాలు పాండిచ్చేరి, దిల్లీ. తక్కువగా ఉన్నవి లక్షదీప్, డామన్‌ - డయ్యూ.

 

అంగవైకల్యం - సమస్యలు 

1) సమాచారపరమైన సమస్యలు: కమ్యూనికేషన్స్, పాఠ్యప్రణాళిక, పుస్తకాలు అందుబాటులో లేకపోవడం. 

2) విద్యాపరమైన సమస్యలు: ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు తక్కువగా ఉండటం. ప్రవేశాల్లో ప్రాధాన్యం లేకపోవడం. 

3) నిర్మాణపరమైన సమస్యలు: వీరికి అనుకూలమైన ఇళ్లు, కార్యాలయాలు, భవనాలు లేకపోవడం.

 

రాజ్యాంగ నిబంధనలు: భారత రాజ్యాంగంలోని 14 - 18 ఆర్టికల్స్‌ దివ్యాంగులకు అందరితో పాటు సమాన హక్కులను కల్పిస్తున్నాయి. ఆర్టికల్‌ 14 ప్రకారం ప్రభుత్వ చట్టాల్లో వీరికి సమానత్వాన్ని నిరాకరించకూడదు. వీరి స్వేచ్ఛ, రక్షణకు ప్రభుత్వ విభాగాలు హామీ ఇవ్వాలి. ఆర్టికల్‌ 25 ప్రకారం దివ్యాంగులకు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కుల్లో సమానత్వంతో పాటు విద్యను పొందే హక్కుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 28 దేశాలు మాత్రమే దివ్యాంగులైన బాలలకు రాజ్యాంగ పరంగా విద్యాహక్కుకు హామీ ఇస్తున్నాయి. ఆర్టికల్‌ 27 ప్రకారం దివ్యాంగులకు పని కల్పించడంలో ఇతరులతో సమానమైన గుర్తింపు ఇవ్వాలి. వారికి అనుకూల పని వాతావరణాన్ని కల్పించాలి.

 

వైకల్యత ధ్రువీకరణ పత్రం: అన్నిరకాల రాయితీలు, లాభాలు పొందడానికి దివ్యాంగులకు ఉండాల్సిన ప్రాథమిక పత్రమిది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర మెడికల్‌ బోర్డులు 40% పైగా వైకల్యం ఉన్న ఏ వ్యక్తికైనా ఈ ధ్రువపత్రాన్ని ఇస్తాయి. దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్‌ ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం - 1961 ప్రకారం ఆదాయపు పన్నులో రాయితీకి వీరు అర్హులు.

 

దివ్యాంగుల చట్టం (1995): ఈ చట్టం 1996, ఫిబ్రవరి 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది సాధారణ వ్యక్తులతో సమానంగా దివ్యాంగులకు అవకాశాలను కల్పించి, వారిని జాతి నిర్మాణంలో పూర్తి భాగస్వాములను చేసే దిశగా పడిన ముఖ్యమైన అడుగు. దీంతో విద్య, ఉపాధి, శిక్షణ, రిజర్వేషన్, అధ్యయనం, పునరావాసం, నిరుద్యోగ భృతి వంటి వాటికి అవకాశం కలిగింది.

 

దివ్యాంగుల జాతీయ విధానం (2006): దివ్యాంగులకు భౌతిక ఆసరా, విద్య, ఆర్థిక పునరావాసం కల్పించేందుకు రూపొందించిన విధానమిది. వారిని జాతికి ముఖ్యమైన మానవ వనరులుగా గుర్తించి, సరైన వాతావరణం కల్ఫిస్తుంది. సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణకు దోహదం చేస్తుంది. 

 

సంక్షేమ పథకాలు: దివ్యాంగుల సాధికారత రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక బాధ్యతగా రాజ్యాంగంలోని పలు షెడ్యూళ్లలో నిర్దేశించి ఉంది. సమాన అవకాశాలను కల్పించేందుకు, దేశ నిర్మాణంలో వారిని పూర్తి భాగస్వాములను చేసేందుకు ఆర్టికల్‌ 253 ప్రకారం కేంద్ర జాబితా అంశంగా భారత ప్రభుత్వం ‘ది పర్సన్స్‌ విత్‌ డిసెబిలిటీస్‌ చట్టం (Equal Opportunities, protection of Rights and Full participation Act) 1995 ను అమలు చేసింది.

 

దివ్యాంగుల సాధికారత విభాగం: 2012, మే 12న దివ్యాంగుల వ్యవహారాల శాఖను ఏర్పాటు చేశారు. దీన్ని 2014, డిసెంబర్‌ 12న దివ్యాంగుల సాధికారత విభాగంగా మార్చారు. దివ్యాంగులు భద్రమైన, గౌరవప్రదమైన జీవనం గడపడానికి, అభివృద్ధి చెందేందుకు వారికి సమాన అవకాశాలను కల్పించడానికి, సమాజ నిర్మాణంలో భాగస్వాములను చేయడానికి ఈ విభాగం దోహదపడుతుంది.

 

జాతీయ వికలాంగుల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఎఫ్‌డీసీ): 1997, జనవరి 24న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ సంస్థను నెలకొల్పింది.

ఎన్‌హెచ్‌ఎఫ్‌డీసీ పథకాలు: 1) వికలాంగుల కోసం పనిచేస్తున్న ఎన్‌జీఓలకు ఆర్థిక సహాయం అందించే పథకాలు.

2) పీడబ్ల్యూడీల కోసం వృత్తి శిక్షణ, విద్యాపథకం.

3) ‘విశేష ఉద్యామి మిత్రాస్‌’ ద్వారా దివ్యాంగుల్లోని ఔత్సాహిక వ్యాపారవేత్తలకు చేయూత అందించే పథకం.

4) విశేష ప్రశిక్షణ్‌ మిత్రాస్‌ ద్వారా వికలాంగులకు శిక్షణ.

 

దివ్యాంగుల స్వచ్ఛంద కార్యాచరణ పథకం (దీన్‌దయాళ్‌ పునరావాస పథకం): భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలుచేస్తోంది. దేశంలోని దివ్యాంగుల్లో 90% కంటే ఎక్కువ మందికి అందుబాటులో లేని సేవలను, సౌకర్యాలను కల్పించాలన్నదే ఈ పథకం ఉద్దేశం.

 

దివ్యాంగులు - చట్టాలు

1) అంగవైకల్యం వ్యక్తుల చట్టం - 1995

2) జాతీయ ట్రస్టు- 1990

3) భారత పునరావాస మండలి చట్టం- 1992 (దీనిద్వారానే తెలంగాణలో నాలుగు పునరావాస కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది).

4) మానసిక ఆరోగ్య చట్టం- 1987

5) న్యాయసేవల అధికారాల చట్టం - 1987

6) దీన్‌ దయాళ్‌ వికలాంగుల పునరావాస పథకం - 1999

7) జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం - 1996

8) దివ్యాంగ సారథి యాప్‌ - దీన్ని ప్రారంభించినవారు థావర్‌చంద్‌ గహ్లోత్‌ (2017, సెప్టెంబర్‌ 27) (మహిళలకు)

9) సంకల్ప్‌ - 2014 (దివ్యాంగులకు)

10) నేషనల్‌ పాలసీ ఆన్‌ ఎల్డర్లీ - 1999

11) వయోశ్రీ యోజన - 2017 (వృద్ధుల సంక్షేమం కోసం) 

12) ఆపరేషన్‌ పునర్జన్మ - నల్గొండలో స్థానిక పోలీసులు వృద్ధుల కోసం ఏర్పాటు చేశారు.

 

ముఖ్యమైన దినోత్సవాలు

1) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం: డిసెంబరు 3 (1998 నుంచి)

2) అంతర్జాతీయ దివ్యాంగుల సంవత్సరం: 1981 (1976లో ఐక్యరాజ్య సమితి ప్రకటన)

3) దివ్యాంగుల దశాబ్దం: 1983 - 1992

 

ప్రత్యేక సంస్థలు

సదరం (SADAREM - Software for assesment of Disabled for Access Rehabilation & Empowerment): ఇది ఒక వెబ్‌సైట్‌. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో రిజిస్ట్రేషన్‌తో పాటు ప్రభుత్వపరంగా అందే సౌకర్యాల వివరాలు ఉంటాయి. 

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

Posted Date : 08-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌