• facebook
  • whatsapp
  • telegram

భారతీయ సమాజ నిర్మాణం

విశిష్ట సమాజం.. విలువల జీవనం

భారతీయ సమాజం సమున్నత విలువలు, ఆదర్శాల సమ్మిళితం. వ్యక్తి సామాజిక జీవనం ఈ విలువలు, ఆదర్శాలతోనే ముడిపడి ఉంటుంది. ఉన్నతంగా జీవించడానికి పాటించాల్సిన ధర్మాలు.. ఆచరించాల్సిన సిద్ధాంతాలు.. అవసరమైన గుణాలు.. లాంటివన్నీ మన సమాజ మూలాల్లో కనిపిస్తాయి. వీటిని అధ్యయనం చేస్తే ఆ సమాజ నిర్మితిని అర్థం చేసుకోవచ్చు.
    ఎక్కడైనా సమాజ నిర్మితిని అధ్యయనం చేయాలంటే ముందు ఆ సమాజం మూలాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆ సమాజంలోని సమస్యలు, విశిష్ట లక్షణాలపై అవగాహన ఏర్పడుతుంది. భారతీయ సమాజం ఆదర్శాలు, విలువలతో కూడుకున్నది. దీని గురించి తెలుసుకోవాలంటే ముందు హిందూ సమాజం పునాదుల నుంచి అధ్యయనం మొదలుపెట్టాలి. ఆ మూలాలను పరిశీలిస్తే...
1. చతుర్విధ పురుషార్థాలు
2. ఆశ్రమ ధర్మాలు
3. రుణాలు
4. కర్మ సిద్ధాంతం
5. త్రిగుణాలు
6. శ్రుతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు


1. చతుర్విధ పురుషార్థాలు
వీటిని చతుర్విధ పురుషార్థాలు అని పిలుస్తారు. ఇవి నాలుగు. సమాజంలో నివసిస్తున్న వ్యక్తి అంతర్గత, బాహ్య ప్రవర్తనను నియంత్రించడానికి వీటిని నిర్దేశించారు. వీటి ప్రకారం వ్యక్తులు వివిధ దశల్లో క్రమశిక్షణతో, ధర్మబద్ధంగా జీవించాల్సి ఉంటుంది. తద్వారా సమాజం వ్యవస్థీకృతం అవుతుంది. అసంఘటిత పరిస్థితులకు దూరంగా ఉంటుంది. ఈ లక్ష్యం సాధించడానికి కింది పురుషార్థాలను అనుసరించాల్సి ఉంటుంది.
1) ధర్మం   2) అర్థం (సంపద)   3) కామం (కోరికలు)   4) మోక్షం


ధర్మం: 'ధృ' అనే సంస్కృత ధాతువు నుంచి 'ధర్మం' అనే పదం వచ్చింది. కలిపి ఉంచు లేదా నిలబెట్టు అని దీనర్థం. ధర్మం అనే పదం రుగ్వేదంలో 'రుత' అనే భావాన్ని తెలియజేస్తుంది. అంటే 'క్రమం' అని అర్థం. సమాజంలోని ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని నిర్వర్తిస్తే సమాజం వ్యవస్థీకృతం అవుతుంది. ధర్మంతో కూడిన అర్థం (సంపద), కామం (కోరికలు) మోక్షానికి చేరుస్తాయి. భారతీయ హిందూ సమాజంలో మోక్షానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.
ధర్మాన్ని పాటించడం వల్ల సమాజంలో వ్యక్తులంతా తమ వృత్తులు, ప్రవృత్తుల ద్వారా వ్వవస్థీకృత పరిస్థితులను ఏర్పరుస్తారు. వర్ణ, ఆశ్రమ, గుణ ధర్మాలను వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. దేశ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ధర్మాన్ని మార్చుకుంటూ సత్యం, అహింస, మనోనిగ్రహం, సహనాన్ని ఆచరించాల్సి ఉంటుంది.

అర్థం: సమాజంలో సుఖమయ జీవనానికి గృహస్థ ధర్మాలను, ఇతర బాధ్యతలను నిర్వర్తించడానికి వ్యక్తికి సంపద లేదా ఐశ్వర్యం చాలా అవసరం. దీన్నే 'అర్థం' అంటారు. సమాజంలో ధర్మబద్ధంగా సంపాదించిన ఆస్తి మూలంగా వ్యక్తికి అంతస్తు లభిస్తుంది. కౌటిల్యుడి ప్రకారం.. సుఖానికి మూలం ధర్మం, ధర్మానికి మూలం అర్థం, అర్థానికి మూలం రాజ్యం. అర్థం అంటే భౌతిక లాభం పొందడం. ధర్మం సాధించడం, ఆనందం అనుభవించడం అనేవి భౌతిక లాభం మీదనే ఆధారపడతాయి. కాబట్టి ధర్మబద్ధంగా అర్థం సంపాదించడం ఆనందానికి మూలం.

కామం: భారతీయ హిందూ సమాజంలో గృహస్థ ఆశ్రమానికి ప్రాధాన్యం ఇచ్చారు. కామం ద్వారా వ్యక్తి ఇంద్రియ వాంఛలు తీర్చుకుని సత్‌సంతానాన్ని పొంది సమాజాన్ని ముందుకు కొనసాగిస్తాడు. ప్రాథమిక సమూహం అయిన కుటుంబాన్ని ఏ విధంగా క్రమబద్ధీకరించాలో.. కుటుంబం, సమాజంలో వివిధ వ్యక్తుల నడవడి ఏ విధంగా ఉండాలో కామం వివరిస్తుంది. సమాజంలో వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి ధర్మంతో కూడిన అర్థం, కామం అవసరం. ధర్మాన్ని వివరించేది ధర్మశాస్త్రం. అర్థాన్ని వివరించేది అర్థశాస్త్రం, కామాన్ని వివరించేది కామశాస్త్రం. ఈ మూడింటినీ 'త్రివర్గాలు' అని పిలుస్తారు.


మోక్షం: పురుషార్థాల్లో చివరిది, అత్యంత ప్రధానమైంది మోక్షం. భారతీయ హిందూ సమాజంలో మోక్షానికి ప్రాధాన్యం ఇచ్చారు. వ్యక్తి జీవితంలో అంతిమ లక్ష్యం మోక్షం. అర్థాన్ని, కామాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించడం ద్వారా మోక్షాన్ని చేరుకుంటారు. ప్రతి వ్యక్తి సమాజంలో మోక్షం కోసం చేసే ప్రయత్నంలో ధర్మబద్ధమైన జీవితాన్ని ఆచరించాలి. తద్వారా సమాజంలో వ్యవస్థీకృత పరిస్థితులు నెలకొంటాయి. మోక్షం వ్యక్తి జీవితానికి పరిపూర్ణతను ప్రసాదిస్తుంది.

2. ఆశ్రమ ధర్మాలు
 వీటిని వర్ణాశ్రమ ధర్మాలు అని పిలుస్తారు. వర్ణ ధర్మాన్ని బట్టి బ్రాహ్మణులు జ్ఞానాన్ని పొంది ఇతరులకు బోధించాలని, క్షత్రియులు రాజ్యాన్ని సంరక్షించి పాలన చేయాలని, వైశ్యులు వ్యయసాయం, పశుపోషణ, వ్యాపారం చేయాలని, శూద్రులు పై వర్ణాల వారికి సేవ చేయాలని పేర్కొన్నారు.
    వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో పురుషార్థాలను నియమబద్ధంగా ఏ విధంగా సాధించాలో ఇవి వివరిస్తాయి. ఆశ్రమ ధర్మాలు సమాజంలో వ్యక్తి నడవడికను, ప్రవర్తనను క్రమబద్ధీకరిస్తాయి. ఆశ్రమాలు నాలుగు. అవి..
1) బ్రహ్మచర్యాశ్రమం    2) గృహస్థాశ్రమం  3) వానప్రస్థా శ్రమం   4) సన్యాసాశ్రమం.
వ్యక్తి జీవితాన్ని ఇలా వివిధ దశలుగా విభజించి.. ఆయా దశల్లో వారు నిర్వర్తించాల్సిన విధులు, నడవడికను తెలియజేశారు. ఈ చర్యలు వ్యక్తి ప్రవర్తనను క్రమబద్ధీకరించి మోక్షం దిశగా నడిపిస్తాయి.


బ్రహ్మచర్యాశ్రమం: ప్రతివ్యక్తి పుట్టినప్పుడు శూద్రుడిగా పుడతాడు. ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత మాత్రమే ద్విజులుగా మారతారు. ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినవారు అని అర్థం. పుట్టుకతో లభించేది ఒక జన్మ అయితే ఉపనయన సంస్కారంతో లభించేది రెండో జన్మ. ఉపనయన సంస్కార సమయంలో బ్రాహ్మణులు గాయత్రీ మంత్రం, క్షత్రియులు త్రిష్టుబ్ మంత్రం, వైశ్యులు జగతీ మంత్రం స్వీకరిస్తారు.
బ్రహ్మచర్య ఆశ్రమంలో గురువు ఇంటి వద్దనే ఉండి వేదాధ్యయనం చేయాలి. గురువు ఇంటివద్ద పశువులు మేపడం, వంట చెరకు సేకరించడం, కర్మకాండలకు కావాల్సిన సామగ్రిని ఏర్పాటు చేయడం లాంటి పనులతో గురువును ప్రసన్నం చేసుకుని వేదాధ్యయనం ప్రారంభిస్తారు. బ్రహ్మచారిగా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి జ్ఞాన యజ్ఞం చేస్తారు.

గృహస్థాశ్రమం: ఒక వ్యక్తి వివాహం చేసుకోవడం ద్వారా బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. ధర్మాచరణ, సంతానోత్పత్తి ద్వారా సమాజం ముందుకు కొనసాగడానికి తోడ్పడతాడు. గృహస్థాశ్రమంలో కింది పంచ మహాయజ్ఞాలు చేయాలి. అవి..

బ్రహ్మ యజ్ఞం: వేదాధ్యయనం

పితృ యజ్ఞం: తర్పణం, శ్రాద్ధక్రియలు

దైవ యజ్ఞం: కర్మకాండలు, హోమాలు

భూత యజ్ఞం: బలి, అర్పణలు

నృయజ్ఞం: అతిథులకు, పేదవారికి సేవ చేయడం

* గృహస్థాశ్రమంలో వ్యక్తి కుటుంబ జీవనం కొనసాగిస్తాడు. ధర్మాచరణను ఆచరిస్తాడు. సంతానోత్పత్తి, లైంగిక అవసరాలను తీర్చుకుంటాడు. యజ్ఞయాగాదులు, కర్మకాండలు విధిగా నిర్వర్తిస్తాడు.

వానప్రస్థాశ్రమం: పిల్లలకు వివాహం జరిపించి, వారి సంతానంతో గడిపిన తర్వాత వ్యక్తి వానప్రస్థంలోకి ప్రవేశిస్తాడు. భార్యతో సహా అడవులకు వెళ్లి నివాసం ఏర్పరుచుకుంటాడు. భార్యతో ఉన్నప్పటికీ సంసార సంబంధాన్ని కొనసాగించకుండా ఆమెకు శారీరకంగా దూరంగా ఉంటూ వానప్రస్థ విధులను నిర్వర్తిస్తాడు. హోమాలు చేస్తూ దైవచింతనలో గడుపుతాడు. భర్తకు కావాల్సిన హోమ సామగ్రిని భార్య సమకూరుస్తూ వంట చేసి పెడుతుంది. శారీరక సుఖాలను వదిలేసి, నార వస్త్రాలను ధరించి కుటుంబ జీవనం నుంచి దూరంగా జీవితాన్ని గడుపుతాడు. ఇంటికి వచ్చిన అతిథులకు సత్కారాలు చేస్తాడు. గృహస్థ, సన్యాసాశ్రమాలకు వారధిగా వానప్రస్థాశ్రమం ఉంటుంది.

సన్యాసాశ్రమం: ఈ ఆశ్రమంలో పూర్వపు జీవితంతో పూర్తిగా బంధాన్ని తెంచుకుంటాడు. భార్యను కూడా విడిచి ఒంటరిగా సన్యాసాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. కఠినమైన ఆహార నియమాలు ఉంటాయి. భిక్షాటన చేయడం ద్వారా ఆహారం తినాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని సన్యాసిలా జీవించాలి. పూర్తి సమయాన్ని దైవచింతనలో గడపాలి. అడవుల్లో కాకుండా ఊరూరా తిరుగుతూ ఆదర్శ బోధనలు చేస్తూ దైవానికి దగ్గరవ్వాలి. ఈ విధంగా జీవితంలో ధర్మ, అర్థ, కామాలను సాధించి దైవచింతనతో శేషజీవితం గడుపుతూ మోక్షానికి దగ్గర అవుతాడు.

3. రుణాలు
    పుట్టిన ప్రతివ్యక్తి తీర్చుకోవాల్సిన రుణాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఒక వ్యక్తికి ఎదుటివారి పట్ల ఉన్న బాధ్యతలను తెలియజేస్తాయి. అవి..
1) పితృ రుణం   2) గురు రుణం   3) దైవ రుణం

పితృ రుణం: ఒక వ్యక్తి జన్మకు కారణం అతడి తల్లిదండ్రులు. సమాజంలో వ్యక్తి మనుగడకు, సాంఘికీకరణకు కుటుంబం తోడ్పడుతుంది. కాబట్టి జన్మనిచ్చిన తండ్రి రుణం తీర్చుకోవడాన్ని పితృ రుణంగా చెబుతారు. పుత్రులు లేనివారు పున్నామ నరకానికి చేరుతారు అనే నమ్మకం హిందూ సమాజంలో ఉంది. తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారిని సుఖసంతోషాలతో ఉంచడం, మరణించిన తర్వాత పిండప్రదానాలు, కర్మకాండలు నిర్వర్తించడం ద్వారా పితృ రుణం తీర్చుకుంటారు.

గురు రుణం: గురు శుశ్రూష (సేవ) చేయడం, గురు దక్షిణ చెల్లించడం, గురువుకు మంచి కీర్తిని సంపాదించి పెట్టడం ద్వారా విద్యను ప్రసాదించిన గురువు రుణం తీర్చుకుంటాడు.

దైవ రుణం: మానవ జన్మ ప్రసాదించినందుకు భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకోవడాన్ని దైవ రుణం తీర్చుకోవడం అంటారు. నవవిధ భక్తి మార్గాలతో భగవంతుడిని ఆరాధించడం, యజ్ఞయాగాదుల నిర్వహణతో దేవుడిని తృప్తిపరచడం ద్వారా దైవ రుణం తీర్చుకుంటారు.


4. కర్మ సిద్ధాంతం
భారతీయ హిందూ సమాజంలో కర్మ భావన ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది కార్యకారణ సంబంధాలను వివరిస్తుంది. మంచి చెడుల ద్వారా ఎదురయ్యే ఫలితాలను తెలుపుతూ సమాజంలో వ్యక్తి ప్రవర్తనను నియంత్రిస్తుంది. కర్మ అనే పదం మొదట రుగ్వేదంలో కనిపించింది. అధర్వణ వేదంలోనూ కనిపిస్తుంది. సమాజంలో ఒక వ్యక్తి చేసే మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు పనులకు చెడు ఫలితాలు ఎదురవుతాయని కర్మ సిద్ధాంతం చెబుతుంది. వ్యక్తి బాహ్య, అంతర్గత ప్రవర్తనలను నియంత్రించడం దీని ముఖ్యోద్దేశం. పునర్జన్మ కారణాలను, ఫలితాలను వివరిస్తుంది. కర్మ నాలుగు చర్యల ద్వారా వ్యక్త మవుతుంది. అవి..
1) ఆలోచనలు      2) సద్భావన కలిగిన మాట    3) మనం చేసే పనులు   4) మనం ఇతరులతో చేయించే పనులు.


5. త్రిగుణాలు
 వ్యక్తి ప్రవర్తనా రీతుల ఆధారంగా గుణాలను వివరించారు. సంప్రదాయ హిందూ సమాజంలో తొలివేద కాలంలో గుణకర్మలను బట్టి వర్ణవ్యవస్థలో వర్ణాలను కేటాయించారు. వీటిని ఆధారంగా చేసుకుని ఒకే ఇంటిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను చూడవచ్చు. తర్వాతి కాలంలో వర్ణవ్యవస్థ కూడా జటిలమైంది.
గుణాలను మూడు రకాలుగా విభజించారు. అవి..

సత్వ గుణం: స్వచ్ఛమైంది. బ్రాహ్మణులు కలిగి ఉంటారని పేర్కొన్నారు.

రజో గుణం: వీరత్వం, మక్కువలకు ప్రతీక. క్షత్రియులు కలిగి ఉంటారన్నారు.

తమో గుణం: సోమరితనానికి ప్రతీక. శూద్రులు కలిగి ఉంటారని చెప్పారు.

6. శ్రుతులు, స్మృతులు, పురాణాలు...
శ్రుతులు: శ్రుతి (వినికిడి) ద్వారా నేర్చుకునేవి. గురు ముఖంగా ఆయన నోటి నుంచి వినడం, మననం చేసుకోవడం ద్వారా విషయాన్ని నేర్చుకుంటారు. వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలను శ్రుతులు అంటారు.

స్మృతులు: స్మరణ చేసుకోవడం ద్వారా నేర్చుకునేవి. గ్రంథ రూపంలో అధ్యయనం చేసేవి. విశ్లేషణ, చర్చల ద్వారా నేర్చుకుంటారు. మనుస్మృతి, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు, పలువురు రుషులు రాసిన సూత్ర గ్రంథాలను స్మృతులు అంటారు.

పురాణాలు: పురాతనమైనవైనా నిత్య నూతనంగా ఉండే వాటిని పురాణాలు అంటారు. శ్రుతులు, స్మృతుల్లోని విషయాలను కథల రూపంలో ఉపదేశం చేసే వాటిని పురాణాలు అంటారు. అష్టాదశ పురాణాలను వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే భాగవతం ఒక పురాణం.

ఇతిహాసాలు: చరిత్రకు కల్పనలను జోడించి కథల రూపంలో రాసేవే ఇతిహాసాలు. రామాయణం, మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఇతిహాసాలు మానవ జీవనాన్ని, జీవన విధానాన్ని నిర్దేశించేవి, మార్గదర్శకం చేసేవి.

దర్శనాలు: వీటిని షడ్దర్శనాలు అంటారు. ఇవి ఆరు. అవి సాంఖ్య, న్యాయ, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, వైశేషికం. దర్శనాలు అంటే రుషులు దర్శించి వారు జ్ఞానబోధ చేసినవి.
పైన వివరించిన అంశాలతో భారతీయ హిందూ సమాజంలో వ్యక్తుల జీవన విధానం, ప్రవర్తనా రీతులు ముడిపడి ఉన్నాయి. వీటిని భారతీయ సమాజం మూలాలుగా పేర్కొన్నారు.


గ్రూప్ - 1 నమూనా ప్రశ్నలు
1. భారతీయ సమాజం మూలాలను వివరించండి.
2. భారతీయ సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు, పురుషార్థాల ప్రాముఖ్యాన్ని తెలియజేయండి.
3. భారతీయ సమాజ నిర్మితిలో హిందూ సంస్కృతి మూలాలను వివరించండి.
4. ఆశ్రమ ధర్మాలు, పురుషార్థాలు, ఇతర మూలాలు సంప్రదాయ హిందూ సమాజంలో వ్యక్తి జీవితంపై చూపిన ప్రభావాన్ని వివరించండి.

 

మరింత సమాచారం ... మీ కోసం!

* భారతదేశంలో ఆదివాసీలు, గిరిజనుల విలక్షణత

గిరిజన సమూహాలు

భారతీయ సమాజం

 

Posted Date : 12-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌