• facebook
  • whatsapp
  • telegram

ప్లాసీయుద్ధం

చరిత్ర గ‌తిని  మార్చేసిన యుద్ధాలు!

ఆ రెండు యుద్ధాలు ఆంగ్లేయుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అఖండ భారతాన్ని అడ్డగోలుగా ఆక్రమించుకోడానికి ధైర్యాన్నిచ్చాయి. అవే ప్లాసీ, బక్సార్‌ యుద్ధాలు. అవి జరగకపోయినా, అందులో ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ పాల్గొనకపోయినా లేదా ఓడిపోయినా దేశ చరిత్ర మరోరకంగా ఉండేది. రెండు వందల సంవత్సరాలకుపైగా పరాయిపాలన పీడ మనకు తప్పిపోయేది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు భారతదేశ చరిత్ర అధ్యయనం చేసేటప్పుడు ఇండియాలో బ్రిటిషర్లు కూడా అప్పట్లో ఊహించలేనంత సామ్రాజ్య విసర్తరణకు పునాదులు వేసిన ఆ యుద్ధాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. 

  కొన్ని సంఘటనలు ఊహించని విధంగా చరిత్ర గతిని మార్చి కొత్త అధ్యాయాలకు తెర తీస్తాయి. అలాంటి ఘటనలే  క్రీ.శ.1757లో జరిగిన ప్లాసీ యుద్ధం, 1764లో జరిగిన బక్సార్‌ యుద్ధం. బెంగాల్‌ నవాబు సిరాజ్‌-ఉద్‌-దౌలాతో జరిగిన ప్లాసీ యుద్ధం తర్వాతే వర్తకం కోసం వచ్చిన బ్రిటిష్‌ కంపెనీ సామ్రాజ్యవాదంపై కూడా దృష్టి సారించింది. భారతదేశంలో ఒక మహా బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని నిర్మించింది. అప్పటి వరకు భారతదేశంలో వర్తక సంఘంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంగ్లిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ విశాలమైన భారత భూభాగం, ప్రజలపై రాజకీయ పాలనాధికారాన్ని సాధించింది.

 

నేపథ్యం: క్రీ.శ.1707లో మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు మరణం తర్వాత సింహాసనం కోసం జరిగిన కుట్రలు, అంతర్యుద్ధాలతో మొగల్‌ సామ్రాజ్యం బలహీనపడింది. అనేక రాష్ట్రాలు (సుబాలు) చక్రవర్తి అధికారాన్ని నామమాత్రంగా అంగీకరించి అన్ని విషయాల్లో సర్వ స్వతంత్రులుగా వ్యవహరిస్తూ ఉండేవి. క్రీ.శ.1717లో బెంగాల్‌ సుబేదారు అయిన ముర్షీద్‌ కులీఖాన్‌ (1717 - 27) దిల్లీ రాజకీయాలకు దూరంగా ఉంటూ బెంగాల్‌ను స్వతంత్ర రాజ్యంగా పాలించడం ప్రారంభించాడు. ముర్షిదాబాద్‌ను రాజధానిగా చేసుకొని బెంగాల్‌ను చక్కగా అభివృద్ధి చేశాడు. విదేశీ కంపెనీలను అదుపులో ఉంచాడు. ఆయన తర్వాత అలీవర్ది ఖాన్‌ (1740 - 56) కూడా అదే విధానాన్ని కొనసాగించాడు.

 

సిరాజ్‌-ఉద్‌-దౌలా: క్రీ.శ.1756లో అలీవర్ది ఖాన్‌ మరణం తర్వాత ఆయన కుమార్తె కుమారుడైన సిరాజ్‌-ఉద్‌-దౌలా చాలా చిన్న వయసులోనే నవాబు అయ్యాడు. భారతదేశ గడ్డపై విదేశీ కంపెనీల రాజకీయ వ్యవహారాలు నచ్చని ఈయన స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. 

 

యుద్ధానికి దారితీసిన పరిస్థితులు

సారవంతమైన, ధనవంతమైన బెంగాల్‌పై బ్రిటిష్‌ కంపెనీ కన్ను పడింది. కుట్రలు ప్రారంభించింది. దానికోసం సిరాజ్‌ బంధువులు, ఆయన బెంగాల్‌ నవాబు కావడాన్ని వ్యతిరేకించిన ఘస్తీ బేగం, షౌకత్‌ జుంగ్‌ లాంటి వారితో రహస్య మంతనాలు జరిపింది. నవాబు ఆజ్ఞలను ధిక్కరించి ఈస్టిండియా కంపెనీ కలకత్తాలోని విలియమ్స్‌ కోట ఆధునికీకరణను చేపట్టింది. నవాబు శిక్షించిన కృష్ణ వల్లభ్‌కు ఆశ్రయం ఇచ్చింది. సిరాజ్‌-ఉద్‌-దౌలా పట్టాభిషేక మహోత్సవానికి కంపెనీ కావాలనే దూరంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మొగల్‌ చక్రవర్తి ఫరూఖ్‌ షియార్‌ 1717లో కంపెనీకి సుంకాలను తొలగిస్తూ ఇచ్చిన ఫర్మానాను ఉల్లంఘించింది. కంపెనీ కోసం జారీ చేసిన సుంకం చెల్లించాల్సిన అవసరంలేని వ్యాపార అనుమతి పత్రాలను (దస్తక్‌)లను ఉద్యోగులు తమ వ్యక్తిగత వ్యాపారాలకు ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ దుర్వినియోగం వల్ల బెంగాల్‌ ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది.

  బ్రిటిషర్లు దక్షిణ భారతదేశంలో జరిగిన కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచ్‌ వారిపై విజయం సాధించారు. ఆ యుద్ధాల్లో భారత రాజ్యాల సైనిక బలహీనతలను తెలుసుకున్నారు. ఆ నేపథ్యంలోనే దస్తక్‌ల దుర్వినియోగంలో బెంగాల్‌ నవాబు సిరాజ్‌-ఉద్‌-దౌలా హెచ్చరికలను కంపెనీ ఉద్యోగులు నిర్లక్ష్యం చేశారు. వారి చర్యలను నవాబు అవమానకరంగా, బెంగాల్‌ సార్వభౌమాధికారంపై దాడిగా భావించాడు. కంపెనీ తన అధికార పరిధిలో ఉండాలని నిర్ణయించాడు.

 

తదనంతర పరిణామాలు

మొదట ఖాసిం బజార్‌లోని ఇంగ్లిష్‌ ఫ్యాక్టరీని సిరాజ్‌ ఆక్రమించాడు. తర్వాత విలియం కోటను (ఫోర్ట్‌ విలియం) స్వాధీనం చేసుకున్నాడు. బెంగాల్‌ నవాబు త‌న మిలిట‌రీ అధికారి మాణికచంద్‌ను కోటకు రక్షణగా నియమించాడు. పరిమిత సంఖ్యలో ఉన్న కంపెనీ సైన్యం సిరాజ్‌ ధాటికి తలవంచింది. మద్రాసు కౌన్సిల్‌కు ఈ విషయం తెలిసి రాబర్ట్‌ క్లైవ్‌,  అడ్మిరల్‌ వాట్సన్‌ ఆధ్వర్యంలో  సైన్యాన్ని బెంగాల్‌పైకి పంపింది. ఈ ఘర్షణలో సిరాజ్‌ ఓడిపోయి 1757 ఫిబ్రవరిలో ఆంగ్లేయులతో అలీనగర్‌ సంధి చేసుకున్నాడు. దీంతో కంపెనీకి పూర్వ హక్కులు లభించాయి. వాటి ప్రకారం కోటలు నిర్మించుకోవచ్చు. ఇతర డిమాండ్‌లను కూడా ఇంగ్లిష్‌ వారు సాధించుకున్నారు. తప్పని పరిస్థితుల్లో సంధి చేసుకున్న సిరాజ్‌-ఉద్‌-దౌలా  తగిన సమయం కోసం ఎదురు చూశాడు. 

ఫ్రెంచ్‌ వారు బెంగాల్‌లో సిరాజ్‌కు సహాయం చేస్తే తమ వ్యాపారానికి, ఉనికికి కూడా ముప్పు అని భావించిన బ్రిటిషర్లు ఆయనను పదవి నుంచి తొలగించేందుకు కుట్రపన్నారు. తమకు అనుకూలమైన వారిని నవాబును చేయడానికి సిద్ధమయ్యారు. దీని కోసం సిరాజ్‌కు వ్యతిరేకులైన మాణికచంద్, అమీన్‌ చంద్, జగత్‌ సేఠ్‌ లాంటి వారితో కలిసి వ్యూహాలు మొదలుపెట్టారు. ఈ కుట్రదారుల్లో ముఖ్యుడైన సైనికాధికారి మీర్‌ జాఫర్‌ను నవాబును చేయడానికి ఒప్పందం కుదిరింది. అంతా సిద్ధమైన తర్వాత అలీనగర్‌ సంధి ఉల్లంఘన నెపంతో సిరాజ్‌పై కంపెనీ యుద్ధం ప్రకటించింది. 1757 జూన్‌ 23న ప్లాసీ వద్ద కంపెనీ సైన్యాన్ని సిరాజ్‌-ఉద్‌-దౌలా ఎదుర్కొన్నాడు.ఇది పేరుకు మాత్రమే యుద్ధం. కుట్ర ఫలితంగా నవాబు సైన్యం అధిక భాగం విద్రోహుల అధీనంలోకి వెళ్లిపోయింది. ఈ యుద్ధంలో సిరాజ్‌ని ముందు ఓడించి తర్వాత చంపేశారు. మీర్‌ జాఫర్‌ను బెంగాల్‌ నవాబుగా చేశారు.  దీనికి కృతజ్ఞతగా జాఫర్‌ బెంగాల్‌లోని 24 పరగణాలను కంపెనీకి దానం చేశాడు. రాబర్ట్‌ క్లైవ్‌కు, ఇతర అధికారులకు విలువైన కానుకలు ఇచ్చాడు.

 

చీకటి గది వృత్తాంతం 

ప్లాసీ యుద్ధ నేపథ్యంలో జరిగిన మరో సంఘటన చరిత్రలో నిలిచిపోయింది. అదే చీకటి గది వృత్తాంతం. 1756 జూన్‌లో సిరాజ్‌-ఉద్‌-దౌలా కలకత్తాలోని ఫోర్ట్‌ విలియమ్‌ను ముట్టడిలో భాగంగా  146 మంది కంపెనీ ఉద్యోగులను ఒక చీకటి గదిలో బంధించగా మరుసటి రోజుకు 23 మంది మాత్రమే బతికి ఉన్నారని హాల్వెల్‌ అనే చరిత్రకారుడు తెలిపాడు. కానీ ఈ వృత్తాంతాన్ని చాలా మంది చరిత్రకారులు అంగీకరించలేదు.

 

ప్లాసీ యుద్ధ ఫలితాలు 


* ప్లాసీ యుద్ధం బెంగాల్‌లో బ్రిటిష్‌ పాలనకు పునాది వేసింది.

* మీర్‌ జాఫర్‌ కంపెనీ చేతిలో కీలుబొమ్మగా మార‌డంతో బ్రిటిషర్లు బెంగాల్‌కు తెర వెనుక పాలకులు అయ్యారు. 

* బెంగాల్‌ సంపద నిరంతర దోపిడీకి గురై ఇంగ్లండ్‌కు తరలిపోయింది.  

* భారతదేశంలో ఆంగ్లేయుల ప్రతిష్ఠ పెరిగింది. స్వదేశీ రాజుల్లో యూరోపియన్‌ సైనిక శక్తి అజేయం అనే నమ్మకం ఏర్పడింది. 

* ఈ యుద్ధం కేవలం బెంగాల్‌లోనే కాకుండా మొత్తం భారతదేశంలో బ్రిటిష్‌ ఆధిపత్యానికి బాటలు వేసింది. బ్రిటిష్‌ వారు భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి బెంగాల్‌ రెవెన్యూ పెట్టుబడిగా మారింది. 1857 నాటికి మొత్తం భారత ఉపఖండం ఇంగ్లిష్‌వారి ప్రత్యక్ష, పరోక్ష ఏలుబడిలోకి రావడానికి ప్లాసీ యుద్ధ విజయమే ప్రధానమైన మెట్టుగా నిలిచింది. 

  అదేవిధంగా 1764లో జరిగిన బక్సార్‌ యుద్ధం కూడా బ్రిటిష్‌ సామాజ్య స్థాపన ప్రయత్నాలను మరింత పటిష్ఠం చేసింది. 

 

రచయిత: వి.వి.ఎస్‌. రామావతారం

Posted Date : 21-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌