• facebook
  • whatsapp
  • telegram

వందేమాతర ఉద్యమం (1905-1911)

విభజన కుట్ర విచ్ఛిన్నం!

  ఒక విభజన ప్రజలను ఏకం చేసింది. ఒక నినాదం జాతి గళంలో ప్రతిధ్వనించింది. ఇంగ్లిష్‌ పాలకులకు కునుకులేకుండా చేసింది. స్వాతంత్య్రోద్యమంలో కొత్త శకానికి నాంది పలికింది. ఎగసిపడుతున్న జాతీయోద్యమ జ్వాలలను అణచివేసేందుకు ఆంగ్లేయులు బెంగాల్‌ విభజన కుట్రకు తెరతీశారు. జనాన్ని విడగొట్టి జాతీయతను చెడగొట్టేందుకు తెగబడ్డారు. నాయకుల పిలుపులతో ప్రజలు చైతన్యవంతమై తిరగబడ్డారు. విభజన వ్యతిరేక పోరాటాల్లో విజృంభించారు. వందేమాతరం నినాదం మహామంత్రంగా మారింది. స్వరాజ్యమే లక్ష్యంగా ఉద్యమం తీవ్రమైంది. బ్రిటిష్‌ చక్రవర్తి దిగివచ్చాడు. మళ్లీ బెంగాల్‌ సమైక్యమైంది. విభజన శాశ్వతం కాకుండా కుట్రను విచ్ఛిన్నం చేసి చరిత్రలో చెరగని ముద్రలుగా నిలిచిన ఆ ఘట్టాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి.  

 

   ఇరవయ్యో శతాబ్దం ప్రారంభం నుంచి భారత స్వాతంత్య్రోద్యమంలో కొత్త శకం ఆరంభమైంది. పరాయిపాలనలో దుష్కృత్యాలపై దేశం నలుమూలలా ప్రజలు నిరసన గళం విప్పడం మొదలైంది. ఆ విషయంలో బెంగాలీలు ఒక అడుగు ముందున్నారని చెప్పవచ్చు. బ్రిటిష్‌ ఇండియాకు కలకత్తా ముఖ్యపట్టణం కావడం, తెల్ల వారి విధానాల తొలి ప్రభావం బెంగాల్‌పైనే పడటంతో అక్కడి జనం రాజకీయంగా చైతన్యవంతులై పోరాటాల్లోకి దిగారు. 

 

బెంగాల్‌ విభజనతో రగడ

  అప్పటి రాజప్రతినిధి లార్డ్‌ కర్జన్‌ (1898-1905) రాజకీయ దురుద్దేశంతో బెంగాల్‌ను రెండు రాష్ట్రాలుగా విభజిస్తూ 1905, జులై 20న అధికారిక ప్రకటన చేశాడు. ఆ నిర్ణయం అదే ఏడాది అక్టోబరు 16 నుంచి అమల్లోకి వచ్చింది. ఢాకా ముఖ్య పట్టణంగా తూర్పు బెంగాల్,  కలకత్తా కేంద్రంగా పశ్చిమ బెంగాల్, అస్సాం ఒక రాష్ట్రంగా, బిహార్, ఒరిస్సాలను రెండో రాష్ట్రంగా విభజించారు. సువిశాల బెంగాల్‌ రాష్ట్ర పరిపాలనా సౌలభ్యం కోసమే ఆ విధంగా చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇతర నిగూఢ విషయాలు కూడా అందులో ఇమిడి ఉన్నాయి. బెంగాల్‌లో ఉప్పొంగుతున్న జాతీయోద్యమానికి అడ్డుకట్ట వేయడమే అసలు ఉద్దేశం.తూర్పు బెంగాల్‌లో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలను, పశ్చిమ బెంగాల్‌లోని ఎక్కువగా ఉన్న హిందువుల నుంచి విడదీయడంతో పాటు కొత్త రాష్ట్రాల్లో బెంగాలీల ప్రాధాన్యం తగ్గించడమే ప్రధాన లక్ష్యం. ఆనాటి భారత ప్రభుత్వ వ్యవహారాల కార్యదర్శి రిస్లే ‘అవిభక్త బెంగాల్‌ ఒక శక్తి. దానిని విభజిస్తే బలహీనమవుతుంది. మన పరిపాలనను ప్రతిఘటించే బలమైన ప్రత్యర్థులను బలహీనపరచడమే మన ముఖ్య లక్ష్యం’ అన్న మాటలే ఇందుకు నిదర్శనం. బ్రిటిషర్ల ‘విభజించు-పాలించు’ విధానానికి రిస్లే వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయి.

  నిజానికి కర్జన్‌ 1903లోనే బెంగాల్‌ విభజనను ప్రతిపాదించాడు. కానీ ఆయన చర్యను సురేంద్రనాథ్‌ బెనర్జీ, కె.కె.మిత్ర, పి.సి.రే వంటి బెంగాలీ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు. 1905, జులైలో అధికారిక ప్రకటన తర్వాత ఆగస్టు 7న కలకత్తా టౌన్‌హాల్‌ వద్ద బ్రహ్మాండమైన సభ జరిగింది. బెంగాల్‌ జాతీయవాదులు విభజనను అంగీకరించలేదు. విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ ఉద్యమ కార్యక్రమాలతో నిరసన తెలపాలని నిర్ణయించారు. మొదట ప్రభుత్వానికి అర్జీలు సమర్పించారు. హితవాది, సంజీవని, బెంగాలీ వంటి పత్రికలు పాలకుల నిర్ణయాన్ని దుయ్యబట్టాయి. ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం 1905 అక్టోబరు 16 నుంచి విభజనను అమల్లోకి తెచ్చింది. జాతీయవాదులు బెంగాల్‌ విభజనను భారత జాతీయతకు సవాలుగా భావించారు. విభజన వ్యతిరేక ఉద్యమం బెంగాల్‌ అంతటా ఊపందుకుంది. ఆ రోజును సంతాపదినం ప్రకటించి నిరాహార దీక్షలు, హర్తాళ్లు చేశారు. ప్రజలు చెప్పులు లేకుండా వచ్చి గంగా నదిలో స్నానాలు ఆచరించారు. హిందూ, ముస్లింలు సంఘీభావంతో రక్షాబంధన్‌ నిర్వహించారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన ఆనంద్‌మఠ్‌ గ్రంథం నుంచి గ్రహించిన ‘వందేమాతరం’ శక్తిమంతమైన ఉద్యమ నినాదంగా మారింది. రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ రాసిన ‘అమర్‌ సోనార్‌ బంగ్లా’ అనే గీతం బెంగాలీలను జాగృతపరిచింది. 

  విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం ప్రధాన ఆయుధంగా మారింది. ప్రజల తీవ్ర ఆవేదన, ఆక్రోశం ప్రస్ఫుటంగా ప్రకటితమయ్యే ఒక దృఢ కార్యాచరణగా నిలిచింది. విదేశీ వస్తువులు అమ్మే దుకాణాల ముందు పికెటింగ్‌లు చేశారు. విద్యార్థులు ఆంగ్ల విద్యాసంస్థలను బహిష్కరించారు. నాయకులు జాతీయ విద్యా సంఘాన్ని ఏర్పరిచి జాతీయ విద్యానిధిని సేకరించి విద్యాసంస్థలను నెలకొల్పారు. బెంగాల్‌లో ‘నేషనల్‌ కాలేజీ ఆఫ్‌ బెంగాల్‌’ను స్థాపించారు. దానికి అరబిందో ఘోష్‌ ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. స్వదేశీ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధించింది.

  1905లో బెనారస్‌లో గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షతన సమావేశమైన జాతీయ కాంగ్రెస్‌ బెంగాల్‌ విభజనను ఖండించింది. 1906లో కలకత్తాలో దాదాభాయ్‌ నౌరోజీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ సమావేశం ‘స్వరాజ్య’ సాధన లక్ష్యంగా ప్రకటించింది. ఈ నిర్ణయం కాంగ్రెస్‌లోని అతివాద వర్గాన్ని కూడా ఆనందపరిచింది. బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమ నాయకత్వం తిలక్, బిపిన్‌ చంద్రపాల్, అరబిందో ఘోష్‌ వంటి అతివాద జాతీయ నాయకుల సారథ్యంలోకి వెళ్లింది. మహారాష్ట్రలో తిలక్, ఆంధ్రాలో బిపిన్‌ చంద్రపాల్, బెంగాల్‌లో అరబిందో ఘోష్, పంజాబ్‌లో లాలా లజపతిరాయ్, ఢిల్లీలో అజిత్‌సింగ్‌ వందేమాతరం లేదా స్వరాజ్య ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో పర్యటించి పోరాటాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు. ఉద్యమంలో భాగంగా అనేక పరిశ్రమలు పునరుద్ధరించారు. చేనేత, సబ్బుల తయారీ, అగ్గిపెట్టెల తయారీ, తోళ్ల పరిశ్రమ, జనపనార పరిశ్రమలను అభివృద్ధి చేశారు. బ్యాంకులు, బీమా కంపెనీలు ఏర్పాటయ్యాయి. పి.సి.రే రసాయన శాస్త్రాభివృద్ధి కోసం బెంగాల్‌ కెమికల్‌ స్వదేశీ స్టోర్స్‌ను స్థాపించారు.

  ఉద్యమ కాలంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్, రజనీకాంత్‌ సేన్, ముకుంద దాస్‌ లాంటి కవులు గేయాలు, కావ్యాలు రాశారు. తిలక్‌ ప్రజల దేశభక్తిని పెంపొందించడానికి, ప్రజలను సంఘటిత పరిచేందుకు గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, శివాజీ జయంతి నిర్వహణ చేపట్టాడు. బెంగాల్‌ ప్రముఖ బారిస్టర్‌ అబ్దుల్‌ రసూల్, ప్రముఖ ఆందోళనకారుడు లియాఖత్‌ హుస్సేన్, వ్యాపారవేత్త గజనవి లాంటి ఎందరో ముస్లిం జాతీయవాద నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారు. అనుశీలన సమితి, అభినవ్‌ భారత్‌ వంటి రహస్య సంస్థలు కూడా ఉద్యమానికి తోడ్పాటును అందించాయి.

 

ప్రభుత్వ నిరంకుశ చర్యలు

స్వదేశీ ఉద్యమం లేదా వందేమాతర ఉద్యమంలో విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాన్ని అణచివేయడానికి ప్రభుత్వం అనేక నిరంకుశ చర్యలను చేపట్టింది. వందే మాతరం ఉచ్చారణను, వందేమాతర గీతం ఆలపించడాన్ని నిషేధించింది. వార్తాపత్రికలపై తీవ్ర ఆంక్షలు విధించింది. సమావేశాలు, ఊరేగింపులను బహిష్కరించింది. కర్జన్‌ తర్వాత రాజప్రతినిధిగా వచ్చిన మింటో తన పదవీకాలంలో సెడిషియస్‌ మీటింగ్స్‌ చట్టం, ఎక్స్‌ప్లోజివ్‌ సబ్‌స్టాన్స్‌ యాక్ట్‌ (1908), న్యూస్‌ పేపర్స్‌ యాక్ట్, ఇండియన్‌ ప్రెస్‌ యాక్ట్‌ వంటి అనేక అప్రజాస్వామిక చట్టాలను తీసుకువచ్చి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నించాడు. తిలక్‌ను అరెస్టు చేసి బర్మాలోని మాండలే జైలుకు పంపాడు. అరబిందో ఘోష్‌ను ఆలీపూర్‌ బాంబు కేసులో ఇరికించాడు. లాలా లజపతిరాయ్‌ విదేశాల్లో ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది. ఉద్యమంలో ముఖ్య నాయకులు అరెస్టయి కారాగారాల పాలయ్యారు.విభజించు-పాలించు విధానంలో హిందువులు, ముస్లింలకు మధ్య అపోహలు కల్పించారు.

 

దిగొచ్చిన చక్రవర్తి

ఏ ప్రజా ఉద్యమం కూడా సుదీర్ఘ కాలం సాగడం సాధ్యం కాదు. ఇక్కడ అదే జరిగింది. ప్రభుత్వ తీవ్ర అణచివేత విధానాలు వందేమాతర ఉద్యమంపై ప్రభావాన్ని చూపాయి. అయినా ప్రజల్లో జాతీయావేశ వెల్లువ సన్నగిల్లలేదు. లార్డ్‌ హార్డింజ్‌ పదవి కాలంలో బ్రిటిష్‌ చక్రవర్తి అయిదో జార్జ్, రాణి మేరీ భారతదేశాన్ని 1911లో సందర్శించారు. వారి గౌరవార్థం దర్బార్‌ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా మొండివైఖరి వదిలిపెట్టి కొంత వాస్తవ దృక్పథంతో వ్యవహరించింది. ఆ దర్బార్‌లో చక్రవర్తి రెండు ముఖ్య ప్రకటనలు చేశారు. అవి బెంగాల్‌ విభజన రద్దు, రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చడం. దీంతో ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించింది. బెంగాల్‌ సమైక్యమైంది. దేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగిన మొదటి ప్రజా ఉద్యమం వందేమాతరం ఉద్యమం. ఇది భారతీయుల్లో జాతీయతా భావాలను, రాజకీయ చైతన్యాన్ని ఇనుమడింపజేసింది. సుప్తచేతనావస్థలో ఉన్న జాతిని మేల్కొలిపి స్వాతంత్య్ర పోరాటానికి సంసిద్ధులను చేసింది. జాతీయోద్యమ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది. 

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 25-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌