• facebook
  • whatsapp
  • telegram

రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారత రాజకీయాలు ఆగస్టు ఆఫర్‌ (1940), క్రిప్స్‌ మిషన్‌ (1942)

 దిగివచ్చిన తెల్లదొరలు!

 


బ్రిటిష్‌ సామ్రాజ్య ఉనికికే ప్రమాదకరంగా పరిణమించిన రెండో ప్రపంచ యుద్ధం భారతీయులకు మంచి అవకాశాన్ని అందించింది. ముప్పు ముంచుకు రావడంతో మన నాయకుల మద్దతు కోసం తెల్లవారు దిగివచ్చారు. రాజ్యాంగాన్ని స్వయంగా రాసుకునే హక్కును కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్వయం ప్రతిపత్తికి ఒప్పుకున్నారు. కానీ పూర్తి అధికారాలను బదిలీ చేయడానికి అంతగా ఇష్టపడని ఆంగ్లేయులు చేసిన ప్రతిపాదనలు, రాయబారాలు ఆఖరికి విఫలమయ్యాయి. కానీ ఈ పరిణామాలన్నీ ప్రజల్లో జాతీయ భావం, స్వరాజ్య సంకల్పం మరింత పటిష్ఠమయ్యేందుకు దోహదపడ్డాయి. మరో మహోద్యమానికి అందరూ సంసిద్ధులయ్యేందుకు సాయపడ్డాయి.

 

జర్మనీ నాజీ నియంత హిట్లర్‌ సామ్రాజ్యకాంక్ష రెండో ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. జర్మనీ, జపాన్, ఇటలీ, హంగేరీ, రొమేనియా, బల్గేరియా లాంటి దేశాలు అక్ష రాజ్య కూటమిగా; బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా తదితర దేశాలు మిత్ర రాజ్య కూటమిగా యుద్ధంలో హోరాహోరీగా తలపడ్డాయి. జాతీయ కాంగ్రెస్‌తో లేదా కేంద్ర శాసనసభకు ఎంపికైన సభ్యులతో కనీసం సంప్రదించకుండా యుద్ధంలో బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం భాగస్వామి కావడాన్ని భారతీయులు వ్యతిరేకించారు. తదనంతర పరిణామాల్లో బ్రిటన్‌ యుద్ధ చర్యలను వ్యతిరేకిస్తూ, బ్రిటిష్‌ ఇండియా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాజీనామాలు చేశాయి. ఐరోపా, ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి భారతీయుల సహాయ సహకారాలు అత్యంత అవసరమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లండ్‌ క్లిష్ట పరిస్థితిని గమనించిన భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. యుద్ధ లక్ష్యాలను బ్రిటన్‌ స్పష్టంగా ప్రకటించాలని, కేంద్రంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం తొలుత ఉదాసీనంగా ఉన్నప్పటికీ, తర్వాత పరిస్థితులు మారిపోవడంతో భారతీయుల సహకారం కోసం నాటి వైస్రాయ్‌ లార్డ్‌ లిన్‌లిత్‌ గో ద్వారా 1940, ఆగస్టు 8న ఒక ప్రకటన చేయించింది. దీనినే ఆగస్టు ప్రతిపాదన (ఆగస్టు ఆఫర్‌) అంటారు.


ఆగస్టు ప్రతిపాదన ముఖ్యాంశాలు: * జాతి జీవన పోరాటంలో నిమగ్నమై ఉన్న సమయంలో రాజ్యాంగ సమస్యలు పరిష్కారం కావని, యుద్ధానంతరం భారతీయులు తమ ఆశయాలు, ఆశలకు అనుగుణంగా రాజ్యాంగ రచన చేసుకునే విధంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

* అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలకు భంగం కలిగించే లేదా వారు అంగీకరించని అంశాలతో కూడిన ఏ రాజ్యాంగమైనా బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఆమోదనీయం కాదని ప్రకటించారు. 

* యుద్ధానంతరం భారతదేశానికి డొమినియన్‌ ప్రతిపత్తి కల్పిస్తూ ఒక బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటుకు హామీ ఇచ్చారు.

* యుద్ధ సమయంలో తాత్కాలిక చర్యగా రాజప్రతినిధి (వైస్రాయ్‌) కార్యనిర్వహణ మండలిలో భారతీయ ప్రతినిధులకు అవకాశం కల్పిస్తారు.
* యుద్ధకాలంలో బ్రిటిష్‌ ఇండియా, భారత రాజ్యాల ప్రతినిధులతో కూడిన ఒక యుద్ధ సలహా మండలి ఏర్పాటవుతుంది.


ఆగస్టు ప్రతిపాదన విశిష్టత: మొదటిసారిగా భారతీయులకు తమ రాజ్యాంగాన్ని రాసుకునే హక్కు కల్పించింది. కానీ ఈ ప్రతిపాదనలు భారతీయుల ప్రధాన డిమాండ్‌ అయిన స్వయంపాలనను నెరవేర్చలేదు. అల్పసంఖ్యాక వర్గాల పట్ల శ్రద్ధ పేరుతో, భారతీయులకు అధికార బదిలీ నిలుపుదల చేసే అంతరార్థం వ్యక్తమైంది. ఈ ప్రతిపాదనలు అధిక సంఖ్యాక భారతీయులకు ఆశాభంగం కలిగించాయి. దాంతో వైస్రాయ్‌ ప్రతిపాదనలను జాతీయ కాంగ్రెస్‌ తిరస్కరించింది.


రెండో ప్రపంచ యుద్ధ పురోగతి: ఐరోపా యుద్ధరంగంలో హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ కూటమి రెచ్చిపోయింది. పశ్చిమ దేశాల్లో అనూహ్య విజయాలు సాధించింది. ఫ్రాన్స్‌ ఉత్తర, ఆగ్నేయ ప్రాంతాలను ఆక్రమించింది. రష్యాపై దాడి చేసింది. తూర్పు యూరప్‌ రాజ్యాలు హిట్లర్‌కు లొంగిపోయాయి. ఆసియా యుద్ధరంగంలో జపాన్‌ వీరవిహారం చేసింది. ఆగ్నేయాసియాలోని బ్రిటన్‌ వలస రాజ్యాలైన ఫిలిప్పీన్స్, ఇండోచైనా, ఇండొనేసియా, మలేసియాలను ఒక్కొక్కటిగా జపాన్‌ సైన్యం ఆక్రమించి, బర్మాలోకి ప్రవేశించింది. యుద్ధం దాదాపు భారతదేశపు ముంగిట్లోకి వచ్చేసింది. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యానికి అంతిమ ఘడియలు సమీపించాయని ఆందోళన కలిగించింది. పెర్ల్‌ హార్బర్‌ దీవుల్లో అమెరికా నౌకా శ్రేణిపై జపాన్‌ మెరుపుదాడి చేసింది. ఈ పరిణామాలు బ్రిటన్, దాని మిత్ర రాజ్యాలకు మింగుడు పడలేదు. జపాన్‌ సేనల విజృంభణను నిలువరించేందుకు భారతీయుల సహకారం అవసరమని అమెరికా, రష్యా భావించాయి. దాంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్‌ భారతదేశంలో రాజకీయ సంస్కరణల కోసం బ్రిటిష్‌ ప్రధాని చర్చిల్‌పై ఒత్తిడి తెచ్చాడు. బ్రిటిష్‌ ఇండియా అభివృద్ధి నిరోధక రాజకీయాలకు విన్‌స్టన్‌ చర్చిల్‌ మద్దతు, ప్రోత్సాహం ఉండేవి. కానీ యుద్ధకాలం నాటి స్థితి భిన్నంగా ఉంది. భారత్‌లో ప్రజాభిప్రాయాన్ని తమకు అనువుగా మలుచుకోవడానికి బ్రిటిషర్లు కొన్ని సానుకూల చర్యలు చేపట్టక తప్పలేదు. అందులో భాగమే సర్‌ స్టాఫోర్డ్‌ క్రిప్స్‌ రాయబారం (1942).


క్రిప్స్‌ మిషన్‌: భారత నాయకులతో సంప్రదింపులు జరపడానికి బ్రిటన్‌ ప్రభుత్వం క్రిప్స్‌ను రాయబారిగా పంపింది. 1942, మార్చిలో అతడు సంప్రదింపులు ప్రారంభించాడు. కాంగ్రెస్‌ తరఫున జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు.


క్రిప్స్‌ ప్రతిపాదనలు: * యుద్ధానంతరం భారతదేశానికి డొమినియన్‌ ప్రతిపత్తి కల్పిస్తారు. భారత్‌కు కామన్‌వెల్త్‌ నుంచి వైదొలిగే హక్కు కూడా ఉంటుంది.

* యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి ఒక కొత్త రాజ్యాంగం రూపొందించుకోవడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది. 

* కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి సిద్ధపడని రాష్ట్రాలు లేదా రాష్ట్రం వేరే యూనియన్‌గా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. స్వదేశీ సంస్థానాలకు కూడా కొత్త రాజ్యాంగానికి కట్టుబడి ఉండటానికి, లేకపోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. 

* బ్రిటిష్‌ ప్రభుత్వం పూర్తి అధికారాన్ని బదిలీ చేయడం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను చర్చించడానికి రాజ్యాంగ పరిషత్తు, బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక  ఒప్పందం కుదుర్చుకోవాలి.

* నూతన రాజ్యాంగం సిద్ధమయ్యే లోపు తాత్కాలికంగా దేశ రక్షణ విషయాలపై బ్రిటిష్‌ ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. వైస్రాయ్‌ అధికారాలు యథాతథంగా ఉంటాయి.


క్రిప్స్‌ ప్రతిపాదనల్లో డొమినియన్‌ ప్రతిపత్తి కల్పించి భారత యూనియన్‌ ఏర్పాటు చేయడం, కామన్‌వెల్త్‌ నుంచి విడిపోయే హక్కు ఉండటం మంచి విషయాలే. కానీ భారత యూనియన్‌ నుంచి బ్రిటిష్‌ రాష్ట్రాలు, స్వదేశీ సంస్థానాలు విడిపోయే అవకాశం ఇవ్వడం ప్రమాదకర అంశం. వివిధ భారతీయ ప్రతినిధుల ప్రాతినిధ్యంతో జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకావాలని, దాని రాజ్యాంగబద్ధ అధిపతిగా మాత్రమే రాజప్రతినిధి ఉండాలనేది భారతీయుల కోరిక. అందుకే కాంగ్రెస్‌ ఈ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.  ప్రత్యేక పాకిస్థాన్‌ గురించి స్పష్టత లేదంటూ ముస్లింలీగ్‌ కూడా వ్యతిరేకించింది. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా వివిధ కారణాలతో అసంతృప్తిని వెల్లడించాయి. క్రిప్స్‌ ప్రతిపాదనలను ‘పతనం అవుతున్న బ్యాంకు పేరిట అనంతర తేదీతో ఇచ్చిన బ్యాంకు చెక్కు వంటిది’ అని గాంధీ విమర్శించారు. భారతీయులకు అధికారాన్ని బదిలీ చేయడానికి బ్రిటిషర్లలో ఉన్న తీవ్ర అయిష్టతే క్రిప్స్‌ ప్రతిపాదనలు, అతడి రాయబారం విఫలమవడానికి ప్రధాన కారణం.


రెండో ప్రపంచ యుద్ధకాలంలో 1940 ఆగస్టు ప్రతిపాదనలు, 1942 క్రిప్స్‌ ప్రతిపాదనలు విఫలం కావడంతో భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి, నైరాశ్యం ఆవహించాయి. ఇంతలోనే ప్రపంచ యుద్ధం భారతదేశం గుమ్మం వరకు చేరింది. భారతీయులు తమకు శత్రువులు కాదని, అక్కడున్న ఆంగ్లేయులే తమ లక్ష్యమని జపాన్‌ స్పష్టం చేసింది. ఇలాంటి స్థితిలో మన దేశానికి యుద్ధ ప్రమాదం తప్పించాలంటే బ్రిటిషర్లు భారత్‌ నుంచి వెళ్లిపోవాలని గాంధీజీ తన ‘హరిజన్‌’ పత్రికలో రాశారు. భారత జాతీయోద్యమంలో మరో చారిత్రాత్మక ఘట్టం ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమానికి నాంది పలికారు.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 20-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌