• facebook
  • whatsapp
  • telegram

స్వదేశీ సంస్థానాల విలీనం - నాయ‌కుల పాత్ర‌

స్వదేశీ సంస్థానాల విలీనం - సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ పాత్ర
ఆంగ్లేయుల పాలనలో మనదేశంలో రెండు రకాల భూభాగాలు ఉండేవి. 1్శ బ్రిటిష్‌ వారు ఆక్రమించి పాలించిన ప్రాంతాలు. వీటినే ‘బ్రిటిష్‌ ఇండియా’గా పిలిచేవారు. 2్శ ఆంగ్లేయుల ప్రత్యక్ష పాలనలో కాకుండా స్వదేశీ రాజుల పాలనలో ఉన్న ప్రాంతాలు. వీటిని ‘స్వదేశీ సంస్థానాలు’గా పేర్కొన్నారు.  మౌంట్‌ బాటెన్‌ ప్రణాళికలో ఈ స్వదేశీ సంస్థానాలకు నిర్ణయాధికారం ఇచ్చారు. దీని ప్రకారం అవి పాకిస్థాన్‌ లేదా భారతదేశంలో కలవచ్చు లేదా ఏ దేశంలోనూ చేరకుండా స్వతంత్రంగా ఉండొచ్చు. ఈ విధానం స్వాతంత్య్రానంతరం భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరంగా మారింది. అనేక మంది స్వదేశీ సంస్థానాధీశులు స్వతంత్రంగా ఉండాలని భావించగా, మరికొందరు పాకిస్థాన్‌లో కలిసేందుకు ప్రయత్నించారు. స్వతంత్ర భారతదేశ తొలి హోంశాఖ మంత్రి, ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఆ సంస్థానాలు భారత్‌లో కలిసేలా కృషిచేశారు. ఈయన చొరవతో సుమారు 562 స్వదేశీ సంస్థానాలు మనదేశంలో విలీనమయ్యాయి. దీని వల్లే పటేల్‌ ఇండియన్‌ బిస్మార్క్‌గా, ఉక్కు మనిషిగా పేరొందారు.


        వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు క్రమంగా భారతదేశాన్ని ఆక్రమించాలనుకున్నారు. యుద్ధాలు, ఒప్పందాలు లాంటి విధానాల ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకొని, తమ ప్రత్యక్ష పాలనలో ఉంచారు. మరికొన్ని స్వదేశీ సంస్థానాలు స్వతంత్రంగా ఉంటూనే ఆంగ్లేయుల ప్రాబల్యాన్ని అంగీకరించాయి. భారత జాతీయోద్యమ కాలంలో ఈ స్వదేశీ సంస్థానాల్లోనూ ఉద్యమాలు జరిగాయి. ఆ సంస్థానాధీశులు బ్రిటిష్‌ వారి సాయంతో వాటిని అణచివేశారు. ముఖ్యంగా 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా యువరాజుల మండలి/ స్వదేశీ సంస్థానాధీశులు మండలిని ఏర్పాటు చేశారు. 1935 చట్టం ద్వారా కేంద్రంలోని ఉభయ సభల్లో స్వదేశీ సంస్థానాధీశులకు కొన్ని సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. అందులోని సభ్యులను ఎన్నిక ద్వారా కాకుండా సంస్థానాధీశులు ఎంపిక చేసిన వారికి స్థానం కల్పించాలని పేర్కొన్నారు. బరోడా, కథియవాడ్‌ లాంటి సంస్థానాల్లో ప్రజా పరిషత్‌లు ఏర్పడ్డాయి. 1927లో బల్వంత్‌రాయ్‌ మెహతా నాయకత్వంలో అఖిల భారత సంస్థానాల ప్రజా పరిషత్‌ను ఏర్పాటు చేశారు. 1938 హరిపుర, 1939 త్రిపుర కాంగ్రెస్‌ సమావేశాల్లో స్వదేశీ సంస్థానాల స్వాతంత్య్రం కోసం కూడా చర్చలు జరిగాయి. 1939లో జవహర్‌లాల్‌ నెహ్రూను అఖిల భారత స్వదేశీ సంస్థానాల ప్రజా సమావేశం  అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 


ఎస్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు
స్వాతంత్య్రానంతరం భారతదేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో స్వదేశీ సంస్థానాల విలీనం ఒకటి. వీటిలో చాలా వరకు చిన్న రాజ్యాలే ఉండేవి. ఇవి ఆర్థికంగా స్వయం పోషకాలు కావు. వీటికి స్వతంత్రంగా ఉండటానికి లేదా పాకిస్థాన్‌తో కలవడానికి అనుమతిస్తే రవాణా మార్గాల విస్తరణలో, నదీలోయ ప్రాజెక్టుల నిర్మాణంలో, ఆంతరంగిక వాణిజ్యాభివృద్ధిలో ఆటంకాలు తలెత్తొచ్చు. జాతీయ సమగ్రత, దేశ భద్రత ప్రమాదం పడొచ్చు. ఈ సమస్యలను అధిగమించేందుకు భారత ప్రభుత్వం 1947, జూన్‌ 25న ఎస్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ను అధ్యక్షుడిగా, వి.పి.మీనన్‌ను కార్యదర్శిగా నియమించారు. వీరి కృషి ఫలితంగానే స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. 1947, జులై 5న ఈ డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వదేశీ సంస్థానాధీశులు జాతీయోద్యమ స్ఫూర్తి, దేశభక్తితో తమ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయమని విజ్ఞప్తి చేశారు. వీరు స్వదేశీ సంస్థానాధీశులతో నేరుగా చర్చలు జరిపారు. 


          1947, జులై 25న మౌంట్‌ బాటెన్‌ 25 మంది సంస్థానాధీశులు, 75 మంది సంస్థానాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రజలు తమ పాలకులను వదిలి ఎలా ఉండలేరో, సంస్థానాధీశులు కూడా తమ భారతదేశం లేకుండా ఉండలేరని, రక్షణ విషయంలో అవి స్వతంత్రంగా వ్యవహరించలేవని ఆయన ప్రభోదించారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కూడా ఛాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌ ఛాన్సలర్‌ అయిన యదువీంద్ర సింగ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. ఫలితంగా జోధ్‌పూర్, జైసల్మీర్, బికనీర్, పటియాలా, బరోడా లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. 


           ఇండోర్‌ మహారాజు, భరత్‌పూర్‌ పాలకుడు, భోపాల్‌ నవాబు, తిరువాన్కూర్‌ మహారాజు మొదలైనవారు తమ రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయడానికి విముఖత చూపారు. పటేల్‌ వారికి నచ్చజెప్పి, వారు విధించిన కొన్ని షరతులకు ఒప్పుకొని ఆ సంస్థానాలు భారత యూనియన్‌లో కలిసేలా కృషిచేశారు. కానీ జునాగఢ్‌తో పాటు పెద్ద సంస్థానాలైన కశ్మీర్, హైదరాబాద్‌ భారతదేశంలో కలవడానికి అంగీకరించలేదు. అయినా పటేల్,  మీనన్‌లు తమ తెలివితేటలు, అధికారాన్ని ఉపయోగించి 1948 నాటికి అవి కూడా భారతదేశంలో విలీనమయ్యేలా చేశారు.


జునాగఢ్‌ సంస్థానం 
జునాగఢ్‌ సంస్థానం నేటి గుజరాత్‌లోని కథియవాడ్‌ ప్రాంతంలో ఉండేది. దీనికి అధిపతి సర్‌ మహబత్‌ ఖాన్‌ రసూల్‌ ఖాన్‌. ఈయన ముస్లిం కాగా, సంస్థానంలోని ఎక్కువ మంది ప్రజలు హిందువులు. రసూల్‌ఖాన్‌కు భారత యూనియన్‌ పట్ల సదభిప్రాయం లేదు. ఈయన తన సంస్థానాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేయాలని భావించారు. కానీ అతడి మంత్రి అయిన ఖాన్‌ బహదూర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ మాత్రం తమ సంస్థానం పాకిస్థాన్‌ యూనియన్‌లో చేరదని ప్రకటించాడు. 1947, జులై 25న జరిగిన స్వదేశీ సంస్థానాధిపతుల సమావేశానికి  రసూల్‌ ఖాన్‌ సోదరుడు సబీబక్ష్ హాజరయ్యాడు. ఆయన పటేల్, మీనన్‌లతో చర్చలు జరిపి తమ సంస్థానాన్ని భారత యూనియన్‌లో కలిపేలా రసూల్‌ ఖాన్‌కు సలహా ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ పాలకుడైన రసూల్‌ ఖాన్‌ పాకిస్థాన్‌కు చెందిన షానవాజ్‌ను జునాగఢ్‌ దివాన్‌గా నియమించాడు. 


           ఈ సంస్థానంలోని హిందువులు నవాబ్, దివాన్‌ల చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. కానీ  రసూల్‌ ఖాన్‌ 1947, ఆగస్టు 15న జునాగఢ్‌ పాకిస్థాన్‌లో విలీనమవుతుందని ప్రకటించాడు. సంస్థానంలోని నాయకులైన యు.ఎస్‌. ధేబర్, బల్వంతరాయ్‌ మెహతా, శామల్‌ దాస్‌ గాంధీ తదితరులు ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. శామల్‌ గాంధీ అధ్యక్షతన ‘‘అర్జీ హుకూమత్‌’’ అనే పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో భారత ప్రభుత్వం తన సైన్యాన్ని జునాగఢ్‌ సరిహద్దులకు పంపింది. దీంతో రసూల్‌ ఖాన్‌ తన కుటుంబంతో 1947, సెప్టెంబరులో పాకిస్థాన్‌కు పారిపోయాడు. జునాగఢ్‌ను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని,  బ్రిగేడియర్‌ గురు దయాళ్‌ సింగ్‌కు దాని పాలనను అప్పగించింది. 1947, నవంబరు 13న పటేల్‌ జునాగఢ్‌కు వెళ్లగా, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. 1948, ఫిబ్రవరి 20న ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన భారత ప్రభుత్వం వారి అభీష్టం ప్రకారం జునాగఢ్‌ను భారత యూనియన్‌లో విలీనం చేసింది. కేవలం 91 మంది మాత్రమే పాకిస్థాన్‌లో కలవడానికి అనుకూలంగా ఓటు వేశారు.


కశ్మీర్‌ సంస్థానం  
కశ్మీర్‌ సంస్థానం భౌగోళికంగా జమ్మూ, కశ్మీర్, గిల్గిత్, లద్దాఖ్‌ అనే నాలుగు ప్రధాన భాగాలుగా ఉండేది. 1947 నాటికి రాజా హరిసింగ్‌ కశ్మీర్‌ సంస్థానాధీశుడిగా ఉన్నారు.  మతపరంగా జమ్మూలో హిందువులు, కశ్మీర్‌ లోయలో ముస్లింలు, లద్దాఖ్‌లో బౌద్ధులు అధికంగా ఉండేవారు. ఆ సమయంలో రాజా హరిసింగ్‌ పాలనను వ్యతిరేకిస్తూ ముస్లింలు షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌  పార్టీ ద్వారా పోరాటం చేశారు. వారు 1946లో క్విట్‌ కశ్మీర్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్రానంతరం కశ్మీర్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని రాజా హరిసింగ్‌ భావించారు. కశ్మీర్‌ను తమ యూనియన్‌లో కలపాలని పాకిస్థాన్‌ హరిసింగ్‌పై ఒత్తిడి తెచ్చింది. దీనికి అంగీకరించలేదని కశ్మీర్‌పై అనేక ఆంక్షలు విధించింది. ఆహార పదార్థాల సరఫరాను నిలిపివేసింది. పాకిస్థాన్‌ చివరగా 1947, అక్టోబరు 22న కశ్మీర్‌పై తమ సరిహద్దు సైన్యంతో ప్రత్యక్ష దాడికి పాల్పడింది. వారిని ఎదుర్కోవడానికి కశ్మీర్‌ రాజు డోగ్రా సైన్యాన్ని పంపగా, అందులోని ముస్లింలు తమ పై అధికారులను కాల్చిచంపి పాకిస్థాన్‌ సైన్యంతో కలిసిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజా హరిసింగ్‌ భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందాన్ని చేసుకొని భారత సైన్యం సహాయాన్ని కోరాడు. భారత యూనియన్‌లో కశ్మీర్‌ను విలీనం చేస్తేనే సైనిక సహాయం చేయడానికి వీలవుతుందని ప్రభుత్వం చెప్పడంతో హరిసింగ్‌ దానికి అంగీకరించాడు. దీంతో 1947, అక్టోబరు 26న కశ్మీర్‌ భారత్‌లో విలీనమైంది. వెంటనే భారతసైన్యం విమానాల ద్వారా శ్రీనగర్‌ చేరుకుని పాక్‌ సైన్యాన్ని నిలువరించింది. కానీ అప్పటికే పాక్‌సైన్యం కశ్మీర్‌లోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. ఈ సమస్యలో యూఎన్‌ఓ జోక్యం చేసుకోవడంతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (ఆజాద్‌ కశ్మీర్‌)ను ఇప్పటికీ భారత్‌ స్వాధీనం చేసుకోలేకపోయింది. భారత యూనియన్‌లో విలీనమైన కశ్మీర్‌లో రాజా హరిసింగ్‌ రాజప్రముఖ్‌గా, షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో మంత్రి వర్గం ఏర్పడింది.


హైదరాబాద్‌ సంస్థానం (ఆపరేషన్‌ పోలో)
1947 నాటికి హైదరాబాద్‌ సంస్థాన పాలకుడిగా అసఫ్‌జాహీ వంశానికి చెందిన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఉన్నారు. ఆయన మౌంట్‌ బాటెన్‌ ప్రణాళికను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌ సర్వస్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రకటన నిజాం సంస్థానంలోని ప్రజలకు తీవ్ర నిరాశను కలిగించింది. ఆయన స్టేట్‌ కాంగ్రెస్‌ ఉద్యమాలు, కార్యక్రమాలపై ఆంక్షలు విధించాడు. సంస్థానంలోని ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కమ్యూనిస్టులు కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. స్వామి రామానందతీర్థ నాయకత్వంలో కాంగ్రెస్‌ జాయిన్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. అయినప్పటికీ నిజాం తన సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడానికి అంగీకరించలేదు. సర్దార్‌ వల్లభ్‌భాయ్, వి.పి. మీనన్‌లు నిజాంతో చర్చలు జరపాలని కేఎం మున్షీని పంపారు. అయినా నిజాం లొంగలేదు. 


            ప్రభుత్వ ఒత్తిడి మేరకు నిజాం 1947, సెప్టెంబరు 29న భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం చేసుకున్నాడు. సంస్థానం ఆంతరంగిక విషయాల్లో భారత ప్రభుత్వం జోక్యం ఉండదని, శాంతి భద్రతలు కాపాడటానికి సహకరిస్తుందనే షరతులకు రెండు వర్గాలు అంగీకరించాయి. నిజాం సంవత్సర కాలంలోనే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. పాకిస్థాన్‌కు చెందిన మీర్‌ లాయక్‌ ఆలీని హైదరాబాద్‌ సంస్థాన ప్రధానమంత్రి (దివాన్‌)గా నియమించాడు. భారత కరెన్సీ తన సంస్థానంలో చెల్లదని ఆజ్ఞలు జారీ చేశాడు. పాకిస్థాన్‌తో రహస్యంగా మంతనాలు చేయడం, ఆయుధ సేకరణ కోసం విదేశాలకు రాయబారం పంపడం లాంటి భారత వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు. ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల్లు కూడా ప్రజలు, కమ్యూనిస్టులపై ప్రత్యక్షదాడులకు దిగారు. దీంతో సంస్థానంలో శాంతి భద్రతలు లోపించాయి. 


          ఈ పరిస్థితులను గమనించిన పటేల్‌ 1948, సెప్టెంబరు 13న భారతసైన్యాలను హైదరాబాద్‌ సంస్థానంలోకి పంపారు. దీనికి ఆపరేషన్‌ పోలో అని పేరు పెట్టారు. మేజర్‌ జేఎన్‌ చౌదరి నాయకత్వంలోని భారత సైన్యాలు నిజాం రాష్ట్రంలోకి ప్రవేశించి సెప్టెంబరు 17 నాటికి నిజాం సైన్యాలను ఓడించాయి. ఖాసిం రజ్వీ పాకిస్థాన్‌కు పారిపోయాడు. నిజాం నవాబును హైదరాబాద్‌ రాజ్యానికి రాజ్‌ప్రముఖ్‌ (గవర్నర్‌)గా నియమించారు.1952లో హైదరాబాద్‌ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగ్గా, బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

Posted Date : 22-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌