• facebook
  • whatsapp
  • telegram

విష్ణుకుండినులు

వైదికాన్ని ఆచరించి... బౌద్ధాన్ని ఆదరించి!

 

తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో విష్ణుకుండినులకు విశిష్టస్థానం ఉంది. వీరు వైదికాన్ని ఆచరించారు. బౌద్ధాన్ని ఆదరించారు. రెండు మతాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. అనేక ఆలయాలు, విహారాలు, చైత్యాలయాలను కట్టారు. సంస్కృతాన్ని రాజభాషగా చేసుకొని వేదవిద్యలను ప్రోత్సహించారు. కీసర, భువనగిరి తదితర ప్రాంతాల్లో కోటలు, గుహాలయాలను నిర్మించారు. నాటి బర్మా వంటి విదేశాలకూ తెలుగు సంస్కృతిని వ్యాపింపజేశారు. విష్ణుకుండినుల చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా  తెలంగాణలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా స్థిరపడ్డాయో తెలుస్తుంది. ఈ వివరాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

 

విష్ణుకుండినులు 

విష్ణుకుండినులు క్రీ.శ.5, 6 శతాబ్దాల్లో తెలుగు ప్రాంతాలను పాలించారు. వీరు తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేశారు. ఈ వంశంలోని తొలి పాలకులు బౌద్ధమత నిర్మాణాలు చేపట్టగా మలిపాలకులు తెలంగాణ వ్యాప్తంగా రామలింగేశ్వర దేవాలయాల పేరు మీద అనేక ఆలయాలు నిర్మించారు. తెలంగాణలో ఘటికల పేరుతో అనేక విద్యా కేంద్రాలను ప్రారంభించిన ఘనత వీరికే దక్కుతుంది. విష్ణుకుండినుల కుల దైవం శ్రీపర్వత స్వామి. విష్ణుకుండిన వంశ స్థాపకుడు ఎవరు అనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ‘విష్ణుకుండి’ అనే పదం వినుకొండకు (గుంటూరు జిల్లా) సంస్కృతీకరణమని, అది వారి ప్రథమ నివాసమని కీల్‌హారన్‌ అనే పండితుడ[ు పేర్కొన్నాడు. వీరి కుల దైవం శ్రీపర్వత స్వామి, మల్లికార్జునుడు ఇద్దరూ ఒక్కటేనని ఈయన తెలిపాడు. విష్ణుకుండిన రాజ్యాన్ని మహారాజేంద్ర వర్మ స్థాపించాడు.

 

పాలకులు - సాంస్కృతిక ప్రగతి

గోవింద వర్మ: ఈయన విష్ణుకుండిన వంశపు తొలి రాజుల్లో అగ్రగణ్యుడు. ఇతడి రాజధాని ఇంద్రపాల నగరం (తుమ్మల గూడెం, నల్లగొండ జిల్లా). ఇతడు బౌద్ధ మతాభిమాని అయిన వైష్ణవుడు. ఈయన అనేక బౌద్ధ స్తూపాలను నిర్మించాడు. హైదరాబాద్‌ నగర సమీపంలో ఉన్న చైతన్యపురిలోని మూసీనది తీరంలో లభించిన ప్రాకృత శాసనం ఈ రాజు పేరుతో వెలిసిన గోవిందరాజ విహారం, చైత్యాలయాల గురించి తెలుపుతుంది. గోవింద వర్మ కాలంలో ఫణిగిరి, గాజుల బండ, నేలకొండపల్లి, రామిరెడ్డి పల్లి ప్రాంతాల్లో బౌద్ధారామ విహారాలు ప్రసిద్ధి చెందాయి. ఇతడి పట్టపు రాణి పరమ మహాదేవి బౌద్ధాభిమాని. ఈమె తన పేరు మీద ఇంద్రపురిలో చాతుర్థ శౌర్య సంఘ బౌద్ధ భిక్షువులకు మహావిహారం నిర్మించింది. ఈ విహారం పోషణ కోసం గోవింద వర్మ పెణ్కపఱ గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. హైదరాబాద్‌ శివారులో ఉన్న కీసరగుట్ట (కేసరి గుట్ట) పైన విష్ణుకుండి కోట, దేవాలయాలు ఉన్నాయి. కేసరి గుట్ట కింద కేసరి వాగు ఉంది. వాగు గట్టున ఉన్న ప్రాంతం పేరు గట్టుకేసరి. దాన్ని ప్రస్తుతం ఘట్‌కేసర్‌ అంటున్నారు. కేసరి అంటే సింహం. అది విష్ణుకుండినుల రాజ చిహ్నం. ఆ రాజముద్ర ఒకటి కీసరగుట్టపై లభించింది.

 

రెండో మాధవ వర్మ: ఈయన విష్ణుకుండినుల్లో గొప్ప పాలకుడు. తన రాజధానిని ఇంద్రపురి నుంచి అమరపురానికి (అమరావతి) మార్చాడు. ఈయన వందకుపైగా యుద్ధాలు చేసి అన్నింటిలో విజయం సాధించాడు. ఒక్కో విజయానికి గుర్తుగా కీసరగుట్టపై ఒక్కో శివలింగాన్ని ప్రతిష్టింపజేశాడు. విజయం సాధించిన ప్రతి చోట రామలింగేశ్వర దేవాలయాన్ని నిర్మించాడు. ఇంద్రపాల నగరంలో అమరేశ్వరాలయం, రామేశ్వరాలయం, మల్లికార్జున ఆలయాలను నిర్మించాడు. రెండో మాధవ వర్మ విష్ణుకుండినుల రాజ చిహ్నం పేరు మీద కీసరలో కేసరి రామలింగేశ్వరాలయాన్ని నిర్మించాడు. కీసరలోనే పురుషమేధం అనే యజ్ఞాన్ని నిర్వహించినట్లు తెలుస్తుంది. ఉండవల్లి గుహల్లో పూర్ణకుంభాన్ని చెక్కించాడు.

 

ఇంద్రభట్టారక వర్మ: ఈయన అనేక ఘటికా స్థానాలను (హిందూ విద్యాకేంద్రాలు) స్థాపించాడు. కీసర సమీపంలో ఉన్న ఘటకేశ్వరం (ఘట్‌కేసర్‌) ఈయన నెలకొల్పిన ఘటికాస్థానమే. ఇంద్రభట్టారక వర్మకు సత్యాశ్రయుడు అనే బిరుదు ఉండేది. ఈయన అనేక ఘటికలను స్థాపించిన విషయాన్ని ఉద్ధంకుడు అనే పండితుడు సోమవేదం గ్రంథంలో వివరించాడు.  

 

మరో పాలకుడైన విక్రమేంద్ర భట్టారక వర్మకు ఉత్తమాశ్రయుడు అనే బిరుదు ఉండేది. ఈయన బ్రాహ్మణులకు తుండి (తుని) గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. రాజధానిని అమరావతి నుంచి లెందులూరుకు (దెందులూరు) మార్చాడు. అనంతర పాలకుడైన నాలుగో మాధవ వర్మకు జనాశ్రయ అనే బిరుదు ఉండేది. ఈయన బెజవాడ దుర్గామల్లీశ్వర స్వామి భక్తుడు. ఇతడి న్యాయపాలన ప్రశంసనీయమైంది. విష్ణుకుండినుల్లో చివరి పాలకుడు మంచన భట్టారకుడు. విష్ణుకుండినుల రాజ లాంఛనం సింహం. వీరి శాసన కడియాలపై ఉండే రాజముద్రికల్లో లంఘించు సింహం ముద్రించి ఉంది.

 

సాంఘిక పరిస్థితులు 

విష్ణుకుండినులు వైదిక మతాన్ని ఆచరించి దాని అభివృద్ధికి పాటుపడ్డారు. వీరు బ్రాహ్మణులు. రెండో మాధవ వర్మ 11 అశ్వమేధ యాగాలు చేశాడు. 18 మత శాఖల సిద్ధాంతాలు పూర్తిగా తెలిసిన, మానవ జాతిని జీవన, మరణ దుఃఖాల నుంచి కాపాడేందుకు యజ్ఞాది కర్మలు చేసే దశబల బలి పండితుడు గోవింద వర్మ ఆస్థానంలో ఉండేవాడు. వీరికాలంలో కొండమోటు నరసింహ శిల్పం ప్రజాదరణ పొందింది. బౌద్ధమతాన్ని పోషించిన చివరి తెలుగు ప్రాంత రాజులు విష్ణుకుండినులు. హైదరాబాద్‌ సమీపంలోని చైతన్యపురిలో బౌద్ధమతానికి చెందిన హీనయాన శాఖ ఉండేది. అక్కడ కొసగుండ్ల నరసింహస్వామి గుహాలయం దగ్గర ఉన్న ఒక పెద్ద బండరాయిపై ఆరు వరుసల ప్రాకృత శాసనం ఉంది. కీసర గుట్టపై మహాయాన బౌద్ధం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అక్కడ ఆచార్య నాగార్జునుడి లోహ విగ్రహం దొరికింది. ప్రముఖ తర్క పండితుడు దిజ్ఞాగుడు కొంతకాలం వేంగిలో నివసించాడు. అక్కడ ఆయన సాంఖ్యకారిక రచయిత అయిన ఈశ్వర కృష్ణుడితో వాగ్వాదాలు జరిపాడు. దిజ్ఞాగుడు కొంతకాలం రామగిరి (రామగుండం), మునుల గుట్ట ప్రాంతంలో జీవించాడనే విషయం కాళిదాసు రచించిన మేఘ సందేశం ద్వారా తెలుస్తుంది. ఈయన ప్రమాణ సముచ్ఛయం అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు. యోగాచార పంథాను బోధించాడు. తెలుగు ప్రాంతాలకు చెందిన బౌద్ధ మహా పండితుల్లో ఈయన చివరి వాడు.

 

విద్యలు - సాహిత్యం

విష్ణుకుండినుల రాజ భాష సంస్కృతం. వీరు ఘటికలను (హిందూ విద్యా కేంద్రాలు) స్థాపించి వేద విద్యలను ప్రోత్సహించారు. వీరే తెలంగాణలో మొదట ఘటికలను స్థాపించినవారు. వీరి శాసనాల్లో తెలుగు పదాలు కనిపిస్తాయి. చిక్కుళ్ల తామ్ర శాసనంలో ‘విజయ రాజ్య సంత్సరంబుళ్‌’ అనే తెలుగు పదం కనిపిస్తుంది. కీసర గుట్టపై ఉన్న ఒక గుండుకు ‘తొలుచువాండ్లు’ అనే అచ్చ తెలుగు పదం చెక్కిఉంది. దగ్గుపల్లి దుగ్గన నచికేతోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు. జనాశ్రయచ్ఛందో విచ్ఛిత్తి అనే పురాతన సంస్కృత చంధో గ్రంథాన్ని మాధవ వర్మ కాలంలో రచించారని ప్రతీతి. ఈ గ్రంథాన్ని గుణస్వామి అనే కవి రచించాడు. 

 

నిర్మాణాలు

వీరి కాలంలో తొలిసారిగా బండరాతిని తొలిచి స్తూపాలుగా తీర్చిదిద్దిన ఆధారాలు ఖమ్మం జిల్లా కారుకొండ వద్ద లభించాయి. తెలంగాణలో విష్ణుకుండినుల రాజధానులైన అమరావతి (అమ్రాబాద్‌), ఇంద్రపాల నగరం, కీసర గుట్టల్లో వీరి కోటలు ఉన్నాయి. భువనగిరి కోటను కూడా మొదట విష్ణుకుండినులే కట్టించినట్లు తెలిపే వారి రాజ చిహ్నం, లంఘిస్తున్న సింహం శిల్పాలు ఆ కోట గోడల మీద కనిపిస్తాయి. ఫణిగిరిలో ప్రభుత్వం చేపట్టిన తవ్వకాల్లో బౌద్ధ జాతక కథలతో చెక్కిన శిల్పాలు, బుద్ధుడి పాదుకలు, చైత్యాలు, స్తూపాలు, సన్యాసుల ఆరామ విహారాలు, మంటపాలు బయటపడ్డాయి. నేలకొండపల్లిలో బయల్పడిన బౌద్ధ స్తూపం చాలా పెద్దది. మొదట్లో దాన్ని విరాట్‌ స్తూపమని తర్వాతి కాలంలో విరాట రాజు గద్దెగా పిలిచేవారు. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో బుద్ధుడి పాలరాతి శిల్పాలు, లోహ విగ్రహాలు వెలుగుచూశాయి. కరీంనగర్‌ జిల్లాలోని మంథని పట్టణం చుట్టు పక్కల ఉన్న ఎల్‌ మడుగుపై గల గుహలు, గౌరీ గుండం జలపాతంపై ఉన్న గుహల్లో కనిపించే మంటప స్తంభాలపై విష్ణుకుండినుల కాలం నాటి చైత్యాలంకరణలు కనిపిస్తున్నాయి. 

 

విష్ణుకుండినుల జన్మస్థానమైన అమరావతి సమీపంలో ఉన్న ఉమామహేశ్వరం, సలేశ్వరం గుహలు అలంపురం శైవ శక్తి ఆలయాలుగా వెలుగొందాయి. వీరి నాణేలపై శ్రీపర్వత అనే పదం ఉండేది. సలేశ్వరంలో ఉన్న రెండు గుహాలయాల్లో ఒక ఆలయ గోడకు విశ్వేశకక్కలప అని రాసి ఉన్న బ్రాహ్మీ శాసనం ఉంది. అలంపురంలో బ్రహ్మేశ్వర, జోగులాంబ ఆలయాలు ప్రసిద్ధి గాంచాయి. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా హిందూ గుహాలయాలను నిర్మించినవారు విష్ణుకుండినులు. వీరి ఉండవల్లి గుహాలయ స్తంభాల మీద పంజా ఎత్తిన సింహ ప్రతిమ ఉంది. బొజ్జన్న కొండ, మొగల్‌ రాజపురం, విజయవాడ, ఉండవల్లి భైరవకొండ ఆలయాలను వీరు నిర్మించారు. బొజ్జన్న కొండ ఒక బౌద్ధ క్షేత్రం. ఇక్కడ గుప్త రాజుల నాణేలు లభించాయి. మొగల్‌ రాజపురం గుహల్లోని దుర్గ గుహలో వెనుక గోడపై ఉన్న అర్ధనారీశ్వర మూర్తి, శివ తాండవ గుహ ముఖంపై ఉన్న నటరాజ విగ్రహం ముఖ్యమైనవి. విజయవాడ దుర్గ కొండకు దిగువన అక్కన్న, మాదన్న గుహలు ఈ కాలం నాటివే. ఉండవల్లి గుహముఖంపై క్రీ.శ.6వ శతాబ్ది లిపిలో ‘ఉత్పత్తి పిడుగు’ అనే లేఖనం ఉంది. వీరి శిల్పాల్లో నాగార్జున కొండ శైలి కనిపిస్తుంది. విష్ణుకుండినులు వివిధ దేశాల్లో తమ సంస్కృతిని వ్యాపింపజేశారు. బర్మా దేశంలోని తైలాంగులు తెలంగాణ వారేనని ఫెరే ‘బర్మా చరిత్ర’ పేర్కొంటోంది.  

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి
 

Posted Date : 22-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌