• facebook
  • whatsapp
  • telegram

వేములవాడ చాళుక్యులు

సపాదలక్ష మల్లుడు... సోలదగండ వీరుడు!

తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ప్రముఖ రాజుల్లో వేములవాడ చాళుక్యులకు ప్రత్యేకస్థానం ఉంది. వీరు జైన, హిందూమతాలను ఆదరించారు. వృత్తి నిపుణుల సాయంతో గ్రామాల్లో పరిపాలన సాగించారు. గొప్ప వర్తక వాణిజ్య కేంద్రాలను అభివృద్ధి చేశారు. అనేక దుర్గాలను నిర్మించారు. వీరి పాలనలోని ప్రాంతం మంచి ఆదాయంతో బంగారు నాణేల రాజ్యంగా ప్రసిద్ధికెక్కింది. పరాజయం ఎరుగని యుద్ధవీరుల పరాక్రమాలకూ పేరుగాంచింది.

 

రాష్ట్రకూటులకు సామంతులుగా వేములవాడ చాళుక్యులు ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ ప్రాంతాలను పాలించారు. వేములవాడను రాజధానిగా చేసుకుని పాలించారు కాబట్టి వీరిని వేములవాడ చాళుక్యులు అంటారు. వీరు అనేక జైన నిర్మాణాలతో పాటు హిందూ దేవాలయాలను నిర్మించి తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేశారు. బోధన్, గంగాధర, వేములవాడలను రాజధానిగా చేసుకొని దాదాపు 200 సంవత్సరాలు పాలించారు. వేములవాడను పూర్వం ‘లేంబులవాడ’ అని పిలిచేవారు. 

వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీ.శ.750 - 780): వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు. ఇతడి రాజధాని నిజామాబాద్‌ జిల్లాలోని పోదనపురం (బోధన్‌). ఈయన సపాదలక్ష దేశాన్ని పాలించాడు. సపాదలక్ష అంటే 1,25,000 బంగారు నాణేలు ఆదాయంగా ఉన్న ప్రాంతం అని అర్థం. 

మొదటి అరికేసరి (క్రీ.శ.780 - 800): వినయాదిత్య యుద్ధమల్లుడి కుమారుడు మొదటి అరికేసరి. ఇతడు కృష్ణానది తీరంలో ఉన్న ఏలేశ్వర క్షేత్రాన్ని దర్శించాడు. అక్కడ ఉన్న కాలాముఖ‌ శైవాచార్యుడైన ముగ్ధ శివాచార్యుడికి బెల్మొగ గ్రామాన్ని విద్యాదానంగా ఇస్తూ కొల్లిపర శాసనాన్ని వేయించాడు. ఏలేశ్వరం ప్రసిద్ధమైన శైవ క్షేత్రం. ఇక్కడ వేద విద్యలను బోధించేవారు. ఈ విద్యాపీఠాన్ని ముగ్ధ శివాచార్యుడు నిర్వహించేవాడు. 

అనంతర పాలకుడైన ఒకటో బద్దెగడు 42 యుద్ధాలు చేసి ‘సోలదగండడు’ అనే బిరుదును పొందాడు. సోలదగండడు అంటే పరాజయాన్ని ఎరుగని వీరుడు అని అర్థం. ఈయన వేములవాడలో బద్దెగేశ్వరాలయాన్ని నిర్మించాడు. 

రెండో అరికేసరి (క్రీ.శ.930 - 955): ఈయన వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడు. వేములవాడ శిలాశాసనాన్ని వేయించాడు. ఈయన సైన్యాధిపతి అయిన పెద్దన, వేములవాడలో ఆదిత్యాలయాన్ని నిర్మించాడు. రెండో అరికేసరి కవి, కవిపండిత పోషకుడు. కన్నడ భాషలో ఆదికవిగా ప్రసిద్ధికెక్కిన పంప ఇతడి ఆస్థాన కవి. పంప కవి తన రాజైన రెండో అరికేసరిని మహాభారతంలోని అర్జునుడితో పోలుస్తూ ‘విక్రమార్జున విజయం’ అనే కన్నడ భాషా గ్రంథాన్ని రచించి అంకితమిచ్చాడు. రెండో అరికేసరి పంప కవికి ధర్మాపురాన్ని (ధర్మపురి, కరీంనగర్‌ జిల్లా) అగ్రహారంగా ఇచ్చాడు. ఈ వంశ పాలకుల్లో చివరివాడు మూడో అరికేసరి.

 

సాంఘిక పరిస్థితులు

గ్రామ పరిపాలన 12 వృత్తుల వారి అధీనంలో ఉండేది. నీటి నిల్వల అధికారిని గ్రన్తి అనేవారు. గోదావరి, మంజీర, ప్రణీత నదులు వ్యవసాయానికి తోడ్పడేవి. కాళేశ్వరం, కంద్కుర్తి గొప్ప వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. వైశ్యులు వర్తక వ్యాపారాలు చేసేవారు. వీరిని కోమట్లు అనేవారు. ప్రాచీన జైన ఆధ్యాత్మిక వీరుడైన గోమటేశ్వరుడి పేరు నుంచి కోమటి అనే పదం వచ్చినట్లు తెలుస్తోంది. బోధన్‌ ఒకప్పుడు గోమటేశ్వర ఆరాధనకు కేంద్రంగా ఉండేది. అక్కడి గోమటేశ్వర విగ్రహం నమూనా ఆధారంగానే శ్రావణ బెళగోళ విగ్రహం చెక్కారని ఒక ఐతిహ్యం. వీరి కాలంలో జైన, వైదిక మతాలు ఉండేవి. అనేక మంది రాజులు జైనమతాన్ని అనురించి జైనాలయాలు, జైన బసదులను నిర్మించారు. ఇతర మతాల వారిని ఆకర్షించడానికి జైనులు వర్ణ వ్యవస్థను అంగీకరించారు. వేములవాడ గొప్ప జైన క్షేత్రంగా ఉండేది. రాజులు, ఉద్యోగులు, అంతఃపుర స్త్రీలు, వర్తకులు, ధనికులు  తదితరులు సన్యాసులకు జైన బసదులు, మఠాలకు భూదానాలు చేశారు. వీరు అన్ని మతాలను సమానంగా ఆదరించారు.రెండో అరికేసరి, కొంతమంది రాజులు శైవ మతాన్ని అనుసరించారు. వీరి కాలంలో వైష్ణవ పూజలు, సూర్యారాధన ఉండేవి. శాసన శిలలపై వైదిక మత చిహ్నాలైన శివలింగం, సూర్యచంద్రులు, వృషభం లాంటివి చెక్కారు.  

 

విద్యాసారస్వతం 

వేములవాడ చాళుక్యుల కాలంలో కన్నడం రాజభాషగా ఉండేది. శివాలయాలకు అనుబంధంగా మఠాలు ఉండేవి. మఠాలు, జైన బసదులు ఉన్నత విద్యాలయాలుగా పనిచేసేవి. ఇందులో వేదవేదాంగాలు, ఆగమాలు, శాస్త్ర పురాణాలు బోధించడానికి విద్వాంసులు ఉండేవారు. పంప మహాకవి సోదరుడు జినవల్లభుడు. ఈయన భవనాలు నిర్మించడంలో నేర్పరి. కుర్క్యాల శాసనాన్ని సంస్కృత, తెలుగు, కన్నడ భాషల్లో వేయించాడు. ఈ శాసనం ఉన్న బొమ్మలమ్మ గుట్టను వృషభ పర్వతం అని పిలిచేవారు. ఈ పర్వతంపై వృషభేశ్వరుడు ఉన్నాడు. తెలుగు భాషలో మూడు కంద పద్యాలు జినవల్లభుడి కుర్క్యాల శాసనంలో ఉన్నాయి. ఇవి తెలుగు భాషలో మొదటి కంద పద్యాలు. జినవల్లభుడి మిత్రుడు మల్లియరేచన ‘కవిజనాశ్రయం’ అనే గ్రంథాన్ని రచించాడు. 

సంస్కృత భాషా ప్రభావంతో తెలుగు భాషను మొదట శాసనాల్లో ఉపయోగించారు. తర్వాత అది గ్రంథ రచన యోగ్యమైన భాషగా మారింది. జినవల్లభుడు కుర్క్యాల, గంగాధర గ్రామాల మధ్య త్రిభావన తిలకం అనే జైన బసదిని నిర్మించాడు. ఈ కాలం కన్నడ భాషకు స్వర్ణయుగం లాంటిది. పంప కన్నడ భాషలో ఆదికవి. ఇతడికి కవితాగుణార్ణవుడు అనే బిరుదు ఉండేది. ఈయన జైనమతాభిమాని. పంప కవి మహాభారతాన్ని ‘విక్రమార్జున విజయం’ పేరుతో జైనమత పరంగా కన్నడ భాషలో రచించాడు. ఇతడి రెండో గ్రంథం ‘ఆదిపురాణం’లో జైన తీర్థంకరుల చరిత్రలను వర్ణించాడు. 

సోమదేవ సూరి అనే జైనకవి క్రీ.శ.950 ప్రాంతంలో గంగాధర పట్టణంలో నివసించేవాడు. ఈయనకు శ్యాద్వాదాచలసింహ, తార్కిక చక్రవర్తి, కవిరాజ లాంటి బిరుదులు ఉండేవి. ఇతడు యశస్తిలక అనే చంపువును రచించాడు. ఇతడి రెండో గ్రంథం నీతి వాక్యామృత - రాజనీతి గ్రంథం. యుక్తి చింతామణి సూత్ర అనేది మూడో గ్రంథం. 

కన్నడ కవిత్రయం:  శాంతిపురాణం, భువనైక రామాభ్యుదయంలను రచించిన పొన్నకవి; గదాయుద్ధం, అజిత పురాణంను రచించిన రన్న కవి, పంప మహాకవి కన్నడ భాషా కవుల్లో (కన్నడ కవిత్రయం) రత్న త్రయమని పేరు పొందారు. తెలుగు భాషలో ఆనాడు అరసున్నా వాడుకలో లేదు. దీనికి బదులు పూర్ణానుస్వారాన్నే ఉపయోగించేవారు. ద్విత్వాక్షరాలు వాడేవారు. వీరికాలంలో దేశమార్గ కవితలు రూపుదిద్దుకున్నాయి.

 

నిర్మాణాలు

వేములవాడ చాళుక్యులు నిర్మించిన వాటిలో పోదన (బోధన్‌) దుర్గం; గంగాధర, వేములవాడల్లో నిర్మించిన దుర్గాలు ముఖ్యమైనవి. వీరు నిర్మించిన భవనాలు శిథిలమయ్యాయి. బద్దెగడు శుభదామ జినాలయాన్ని నిర్మించగా అతడి కుమారుడు మూడో అరికేసరి దాని నిర్వహణకు భూములను ఇచ్చాడు. వీరు పోదన నగరంలో జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కించారు. వాటిలో ఒక విగ్రహం ఎత్తు 56 అడుగులు. ప్రస్తుతం ఇది విరిగిపోయి శిరస్సు మాత్రమే ఉంది. చాముండరాయ ఈ విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని కర్ణాటకలోని శ్రావణబెళగొళ విగ్రహాన్ని రూపొందించాడు. వేములవాడ, బోధన్, చెన్నూరు, కాళేశ్వరం, కుర్క్యాల, గంగాధరల్లో జైనాలయాలు నిర్మించారు. భీమేశ్వర ఆలయాన్ని బద్దెగడు నిర్మించాడు. పూర్వం దీన్ని బద్దెగేశ్వర ఆలయం అనేవారు. దీనిలో గృహముఖ ద్వారంపై గజలక్ష్మి ఉంది. గర్భగృహం గోడల్లో నాలుగు స్తంభాలు ఉన్నాయి. ఇది తొలి చాళుక్యుల సంప్రదాయం. వేములవాడలోని భీమలింగేశ్వరాలయంలో అంతరాళపు ఉత్తర గోడపై మహిషాసురమర్ధని శిల్పం చెక్కి ఉంది. వేములవాడలోని నాగేశ్వర ఆలయాన్ని రెండో అరికేసరి కాలంలో నిర్మించారు. వర్తకులు పూజించే ఈ దేవుడిని నగరేశ్వర అనేవారు. అలంపూర్‌లో నవబ్రహ్మ దేవాలయాలు అని పిలిచే తొమ్మిది దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఆరు దేవాలయాలకు చుట్టూ ప్రాకారాన్ని నిర్మించారు. ఈ ప్రాకారానికి వెలుపల మిగిలిన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల అన్నింటి పేర్ల చివర బ్రహ్మ అనే పదం ఉంది. కానీ ఇవన్నీ శివాలయాలు. వాటిలో శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. ఈ తొమ్మిది ఆలయాల్లో విశ్వబ్రహ్మ ఆలయం పెద్దది. ఈ ఆలయాలు నేటికీ పూజలందుకుంటున్నాయి.

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

Posted Date : 22-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌