• facebook
  • whatsapp
  • telegram

ఇక్ష్వాకులు (క్రీ.శ.225 - 300)

తెలుగు లిపికి ఆకృతినిచ్చింది ఆ శిల్పులే!

తెలంగాణ సంస్కృతికి సేవ చేసిన వారిలో ఇక్ష్వాకులకు ప్రత్యేకస్థానం ఉంది.  శైవ, వైష్ణవాలతోపాటు వీరు బౌద్ధాన్నీ ఆదరించి అనేక నిర్మాణాలు చేపట్టారు. సంస్కృతాన్ని రాజభాషగా ఉపయోగించినప్పటికీ తెలుగు భాష అభివృద్ధికీ పాటుపడ్డారు. ఆనాటి శిల్పులు తెలుగు అక్షరాలను అందంగా తీర్చిదిద్దడంలో ప్రధానపాత్ర పోషించారు. సాంస్కృతిక చరిత్ర అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఆయా రాజుల కాలంలో జరిగిన పరిణామాలను ఒక క్రమంలో చదివి గుర్తుంచుకోవాలి. 

 

ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులుగా తెలంగాణను పాలించారు. పురాణాలు వీరిని శ్రీపర్వతీయులుగా పేర్కొన్నాయి. వీరి రాజధాని విజయపురి. ఇక్ష్వాకుల పాలనలో బౌద్ధమతానికి విశేష ఆదరణ లభించింది. అనేక బౌద్ధ నిర్మాణాలను ఏర్పాటు చేశారు. హిందూ దేవాలయాలను అధికంగా నిర్మించి తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేశారు. ఇక్ష్వాకుల జన్మస్థలం గురించి చరిత్రకారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీరు ఉత్తర భారతంలోని అయోధ్య ప్రాంతం వారని బూలర్, రాప్సన్‌; తమిళ దేశం వారని గోపాలాచారి, కన్నడ దేశం వారని వొగెల్, కృష్ణాతీరం (ఆంధ్ర) వారని కాల్‌డ్వెల్‌ పేర్కొన్నారు.

 

వాశిష్టిపుత్ర చాంతమూలుడు (క్రీ.శ.225 - 245)

ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు వాశిష్టిపుత్ర చాంతమూలుడు. ఈయన వైదిక బ్రాహ్మణ మతాభిమాని. విరూపాక్షపతి భక్తుడు (మహాసేనుడు - కార్తికేయుడు). అడవులను తొలగించి నూతన గ్రామాలను నిర్మించాడు. ఈయన గొప్ప దాత. భూమిని సాగు చేయడానికి రైతులకు లక్షల కొద్దీ నాగళ్లు, గోవులు, వ్యవసాయ క్షేత్రాలను దానం చేశాడు. ఈయన సోదరి శాంతాశ్రీ బౌద్ధ మతాభిమాని. ఈమె పారావత మహావిహారాన్ని పునరుద్ధరించింది. చాంతమూలుడికి దక్షిణాపథపతి అనే బిరుదు ఉండేది. 

 

వీరపురుషదత్తుడు (క్రీ.శ.245 - 265)

 

చాంతమూలుడి తర్వాతి పాలకుడైన వీరపురుషదత్తుడి పాలనాకాలం తెలంగాణ బౌద్ధమత చరిత్రలో ఒక సువర్ణయుగం. ఈయన రాణులు, అంతఃపుర స్త్రీలు పోటీపడి బౌద్ధమత సంస్థలకు దానధర్మాలు చేశారు. హీనయాన బౌద్ధులకు బుద్ధగయ పుణ్యక్షేత్రమైనట్లు మహాయన బౌద్ధులకు నాగార్జున కొండ పవిత్ర క్షేత్రమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులు నాగార్జున కొండ బౌద్ధ క్షేత్ర దర్శనానికి వచ్చేవారు. విదేశీయుల కోసం సింహళ విహారాన్ని నిర్మించారు. క్రీ.శ.250లో నాగార్జున కొండలో మహాచైత్యాన్ని పునరుద్ధరించి ఆయక స్తంభాలు నిలిపారు.  వీరపురుషదత్తుడు పుష్పభద్రుడనే పేరుతో శివాలయాన్ని నిర్మించాడు. 

  రాజ భాండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు ఉపాసిక బోధిసిరి బౌద్ధాభిమాని. ఈమె వివిధ ప్రాంతాల్లో బౌద్ధ ధర్మ ప్రచారం చేసే బౌద్ధ భిక్షువుల కోసం శ్రీ పర్వతంలో చుళదమ్మగిరిపై చైత్యగృహంతో పాటు చతుశ్శాలను నిర్మించింది. ఈమె కుల విహారం వద్ద ఒక చైత్యాన్ని, సింహళ విహారంలో బోధి వృక్ష వేదికను, మహాదమ్మ గిరిపై గృహాన్ని, దేవగిరిపై ప్రార్థనాశాలను నిర్మించింది. బోధిసిరి వేసిన శాసనం ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ మతాభివృద్ధిని తెలుపుతుంది. 

 

ఎహువల శాంతమూలుడు (క్రీ.శ.265 - 290)

ఈయన కాలంలోనే శాసనాల్లో సంస్కృత భాష వాడకం ప్రారంభమైంది. ఇతడి సేనాని ఎలిసిరి కుమారస్వామికి ‘సర్వదేవాధివాసం’ అనే ఆలయాన్ని నిర్మించడంతో పాటు తన పేరున కృష్ణానది ఉత్తర తీరంలో ఏలేశ్వర స్వామిని ప్రతిష్టించి అనేక దేవాలయాలు నిర్మించాడు. అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించి దాన్ని వేద విద్యా కేంద్రంగా అభివృద్ధి చేశాడు. ఎలిసిరి పేరుతో వెలిసిన ఏలేశ్వరం పుణ్యక్షేత్రం శ్రీశైల దేవాలయానికి ఈశాన్య ద్వారం. ఎహువల శాంతమూలుడి కాలంలో దేవాలయాల నిర్మాణం ముమ్మరంగా సాగింది. ఈ కాలంలో నవగ్రహ, కుబేర, నోదగేశ్వర, హరీతి, కార్తికేయ దేవాలయాలను నిర్మించారు. ఈయన నాగర్జునకొండలో ఒక సంస్కృత శాసనం వేయించాడు. ఎహువల శాంతమూలుడి ప్రాకృత శాసనం ఇటీవల గుమ్మడుర్రులోని స్తూప భాగంలో బయల్పడింది. ఇక్కడ ఒక బౌద్ధ విద్యాలయం ఉండేదని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. ఇతడి సోదరి కొండ బలిసిరి మహిషాసకులనే బౌద్ధమత శాఖీయులకు నాగార్జున కొండలో ఒక విహారాన్ని నిర్మించి ఇచ్చింది. ఎహువల శాంతమూలుడి కాలంలో మంచికల్లు, వేల్పూరు, హలంపురి, ఏలేశ్వరం, వేంగి లాంటి ప్రాంతాల్లో ఆలయాలు వెలిశాయి. అనంతరం పాలించిన రుద్ర పురుషదత్తుడు (క్రీ.శ.290 - 300) చివరి ఇక్ష్వాకు పాలకుడు. ఇతడి శాసనాలు గురజాల, నాగార్జున కొండల్లో లభించాయి. మైదవోలు శాసనం ఇక్ష్వాకు రాజ్య పతనాన్ని తెలియజేస్తుంది.

 

మతపరిస్థితులు 

  వీరి కాలంలో వీరగళ్‌ మత సంప్రదాయం ప్రసిద్ధి చెందింది. వీరగళ్‌ అంటే రాజు కోసం ప్రాణాలర్పించిన అంగరక్షకులను పూజించడం. చాంతమూలుడి సోదరి శాంతాశ్రీ నాగార్జున కొండలోని మహాచైత్యాన్ని పునరుద్ధరించింది.దీని పునర్నిర్మాణానికి బ‌తందానందుడనే బౌద్ధాచార్యుడు పర్యవేక్షణ చేశాడు. నాగార్జున కొండలో రాజు దుస్తులు ధరించి కుడి చేయిని ఎత్తి, ఎడమచేతిని కటిపై వేసుకొని ఉన్న చిత్రం లభించింది. ఇది శాంతమూలుడిది. నాగార్జునకొండలోని విహారాల్లో అపర మహావినశైలీయులు, మహిషాసకులు, బహుశ్రుతీయులు అనే బౌద్ధమత శాఖీయులు నివసించేవారు. వీరపురుషదత్తుడి రాణి మహాదేవి భట్టిని దేవరాణి బహుశ్రుతీయులు అనే బౌద్ధ శాఖ సన్యాసులకు తన పేరున దేవీ విహారాన్ని నిర్మించి ఇచ్చింది. నాగార్జునకొండలోని ఒక శిల్పంలో యుద్ధం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఇది వీరపురుషదత్తుడి కాలానికి చెందింది. 

  నాగార్జున కొండలో మహాసాంఘికులు ఉండేవారు. ఈ కాలంలో బోధి వృక్షారాధన, త్రిరత్న, స్వస్తిక, ధర్మచక్రం మీన లాంఛనాలతో ఉన్న బుద్ధుడి పాదాలను బౌద్ధ మతస్థులు ఆరాధించేవారు. ఇక్ష్వాకుల శాసనాల్లో దిఘనికాయ, మఝనికాయ, పంచమాతృక లాంటి బౌద్ధ గ్రంథాలను ప్రశంసించారు. నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నుంచే ప్రారంభమైంది. బౌద్ధ స్తూపాల నిర్మాణంలో ముడుపు స్తూపాల నిర్మాణం మొదలైంది. అంటే కోరికలు నెరవేరినందుకు కట్టే నిర్మాణాలు. క్రమంగా బౌద్ధ విహారాల్లో ధూపదీపాలతో పూజలు చేయడం పెరిగి ఆ మత క్షీణతకు కారణమైంది. వీరి కాలంలో బౌద్ధమతం వారు ప్రాకృత భాషను వదిలి సంస్కృత భాషలో గ్రంథ రచన చేశారు. ఫలితంగా ప్రజలకు దూరమయ్యారు. 

  బావవివేకుడు అనే బౌద్ధమత తార్కికుడు విజయపురి విహారంలో నివసించినట్లు హుయాన్‌త్సాంగ్‌ రచనల ద్వారా తెలుస్తుంది. ఆంధ్రదేశ‌ మహాసాంఘికులకు అంధకులనే పేరు వచ్చింది. చాంతమూలుడు బ్రాహ్మణులకు కోట్ల సువర్ణాలు, గోవులు, అగ్రహారాలు, భూములను దానం చేసి వైదిక మత విస్తరణకు పాటుపడ్డాడు. ఈయన బ్రాహ్మణ మతాభిమాని అయిన ఉజ్జయిని మహాసేనుడి భక్తుడు. అశ్వమేధ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర, వాజపేయ యాగాలను చేశాడు. హిరణ్యకోటి దాన శిల్పం నాగార్జునకొండలో లభించింది. వీరి కాలంలో రోమ్‌తో విదేశీ వాణిజ్యం చేసేవారు. నాగార్జునకొండలో రోమన్‌ నాణేలు  లభించాయి. ఇక్కడ రోమ్‌ వర్తక స్థావరం బయల్పడింది. ఈ ప్రాంతంలో రోమ్‌ వర్తకులు నివసించినట్లు తెలుస్తుంది. ఇక్ష్వాకుల శాసనాల్లో తరచుగా నిగమ సభలు, సెట్టి గహపతుల శ్రేణుల ప్రస్తావన కనిపిస్తుంది. శాసనాల్లో పర్ణిక శ్రేణి (తమలపాకులు), పూసిన శ్రేణి (మిఠాయిలు) ప్రస్తావన ఉంది. ఇక్ష్వాకుల రాజ లాంఛనం సింహం. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో సింహ లాంఛనం ఉన్న నాణేలు లభించాయి. ఇందులో ‘సామిన’ అనే పేరు గల నాణేలు శాంతమూలుడు వేయించినవి. ఇతడిని ఇక్ష్వాకు స్వామి అనేవారు. మాడ-స అనే అక్షరాలు గల దీనార, మాషక నాణేలు వీరపురుషదత్తుడికి చెందినవి. 

 

విద్య - సాహిత్యం 

ఇక్ష్వాకుల కాలంలోనే శాసనాల్లో సంస్కృత భాష వాడకం ప్రారంభమైంది. పంచచామర, వంశస్థ లాంటి వృత్తాలు ఉన్నాయి. వీరి కాలంలో మహాయాన బౌద్ధులు తమ ప్రచారానికి, గ్రంథ రచనకు సంస్కృతాన్ని స్వీకరించడంతో దేశంలో సంస్కృతం రాజ భాషగా, శాసన భాషగా, పండిత భాషగా గౌరవాన్ని పొందింది. వైదిక విద్యలు బ్రాహ్మణులకే పరిమితం. నాగార్జునకొండ గొప్ప విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. బౌద్ధ వాఙ్మయంలో ఉన్నత విద్యను కొనసాగించడానికి ఆసియా ఖండంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారు. ఇక్ష్వాకుల పేర్లలో విహువల, బాపి, అనిక్కి, అడవి, రెమ్మణక అనే తెలుగు పేర్లు ఉన్నాయి. ఈ కాలంలో భాషతో పాటు లిపి కూడా పరిణామం చెందింది. ఇక్ష్వాకులు బ్రాహ్మి లిపిని ఉపయోగించారు. నాగార్జునకొండ శిల్పాల మాదిరి వీరి లిపి కూడా సుందరమైంది. గుండ్రటి అక్షరాల తెలుగు లిపికి నాగార్జునకొండ శిల్పులే ఆకృతిని ఏర్పరిచారు. ఎహువల శాంతమూలుడు నాగార్జునకొండలో ఒక శాసనాన్ని వేయించాడు. ఈ శాసనం దక్షిణ భారతదేశంలోనే మొదటి సంస్కృత శాసనం. ధాన్యకటక సంఘారామంలో స్వదేశీ, విదేశీ విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారు. ఇందులో 7700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారు. ధాన్యకటక సంఘారామాన్ని ఆదర్శంగా తీసుకుని టిబెట్‌లోనే దోపంగ్‌ సంఘారామం నిర్వహించబడేది. తిథి, వార, నక్షత్ర, పక్ష, మాసాలతో కూడిన పంచాంగం వాడుకలో ఉండేది. రుతువులు కూడా ఉండేవి. ధర్మామృత కావ్యం అనే గ్రంథాన్ని నయసేనుడు అనే జైనమతాభిమాని రచించాడు. ఇతడు కర్ణాటక ప్రాంతానికి చెందినవాడు. 

 

నిర్మాణాలు 

ఇక్ష్వాకుల కాలంలో శైవ, వైష్ణవ మతాలు ఆదరణ పొందాయి. విజయపురిలో శివుడికి, విష్ణువుకు, శక్తికి, మహాసేనుడికి ఆలయాలు ఉన్నాయి. ఇక్ష్వాకులు శైవులు. ఎహువల శాంతమూలుడి కాలంలో నిర్మించిన అష్టభుజ నారాయణ దేవాలయం తెలుగు ప్రాంతాల్లోనే తొలి వైష్ణవాలయం. వీరి కాలంలో శక్తి ఆరాధన జరిగింది అనడానికి నిదర్శనమే నాగార్జునకొండలో బయల్పడిన హరీతి దేవాలయం. కొణిదెవ, పెదముడియం శిల్ప ఫలకాలు. విజయపురి గొప్ప హిందూక్షేత్రం. అక్కడి హరీతి ఆలయంలో సంతానం కాంక్షించిన స్త్రీలు గాజులు దానం చేసినట్లు తెలుస్తుంది. హరీతి చిన్న పిల్లల దేవత. అమరావతి శిల్ప సంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నాటికి చివరి దశకు చేరుకుంది. వేల్పూరు హిందువులకు, బౌద్ధులకు గొప్ప క్షేత్రం. అక్కడ భూతగ్రాహక స్వామికి (యముడు) కూడా ఆలయం ఉండేది. 

  నాగార్జునకొండ ఆలయాలను ఆగమోక్త పద్ధతి ప్రకారం నిర్మించారు. నాగార్జునకొండలో మహాసేన, పుష్పభద్ర, అష్టభుజ నారాయణ, నోదగేశ్వర, హరీతి ఆలయాలు వీరి కాలానికి చెందినవే. ఇక్కడ క్లిష్టమైన నిర్మాణంతో కూడిన అవబృథ స్నానవాటిక బయల్పడింది. ఈ ఆలయాల్లో కొన్ని గజ పృష్టాకృతిలో ఉన్నాయి. వీరి కాలం నాటికే వాస్తు శిల్ప ఆగమాలు తయారై దేవాలయ వాస్తుకు నిర్దిష్ట స్వరూపం ఏర్పడింది. ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతం, జగ్గయ్యపేట, రామిరెడ్డి పల్లి, చినగంజాం లాంటి బౌద్ధక్షేత్రాల్లో స్తూప విహార మంటపాల నిర్మాణం జరిగింది. ఈ కాలానికి చెందిన జగ్గయ్యపేట శిల్పాలకు వర్ణచిత్రీకరణే అజంతా కుడ్య చిత్రాలు అని బర్గెస్‌ అనే పండితుడు వ్యాఖ్యానించాడు. అమరావతి శిల్పాల్లో సతీసహగమనం, నిర్బంధ సతీసహగమనం అమలైనట్లు తెలుస్తుంది. ఈ కాలం నాటి మందాత శిల్పం జగ్గయ్యపేటలో లభించింది. నాగార్జున కొండలో మొత్తం 20 విహారాలు నిర్మించారు. తెలంగాణలో వీరి కాలం నాటి బౌద్ధ స్థావరాలు ఇంకా నల్లగొండ జిల్లా ఫణిగిరి, గాజుల బండ, వర్ధమానకోట, ఏలేశ్వరం; ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ముదిగొండలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో లభించాయి. 1926లో రంగనాథ సరస్వతి మొదటిసారిగా నాగార్జునకొండ అవశేషాలను గుర్తించాడు.

 

మాదిరి ప్రశ్నలు

1. ఇక్ష్వాకుల రాజధాని ఏది?

1) విజయపురి       2) వేల్పూరు      3) తంగెడ      4) అమరావతి 

 

2. శ్రీపర్వతీయులు ఎవరు? 

1) శాతవాహనులు     2) ఇక్ష్వాకులు     3) విష్ణుకుండినులు     4) శాలంకాయనులు

 

3. రైతులకు లక్షల కొద్ది నాగళ్లు, గోవులు, వ్యవసాయ క్షేత్రాలను దానం చేసిన పాలకుడు ఎవరు? 

1) చాంతమూలుడు     2) వీరపురుషదత్తుడు     3) రుద్రపురుషదత్తుడు     4) ఎహువల శాంతమూలుడు

 

4. కింది ఏ పాలకుడి కాలంలో తెలంగాణ బౌద్ధమత చరిత్రలో ఒక సువర్ణయుగం? 

1) మాధవవర్మ      2) అపరాజిత వర్మ      3) చాంతమూలుడు      4) వీరపురుషదత్తుడు

 

5. కింది ఏ పాలకుల కాలం నుంచి శాసనాల్లో సంస్కృత భాష వాడకం ప్రారంభమైంది?

1) శాతవాహనులు     2) ఇక్ష్వాకులు     3) విష్ణుకుండినులు      4) శాలంకాయనులు

 

6. తెలుగు ప్రాంతాల్లో మొదటి వైష్ణవ ఆలయం? 

1) అష్టభుజ నారాయణ దేవాలయం     2) హరీతి ఆలయం  

3) పుష్పభద్ర దేవాలయం     4) భూతగ్రాహకుడి ఆలయం

 

7. చిన్న పిల్లల దేవత ఎవరు?

1) పార్వతి    2) లక్ష్మీ    3) హరీతి    4) శక్తి 

 

8. ఇక్ష్వాకుల రాజ లాంఛనం ఏది? 

1) పులి    2) వృషభం    3) నెమలి    4) సింహం 

 

9. ధర్మామృత కావ్యం రచయిత ఎవరు?

1) నయసేనుడు    2) బావవివేకుడు    3) దిజ్నాగుడు    4) భారవి 

 

10. హిరణ్యకోటి దాన శిల్పం ఎక్కడ లభించింది? 

1) విజయపురి     2) భట్టిప్రోలు    3) నాగార్జున కొండ     4) దూళికట్ట 

 

11. చివరి ఇక్ష్వాకుల పాలకుడు ఎవరు?

1) విజయవర్మ     2) రుద్రపురుషదత్తుడు     3) శివస్కంద వర్మ     4) రణరాగుడు

 

12. మాందాత శిల్పం ఎక్కడ బయల్పడింది? 

1) నాగార్జునకొండ       2) ఏలేశ్వరం      3) అమరావతి     4) జగ్గయ్యపేట 

 

  సమాధానాలు

1-1,   2-2,   3-1,   4-4,   5-2,   6-1,   7-3,   8-4,   9-1,   10-3,   11-2,   12-4.

 

రచయిత: ఎం.జితేందర్‌ రెడ్డి

Posted Date : 18-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌