• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో ప్రజాస్వామ్యం (6 నుంచి 10వ లోక్‌సభలు) 

సంకీర్ణ రాజకీయాల స్వర్ణయుగం! 


స్వాతంత్య్రానంతరం దేశ రాజకీయాల్లో రెండున్నర దశాబ్దాలకు పైగా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్‌ పార్టీకి ఆరో లోక్‌సభ ఎన్నికల నుంచి అసలైన పోటీ మొదలైంది. ఈ పరిణామం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు బాటలు పడ్డాయి. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా జనతా పార్టీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలు ఆవిర్భవించాయి. సంకీర్ణ రాజకీయాల స్వర్ణయుగం మొదలైంది. ఇదే క్రమంలో వరుసగా ఇద్దరు శక్తిమంతులైన ప్రధానులు హత్యలకు గురవడం అనుకోని పరిణామాలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వాల్లో స్థిరత్వం తగ్గి, అనిశ్చితి కొనసాగినప్పటికీ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధానాల్లో మార్పులు, ప్రగతిశీల సంస్కరణలు వేగంగా అమలయ్యాయి. కఠిన సవాళ్లు ఎదురైనప్పటికీ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది.  లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వాల పనితీరు ఆధారంగా ఈ అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. ఎన్నికల సరళి, ప్రధాన పార్టీలు సాధించిన సీట్లు, ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, చేసిన చట్టాలు, వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి.


ఆరో లోక్‌సభ(1977-79): ఈ లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సోషలిస్ట్‌ పార్టీ, సంస్థా కాంగ్రెస్‌ పార్టీలు విలీనమై ‘జనతా పార్టీ’గా అవతరించి, ఎన్నికల బరిలో నిలిచాయి. ‘ప్రజాస్వామ్య కాంగ్రెస్‌’ అనే కొత్త పార్టీ జనతా పార్టీకి మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 60%. లోక్‌సభకు ఎన్నికైన మహిళల సంఖ్య కేవలం 19. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ 295 స్థానాలు గెలుపొందగా, భారత జాతీయ కాంగ్రెస్‌ (INC)154 స్థానాలకు పరిమితమైంది. సీపీఐ (ఎం) 22, సీపీఐ 7 స్థానాలు సాధించాయి. కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది.


*
జనతా పార్టీకి చెందిన మొరార్జీ దేశాయ్‌ లోక్‌సభా నాయకుడిగా ఎన్నికై 1977లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది కేంద్రంలో తొలి సంకీర్ణ, కాంగ్రెసేతర ప్రభుత్వం. 1979లో మొరార్జీ దేశాయ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో చరణ్‌ సింగ్‌ ప్రభుత్వం పాలనలోకి వచ్చింది.ఈయన పార్లమెంటులో అడుగుపెట్టకుండానే 4 నెలల వ్యవధిలోనే పదవికి రాజీనామా చేశారు.


* 6వ లోక్‌సభ పదవీ కాలం 1977 మార్చి నుంచి 1979 ఆగస్టు వరకు కొనసాగింది. స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవిని చేపట్టిన కొంతకాలానికే రాజీనామా చేయడంతో, కె.ఎస్‌.హెగ్డే స్పీకర్‌గా వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్‌గా మురహరి విధులు నిర్వహించారు.


* 1977, నవంబరు 18న ఇందిరా గాంధీ లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురై అరెస్టయ్యారు. 1978, డిసెంబరు 19న ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. బి.డి.జెట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు. 1977, జులై 25న నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ఈ లోక్‌సభ కాలంలోనే 1977లో ‘ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం’ రూపొందింది. దాని ప్రకారం లోక్‌సభలో తొలి ప్రధాన ప్రతిపక్షపార్టీ నేతగా వై.బి.చవాన్‌ (భారత జాతీయ కాంగ్రెస్‌  (INC)154 వ్యవహరించారు.


* ఈ లోక్‌సభ కాలంలోనే 1978లో ‘బ్యాంకింగ్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు/ రద్దు’కు సంబంధించిన బిల్లు ఆమోదం కోసం ‘పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం’ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అప్పటి లోక్‌సభ స్పీకర్‌ కె.ఎస్‌.హెగ్డే అధ్యక్షత వహించారు.


* రాజకీయ అనిశ్చితి కారణంగా రెండేళ్ల కాలపరిమితి ఉండగానే 1979, ఆగస్టు 22న 6వ లోక్‌సభ రద్దయింది.. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. దీని ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలోని ఆర్టికల్‌ 31లో పేర్కొన్న ‘ఆస్తి హక్కు’ను ఆ జాబితా నుంచి తొలగించి, ఆర్టికల్‌ 300(ఎ)లో సాధారణ చట్టబద్ధమైన హక్కుగా మార్పు చేశారు.


* ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా ఆరేళ్లకు పెంచిన లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల పదవీకాల పరిమితిని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తిరిగి అయిదేళ్లకు తగ్గించారు.


* కేంద్ర కేబినెట్‌ లిఖిత పూర్వక సలహా మేరకే రాష్ట్రపతి ఆర్టికల్‌ 352ను ప్రయోగించాలని, దానిని ప్రయోగించేందుకు ‘ఆంతరంగిక అల్లకల్లోలాలు’ అనే పదానికి బదులుగా ‘సాయుధ దళాల తిరుగుబాటు’ అనే పదాన్ని పరిగణనలోకి తీసుకోవాలని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు.


* 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందించిన ' MISA - Maintenance of Internal Security Act' ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు.


* ఈ లోక్‌సభ కాలంలోనే 1977లో ‘పనికి ఆహార పథకం’, 1978లో ‘నిరంతర ప్రణాళికలు’ ప్రారంభమయ్యాయి.


* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం సిఫార్సుల మేరకు అప్పటి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న బి.డి.జెట్టి ఆర్టికల్‌ 356ను ప్రయోగించి 9 కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. వాటిలో ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, బిహార్, హిమాచల్‌ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ఉన్నాయి.


* ఈ లోక్‌సభ కాలంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వీతీది వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని అధ్యయనం చేసేందుకు బి.పి.మండల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.


* పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు అశోక్‌ మెహతా కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ రెండంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని సిఫార్సు చేసింది.

 

ఏడో లోక్‌సభ (1980-84): ఈ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో 57% పోలింగ్‌ నమోదైంది. 28 మంది మహిళలు ఎన్నికయ్యారు. ‘ఇందిరాకో బులావో - దేశ్‌కో బచావో’ అనే నినాదంతో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లను ఆకర్షించి, ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 353, సీపీఐ(ఎం) 37, సీపీఐ 10, జనతా పార్టీ 31 స్థానాలు గెలుపొందాయి. లోక్‌సభ నాయకురాలిగా ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌గా బలరాం జక్కర్, డిప్యూటీ స్పీకర్‌గా జి.లక్ష్మణ్‌ వ్యవహరించారు. ఈ లోక్‌సభ కాలంలో నీలం సంజీవ రెడ్డి, జ్ఞానీ జైల్‌సింగ్‌ రాష్ట్రపతి పదవులు నిర్వహించారు.


* 1984లో ఆగస్టులో బి.పి.మండల్‌ కమిషన్‌ తన నివేదికను సమర్పించింది. 1983లో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసేందుకు రంజిత్‌ సింగ్‌ సర్కారియా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ లోక్‌సభ కాలంలోనే ఇందిరా గాంధీ ప్రభుత్వం 1984, జూన్‌ 3 నుంచి 8 వరకు పంజాబ్‌లోని అమృతసర్‌లో స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’ పేరుతో సైనిక చర్య నిర్వహించింది. 1984, అక్టోబరు 31న ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో దిల్లీలో సిక్కు మతస్థులపై భారీగా దాడులు జరిగి అపార ప్రాణనష్టం జరిగింది. ఇందిర అనంతరం రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టారు.


* 7వ లోక్‌సభ పదవీ కాలం 1980 జనవరి నుంచి 1984 డిసెంబరు వరకు కొనసాగింది. ఇది రెండో మధ్యంతర ఎన్నికల ద్వారా ఏర్పడిన లోక్‌సభ. ఈ సభా కాలంలోనే 1983లో దిల్లీలో అలీన దేశాల 7వ శిఖరాగ్ర సదస్సు జరిగింది.

 

ఎనిమిదో లోక్‌సభ (1984-89): ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధికంగా 414 స్థానాలు సాధించింది. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 30 స్థానాలు గెలిచి లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించింది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ 10, సీపీఐ (ఎం) 22, సీపీఐ 6, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2 స్థానాలు గెలుపొందాయి. నమోదైన పోలింగ్‌ 64%. ఎన్నికైన మహిళలు 44 మంది. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌గా బలరాం జక్కర్, డిప్యూటీ స్పీకర్‌గా ఎం.తంబిదొరై వ్యవహరించారు. ఈ లోక్‌సభ కాలంలోనే రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంలో రక్షణశాఖా మంత్రిగా ఉన్న వి.పి.సింగ్‌ తన పదవికి రాజీనామా చేసి 1988లో జనతాదళ్‌ పార్టీని స్థాపించారు.


* 61వ రాజ్యాంగ సవరణ చట్టం(1988) ద్వారా రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం వయోజన ఓటు హక్కు అర్హత వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది. 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 ద్వారా ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’ రూపొందించారు. మనదేశంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 1986లో ‘నూతన జాతీయ విద్యావిధానం’ రూపొందించారు. 


* శ్రీలంకలో శాంతిభద్రతలను పరిరక్షించే ఉద్దేశంతో  "Indian Peace Keeping Force" (IPKF) దళాలను రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు పంపింది. ఈ లోక్‌సభ కాలంలోనే 1987లో ‘ముస్లిం మహిళల వివాహం, విడాకుల చట్టం’ రూపొందింది. స్థానిక సంస్థలపై అధ్యయనం కోసం ఎల్‌.ఎమ్‌.సింఘ్వీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ కమిషన్‌ సిఫార్సుల మేరకు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు, 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ లోక్‌సభ కాలంలోనే రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం బోఫోర్స్, ఫెయిర్‌ పాక్స్‌ కుంభకోణాలకు పాల్పడిందనే ఆరోపణలు రావడంతో 101 మంది ఎంపీలు రాజీనామా చేశారు.


* ఈ సమయంలోనే మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. ఈ లోక్‌సభ కాలం 1984, డిసెంబరు నుంచి 1989, నవంబరు వరకు కొనసాగింది. రాజీవ్‌ గాంధీ తన మంత్రిమండలిని అత్యధికంగా 13 సార్లు పునర్‌వ్యవస్థీకరించారు.


* మొదటిసారిగా పార్లమెంటరీ స్థాయీ సంఘాలను ఈ లోక్‌సభ కాలంలోనే ప్రారంభించారు. జ్ఞానీ జైల్‌సింగ్, ఆర్‌.వెంకట్రామన్‌ రాష్ట్రపతి పదవులు నిర్వహించారు. 1986లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పంపిన ‘పోస్టల్‌ బిల్‌’పై అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌ సింగ్‌ ‘పాకెట్‌ వీటో’ను ప్రయోగించి బిల్లును తన వద్దే ఉంచుకున్నారు.


తొమ్మిదో లోక్‌సభ (1989-91): ఈ ఎన్నికల్లో 62% పోలింగ్‌ నమోదైంది. ఎన్నికైన మహిళల సంఖ్య 27. కాంగ్రెస్‌ 197, జనతాదళ్‌ 143, భారతీయ జనతా పార్టీ 85, సీపీఐ(ఎం) 33, సీపీఐ 12 స్థానాలు గెలుపొందాయి. ఏ రాజకీయ పార్టీకీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ‘హంగ్‌  పార్లమెంటు’ ఏర్పడింది. స్పీకర్‌గా రబీ రే, డిప్యూటీ స్పీకర్‌గా శివరాజ్‌ పాటిల్‌ వ్యవహరించారు. ఈ లోక్‌సభ పదవీకాలం 1989, డిసెంబరు నుంచి 1991, మార్చి వరకు కొనసాగింది. ‘నేషనల్‌ ఫ్రంట్‌’ పేరుతో కూటమిని ఏర్పాటు చేసిన జనతాదళ్‌ పార్టీకి చెందిన వి.పి.సింగ్‌ లోక్‌సభా నాయకుడిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించారు.దీనికి బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మద్దతిచ్చాయి.


* అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రథయాత్ర చేస్తున్న బీజేపీ నేత ఎల్‌.కె.ఆడ్వాణీని అరెస్ట్‌ చేయడంతో వి.పి.సింగ్‌ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించింది. అనంతరం లోక్‌సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా, వీగిపోవడంతో వి.పి.సింగ్‌ ప్రధాని పదవి కోల్పోయారు. ఆ తర్వాత జనతాదళ్‌ పార్టీకి చెందిన చంద్రశేఖర్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అనతికాలంలోనే కూలిపోయింది. ఈ లోక్‌సభ కాలంలోనే వి.పి.సింగ్‌ ప్రభుత్వం 1990లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 263 ప్రకారం ‘అంతర్రాష్ట్ర మండలి’ని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ వర్గాల వారికి 27% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బి.పి.మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం దినేష్‌ గోస్వామి కమిటీని ఏర్పాటు చేసింది. 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఈ లోక్‌సభ కాలంలోనే రూపొందింది. 9వ లోక్‌సభ కేవలం 14 నెలల 26 రోజులు కొనసాగి, 1991, మార్చి 13న రద్దయింది.


పదో లోక్‌సభ (1991-96): ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 56%. ఎన్నికైన మహిళలు 39 మంది. కాంగ్రెస్‌ పార్టీ 232 స్థానాలు గెలుపొందగా, బీజేపీ 129, జనతాదళ్‌ 59, సీపీఐ(ఎం) 35, సీపీఐ 14 స్థానాలు గెలిచాయి. ఈ ఎన్నికల ప్రచార సమయంలోనే 1991, మే 21న మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనూ సభ్యత్వం లేని పి.వి.నరసింహారావు ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత నంద్యాల లోక్‌సభ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. స్పీకర్‌గా శివరాజ్‌ పాటిల్, డిప్యూటీ స్పీకర్‌గా మల్లికార్జునయ్య వ్యవహరించారు. ఈ లోక్‌సభ కాలం 1991, జూన్‌ నుంచి 1996, మే వరకు కొనసాగింది. ఆర్‌.వెంకట్రామన్, శంకర్‌ దయాళ్‌ శర్మ రాష్ట్రపతి పదవులు నిర్వహించారు. పి.వి.నరసింహారావు తన సమర్థతతో మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు (5 సంవత్సరాలు) నిర్వహించారు.


* పీవీ హయాంలోనే 1991లో నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 1993, డిసెంబరు 23న ఎంపీలాడ్స్‌(Member of Parliament Local Area Development Scheme) ను ప్రారంభించారు. ఈ లోక్‌సభ కాలంలోనే 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించారు. పి.వి.నరసింహారావు ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో 8 సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంది. భారతదేశ, విదేశాంగ విధానంలో "LOOK EAST" విధానాన్ని ప్రవేశపెట్టారు. 1992, డిసెంబరు 6న బాబ్రీ మసీదు దుర్ఘటన జరిగింది.

రచయిత: బంగారు సత్యనారాయణ 

 

Posted Date : 19-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌