• facebook
  • whatsapp
  • telegram

గవర్నర్‌

ఇటీవల కాలంలో గవర్నర్‌ వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్‌లు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రాజకీయాంశాలను ప్రభావితం చేస్తున్నారు. ఇది దేశవ్యాప్త చర్చకు దారితీస్తుంది. గవర్నర్‌ల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతుంది. రాజకీయ నాయకుడు ముదిరితే గవర్నర్‌ అవుతారనే విమర్శకుల వాదనకు బలం చేకూరుతుంది.

 

గవర్నర్‌ వ్యవస్థ 

రాజ్యాంగ నిర్మాతలు గవర్నర్‌ వ్యవస్థను భారత ప్రభుత్వ చట్టం, 1935 నుంచి గ్రహించారు. గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించే విధానాన్ని కెనడా దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు. భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాష్ట్రంలో రాజ్యాంగ పరమైన అధిపతిగా రెండు సున్నితమైన, సంక్లిష్టమైన పాత్రలను నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పరిపాలనాపరమైన ఆదేశాలు, నియామకాలు గవర్నర్‌ పేరు మీదుగానే జరుగుతాయి.

 

గవర్నర్‌ - రాజ్యాంగ వ్యవస్థ

రాజ్యాంగంలోని 6వ భాగంలో రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి వివరణ ఉంది. దీనిలో గవర్నర్, ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి, అడ్వకేట్‌ జనరల్‌ అంతర్భాగంగా ఉంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 163(1) ప్రకారం రాష్ట్ర గవర్నర్‌కు పరిపాలనా వ్యవహారాల్లో సహకరించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది. ఈ మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్‌ తన అధికారాలు, విధులను నిర్వహించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 168 ప్రకారం గవర్నర్‌ శాసనసభలో అంతర్భాగం. 

* గవర్నర్‌ శాసనసభ సమావేశాలను ప్రారంభించడాన్ని "Summans" (సమన్స్‌) అంటారు.

* గవర్నర్‌ శాసనసభ సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేయడాన్ని "Prorogue" (ప్రోరోగ్‌) అంటారు.

* గవర్నర్‌ శాసనసభను రద్దు చేయడాన్ని "Dissolve" (డిసాల్వ్‌) అంటారు.

 

గవర్నర్‌ పదవి వివాదాస్పదమవుతున్న తీరు

గవర్నర్‌ల నియామకం, వారి పాత్ర, వ్యవహార శైలి తరచూ విమర్శలకు గురవుతుంది. రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయడం, రాజకీయ అవసరాల కోసం గవర్నర్‌ పదవిని, దాని ఔనత్యాన్ని దుర్వినియోగం చేయడం సమర్థనీయం కాదు. గవర్నర్‌ పదవిని రాజకీయాలకు అతీతంగా, సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తికి భంగం వాటిల్లకుండా చూసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని 1994లో ఎస్‌.ఆర్‌.బొమ్మై vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.

 

పరిణామాలు

* పశ్చిమ్‌ బంగలో గవర్నర్‌ జగ్దీప్‌ ధనకర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య పరిపాలనాపరమైన విభేదాలు రావడంతో గవర్నర్‌పై రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగానే విమర్శలకు దిగింది. ఇక్కడ గవర్నర్‌ ఉన్నతాధికారులను తరచూ రాజ్‌భవన్‌కు పిలిపించి సమీక్షలు నిర్వహించడం మమతా బెనర్జీ ప్రభుత్వానికి నచ్చలేదు.

* రాజస్థాన్‌లో గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా వైఖరితో విసుగు చెందిన ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ శాసనసభ సమావేశాలను తక్షణం నిర్వహించాలని, సభలో తన ప్రభుత్వ విశ్వాసాన్ని నిరూపించుకునేందుకు అవకాశం కల్పించాలని 102 మంది శాసన సభ్యులతో రాజ్‌భవన్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో సద్దుమణిగింది.

* ఉత్తర్‌ ప్రదేశ్‌లో 1990వ దశకంలో గవర్నర్‌ రొమేష్‌ భండారీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఇక్కడ గవర్నర్‌ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ అగ్రనేత అటల్‌బిహారి వాజ్‌పేయీ దీక్షను చేపట్టారు.

* తమిళనాడులో జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రిని నియమించడంలో అక్కడి గవర్నర్‌ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇటీవల తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం నీట్‌ పరీక్షల నుంచి తమిళనాడును మినహాయిస్తూ రాష్ట్ర శాసనసభలో ఒక బిల్లును ఆమోదించి, గవర్నర్‌ వద్దకు పంపగా, గవర్నర్‌ సంబంధిత బిల్లుపై ఆమోదముద్ర వేయకుండా తీవ్ర జాప్యం చేశారు.

* దిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పకుండానే అఖిల భారత సర్వీసుల ఉద్యోగులను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బదిలీ చేయడం తీవ్ర దుమారం లేపింది.

* అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరపడం విమర్శలకు దారితీసింది.

* పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీతో విభేదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమెను పిలవకుండానే బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించింది. 

* కేరళలో పినరయి విజయన్‌ ప్రభుత్వానికి గవర్నర్‌ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌కు మధ్య తీవ్రమైన పరిపాలనా పరమైన విభేదాలు వచ్చాయి. 

* ఆంధ్రప్రదేశ్‌లో 1984లో అప్పటి గవర్నర్‌ రాంలాల్‌ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయకుండానే ఎన్‌.టి.రామారావు ప్రభుత్వాన్ని రద్దుచేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో గవర్నర్‌ రాంలాల్‌ రీకాల్‌ చేయబడి పదవీచ్యుతులయ్యారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర సమాచార కమిషనర్‌ల నియామకం విషయంలో అప్పటి గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌తో విభేదాలు వచ్చాయి.

 

తెలంగాణ

 

రాజ్‌భవన్‌ vs ప్రగతి భవన్‌

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణలో కె.చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వానికి రుచించడంలేదు. దీనికి కారణాలు...

* రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ప్రజా దర్బార్‌ను నిర్వహించడం.

* విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సెలర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఖాళీల భర్తీపై గవర్నర్‌ ప్రకటన చేయడం. 

* గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం, ప్రగతిని విస్మరించడం.

* గవర్నర్‌ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం.

* రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే గవర్నర్‌ ఆకస్మిక పర్యటనలు జరపడం.

 

గవర్నర్‌ వ్యవస్థ - సుప్రీంకోర్టు తీర్పులు

 

షంషేర్‌ సింగ్‌ vsస్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు

ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాను గవర్నర్‌ తప్పనిసరిగా పాటించాలని, గవర్నర్‌ సంతృప్తి అంటే రాష్ట్ర మంత్రిమండలి సంతృప్తిగానే భావించాలని పేర్కొంది.

 

రఘుకుల తిలక్‌ vs హరగోవింద్‌ కేసు

గవర్నర్‌లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే సంస్థ కాదు. గవర్నర్‌లు రాష్ట్ర అధిపతులుగా రాజ్యాంగం ప్రకారమే తమ విధులను నిర్వహించాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

బి.పి. సింఘాల్‌ vsయూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

కేంద్రంలో ప్రభుత్వాలు మారిన ప్రతి సందర్భంలో గవర్నర్‌లను మార్పు చేయరాదని, వారిని తొలగించడానికి ప్రత్యేక నియమావళిని అనుసరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

ఎస్‌.ఆర్‌.బొమ్మై vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు 

ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం యొక్క విశ్వాసాన్ని గవర్నర్‌ రాజ్‌భవన్‌లో కాకుండా శాసనసభలోనే పరీక్షించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

సమీక్ష

కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌లను రాజకీయ పావులుగా ఉపయోగించకూడదు. కేంద్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి రాష్ట్రాల గవర్నర్‌లను మార్పుచేయడం సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.

* 1989లో విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన వెంటనే 17 రాష్ట్రాల గవర్నర్‌లను తొలగించింది.

* 1991లో పి.వి.నరసింహారావు ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన వెంటనే 14 రాష్ట్రాల్లో గవర్నర్‌లను ఒకేసారి తొలగించింది.

* 1998లో అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత 13 రాష్ట్రాల గవర్నర్‌లను తొలగించింది.

* 2004లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 రాష్ట్రాల్లోని గవర్నర్‌లను తొలగించింది.

* 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లోని గవర్నర్‌లను తొలగించడం ప్రారంభించింది.

* గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతర అధికార వ్యవస్థ కాదు.

* గవర్నర్‌లుగా సీనియర్‌ రాజకీయ నాయకులను నియమించిన ప్రాంతాల్లో పాలనా వ్యవహారాల్లో జోక్యం పెరుగుతుంది. అలాకాకుండా మాజీ బ్యూరోక్రాట్లను గవర్నర్‌లుగా నియమించిన చోట వివాదాలు తక్కువగా ఉన్నాయి. గవర్నర్‌ వ్యవస్థ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దీన్ని రాజ్యాంగ నియమావళికి అనుగుణంగా కొనసాగిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లుతుంది.

* డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ప్రకారం గవర్నర్‌ పదవి కేంద్రం యొక్క రాజకీయ పదవి కాదు. ఇది రాజ్యాంగబద్ధమైంది.

 

రచయిత: బంగారు సత్యనారాయణ


 

Posted Date : 14-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌