• facebook
  • whatsapp
  • telegram

లా కమిషన్‌

దేశంలో న్యాయ పాలనను సమర్థవంతంగా నిర్వహించడానికి, సామాజిక న్యాయాన్ని ప్రజలందరికీ అందించడానికి, అవసరమైన అంశాలపై శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహించి, తగు సూచనలు, సిఫార్సులు చేసేందుకు ‘లా కమిషన్‌’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ నేపథ్యం, నిర్మాణం, విధులపై పోటీ పరీక్షార్థులకు అవగాహన అవసరం.


నేపథ్యం

* మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు ఆంగ్లేయుల పాలనా కాలంలో చార్టర్‌ చట్టం  1833 ప్రకారం 1834లో లార్డ్‌ మెకాలే అధ్యక్షతన తొలిసారిగా లా  కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* దీని తర్వాత 1853, 1861, 1879లలో వివిధ లా    కమిషన్‌లు ఏర్పాటయ్యాయి. వీటి సిఫార్సుల మేరకు మనదేశంలో 1859లో సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌; 1860లో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌; 1861లో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లను రూపొందించారు.


స్వాతంత్య్రానంతరం..

* స్వాతంత్య్రం తర్వాత మనదేశంలో మొదటి లా కమిషన్‌ను 1955లో ఎంసీ సెతల్‌వాడ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీన్ని మూడేళ్లకోసారి పునర్‌వ్యవస్థీకరిస్తున్నారు.
* దేశంలో ఇప్పటి వరకు 21 లా కమిషన్‌లను ఏర్పాటు చేశారు.
* న్యాయ మంత్రిత్వశాఖకు సలహాదారుగా వ్యవహరించడం దీని ఉద్దేశం.
* ఈ కమిషన్‌లో ఛైర్మన్‌ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి), నలుగురు సభ్యులు ఉంటారు. 

 

20వ లా కమిషన్‌ - ప్రధాన సిఫార్సులు:

* ఎన్నికల సంస్కరణల అమలుపై 255వ నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు సమర్పించింది.
* ఉరిశిక్ష రద్దుకు సంబంధించి 262వ నివేదికలో కీలక సూచనలు చేసింది. దీని ప్రకారం ఉగ్రవాదం, దేశంపై యుద్ధం ప్రకటించడం మొదలైనవి మినహాయించి ఇతర అన్ని రకాల నేరాలకు ఉరిశిక్షను రద్దు చేయాలని పేర్కొంది.


21వ లా కమిషన్‌ - ప్రధాన సిఫార్సులు:

* ఇది తన 268వ నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించి, కింది సిఫార్సులు చేసింది.
* తప్పుచేసే న్యాయవాదులకు శిక్షలు విధించాలి. 
* న్యాయవాదులు సమ్మె చేయడం వల్ల కక్షిదారులకు నష్టం జరిగితే సంబంధిత న్యాయవాదులే పరిహారం చెల్లించాలి. ఈ అంశాల పర్యవేక్షణకు ఒక చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయాలి.
* అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు వివాహ వయోపరిమితులు లేకుండా, ఇద్దరికీ కనీస వివాహ వయసును 18 ఏళ్లుగా నిర్ణయించాలి.
* వివాహమైన దంపతుల్లో ఆస్తిని ఎవరు సమకూర్చినా దాన్ని వారి ఉమ్మడి ఆస్తిగానే పరిగణించాలి. వారు విడాకులు తీసుకుంటే స్త్రీకి సమాన వాటా ఇవ్వాలి. 
* క్రికెట్‌తో సహా ఇతర అన్ని క్రీడలపై బెట్టింగ్, జూదాన్ని చట్టబద్ధం చేయాలి.
* బెట్టింగ్‌ను చట్టబద్ధం చేశాక మ్యాచ్‌ ఫిక్సింగ్‌ మోసాలు జరగకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలి.


వేతన కమిషన్‌ (Pay Commission) 

* ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తోంది.ఇది మారుతున్న కాల పరిస్థితులు, నిత్యావసర సరకుల ధరల పెరుగుదల ఆధారంగా ఉద్యోగులు, పింఛన్‌దార్ల వేతనాలు, ఇతర అంశాలపై అధ్యయనం చేసి  ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తుంది.
* మనదేశంలో ఇప్పటివరకు 7 వేతన సవరణ కమిషన్‌లు ఏర్పాటయ్యాయి.

వేతన సవరణ సంఘం సంవత్సరం ఛైర్మన్‌
1వ 1946 శ్రీనివాస వరదాచారియార్‌
2వ 1957 జగన్నాథ్‌ దాస్‌
3వ 1970 రఘువీర్‌ దయాళ్‌
4వ 1983 పి.ఎన్‌.సింఘాల్‌
5వ 1994 రత్నవేల్‌ పాండ్యన్‌
6వ 2006 జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ
7వ 2014 జస్టిస్‌ ఎ.కె.మాథూర్‌

                

లా కమిషన్‌ విధులు
* కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాలపై అధ్యయనాలు నిర్వహించి, సంస్కరణలను సూచిస్తుంది. దేశంలో అమల్లో ఉన్న వివిధ చట్టాల పనితీరును అధ్యయనం చేస్తుంది.
* ఏదైనా విషయంలో సంస్కరణలు అవసరమని భావిస్తే కమిషన్‌ స్వయం పరిశీలన చేయొచ్చు. సమాజంలోని విభిన్న వర్గాల సామాజిక స్థితిగతులు, ఆచార సంప్రదాయాలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేస్తుంది.
* సామాజిక, రాజకీయ, న్యాయ అంశాలపై అభిలషణీయమైన నివేదికలు రూపొందించి, ప్రభుత్వానికి నివేదిస్తుంది.


వివిధ లా కమిషన్‌లు, ఛైర్మన్‌ల వివరాలు

లా కమిషన్‌ ఛైర్మన్‌ పదవీకాలం
1వ జస్టిస్‌ ఎంసీ సెతల్వాడ్‌ 1955-58
2వ జస్టిస్‌ వెంకట్రామ అయ్యర్‌ 1958-61
3వ జస్టిస్‌ జేఎల్‌ కపూర్‌ 1961-64
4వ జస్టిస్‌ జేఎల్‌ కపూర్‌ 1964-68
5వ జస్టిస్‌ కేవీకే సుందరం (ఐసీఎస్‌ అధికారి) 1968-71
6వ జస్టిస్‌ పీబీ గజేంద్ర గడ్కర్‌ 1971-74
7వ జస్టిస్‌ పీబీ గజేంద్ర గడ్కర్‌ 1974-77
8వ జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా 1977-79
9వ జస్టిస్‌ పీవీ దీక్షిత్‌ 1979-80
10వ జస్టిస్‌ కేకే మాథ్యూ 1981-85
11వ జస్టిస్‌ డీఏ దేశాయ్‌ 1985-88
12వ జస్టిస్‌ ఎంపీ ఠక్కర్‌ 1988-91
13వ జస్టిస్‌ కేఎన్‌ సింగ్‌ 1991-94
14వ జస్టిస్‌ కే జయచంద్రారెడ్డి 1995-97
15వ జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి 1997-2000
16వ జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి
ఎం. జగన్నాథరావు
2000-01
2002-03
17వ  జస్టిస్‌ ఎం జగన్నాథరావు 2003-06
18వ జస్టిస్‌ ఏఆర్‌ లక్ష్మణ్‌ 2006-09
19వ జస్టిస్‌ పి వెంకట్రామిరెడ్డి 2009-12
20వ జస్టిస్‌ డీకే జైన్‌ (రాజీనామా చేశారు) 
జస్టిస్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా

2012-13
2013-15

21వ జస్టిస్‌ బల్బీర్‌సింగ్‌ చౌహాన్‌ 2015-18

                         
నమూనా ప్రశ్నలు

1. 1834లో ఏర్పాటైన లా కమిషన్‌కు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు?

1) లార్డ్‌ మెకాలే         2) చార్లెస్‌ హాప్‌కిన్స్‌
3) థామస్‌ ఉడ్స్‌         4) ఎలిన్‌బరో


2. కిందివాటిలో సరికానిది ఏది?
1) సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను 1859లో రూపొందించారు.
2) ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ను 1860లో రూపొందించారు.
3) క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను 1861లో రూపొందించారు.
4) కామన్‌ సివిల్‌ కోడ్‌ను 1866లో రూపొందించారు.


3. మనదేశంలో స్వాతంత్య్రం తర్వాత 1955లో ఏర్పడిన మొదటి లా కమిషన్‌కు అధ్యక్షులుగా వ్యవహరించింది?
1) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌
2) ఎం.సి.సెతల్‌వాడ్‌ 
3) శ్రీనివాస అయ్యంగార్‌  
4) వరదాచారి అయ్యర్‌


4. కిందివాటిలో సరైంది ఏది?
1) సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లా కమిషన్‌కు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
2) సాధారణంగా మూడేళ్లకోసారి లా కమిషన్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తారు.
3) మనదేశంలో ఇప్పటివరకు 21 లా కమిషన్‌లు తమ నివేదికలను సమర్పించాయి.
4) పైవన్నీ సరైనవే


5. వివిధ లా కమిషన్‌లు వాటి అధ్యక్షులకు సంబంధించి సరికానిది ఏది? 
1) 14వ లా కమిషన్‌ - జస్టిస్‌ కె.జయచంద్రారెడ్డి
2) 15వ లా కమిషన్‌ - జస్టిస్‌ బి.పి.జీవన్‌రెడ్డి
3) 16వ లా కమిషన్‌ - జస్టిస్‌ కె.ఎన్‌.సింగ్‌
4) 18వ లా కమిషన్‌ - జస్టిస్‌ ఎ.ఆర్‌.లక్ష్మణ్‌


6. 21వ లా కమిషన్‌కు అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్‌ బల్బీర్‌సింగ్‌ చౌహాన్‌ 2) జస్టిస్‌ డి.కె.జైన్‌
3) జస్టిస్‌ పి.వెంకట్రామిరెడ్డి
4) జస్టిస్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా

 

7. 21వ లా కమిషన్‌ సిఫార్సును గుర్తించండి.
1) న్యాయవాదుల సమ్మె వల్ల కక్షిదారులు నష్టపోతే, సంబంధిత న్యాయవాదులే పరిహారం చెల్లించాలి.
2) క్రికెట్‌తో సహా అన్ని క్రీడలపై బెట్టింగ్, జూదాన్ని చట్టబద్ధం చేయాలి.
3) ఉరిశిక్షను మరిన్ని రంగాలు/ నేరాలకు విస్తరించాలి.
4) 1, 2


8. 21వ లా కమిషన్‌ సిఫార్సులకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.
1) అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు వివాహ వయోపరిమితులు ఉండటం సరికాదు.
2) అమ్మాయిలు, అబ్బాయిల వివాహ వయోపరిమితి 18 సంవత్సరాలుగా ఉండాలి.
3) వివాహమైన దంపతుల్లో ఆస్తిని ఎవరు సంపాదించినా, దాన్ని వారి ఉమ్మడి ఆస్తిగానే పరిగణించాలి.
4) పైవన్నీ సరైనవే


9. ఉగ్రవాదం, దేశంపై యుద్ధం ప్రకటించడం లాంటి నేరాలు తప్ప, ఇతర అన్ని రకాల నేరాలకు ఉరిశిక్షను రద్దు చేయాలని 262వ నివేదికలో పేర్కొన్న లా  కమిషన్‌ ఏది?
1) 21వ లా కమిషన్‌     2) 20వ లా కమిషన్‌
3) 19వ లా కమిషన్‌     4) 18వ లా కమిషన్‌


10. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల జీతభత్యాలు, ఇతర అంశాలపై అధ్యయనం కోసం మనదేశంలో ఇప్పటి వరకు ఏర్పాటైన వేతన సవరణ కమిషన్‌లు?
1) 5       2) 6       3) 7       4) 8


11. వివిధ వేతన సవరణ కమిషన్‌లు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.
1) ఒకటో వేతన సవరణ కమిషన్‌ -   శ్రీనివాస వరదాచారియార్‌
2) రెండో వేతన సవరణ కమిషన్‌ -    రత్నవేల్‌ పాండ్యన్‌
3) ఆరో వేతన సవరణ కమిషన్‌ -   జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ
4) ఏడో వేతన సవరణ కమిషన్‌ -   జస్టిస్‌ ఎ.కె.మాథూర్‌


12. 20వ లా కమిషన్‌ ఎన్నికల సంస్కరణ అమలుపై కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు సమర్పించిన నివేదిక ఎన్నోది? 
1) 239వ నివేదిక          2) 251వ నివేదిక
3) 255వ నివేదిక          4) 265వ నివేదిక


సమాధానాలు: 1-1; 2-4; 3-2; 4-4; 5-3; 6-1; 7-4; 8-4; 9-2; 10-3; 11-2; 12-3.

Posted Date : 06-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌